సంపాదకీయం

డొనాల్డ్ దౌష్ట్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- వ్యవస్థ బీటలు వారుతోందన్నది మన దేశంలోని రాజకీయ వేత్తలలో అత్యధికులు గుర్తించని ‘మహా విషయం’. ఇలా గుర్తించకపోవడం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వా రు విదేశాల పెట్టుబడుల కోసం ఇప్పటికీ వెంపరలాడుతున్నారు. అమెరికా, మెక్సికో దేశాల సరిహద్దుల్లో ఆవిష్కృతవౌతున్న భయానక దృశ్యాలు ‘ప్రపంచీకరణ’ పరిధి నుంచి విముక్తం కాదలచుకుంటున్న పడమటి దేశాల పైశాచిక ప్రవృత్తికి వికృతమైన ప్రతీకలు. మెక్సికో నుండి తమ దేశంలోకి చొచ్చుకొని వస్తున్న విదేశీయులను అమెరికా ప్రభుత్వం నెలల తరబడి జైళ్లలో నిర్బంధిస్తోంది. అదికాదు ప్రధానం. చిన్నపిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేఱుచేశారు! సార్వభౌమ దేశాల సరిహద్దులు చెఱగిపోవాలన్నది ప్రపంచీకరణ సూత్రం. అలా సరిహద్దుల్లేని ప్రపంచ దేశాలన్నీ ఒకే వాణిజ్య మండలం గాను, ‘పుడమి పల్లె’- గ్లోబల్ విలేజ్- గాను ఏర్పడడం వాణిజ్య ప్రపంచీకరణ లక్ష్యం. కానీ అమెరికా సరిహద్దుల ‘గోడలు’ మరింత బలపడుతున్నాయి. వివిధ కారణాలతో స్వదేశాలను వదలి ‘శరణార్థులు’గా అమెరికాకు తరలివస్తున్న వారిని అమెరికా అధికారులు మెక్సికో సరిహద్దుల్లో నిరోధించి నిర్బంధ గృహాలకు తరలిస్తున్నారు. అమెరికాలో ఆశ్రయం కోరివచ్చిన ఈ విదేశీయులకు అమెరికా ప్రభుత్వం తమ దేశం పౌరసత్వం కల్పించకపోవచ్చు. కాని ఐక్యరాజ్య సమితి ప్రవచిస్తున్న నిబంధనావళికి, మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించవచ్చు. శరణార్థి శిబిరాల్లో వారిని నివసింపచేయవచ్చు. కానీ అమెరికా ప్రభుత్వం ఈ విదేశీయులపై ‘అక్రమ ప్రవేశకుల’న్న ముద్ర వేసింది. వారిని కారాగృహ నిర్బంధానికి వారాల తరబడి గురిచేసింది. ఇలా బంధితులైన దంపతుల నుంచి వారి పిల్లలను వేఱుచేసి గుర్తు తెలియని చోట- ఆ ‘బుడతల’ను ఉంచడం ప్రభుత్వ పైశాచిక చర్యలకు పరాకాష్ఠ. అమెరికా ప్రభుత్వం ఈ పైశాచిక చర్యకు ఒడిగట్టింది. నరరూప పిశాచి వలే భీకర నృత్యం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ‘చర్య’ను- పిల్లలను తల్లిదండ్రుల నుంచి విడగొట్టిన దుశ్చర్యను- బుధవారం రద్దు చేయవలసి రావడానికి కారణం మానవీయ భావాలు మిగిలి ఉన్న ప్రపంచ దేశాల నిరసన, అమెరికన్లలో అధికాధికుల అభిశంసన!
దాదాపు రెండునెలల పాటు రెండువేల మంది చిన్నపిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి విడదీసి గుర్తుతెలియని చోట ఉంచారట! ఇలా తల్లిదండ్రుల నుంచి పిల్లలను-శిశువులను విడదీయవలసిన అనివార్యాన్ని ట్రంప్ కల్పించాడు, అధ్యాదేశం జారీ చేశాడు. తల్లిదండ్రులను, పిల్లలను ఒకేచోట ఎందుకు ఉంచరాదన్న ప్రశ్నకు డొనాల్డ్ దొరతనం వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. భర్తల నుంచి భార్యలను విడదీసి వేఱు వేఱు జైళ్లలో ఉంచారు. ఇలా నిర్బంధానికి గురైన వేలమందిలో యాబయి రెండు మంది భారతీయులు, పదముగ్గురు నేపాలీలు ఉన్నారు. చివరికి అంతర్గత, అంతర్జాతీయ నిరసనలకు తలఒగ్గి డొనాల్డ్ ట్రంప్ ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల పట్టుబడిన ‘అక్రమ ప్రవేశకుల’కు నిర్బంధం తప్పకపోయినప్పటికీ కుటుంబాల సభ్యుల మధ్య ఎడబాటు తప్పింది. ఇలా ‘అబద్ధాలు వ్రాసి దిద్దుకుంటున్న అయ్యవారి’ వలె ప్రవర్తిస్తున్న ట్రంప్ విధాన వైచిత్రి ఇంతటితో ఆగలేదు. ‘ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి’ నుంచి తమ దేశం వైదొలగుతున్నట్టు అమెరికా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అంతర్జాతీయ సంస్థల సభ్యత్వం నుంచి అమెరికా నిష్క్రమిస్తుండడం పదిహేడు నెలల ట్రంప్ పాలన నిర్వాకం! అమెరికా ప్రభుత్వం నిరంతరం అసహనానికి గురవుతోంది. అమెరికా రాజకీయ, వాణిజ్య, దౌత్య, వ్యూహాత్మక ఆధిపత్యం అంతర్జాతీయ రంగస్థలిపై అంతరించిపోతోండడం ఇందుకు కారణం. చైనా సామ్రాజ్యం విస్తరించిపోతోండడం అమెరికాకు, ఐరోపా దేశాలకు కొరుకుడుపడని వ్యవహారం. అందువల్లనే అమెరికా, ఐరోపా దేశాలు సంకుచిత ఆర్థిక విధానాలను ఆచరించడం ఆరంభమైంది. చైనా వస్తువులు తమ దేశాలను ముంచెత్తుతుండడాన్ని నిరోధించడానికి ఈ దేశాలు యత్నిస్తున్నాయి. అమెరికా మొదలుపెట్టింది, ఐరోపా అనుసరించనుంది..
‘ఐరోపా హితం ప్రపంచ హితం, ఐరోపా వారి బాధ ప్రపంచానికి బాధ’ అన్నది నాలుగు శతాబ్దుల ప్రపంచ చరిత్ర. ఈ చరిత్ర ప్రపంచీకరణ రూపంలో పునరావృత్తవౌతోంది. ప్రపంచీకరణ పేరుతో సరిహద్దులను చెఱపివేయడం వల్ల వివిధ ప్రవర్ధమాన దేశాలను కొల్లగొట్టవచ్చునన్నది గత శతాబ్దిలోని చివరి దశాబ్దిలో ఐరోపా, ఐరోపాకు ఆధునిక రూపమైన అమెరికా పన్నిన పన్నాగం. సరిహద్దులు చెఱగిపోవడమంటే ఎగుమతుల దిగుమతుల సుంకాలు తగ్గిపోవడం. వర్ధమాన దేశాల నుంచి సంపన్న దేశాలకు పెద్దగా ఎగుమతులు జరగడం లేదు. సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందువల్ల ఉప్పు మొదలు అణ్వస్త్రాల వరకు, ఐస్‌క్రీములు మొదలు అంతరిక్ష నౌకల వరకు ప్రవర్ధమాన దేశాలకు నిర్నిరోధంగా అమ్మి భారీగా అక్రమ లాభాలను పొందవచ్చునన్నది సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ఎత్తుగడ, సంపన్న దేశాల ప్రభుత్వాల ఎత్తుగడ. మొన్‌సాంటో, నెజల్-నెస్లే, వాల్‌మార్ట్, అమెజాన్ వంటి సంపన్న దేశాల అవినీతి సంస్థలు మన దేశంలోకి చొరబడి లక్షల కోట్ల రూపాయలను దోచుకొనడం ‘ప్రపంచీకరణ’. కానీ చైనా రంగమెక్కి వికృత వాణిజ్య తాండవం మొదలుపెట్టిన తర్వాత అమెరికా, ఐరోపాల వ్యూహం బెడిసికొట్టింది. ఐరోపా, అమెరికా సంయుక్తంగా చేయతలపెట్టిన దోపిడీని చైనా జరిపిస్తోంది. వర్ధమాన దేశాలే కాదు, అమెరికా ఐరోపా దేశాలు సైతం చైనా సంస్థల వాణిజ్య దురాక్రమణకు గురవుతున్నాయి. టిబెట్‌ను కబళించిన చైనా టిబెట్‌లోని ప్రాకృతిక సంపదను భారీగా కొల్లగొట్టింది. దాదాపు అన్ని దేశాలకు అవసరమైన ‘అపురూప భూగర్భ ఖనిజ ధాతువులు’- రేర్ ఎర్త్ మినరల్స్- టిబెట్‌లో భారీగా లభిస్తున్నాయి. ఈ ధాతువుల సరఫరాలను నియంత్రించడం ద్వారా చైనా ప్రభుత్వం ప్రవర్ధమాన దేశాలపై పట్టు సాధించింది. ఈ దేశాలన్నీ చైనా వస్తువులను దిగుమతి చేసుకోవలసిన అనివార్యం ఏర్పడిపోయింది.
ఇలా ప్రపంచీకరణ తమకు వ్యతిరేకంగా బెడిసికొడుతుండడంతో ఐరోపా, అమెరికా ప్రభుత్వాల వారు వివిధ దేశాల నుంచి తమ దేశాలకు తరలివస్తున్న వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను పెంచారు. ఫలితంగా చైనా ప్రభుత్వం కూడ అమెరికా, ఐరోపా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచింది, పెంచుతోంది. తోడేళ్లకూ రాబందులకూ మధ్య ‘అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ’ కుమ్ములాటలకు కేంద్రంగా మారింది. ప్రపంచ వాణిజ్య సంస్థ- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-ను ట్రంప్ పరుష పదజాలంతో నిందిస్తున్నాడు. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నుంచి అమెరికా నిష్క్రమించినా ఆశ్చర్యకరం కాబోదు..!