సంపాదకీయం

‘ఉడుత’కు ఊపిరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడుతలు ఉత్సాహంగా చెట్లెక్కి ఊగుతుండడం పర్యావరణం పదిలంగా ఉందన్నదానికి ఓ నిదర్శనం. పిచ్చుకల కిలకిల ధ్వనులు ప్రభాత సమయంలో వినిపించకపోవడం పొగచూరిపోతున్న ప్రకృతికి నిదర్శనం. ప్లాస్టిక్ కాలుష్యం విస్తరించిపోతున్న నగర జీవన స్వరూప స్వభావాలు ఇవీ! పండ్లు లేని, వాసనలేని పువ్వుల చెట్లు నగరాలలో వీధుల పక్కన మహాపథాల మధ్యలోని ‘హరిత ద్వీపాల’-గ్రీన్ ఐలాండ్స్-లోను పెరుగుతున్నాయి. ఆకుపచ్చదనం విస్తరించడం హర్షణీయం. కానీ ఈ ఆధునిక వృక్షజాలం వెగటు వాసనలను, చేదు వాసనలను పంచుతుండడం మహానగరాలలోని మానవుల అనుభవం. పండ్లు దొరకని ఈ చెట్లపై పారాడు ఉడుతలు ప్రాంగణాలలోని వ్యర్థ ఆహారాలను ఏరుకొని తింటున్న దృశ్యాలు నగరాలలో అవిష్కృతవౌతున్నాయి. జనావాసాల మధ్య, ప్రధానమైన రహదారులకు దూరంగా ఈ ఉడుతలు మనుగడ సాగిస్తున్నప్పటికీ ఆరోగ్యంగా నిగనిగలాడడం లేదు, బక్కచిక్కిన ఉడుతలు భాగ్యనగరంలో ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజధానిలోని మిగిలిన చోట్ల ప్లాస్టిక్ గుట్టల మధ్య సంచుల మధ్య బొద్దింకలు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అనంతగిరి అడవుల నుంచి విస్తరించిన మధుర పరిమళ పవనాలు గొల్లకొండ కోటను మురిపించిన రోజులు గతించి శతాబ్దులయింది. అనంతగిరి ఓషధులతో నిండిన ముచికుందా నదీ స్వచ్ఛజలాలు అనాదిగా భాగ్యలక్ష్మీదేవి శిలావిగ్రహాన్ని అభిషేకించిన చరిత్ర చిరిగిపోయింది. గొల్లకొండ గోలకొండగా, ముచికుంద మూసీగా మారడం కాలుష్య విస్తరణ ప్రభావం.. ఒకటి మానసిక కాలుష్యం, రెండవది మానవ కాలుష్యం! నీరులేని ‘మూసీ’ పక్కన - అనాదిగా ఉండిన - శిలావిగ్రహం కనుమరుగైంది! విస్తృత హైదరాబాద్ నగర పాలక సంస్థవారు మళ్లీ మళ్లీ నిషేధిస్తున్న ‘ప్లాస్టిక్’ పదార్థాలు మాత్రం కనుమరుగు కాకపోవడం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి విచిత్రమైన నేపథ్యం... భాగ్యనగరం ప్రతీక మాత్రమే, దేశంలోని దాదాపు ప్రతి నగరంలోను, పట్టణంలోను ప్లాస్టిక్ చెత్తకుప్పలు కనుమరుగు కాకపోవడం ప్రకృతిమాత ప్రస్తుత స్వరూపానికి ప్రత్యక్ష ప్రమాణం...
ఉడుతలు లేని కొన్ని నగరాలలోని హరిత ప్రదేశాలలో పిచ్చుకలు తిరుగాడుతున్నాయట! బెంగళూరు మహానగర వాసుల అనుభవం ఇది. ఉడుతలు, పిచ్చుకలు పరస్పరం విరోధులు కావు. ఈ జంతువులు, ఆ పక్షులు కలసిమెలసి యథేచ్ఛగా విహరించడం ప్రశాంతమైన పల్లెల స్వరూపం.. స్వభావం! వీటికి తోడు రకరకాల పక్షులు, చిలుకలు, గోరు వంకలు, కాకులు, కోకిలలు, తేనెటీగలు, తుమ్మెదలు,కందిరీగలు, తూనీగలు కలసిమెలసి సహజీవనం చేయడం జీవవైవిధ్యం, జీవన వైవిధ్యం. జంతుజాలం వృక్షజాలం కలసి జీవజాలం. కొన్ని రకాల వృక్షజాలం లేనిచోట పిచ్చుకలు బతకవు, మరికొన్ని మొక్కలు, చెట్లు లేని చోట ఉడుతలు మిగలవు. ఉడుతలు, పిచ్చుకలు కూడా ఒకేచోట కనిపించడానికి వీలైన హరిత ప్రాంగణాలను ప్రభుత్వాలు ఎన్నిచోట్ల ఏర్పాటు చేయగలిగాయి? పరిశోధనలు జరగాలి! ఉడుత, పిచ్చుక ప్రతీకలు మాత్రమే.. వందల రకాల వృక్షజాలం వందల రకాల జంతువులను, పక్షులను ఆకర్షించడం ఆశ్రయం ఇవ్వడం జీవవైవిధ్యం - బయో డైవర్సిటీ-! ఇలా జీవవైవిధ్యాన్ని పెంచి పోషించగల ‘హరిత ప్రాంగణాల’-గ్రీన్ కారిడార్స్-ను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయా? లేక ఏవో కొన్ని రకాల చిత్రవిచిత్రమైన - మేకలు మేయని ఆకులున్న మొక్కలను పెంచుతున్నాయా?? జీవ వైవిధ్య పరిరక్షణ వ్యవస్థల నిర్వాహకులు ఆలోచించాలి! అస్సాం ప్రాంతపు జీవధారల గట్లు మీద ఆరోగ్యవంతమైన తాబేళ్లు ఆడుకుంటున్నాయట! సముద్ర జలాలలో ఎందుకని తాబేళ్ల, తిమింగలాల కళేబరాలు తేలుతున్నాయి? నీలగిరి పర్వత ప్రాంతంలో నిన్న మొన్న ఒక అడవి ఏనుగు ఆకలితో నిస్సారపడి మరణించిందట.. జీవ వైవిధ్యంలో, ప్రకృతిలో మానవులు కూడా భాగం! గొడ్డలి తగిలి తెగిన కాలి గాయం కొన్ని గంటలలోనే మచ్చకూడా లేని రీతిలో నయమైపోవడం శ్రీశైలం కొండలలోని ‘చెంచు’ వనవాసుల అనుభవం. పాదం తెగిన గిరిజనుడు గాయపడిన స్థలం నుండి ఇంటికి కుంటుతూ - నడచిన దారిలో పెరిగిన మొక్కలు చేసిన చికిత్స అది! ఏ మొక్కలో ఏ ఆకులో ఏ ఔషధ గుణమున్నదన్న వాస్తవాన్ని ఎవరు పరిశోధిస్తున్నారు? దేశవాళీ ఆవు మూత్రం తాగి మూత్రపిండాల వ్యాధులను నయం చేసుకొన్న ఆరోగ్యవంతులు దేశమంతటా తమ కథనాలు వినిపిస్తున్నారు..
దాదాపు ముప్పయి ఏళ్ల క్రిందట ఆస్ట్రేలియాలో ఒక ప్రాకృతిక రహస్యాన్ని కనిపెట్టారు. ఉక్కు వంటి గట్టి కలపను ప్రసాదించే ఒక జాతి చెట్లు అనాదిగా ఆస్ట్రేలియా భూమిపై పెరుగుతున్నాయి. ‘టేకు’ వంటి ఈ చెట్లు చాలా ఎత్తునకు పెరుగుతాయట! అయితే ఈ చెట్ల సంఖ్య క్షీణిస్తోంది. అప్పటికి యాబయి ఏళ్ల క్రితం నుంచి ఈ ‘జాతి’ మొక్కలు మొలవడం లేదని విస్తృత భూభాగంపై పరిశోధన జరిపిన ‘వేత్తలు’ ముప్పయి ఏళ్ల క్రితం కనిపెట్టారు. ఈ చెట్ల నుంచి పండ్లు రాలి పడ్డాయి, విత్తనాలు విరివిగా విస్తరించాయి. కానీ ఒక విత్తనం కూడా మొలకెత్తలేదు.. విచక్షణ రహితంగా వేటాడి చంపడం ఐరోపా వారిలో అత్యధికుల స్వభావం. క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుంచి అమెరికాలోను పద్దెనిమిదవ శతాబ్ది నుంచి ఆస్ట్రేలియాలోను స్థానిక ప్రజలను వేటాడి చంపిన అనాగరిక, పైశాచిక ప్రవృత్తి ఐరోపా వారిది. అనాదిగా అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను జీవించిన ‘స్వజాతీయ’ ప్రజలు నేడు లేరు. ఆ జాతులను నిర్మూలించిన ఐరోపావారు ఈ దేశాలలో తామే స్థానికులుగా స్థిరపడినారు. ఇలా స్థిరపడిన ఐరోపావారు ఒక పక్షిని తినడం మరిగారు. ఆస్ట్రేలియాలో జీవించే ఈ పక్షులను వందేళ్లకుపైగా ఈ కొత్త జాతివారు చంపి తినేశారు. ఆ పక్షులు అంతరించాయి.. ఫలితంగా ‘ఉక్కు’ వంటి కలపను ప్రసాదించే ఈ చెట్లు అంతరించిపోతున్నాయి!! ఆ ‘ఉక్కు’ చెట్ల పండ్లను ఆ పక్షులు తినాలి, ఆ పండ్ల ‘గుజ్జు’ను జీర్ణం చేసుకున్న పక్షులు ‘విత్తనాల’ను మాత్రం విసర్జిస్తాయి. అలా ఆ పక్షులు విసర్జించిన తరువాత మాత్రమే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఇదీ ప్రకృతి నిర్మించిన వ్యవస్థ. ఈ జీవ వైవిధ్య రహస్యాలు తెలియని ఐరోపావారు ఆస్ట్రేలియాలోని ఆ పక్షులను తినేశారు. ఆ చెట్ల పండ్లను తినడానికి ఆ పక్షులు లేవు, అందువల్ల పండ్లలోని విత్తనాలు మొలకెత్తవు.. ఆ పక్షులను వెదకి పట్టుకొని పరిరక్షించడానికి ఆ తరువాత ప్రయత్నాలు మొదలయ్యాయి...
ప్రకృతి పరిరక్షణ మన దేశంలో అనాదిగా జీవన సంస్కృతి! అడవుల నిండా మానవుల కడుపులు నింపగల, కడుపులోని జబ్బులను సైతం నయం చేయగల వందల రకాల పండ్లు, దేవదారు - గాదిర - బలిస, నారవ, బిక్కి, పులివెలగ, పులిచింత, బంహీరు, కొండఈత, ఊడగ, పలగ, నాగదోర వంటి పండ్లు, ‘నెమితిగడ్డ’ వంటి తీయటి అడవి దుంపలు నాగరికులకు తెలియవు. అడవుల నిర్మూలన తరువాత జానపదులకు సైతం తెలియవు! వరసిద్ధి వినాయకుడిని పూజించడానికి ఉపకరించే ఇరవై ఒక్క జాతుల ఆకులు లభిస్తున్నాయా? ‘గరిక’ ఓషధీరస గుళిక. మనం నడిచేదారి పక్కన నిరంతరం ‘గరికె’- గడ్డిపూలు పూయాలన్నది వేదద్రష్టల ఆకాంక్ష ‘అయనేతే పరాయణే దూర్వా రోహన్తు పుష్పిణీ..’ గరికెలను మేసిన దేశవాళీ ఆవు ఇచ్చే పాలు అమృతం.. ఇదీ ప్రాకృతిక స్వచ్ఛత! కానీ గరికెగడ్డి సైతం రసాయన కాలుష్య భరితం అవుతోంది.. నిరోధించవద్దా??