సంపాదకీయం

కుమార ‘గరిమ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటమిని ‘విజయం’గా చిత్రీకరించి ఉత్సవాలు జరుపుతుండడం కర్నాటకలో ప్రస్తుతం నడుస్తున్న ‘కాండ’. పదహైదవ తేదీన కర్నాటక శాసనసభ ఫలితాలు వెలువడుతుండిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ‘కాండ’ను ప్రారంభించింది. ఇరవై మూడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడం పరాకాష్ఠ. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. 2013 ఎన్నికలలో నూట ఇరవై రెండు స్థానాలను గెలిచిన కాంగ్రెస్ బలం ఈ ఎన్నికలలో డెబ్బయి ఎనిమిది స్థానాలకు దిగజారడం ఘోర పరాజయం. ఈ పరాజయానికి కారణం కాంగ్రెస్ ఐదేళ్లు సాగించిన అవినీతి పాలన! ఇది కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తల వంచుకోవలసిన పరిణామం. కానీ కాంగ్రెస్ ‘అధిష్ఠానం’ వారు, కర్నాటక ప్రాంతీయ అధిపతులు ఈ వారం రోజులకు పైగా సిగ్గులేకుండా ప్రవర్తించడం జనానికి విస్మయం కలిగిస్తున్న పరిణామం! జనం తమ పార్టీని ఛీకొట్టి తిరస్కరించిన సంగతిని ‘ప్రపంచం’ గుర్తించలేదన్నది కాంగ్రెస్ అధిష్ఠాన నేతలలో వికృతంగా ప్రదర్శితవౌతున్న ధీమా.. లౌకిక జనతాదళ్ నాయకుడు, అవకాశవాదానికి జీవన రూపమైన కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడం తమ గొప్ప విజయమని కాంగ్రెస్ ‘డంకా’ బజాయిస్తోంది. ఇదీ ఓటమిని ‘విజయం’గా చిత్రీకరించడమంటే..! రెండు వందల ఇరవై రెండు స్థానాలున్న కర్నాటక శాసనసభలో రెండు వందల ఇరవై స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోటీచేసిన ఏ ఒక్క రాజకీయ పార్టీకీ శాసనసభలో ‘సంఖ్యా బాహుళ్యం’ లభించకపోవడం ఈ పార్టీల పట్ల ప్రజల విశ్వాస రాహిత్యానికి చిహ్నం. నూట నాలుగు స్థానాలు లభించిన భారతీయ జనతాపార్టీ కాని, డెబ్బయి ఎనిమిది చోట్ల గెలిచిన కాంగ్రెస్ కాని, ముప్పయి ఎనిమిది చోట్ల గట్టెక్కిన లౌకిక జనతాదళ్ కాని ప్రజల విశ్వాసం పొందలేదన్నది ప్రజాస్వామ్య వాస్తవం! ఇరవై శాతం వోట్లు కూడ లభించని ‘లౌకిక జనతాదళ్’ను దాదాపు ఎనబయి శాతం వోటర్లు వ్యతిరేకిస్తుండడం ఈ ప్రజాస్వామ్య వాస్తవం!
ఈ వాస్తవం వాస్తవంగానే కొనసాగినట్టయితే కర్నాటక- ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని ‘రాజ్యాంగ సంక్షోభ స్థితి’కి గురి అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ‘జనాదేశం’ ఏ పార్టీకి కూడా దక్కలేదు. అతి పెద్ద పార్టీకి- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశం లభించడం జనాభీష్టానికి కొంత ‘దగ్గరితనం’ మాత్రమే! అది కూడ సాధ్యం కానప్పుడు రాష్టప్రతి పాలన విధించాలి! మళ్లీ సంవత్సరానికో, ఆరు నెలలకో ఎన్నికలు నిర్వహించాలి! కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది.. కానీ ఈ ప్రజాస్వామ్య వాస్తవాన్ని కాంగ్రెస్ వమ్ము చేసింది. ఎనబయి శాతం ప్రజలు తిరస్కరించిన ‘లౌకిక జనతాదళ్’ పార్టీకి చెందిన కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి పూనుకొంది. ఎన్నికల ప్రచార సమయంలో పరస్పరం ప్రత్యర్థులైన వారు, ఈ ప్రత్యర్థిత్వం ప్రాతిపదికగా ప్రజల విశ్వాసాన్ని కోరినవారు- ఎన్నికల తరువాత మైత్రిని అభినయించడం జనవంచన! ఇలా జనాన్ని వంచించడం దశాబ్దులుగా కొనసాగుతున్నప్రజాస్వామ్య ప్రహసనం!! 1996లో లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ‘్భజపా’ తన ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోయింది. అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.దేవగౌడను కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీలవారు కలసికట్టుగా ప్రధానమంత్రిని చేశారు. ఇప్పుడు కర్నాటక శాసనసభలో అతి పెద్ద పార్టీ అయిన ‘్భజపా’ బలపరీక్షకు ముందే ఓడింది. దేవగౌడ తనయుడు కుమారస్వామిని కాంగ్రెస్ వారు ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోబెట్టారు. ‘జనాభిప్రాయం’ సమగ్రంగా ప్రస్ఫుటం కాని సందర్భాలలో ఈ దుస్థితిని అతిగమించడానికి, ‘జనాదేశం’ మరోసారైనా సమగ్రంగా ప్రస్ఫుటించడానికి అవసరమైన అనివార్యమైన ‘రాజ్యాంగ ప్రక్రియ’ ఏడు దశాబ్దులుగా ఆరంభం కాలేదు. ఏ పార్టీకి కాని ‘చట్టసభల’లో సంఖ్యాబాహుళ్యం లభించని సందర్భాలలో మొదటి రెండు స్థానాలలో ‘నిలిచిన’ పెద్ద పార్టీలకు మాత్రమే ‘రెండవ దశ’ ఎన్నికల ప్రక్రియలో పోటీచేయడానికి అవకాశం లభించే విధంగా రాజ్యాంగ ప్రక్రియలో మార్పు జరగాలి. ఉదాహరణకు ఇప్పుడు కర్నాటకలో రెండవ ‘దశ’-సెకండ్ రౌండ్- ఎన్నికలు జరిగాయనుకోండి.. భాజపా, కాంగ్రెస్ మాత్రమే పోటీచేయాలి! మొదటిసారి జరిగిన ఎన్నికలలో మూడవ, ఆ కింది స్థానాలను పొందిన పార్టీలకు రెండవ దశ ఎన్నికలలో పోటీచేయడానికి అవకాశం ఉండదు. అలా రెండు దశల ఎన్నికల ప్రక్రియ కోసం, రెండు సభలకూ ప్రత్యక్షంగా ఎన్నికలు జరిపించడం కోసం రాజ్యాంగ ప్రక్రియను సవరించాలి. అలాంటి పద్ధతి వల్ల ఏదో ఒక పార్టీకి ‘చట్టసభ’లో సంఖ్యాబాహుళ్యం- మెజారిటీ లభించి తీరుతుంది!
కానీ ఇలాంటి రాజ్యాంగ ప్రక్రియ గురించి మన దేశంలోని అధికాధిక రాజకీయ పక్షాలకు ప్రధానంగా జాతీయ పక్షాలకు అవగాహన లేదు, ధ్యాస లేదు, శ్రద్ధ లేదు. జనాభిప్రాయాన్ని వమ్ముచేయగల రాజకీయ ప్రక్రియ మాత్రమే దశాబ్దులుగా సాగిపోతోంది. కర్నాటకలో ఈ కుమారప్ప మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ఈ ‘రాజకీయ ప్రక్రియ’ కారణం.. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ వ్యతిరేక బిందువుగా దేశంలో రాజకీయ ప్రక్రియ ఊపందుకొంటోంది, కుమారస్వామి పట్ట్భాషేకం ఈ ‘ఊపు’నకు కొత్తరూపు.. అయితే ఈ ‘ఊపు’ కేవలం ‘వాపు’ అన్నది జనానికి తెలిసిన రహస్యం. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి మహాకవి కాళిదాసు తన ‘ఋతుసంహార’కావ్యంలో ఒక ప్రాకృతిక సత్యాన్ని వివరించాడు.. ‘నెమలి పింఛం నీడలో పాము పడుకొని ఉంది, పాము పడగ నీడలో కప్ప నిశ్చింతగా నిద్రపోతోంది.. బల్లికి సమీపంలోనే బొద్దింక ముద్దులు గునుస్తోంది..’. ఇలా వైరుధ్య ప్రవృత్తులు కలిగిన ప్రాణులు పరస్పరం శత్రుత్వాలను మరచిపోయి ఒకేచోట గుమికూడడానికి ఏకైక కారణం ఉమ్మడి శత్రువు! భారత రాజకీయాలలో ఇప్పుడు ఉమ్మడి శత్రువు భారతీయ జనతాపార్టీ. ఎన్నికల ప్రచార సమయంలో విరోధులైన కర్నాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ కర్నాటక అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర బుధవారం కర్నాటక విధానసౌధ మెట్ల మీద ఇలా పరస్పరం రక్షణ పొందారు. వీరితోపాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు ఈ ఉభయుల ప్రమాణ స్వీకార ఉత్సవ సమయంలో అక్కడికి చేరిపోవడానికి కారణం ‘్భజపా’ భయం.. ఉమ్మడి విరోధం!!
గతంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టి ఉండిన ఈ లౌకిక జనతాదళ్ నేత, కుమారస్వామి 2006 జనవరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేశాడు. ‘్భజపా’తో జట్టుకట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. విశ్వాస ఘాతుక అవకాశ వాదానికి ఇది మచ్చుతునక! కుమారస్వామి 2007 అక్టోబర్‌లో సీఎం పదవికి రాజీనామాచేసి ఆ పదవిని ‘్భజపా’ నేత, అప్పటి ఉప ముఖ్యమంత్రి యడియూరప్పకు అప్పగించాలి. కానీ కుమారస్వామి అలా అప్పగించలేదు, మాట తప్పాడు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన ‘కుమార’ గత జీవనంలోని ప్రధాన ఘట్టాలు ఇవి!