సంపాదకీయం

పెట్టుబడుల గుట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నాలుగేళ్లలో ఇతర దేశాల నుంచి మన దేశానికి తరలివస్తున్న పెట్టుబడులు- ఫారిన్ డైరెక్ట్ ఇనె్వస్టిమెంట్-ఎఫ్‌డిఐ- తగ్గిపోవడం హర్షణీయ పరిణామం.. విదేశీయ వాణిజ్య సంస్థల పెట్టుబడులు తగ్గినంతమేర మన ఆర్థిక వ్యవస్థపై ఈ సంస్థల పట్టు సడలిపోగలదన్నది సంతోషానికి కారణం. 1994లో ‘ప్రపంచీకరణ’ మొదలయినప్పటి నుంచి మన ఆర్థిక వ్యవస్థ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల దోపిడీకి గురి అవుతోంది. మన ‘జుట్టు’ విదేశీయుల చేతిలో ఇరుక్కొని ఉంది. అందువల్ల విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న పెట్టుబడులు తగ్గుతున్నాయన్న సమాచారం ఈ దేశ హితం కోరుతున్నవారికి ఆనందకరం. ఈ వాస్తవాన్ని గ్రహించని ప్రభుత్వాలు విదేశీయ సంస్థల పెట్టుబడుల ‘మారీచ మృగ మాయాజాలం’లో చిక్కుకొని ఉండడం నడుస్తున్న చరిత్ర. ప్రతివారం ఎక్కడో అక్కడ ఏదో రకమైన ‘విదేశీయ నిధుల’ మేళా జరగడం గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ప్రహసనం. రకరకాల విచిత్ర నామధేయాలతో ఈ పెట్టుబడుల ‘మేళా’లు జరిగాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధులు అనేక విదేశాలలో తరచూ పర్యటనలు జరిపి ‘మా దేశంలో పెట్టుబడులను పెట్టండి. మీకు భూమి కారుచౌకగా కొనిపెడతాము. మీ పరిశ్రమలకు అవసరమైన అనుమతులను ఇరవై నాలుగు గంటలలోపే మంజూరు చేస్తాము. పదిహేను సంవత్సరాలు పన్ను రాయితీలు ఇస్తాము, విద్యుత్‌ను కారుచౌకగా సరఫరాచేస్తాము. రండహో రండి..’అని చాటింపువేసి వస్తున్నారు. విదేశాల ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు మన దేశానికి వచ్చినప్పుడు మన ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు విదేశాలలో పర్యటించినప్పుడు మన దేశంలో ఆయా దేశాల వాణిజ్య సంస్థలవారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అంగీకారాలు కుదిరినట్టు ప్రచారమైంది. ఇలాంటి పెట్టుబడుల సదస్సుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె హాజరు కావడం గురించి భూనభోవీధులు దద్దరిల్లేలాగ ప్రచారం.. ‘్ఫలానా గొప్ప సినిమా నటుడు సదస్సు వేదిక పైకి అందరికంటె ముందు ఎక్కాడు..’, ‘్ఫలానా క్రీడాకారుడు మొదటి ‘బొకే’ అందుకున్నాడు..’, ‘్ఫలానా ‘ముద్రా రాయబారి’- బ్రాండ్ అంబాసిడర్- ‘రిబ్బన్’లను గాలిలో ఊపాడు..’ ఇలాంటి సమాచారం విరివిగా ప్రచారం కావడం విదేశాల పెట్టుబడుల సదస్సులలో ప్రధాన విశేషాలు! దేశభక్తులను, ఉద్యమకారులను, నిరాడంబరులను, సౌశీల్యమూర్తులను జనం ప్రధానంగా యువజనం ఆరాధించడం గతం... అల్లసాని పెద్దన మహాకవి చెప్పినట్టు ‘నట విట గాయక గణికాకుటిల వచస్సీ ధురసముల’ వాణిజ్య వాసనలను జనం ఆఘ్రాణిస్తుండడం పెట్టుబడుల యుగం. పారిశ్రామిక ప్రాంగణ ప్రారంభోత్సవం సమయంలో ‘ప్రముఖుడు’ రిబ్బన్‌ను కోస్తాడు.. ఒక ‘ప్రముఖ’ కళాకారిణి కత్తెరను అందిస్తుంది! ‘క్రికెట్’ క్రీడానైపుణ్యం ప్రధానం కాదు. ‘్ఛర్’ యువతుల విన్యాసాలు ప్రధానం.. స్వదేశ ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు స్వజాతీయ సంస్కృతిని సైతం విదేశాల పెట్టుబడిదారులు దివాలా తీయిస్తుండడం ప్రపంచీకరణ యుగం!
ఇంత జరిగినప్పటికీ, విదేశీయ వాణిజ్య సంస్థలు మన దేశాన్ని దోపిడీ చేయడానికి మన ప్రభుత్వాలు ఇరవై ఆరు ఏళ్లుగా అనుమతించినప్పటికీ ఈ విదేశాల పెట్టుబడులు తరలిరావడం తగ్గుతోంది. ఇందుకు ప్రధాన కారణం మన ప్రభుత్వాలు భ్రమిస్తున్నట్టుగా పెట్టుబడులు విదేశీయ సంస్థల వద్ద లేకపోవడం.. పెట్టుబడులు ఉన్న సంస్థలు- ఐరోపా, అమెరికా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మన దేశంలో పెట్టడం కంటె ఆఫ్రికా దేశాలలోను పశ్చిమాసియా, దక్షిణ అమెరికా దేశాలలోను పెట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నాయి. మన దేశాన్ని దోచుకోవడం కంటె పై దేశాలను దోచుకోవడం మరింత సులభం. ఆఫ్రికా ఖండంలోని అటవీ భూమిలో అరవై శాతాన్ని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- విదేశీయ సంస్థలు- కొనుగోలు చేసినట్టు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రకటించిన తరువాత దశాబ్ది గడిచిపోయింది. మన దేశంలో కూడ ‘ప్రత్యేక’ ఆర్థిక మండలాల’- స్పెషల్ ఎకనామిక్ జోన్స్- సెజ్‌లు- పేరుతో వేల ఎకరాల భూమిని విదేశీయ సంస్థలకు ప్రభుత్వాలు సేకరించి పెట్టాయి, పెడుతున్నాయి! తమలపాకుల తోటలను, అరటి తోటలను, కొబ్బరి తోటలను కూల్చివేసి, వరి పొలాలను రైతుల కళ్లముందే తగలబెట్టి, అత్యవసరంగా యుద్ధప్రాతిపదికపై ‘పోస్కో’ ‘అరేవా’వంటి విదేశీయ సంస్థలకు మన ప్రభుత్వాలు వ్యవసాయ భూమిని సేకరించి పెట్టడం చరిత్ర.. అయినప్పటికీ విదేశీయ సంస్థలకు తృప్తిలేదు. అందువల్లనే ‘ప్రపంచీకరణ’ మత్తెక్కిన ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పెట్టుబడులు తరలి రావడం లేదు.
గత మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విదేశీయ వాణిజ్య నిధులు మాత్రమే మన దేశానికి తరలి వచ్చాయట. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో లభించిన విదేశీయ నిధుల కంటె మూడు శాతం మాత్రమే గత ఏడాది పెరుగుదల కనిపించడం ప్రభుత్వ నిర్వాహకులను కలవరపరుస్తోందట! ఈ మూడు లక్షల కోట్ల రూపాయలలో వౌలిక రంగమైన ‘విద్యుత్’ ఉత్పాదనకు కేవలం పదకొండు వేల కోట్ల రూపాయల విదేశీయ నిధులు లభించాయి. మిగిలిన నిధులన్నీ - తొంబయి శాతానికి పైగా- సేవారంగానికి, పంపిణీ రంగానికి తదితర అనుత్పాదక రంగాలకు లభించాయి. అనుత్పాదక రంగాలలోని ప్రగతి కేవలం ‘వాపు’.. ‘బలుపు’కాజాలదు. ఉక్కు, సిమెంటు, విద్యుత్, బొగ్గు, ఇంధన తైలం, ఇంధన వాయువు వంటి వౌలిక రంగాలలో జరిగే ఉత్పత్తులు నిజమైన ప్రగతికి చిహ్నాలు. విద్యుత్‌కు తప్ప మరే ఇతర వౌలిక రంగానికి కూడ విదేశాల నుంచి ‘దమ్మిడీ’ నిధులు లభించలేదు. వౌలిక రంగాలలో మాత్రమే ‘విదేశీయ ప్రత్యక్ష వాణిజ్య భాగస్వామ్యాన్ని’- ఫారిన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ- అనుమతించనున్నట్టు 1990వ దశకంలో మన ప్రభుత్వం చేసిన వాగ్దానం. వౌలిక రంగాలలోకాక ఇతర రంగాలలో విదేశీయులు పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటె వౌలిక రంగాలలో దీర్ఘకాలం పాటు పెట్టుబడులుపెట్టి కృషి చేశాయి. అప్పుడు మాత్రమే ఉత్పత్తులు మొదలవుతాయి, లాభాలు వస్తాయి. అందువల్ల సేవలు, పంపిణీ, విహారం- టూరిజం- ‘ఆతిథ్యం’- హోటల్- వంటి రంగాలలో విదేశీయులు పది పైసలు ఖర్చుపెట్టి రూపాయి లాభం తమ దేశాలకు తరలిస్తున్నారు. ఈ రంగాలలో ఫలితాలు, లాభాలు సంవత్సరం రెండేళ్ల లోపే ఆర్జించవచ్చు!
విదేశీయ సంస్థాగత భాగస్వామ్యం- ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఎఫ్‌ఐఐ- ఇప్పుడు దాదాపు మూలపడింది. ‘ఎఫ్‌ఐఐ’ ద్వారా భారతీయ సంస్థల ‘వాటా’లను కొనుగోలు చేసే విదేశీయ సంస్థలకు నిర్వహణలో పెత్తనం లభించదు. మన ‘జుట్టు’ను తమ చేతులలో ఇరికించుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ‘ఎఫ్‌డిఐ’ ద్వారా విదేశీయ సంస్థలు తమ వాణిజ్య సామ్రాజ్యాలను మన దేశంలో ఏర్పాటు చేయవచ్చు! ఇదీ ప్రపంచీకరణ కుట్ర.. గతంలో ‘ఈస్టిండియా కంపెనీ’ వంటి ఐరోపా సంస్థలు మొదట మన వాణిజ్య స్వాతంత్య్రాన్ని హరించాయి. ఆ తరువాత భౌతిక, రాజకీయ, సాంస్కృతిక స్వాతంత్య్రాన్ని హరించాయి. ఈ చరిత్ర పునరావృత్తం ఔతుండడం వర్తమాన చరిత్ర! వస్తున్న పెట్టుబడుల కంటె ఇబ్బడి ముబ్బడిగా లాభాలు విదేశాలకు తరలిపోతున్నాయి.