సంపాదకీయం

సీఎంలకు దేశభద్రత పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. ఇలా ఎందుకు జరుగుతోంది? వాతావరణ కాలుష్యం విషమించిన ప్రాంతాల్లో ఢిల్లీ నగరం ఒకటని శాస్తవ్రేత్తలు ప్రభుత్వానికి తాజాగా ఓ నివేదికను అందజేశారు. రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది అత్యధిక సంఖ్యలో వాహనాలు. రెండవది పరిపాలనా రాహిత్యం. ఢిల్లీలో ఐఎఎస్ అధికారులు అనధికారికంగా సమ్మె చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, అక్కడి లెఫ్టినెంటు గవర్నరుకూ పొసగడం లేదు. ఎవరి రాజకీయాలు వారివి. తన ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కావాలని, లెఫ్టినెంటు గవర్నర్ పెత్తనం తగ్గాలని కేజ్రీవాల్ నిరశన దీక్ష చేయడం తెలిసిందే. లెఫ్టినెంటు గవర్నర్ నివాసంలో ధర్నాకు దిగడం సరికాదంటూ న్యాయస్థానం మందలించడంతో చివరికి కేజ్రీవాల్ తన నిరసన వ్రతాన్ని ముగించారు. ఢిల్లీకి పూర్తిస్థాయిలో రాష్ట్రం హోదా కల్పించాలని, పరిపాలనలో కేంద్రం జోక్యం తగ్గాలన్నది కేజ్రీవాల్ ప్రధాన డిమాండ్లు.
ఇక, ‘ప్రత్యేక హోదా’ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ‘్ధర్మపోరాటం’ పేరుతో నిరసన ప్రకటించారు. ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే కాదు ముఖ్యమంత్రులూ, మంత్రులూ నిరసన ప్రకటించవచ్చు, ధర్నాలు చేయవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌కు దేశ భద్రత గురించి ఎలాంటి ఆలోచనా లేదు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం నిరసన వ్రతం చేపట్టారు. తమ ప్రాంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రులు నిరశన దీక్షలు చేస్తుండగా, మరోవైపు వివిధ రాష్ట్రాల్లో శాంతిభద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల బీభత్స చర్యలు పాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాటించాలని కేంద్రం నిర్ణయించగా- పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. కశ్మీర్‌లో ప్రఖ్యాత సంపాదకుడు బుఖారీని, ఆర్మీ జవాను ఔరంగజేబును లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు కాల్చిచంపడం కొందరు ముఖ్యమంత్రులకు కిరాతక చర్యగా కనిపించలేదు. జాతీయ భావాన్ని, దేశ భద్రతను ఆకాంక్షించడానికి బదులు విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకుని ధర్నాల పేరిట హడావుడి చేస్తున్నారు. ఢిల్లీలోని మండీ హౌస్ నుండి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు వరకు కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దేశ సమైక్యతను కాపాడండి’- అంటూ వీరు ఊరేగింపు ఎందుకు చేయలేకపోయారు? ‘ఆప్’ ఎమ్మెల్యేలలో చాలామంది వివిధ ఆరోపణలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే కేజ్రీవాల్‌తో కలసి ప్రారంభించిన ‘అవినీతి రహిత భారత్’ ఉద్యమం ఏమైపోయింది? హజారా ఆశయాలకు విరుద్ధంగా కేజ్రీవాల్, ఆయన అనుచర గణం ఇప్పుడు చేస్తున్నదేమిటి?
ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశంలోనూ ప్రాంతీయ ధోరణులే వ్యక్తమయ్యాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొన్న ఈ సమావేశంలో జాతీయ భావన మచ్చుకైనా కానరాలేదు. ‘నీతి ఆయోగ్’ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించగా, కేంద్ర హోమ్‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అదే సమయంలో ఢిల్లీలో నిరశన వ్రతం చేస్తున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఏపీ, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక ముఖ్యమంత్రులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సంఘీభావం దేనికి? తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసమేనా?
పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. అక్కడ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎందరో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భాజపా బలపరచిన అభ్యర్థికి వోటు వేశాడన్న కక్షతో త్రిలోచన్ మెహతా అనే దళితుడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు హత్య చేసి చెట్టుకు వ్రేలాడదీశారు. ఇలాంటి అరాచక సంఘటనలను నిలువరించలేక పోయిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చి మరో అరాచక ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించడం విడ్డూరం. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తృతీయ ఫ్రంటుకు అధిక సీట్లువస్తే తాను ఈ సువిశాల దేశానికి ప్రధాని కావాలని మమతా బెనర్జీ ఉవ్విళ్లూరుతున్నది. ఇలాంటి నేతలకు పదవులు తప్ప, జాతీయ భద్రత, ప్రజాసంక్షేమం వంటి విషయాలు పట్టవు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా?
‘నీతి ఆయోగ్’ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరవై నిముషాల సేపు మాట్లాడి, తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల గురించి ఏకరువుపెట్టారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాజధాని అమరావతి నగర నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలను ఆయన ప్రధాని ఎదుట ప్రస్తావించి, ఏపీకి దండిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించడం ఆత్మహత్య సదృశం అవుతుంది. రాజకీయ వైరం ఉంటే సంబంధిత పార్టీలు ఎన్నికల్లో తేల్చుకోవాలి. అంతేకాని, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు లేవనెత్తిన అంశాలను తిరస్కరించే అధికారం నైతికత ఎవరికీ లేదు. అందుకనే బిహార్ సీఎం నితీశ్‌కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు ప్రతిపాదనలకు మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వవలసిందేనన్నారు. అందుకు రాజ్యాంగం ఒప్పుకోకపోతే దానిని సవరించవచ్చు. ఇప్పటికే రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించారు. మరోసారి ప్రజల కోసం సవరిస్తే తప్పేమిటి??
ఇక, తెలంగాణలో భాజపాకు కాస్త ఉనికి ఉన్నప్పటికీ, ఏపీలో మాత్రం బాగా బలహీనపడింది. అందుకు కారణం- ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అనే ప్రజా ఉద్యమం. అవసరమైన ఆర్థిక సహాయాలను ‘నీతి ఆయోగ్’ నుండి అందించకపోతే ఏపీ ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ‘నీతి ఆయోగ్’ వేదికగా నితీశ్‌కుమార్ మాట్లాడుతూ బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అయితే- అందుకు సరియైన తర్కం లేదు. బిహార్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు. అక్కడ నూతన రాజధాని నిర్మాణం జరగడం లేదు. ఐనా రాజకీయ లబ్ధి కోసం నితీశ్ ప్రత్యేక హోదా కోరుతున్నారు.
మెహబూబా ముఫ్తీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి విధి లేని పరిస్థితుల్లో రాజీనామా చేసినా, పదవిలో ఉన్నన్నాళ్లూ ఆమె శాంతిభద్రతల గురించి పట్టించుకోలేదు. కేంద్రం కాల్పుల విరమణ ప్రకటించడం వల్ల భారీగా నష్టపోయింది కాశ్మీర్ పౌరులే. ముఫ్తీ ఆది నుంచీ వ్యక్తిగతంగా పాక్ అనుకూల ధోరణిని ప్రదర్శించారు. కాంగ్రెస్, భాజపా, నేషనల్ కాంగ్రెస్, ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ.. ఇలా అన్ని రాజకీయ పార్టీలూ కాశ్మీర్ సమస్యను సంక్లిష్టం చేశారు. ముఫ్తీతో ఇంకా పొత్తు కొనసాగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి భాజపా తప్పుకుంది.
‘ఫ్రంట్’ రాజకీయాలు..
‘నీతి ఆయోగ్’ సమావేశం కోసమని ఢిల్లీ చేరిన కొందరు ముఖ్యమంత్రులు సందట్లో సడేమియా అన్నట్టు- 2019 సార్వత్రిక ఎన్నికల గురించి, అందులో తమ తమ విజయావకాశాల గురించి చర్చించుకున్నారు. కాలం కలిసివస్తే ప్రధాని కావాలని చాలామంది సీఎంలు కోరుకుంటున్నారు. అలాంటి కోరికలు ఉండడం తప్పుకాదు. ‘నిద్రా ముద్రాంకితుడు’ దేవెగౌడను ప్రధానిగా ఎన్నుకున్న దేశం మనది. చంద్రబాబు వంటి నేతలు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పాలని, మిగతా ముఖ్యమంత్రులతో మంతనాలు మొదలుపెట్టారు. ‘ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా?’ అన్నట్లు కొందరు సీఎంలకు వారి రాష్ట్రాల్లోనే అధికారం సంశయ స్థితిలో ఉన్నప్పుడు కేంద్రంలో వీరి మాటలు ఎవరు వింటారు? నిరశన దీక్షలో ఉన్న కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపేలా ఆయన కుటుంబ సభ్యులను కొందరు సీఎంలు కలిశారు. ఏదో విధంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని కూల్చివేయాలని సీట్ల బలం లేని కమ్యూనిస్టులు సైతం తహతహలాడుతున్నారు. వీరికి చైనా నుంచి ఇందుకు ఆదేశాలున్నాయా? మొత్తానికి మోదీని వ్యతిరేకించే నేతలకు ఇపుడు కేజ్రీవాల్ ఓ ఆయుధంగా ఉపయోగపడుతున్నాడు. కేరళలో వరదలు, వైరల్ వ్యాధులతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నా, ఆ రాష్ట్ర సీఎం విజయన్‌కు రాజకీయాలే ప్రధానం. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే వామపక్ష మేధావుల ఏకైక అజెండా. రాజకీయమే పరమావధిగా మారిన వారు ముఖ్యమంత్రులుగా చెలామణి అవుతున్న దేశం మనది. మోదీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తృతీయ ఫ్రంట్ అధికారం చేపట్టాలన్నదే ఈ నేతల ఆరాటం. అయితే- ఈ తృతీయ ఫ్రంట్‌కు నాయకత్వం వహించే నాథుడెవరు? ఈ కప్పల తక్కెడ మేళం దేశానికి సుస్థిర పాలన అందించగలదా? ‘రైజింగ్ కాశ్మీర్’ సంపాదకుడు బుఖారీని ఉగ్రవాదులు రంజాన్ మాసంలో హత్య చేయడాన్ని ముఖ్యమంత్రులెవరూ ప్రస్తావించలేదు. ఇదొక దుర్మార్గపు ప్రజాస్వామ్యం. అధికారం కోసమే వీరంతా పరితపించిపోతున్నారు. ‘నేను భారత ప్రధాని కావాలనుకుంటున్నా.. మీరంతా నాకు మద్దతునివ్వండి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ప్రాంతీయ పార్టీల నాయకులకు సందేశం పంపాడు. మరి ఆయన ఆశలు ఫలిస్తాయా?
మనం ఔనన్నా కాదన్నా పాకిస్తాన్ మన దేశంతో యుద్ధం చేస్తోంది. తన న్యూక్లియర్ వాహనాలను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. రాబోయే పది నెలలు భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోబోతున్నది. ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? కొందరు నిపుణులు సూచిస్తున్నట్టు- మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఎపీ, తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికలను 2019 ఏప్రిల్ వరకు వాయిదా వేయాలి. లోక్‌సభ ఎన్నికలతోబాటు ఈ రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరుపాలి. ఈలోగా కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద ముఠాలను ఏరివేయాలి. ఆర్థిక నేరగాళ్లపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించి వారికి కఠిన శిక్షలు వేస్తే జనంలో నమ్మకం కలుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ అసమర్ధ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్టప్రతి పాలన విధించాలి. పాకిస్తాన్‌పై మరోసారి సర్జికల్ దాడులను మన సైన్యం జరపాలి. బెలూచీస్థాన్, సింధ్‌లను స్వతంత్ర దేశాలుగా ప్రకటించేలా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఒత్తిడి పెంచాలి. సరిహద్దుల్లో ఉగ్రవాదులను కట్టడి చేయకుంటే దేశభద్రతను గాలికి వదిలినట్లవుతుంది. ప్రస్తుతం దేశానికి కావలసింది ‘ఫ్రంట్‌లు’ కాదు. అన్ని రంగాల్లో సమస్యలపై దృష్టి సారించి పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్