సంపాదకీయం

విషాద గాంధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్ఘానిస్థాన్‌లో ఆదివారం పదిహేడు మంది హిందువులు హత్యకు గురికావడం శతాబ్దుల తరబడి ఆగని జిహాదీ బీభత్సకాండకు సరికొత్త నిదర్శనం. క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో అప్పటి అఖండ భారత్‌లో భాగంగా ఉండిన ‘గాంధార, యోన, రామఠ, ఉత్తర జ్యోతిష’ వంటి పదహారు భారతీయ రాజ్యాలు పరిఢవిల్లిన ప్రాంతాలు నేటి బలూచిస్థాన్, అప్ఘానిస్థాన్‌లు.. ఏడవ శతాబ్దిలో ఆరబ్బీ జిహాదీలు చొరబడిన నాటికి ఈ ప్రాంతాలలో అత్యధికులు హిందువులు, భారతీయులు.. పారశీక మతస్థులు కూడ ఈ ప్రాంతంలో హిందువులతో కలసిమెలసి జీవించేవారు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠాపించాలన్న లక్ష్యంతో ఆరబ్ జిహాదీలు బీభత్సకాండను మొదలుపెట్టారు. ఇలా నేటి అప్ఘానిస్థాన్, బలూచిస్థాన్ ప్రాంతాలలోకి చొరబడిన ఆరబ్ జిహాదీలు హిందువులను సామూహికంగా హత్యచేశారు. ఈ సామూహిక హత్యాకాండను ప్రస్తుతం బలూచిస్థాన్‌లోను, అప్ఘానిస్థాన్‌లో ‘తాలిబన్’ మూకలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అప్ఘానిస్థాన్ స్వతంత్ర దేశంగా ఉంది. పదకొండవ శతాబ్ది నాటికే ఈ దేశంలోని అత్యధిక భూభాగం అఖండ భారత్ నుంచి విడిపోయింది. బలూచిస్థాన్ పాకిస్తాన్‌లో భాగంగా ఉంది! ఆదివారం అప్ఘానిస్థాన్ తూర్పుప్రాంతంలోని జలాలాబాద్‌లో వాహనశ్రేణిపై బాంబులు విసిరి పంతొమ్మిది మందిని చంపివేయడం ఇప్పటికీ ఆగని జిహాదీ బీభత్సకాండకు నిదర్శనం. హతులలో పదిహేడుమంది హిందువులు.. సిక్కులు, ఇతర హిందూ మతాలవారు! ఈ దుర్ఘటన ఫలితంగా గాయపడిన ఇరవై మందిలో పదుగురు హిందువులు.. శతాబ్దుల క్రితం దాదాపు వంద శాతం హిందువులుండిన అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం వెయ్యిమంది హిందువులు మిగిలి ఉన్నారట! వీరిలో ఆరువందల మందికి పైగా సిక్కులు.. అవశేష హిందువులను నిశే్శషం చేయడానికి అఫ్ఘానిస్థాన్ ‘తాలిబన్’లు పూనుకోవడం అఫ్ఘానిస్థాన్‌లోని అరాజక స్థితికి, అభద్రతాస్థితికి నిదర్శనం! 1995-2001 సంవత్సరాల మధ్య ‘తాలిబన్’లు అఫ్ఘానిస్థాన్‌లోని అత్యధిక ప్రాంతాలపై ఆధిపత్యం వహించారు. ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్’ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో హిందువులను మాత్రమేకాక హైందవ చారిత్రక సాంస్కృతిక చిహ్నాలను కూడ ధ్వంసం చేయడానికి ‘తాలిబన్’ మూకలు, అల్ ఖాయిదా జిహాదీలు యత్నించారు. కానీ తాలిబన్‌ల పెత్తనం 2002లో ముగిసింది. ‘అల్ ఖాయిదా’ అఫ్ఘానిస్తాన్ నుండి పారిపోయింది. పదిహేడు ఏళ్లు గడిచిన తరువాత కూడ అఫ్ఘానిస్థాన్‌లో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడలేదు. ఇదీ వౌలిక వైపరీత్యం!
మతోన్మాదం వౌలిక వైపరీత్యం. ఈ భయంకర మతోన్మాదం శతాబ్దుల తరబడి సర్వమత సమభావ స్వభావులైన హైందవ జాతీయులను భయంకర పైశాచిక బీభత్సకాండకు గురిచేసింది, అఖండ భారత్‌ను పదే పదే బద్దలుకొట్టింది. శతాబ్దులు గడిచినప్పటికీ హిందువులను హత్యచేసే ఈ జిహాదీ బీభత్సం ఆగడం లేదు. తమ దేశంలో శేషించిన వెయ్యిమంది హిందువుల ఉనికిని సైతం జిహాదీలు సహించడం లేదు. ఆదివారం అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అఫ్రఫ్ ఘనీ జలాలాబాద్‌లో ఉన్నాడు. జలాలాబాద్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఐఎస్‌ఐ’-ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్- ఉసిగొల్పుతున్న బీభత్సమూకలు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. ‘తాలిబన్’ మూకలు మాత్రమేకాక ‘ఐఎస్‌ఐ’ ఏర్పాటు చేసిన ‘హక్కానీ’ ముఠా కూడ అఫ్ఘానిస్థాన్ తూర్పు ప్రాంతంలో బీభత్స కలాపాలను సాగిస్తోంది. అయినప్పటికీ తమ దేశ అధ్యక్షుడు పర్యటిస్తున్న సమయంలో కూడ అఫ్ఘానీ ప్రభుత్వ దళాలు ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయలేకపోయాయి. బీభత్సకారుల దాడిలో హతులైన హిందువులు, గాయపడిన హిందువులు అధ్యక్షుడిని కలుసుకొనడానికి వెడుతుండిన సమయంలోనే దాడులు జరగడం విస్మయకరం. 1994 నుంచి పెత్తనం వహించిన ‘తాలిబన్’ జిహాదీలు అఫ్ఘానిస్థాన్‌లోని ప్రాచీన బుద్ధవిగ్రహాలను, శివలింగాలను ధ్వంసం చేశారు. శతాబ్దుల తరబడి జిహాదీలు ధ్వంసం చేసినప్పటికీ ఈ హైందవ చిహ్నాలు వారి దృష్టిని తప్పించుకొని మిగిలాయి. వాటిని అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం వికృతపరచి విధ్వంసం చేయడం ప్రభుత్వం బీభత్సకాండకు చిహ్నం. కానీ తాలిబన్లను అమెరికా నాయకత్వంలోని ‘నాటో’- ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి-దళాలు నిర్మూలించిన తరువాత కూడ ఈ హైందవ చిహ్నాల పునరుద్ధరణ జరగలేదు..
తాలిబన్, అల్ ఖాయిదా మూకలు అమెరికాలోని ‘ప్రపంచ వాణిజ్య కేంద్రం’ భవనాన్ని కూల్చివేసిన తరువాత 2001 చివరి నుండి ‘నాటో’ అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్, అల్ ఖాయిదాలను తుదముట్టించింది. ఆ తరువాత ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం వారు ‘హైందవ చిహ్నాల’ను పునరుద్ధరించలేదు. ఎందుకంటె పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటికీ అఫ్ఘానిస్థాన్‌లో ‘సర్వమత సమభావ వ్యవస్థ’ ఏర్పడలేదు. ప్రజాస్వామ్య అఫ్ఘానిస్థాన్ ‘ఇస్లామిక్ రిపబ్లిక్’గా అవతరించింది. ‘జిహాదీ’లు 1996-2001 మధ్య అఫ్ఘానిస్థాన్‌లోని ఇస్లాం మతస్థులను సైతం చిత్రహింసలకు గురిచేశారు. బాలికలు పాఠశాలలకు వెళ్లరాదని, చదువుకోరాదని నిర్దేశించారు. మహిళలను బానిసలుగా మార్చారు. ఇలా ఘోరమైన మతోన్మాదానికి గురైనప్పటికీ ‘అఫ్ఘానిస్థానీ’ సమాజం-తాలిబన్‌ల నుంచి విముక్తిని సాధించిన తరువాత-గుణపాఠం నేర్చుకోలేదు. సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. మళ్లీ ఏకమత రాజ్యంగా ‘ఇస్లాం గణతంత్రం’గా అఫ్ఘానిస్థాన్ అవతరించింది. ‘జిహాదీ’లు నిరంతరం బీభత్సకాండ కొనసాగించడానికి ఇది వౌలిక కారణం. 1970వ దశకంలో ఎనబయి వేల మంది హిందువులు అఫ్ఘానిస్థాన్‌లో మిగిలారు. ఇప్పుడు వీరి సంఖ్య వెయ్యికి దిగజారడానికి కారణం ‘సర్వమత సమభావం’ రాజ్యాంగ పద్ధతిలో వికసించకపోవడం..
ఇలాంటి మత రాజ్యాంగ వ్యవస్థను అమెరికా ప్రభుత్వం- నియంతృత్వ విముక్త ‘ఇరాక్’లో సైతం అంగీకరించింది! అఫ్ఘానిస్థాన్‌లో సైతం ‘తాలిబన్’లు తొలగిపోయిన తరువాత ఇదే జరిగింది. ‘తాలిబన్’ విముక్త అఫ్ఘానిస్థాన్ పునర్ నిర్మాణానికి మన దేశం పదహైదు ఏళ్లకుపైగా వేల కోట్ల రూపాయలను ప్రదానం చేసింది. అఫ్ఘానిస్థాన్ సైనిక దళాలకు శిక్షణనిచ్చింది. అనేక వందల కిలోమీటర్ల రహదారులను నిర్మించింది. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను, సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అఫ్ఘానీ పార్లమెంటు భవనాన్ని సైతం మన ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. ఇంత జరిగినప్పటికీ అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం మన దేశానికి శరణార్థులుగా వచ్చేసిన హిందువులను తిరిగి తమ దేశానికి రప్పించి పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి పూనుకోలేదు. ‘మీకు భద్రత కల్పిస్తాము, తిరిగి రండి’అని ఈ శరణార్థులకు హామీ ఇవ్వడం లేదు. ఇలాంటి అఫ్ఘానీ శరణార్థులకు మన దేశం పౌరసత్వం కల్పించడానికి మన ప్రభుత్వం నిర్ణయించవచ్చు. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురవుతున్న వారికి పౌరసత్వం కల్పించాలని 2015లోనే మన ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అఫ్ఘానిస్థాన్‌లోని అవశేష హిందువులు నిశే్శషమయితే అది చారిత్రక విషాదానికి పరాకాష్ఠ కాగలదు. 1970 నుంచి అఫ్ఘానిస్థాన్‌ను వదలి వచ్చిన హిందువులు తిరిగి స్వస్థలాలకు వెళ్లగలగాలి.. ఇది జరిగేనా?