సంపాదకీయం

సమగ్ర వందనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరగతిని నిర్దేశించిన అఖండ భారత జాతీయ మహామంత్రం ‘వందేమాతరం’.. ప్రస్తుతం అఖండ భారతం ముక్కలై ఉంది. ‘వందేమాతరం’ కూడ ముక్కలై ఉంది. అఖండ భారత విభజనకూ, ‘వందేమాతరం’ విభజనకూ అవినాభావ సంబంధం ఉండడం చరిత్ర. మొదట ‘వందేమాతరం’ గీతాన్ని విభజించారు, ఆ తరువాత ‘అఖండ భారత్’ను విభజించారు. ఈ చారిత్రక వైపరీత్యాన్ని భారతీయ జనతాపార్టీ అధినేత అమిత్ షా సరిగ్గా వారం రోజుల క్రితం దేశ ప్రజలకు గుర్తుచేశాడు. కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ ఉద్యమ సంస్థ -వారు 1937లో ‘వందేమాతరం’ గీతాన్ని ముక్కలు చేశారని, 1947లో దేశాన్ని ముక్కలుచేసి పాకిస్తాన్ వేర్పాటుకు దోహదం చేశారని అమిత్ షా కలకత్తా మహానగరంలో గుర్తుచేసిన చారిత్రక సత్యం. పాకిస్తాన్ 1971లో మళ్లీ ముక్కలైంది, బంగ్లాదేశ్ ఏర్పడింది. ‘వందేమాతరం’ గీతాన్ని రచించిన జాతీయ మహాకవి బంకించంద్ర ఛటర్జీ కలియుగం 4940- క్రీస్తుశకం 1838-లో బంగ్లాదేశ్‌లో జన్మించాడు. యుగాలుగా భారత్‌లో భాగమై ఉండిన బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్‌లో లేదు. ‘వందేమాతరం’ గీతంతోను, బంకించంద్రుని జీవితంతోను ముడివడి ఉన్న మరో విషాదాంశం ఇది. ‘వందేమాతరం’ గీతం బంకించంద్రుడు 1875లో శ్రీకారం చుట్టిన ‘ఆనంద మఠం’ చారిత్రక నవల లోనిది. ఈ చరిత్ర 1760-1763 సంవత్సరాల మధ్య వంగ ప్రాంతంలో సంభవించిన జాతీయ విప్లవానికి సంబంధించినది. ‘మొఘలాయిలు’, ‘ఈస్టిండియా కంపెనీ’వారు సాగించిన ఉమ్మడి దోపిడీకి వ్యతిరేకంగా బ్రహ్మచారులు, సంన్యాసులు, ధర్మాచార్యుల నాయకత్వంలో ఆ విప్లవం జరిగింది. విప్లవం విజయవంతమైంది, వంగ ప్రాంతంలో మొఘలాయిల పెత్తనం ముగిసింది. ఈ వాస్తవ చరిత్ర ఆధారంగా దాదాపు నూట పదిహేనేళ్ల తర్వాత బంకించంద్రుడు ‘ఆనందమఠం’ వ్రాశాడు. సంన్యాసుల విప్లవం సమయంలో ఉద్యమకారులు ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించినట్టు ‘ఆనంద మఠం’లో బంకించంద్ర ఛటర్జీ వివరించాడు. 1905, 1906 సంవత్సరాలలో బ్రిటన్‌కు వ్యతిరేకంగా జరిగిన ‘స్వదేశీ’ ఉద్యమం సమయంలో ‘ఆనంద మఠం’ నవలలోని ‘వందేమాతరం’ మరోసారి దేశమంతటా మారుమోగింది. లాలాలజపతి రాయ్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, విపిన చంద్రపాల్- ‘లాల్ బాల్ పాల్’- మహాపురుషత్రయం నాయకత్వంలో ఈ స్వదేశీ ఉద్యమం జరిగింది. బ్రిటన్ దురాక్రమణదారులు జరిపిన వంగప్రాంత విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఈ మహోద్యమం ‘వందేమాతరం’ ఉద్యమంగా వినుతికెక్కింది. అమిత్ షా కలకత్తాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణకు ఇదీ చారిత్రక నేపథ్యం!
ఇలా- ‘వందేమాతరం ఒక విజయ స్మృతి, ఒక చారిత్రక కృతి, ఒక విప్లవ ద్యుతి, భారత జాతీయ ధృతి..!’ అన్న వాస్తవాలు దేశ ప్రజలకు మరోసారి గుర్తుకు రావడానికి అమిత్ షా చేసిన ఆరోపణ దోహదం చేస్తోంది. కలకత్తాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పరిశోధక సంస్థ వారు ఏర్పాటు చేసిన ‘బంకించంద్ర చటర్జీ స్మారక ప్రసంగం’ సందర్భంగా అమిత్ షా వందేమాతరం గీతాన్ని ప్రస్తావించడం సహజం.. ‘వందేమాతరం’ లేనిదే ‘ఆనందమఠం’ లేదు, ‘ఆనంద మఠం’లేనిదే బంకించంద్రు లేడు. ‘అనాదిగా ఇది, ఈ భారతదేశం, ఒక జాతిగా పరిఢవిల్లుతోంది..’’ అన్న వాస్తవాన్ని మరచి, భౌతిక దాస్యానికి, భౌతిక దాస్యం కంటె మరింత హేయమైన, ప్రమాదకరమైన భావదాస్యానికి గురైన దేశ ప్రజలకు ఈ వాస్తవాన్ని గుర్తుచేసినవాడు బంకించంద్రుడు. ఈ అనాది జాతీయతకు ప్రాతిపదిక ఈ దేశంలో పరిఢవిల్లిన సంస్కృతి... సంస్కృతి దేశ ప్రజల సమష్టి స్వభావం. ‘ఈ భూమి తల్లి.. నేను ఆమె బిడ్డను..’ అన్నది మానవాళికి మాత్రమేకాక సకల జీవజాలానికి అన్వయమవుతున్న సృష్టిగత వాస్తవం! ‘మాతాభూమీ, పుత్రోహం పృథివ్యాః’ ఈ సనాతన వాస్తవం అనాదిగా భారత జాతీయ వికసనానికి దోహదం చేసింది. భారత జాతి సృష్ట్యాది గుర్తించిన ఈ ‘మాతాపుత్ర బంధాన్ని’ ఇతర దేశాల వారు ప్రధానంగా పాశ్చాత్య దేశాలవారు గుర్తించక పోవడం వేఱు కథ. ఈ ‘మాతాపుత్ర సంబంధం’ భారతీయుల సమష్టి స్వభావమైంది, సంస్కృతి అయింది, జాతీయత అయింది. శతాబ్దుల దాస్యం ఫలితంగా ఈ సంస్కృతిని, భూమాత లేదా భరతమాత పరమదేవత అన్న అనాది వాస్తవాన్ని, జాతీయతను మరచిన ప్రజలకు ఈ సంగతులను గుర్తుచేయడానికై బంకించంద్రుడు ఈ గీతాన్ని వ్రాశాడు, నవలను వ్రాశాడు.
ఇలా స్వభూమితో ముడివడిన ఈ గీతంలో భరతస్వరూపం ప్రస్ఫుటించింది, స్వభావం ఆవిష్కృతమైంది. స్వభావం ప్రాణం, బుద్ధి, మనస్సు, ఆత్మ.. అందువల్లనే ‘వందేమాతరం’ గీతాన్ని సర్వసమగ్రం ఆలపించిన 1760-63నాటి సంన్యాసులు, 1906నాటి స్వదేశ ఉద్యమకారులు విజయం సాధించారు. 1763నాటి స్వదేశ వీరుల విజయం వంగసీమ-నేటి మన పశ్చిమ బెంగాల్, త్రిపుర, బంగ్లాదేశ్‌లు కలసిన ప్రాంతం-లో మొఘలాయి పెత్తనానికి అంతం.. 1906 నాటి స్వదేశ ఉద్యమ విజయం బెంగాల్ విభజన రద్దు.. కానీ 1937 తరువాత కాంగ్రెస్‌వారు కేవలం ‘వందేమాతరం’లోని మొదటి చరణాన్ని ఆలపించారు. ఇలా ‘మంత్రాన్ని’ ముక్కలుచేసిన వారు క్రమంగా బ్రిటన్, ముస్లింలీగ్ ఉమ్మడి కుట్రకు తలవంచారు, దేశ విభజనకు అంగీకరించారు!
స్వదేశ ఉద్యమం సమయంలోనే బ్రిటన్ పెత్తందార్లు ‘వందేమాతరం’ నినాదాన్ని, గీతాన్ని నిషేధించారు. ఈ నిషేధం విఫలమైంది. దేశమంతటా ‘మంత్రం’ మారుమోగింది. అందువల్లనే మరో ‘కుట్ర’ను బ్రిటన్ దుండగులు రూపొందించారు. ‘వందేమాతరం’లో భరతమాత వర్ణన, ఆరాధన ఉన్నాయి. ఇదంతా విగ్రహారాధన అని ముస్లింలీగ్, కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ప్రకటించారు. ‘విగ్రహారాధన’ ఇస్లాం మతస్థుల విశ్వాసాలకు విరుద్ధం కనుక ‘వందేమాతరం’ పాడరాదన్నది కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు చేసిన వాదం. 1922లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో కొందరు ముస్లిం నాయకులు ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో నిరసనగా బయటికి వెళ్లిపోవడం చరిత్ర! కాంగ్రెస్ అధిష్ఠానం క్రమంగా ఈ ఒత్తిడికి లొంగింది. 1937లో వందేమాతరంలోని పల్లవిని, మొదటి చరణాన్ని మాత్రమే పాడే పద్ధతిని ప్రారంభించింది. 1947 తరువాత ఈ వైపరీత్యం ఆధికారికంగా స్థిరపడింది. ప్రభుత్వం, ప్రజలు ‘గీతం’లోని మిగిలిన చరణాలను మరచిపోయారు. మొదటి చరణంలో భరతమాత భౌతిక స్వరూపం మాత్రమే ప్రస్ఫుటిస్తోంది. ఆమె స్వభావం స్ఫురిస్తున్న మిగిలిన చరణాలు విస్మృతికి గురవుతున్నాయి. జాతీయతా నిష్ఠులైనవారు ఇప్పటికీ వందేమాతరం గీతాన్ని సర్వసమగ్రంగా ఆలపిస్తున్నారు. వీరి సంఖ్య చాలా తక్కువ. కాంగ్రెస్ తప్పిదాన్ని ఎత్తిచూపిన ‘్భజపా’ అధ్యక్షుడు ఈ తప్పు దిద్దడానికి తమ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదో మాత్రం చెప్పలేదు! ‘వందేమాతరం’ విభజనను కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దుచేయవచ్చు. గీతాన్ని పూర్తిగా పాడాలని ఆధికారికంగా నిర్దేశించవచ్చు.. నిర్దేశించండి మరి... ‘అలసత్వం’ ఎందుకు?