సంపాదకీయం

కాలుష్య అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం కాలుష్య నగరాల నిలయమని ఐక్యరాజ్యసమితి అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్ధారించడం ‘స్వచ్ఛ భారత్’ ప్రణాళికకు లభించిన చెడ్డ పేరు. ‘నమామి గంగే’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గంగానది స్వచ్ఛతను పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో గంగానదికి చేరువలో ఉన్న కాన్పూరు ప్రపంచంలోని కాలుష్య నగరాలలో మొదటి స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ-వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్- డబ్ల్యుహెచ్‌ఓ- కనిపెట్టడం అందువల్ల ఆశ్చర్యకారకం! గంగానది ఒడ్డున ఉన్న వారణాసి ప్రపంచంలో అతి పెద్ద కాలుష్య కేంద్రాలలో మూడవ స్థానంలో ఉందన్నది ఈ నిర్ధారణ. బిహార్ రాజధాని పాట్నా మధ్యలో గంగ ప్రవహిస్తోంది, పాట్నా ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్య నగరమట! ఢిల్లీ నగరం ఆరవదట. అమెరికా, చైనా వంటి సంపన్న దేశాలు భయంకరమైన వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ‘బొగ్గు’ పులిసి విష వాయువుగా విశ్వవ్యాప్తంగా విస్తరించి పోతోంది. ఈ ‘బొగ్గుపులుసు’ వాయువును అవనీ తలానికి ప్రదానం చేస్తున్న దేశాలలో అమెరికా,చైనా, ఐరోపా దేశాలు అగ్రగాములన్నది ‘పారిస్ ఒప్పందం’లోని ప్రధాన అంశం. ‘అపానవాయువును విడుదల చేసి కాలుష్య ధ్వని పుట్టించిన అయ్యగారు అందరికంటె ముందు తానే ముక్కు మూసుకున్నట్టు’గా కాలుష్యాన్ని పంచుతున్న దేశాల ప్రభుత్వాలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేనట్టు జాణతనాన్ని ప్రదర్శించడం పారిస్ పర్యావరణ ఒప్పందానికి పూర్వ రంగం. పది శాతం దేశాలు యాబయి శాతం ‘బొగ్గుపులుసు గాలి’ని విడుదల చేస్తున్న సంపన్న దేశాల అధ్యయన సంస్థలే దశాబ్దికి పై ఏటా ఈ విషయాలను కనిపెడుతూనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని సంపన్న దేశాలు అంగీకరించకుండా ‘నాసికా బంధన’ ప్రక్రియను అభినందించడం వల్లనే ‘పారిస్ పర్యావరణ పరిరక్షణ ప్రక్రియ’ అనేక నెలలపాటు కూలబడింది. 2016 సెప్టెంబర్‌లో మన ప్రభుత్వం ఈ ‘పర్యావరణ పరిరక్షణ’ అంగీకారాన్ని ధ్రువపరచింది. ‘కొన్ని దేశాలు కాలుష్యాన్ని ప్రదానం చేస్తున్నాయి, ప్రసారం చేస్తున్నాయి. మరికొన్ని దేశాలను కాలుష్యం కబళిస్తోంది’ అన్న అంతర్జాతీయ వాస్తవానికి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ఇప్పుడు విడుదల చేసిన నివేదిక నిదర్శనం.. మొదటి పదునాలుగు కాలుష్య నగరాలు మన దేశంలోనే ఉన్నాయట..
వంద దేశాలలోని నాలుగువేల నగరాలలో ‘కాలుష్య’ అధ్యయనం జరిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ మన దేశాన్ని ‘పెద్ద దోషి’ అని కాలుష్య నిర్ణయం చేసింది. ఈ తీర్పును మన ప్రభుత్వం కూడ అంగీకరించిందన్న వాస్తవం ‘వౌన వ్యాఖ్య’ ద్వారా ధ్వనిస్తోంది. మిగిలిన దాదాపు వంద దేశాల కాలుష్యం గురించి ఐక్యరాజ్యసమితి వారు ఎందుకని అధ్యయనం చేయలేదు? ఆయా దేశాలలో జనం లేరా? కాలుష్యం లేదా? నగరాలు లేవా? ఈ ‘అర్ధ నిజనిర్ధారణ’ గురించి మన ప్రభుత్వం కాని ఇతర దేశాల వారు కాని ‘సమితి’ని నిలదీయాలి! అమెరికా ఆవైపు నుంచి, ఐరోపా ఈ వైపునుంచి కాలుష్య విషవాయువులను ప్రసారం చేస్తున్నందువల్ల అట్లాంటిక్ మహాసముద్రపు ఉత్తర ప్రాంతంలో వేడిమి పెరిగి విస్తరిస్తోంది. చైనా, అమెరికాలు ఇటూ అటూ చేరి ప్రశాంత మహా సాగరాన్ని ‘కాచు’తున్నాయి. ఫలితంగా వేడెక్కుతున్న సముద్రాలలోని ‘హిమఖండాలు’- ఐస్‌బర్గ్‌లు- కరగిపోతున్నాయి- సముద్రాల నీటిమట్టం పెరిగి ద్వీపాలుగా, చిన్న ద్వీపకల్పాలుగా ఉన్న దేశాలు మునిగిపోవడానికి రంగం సిద్ధమైంది. వాణిజ్య ప్రపంచీకరణ వల్ల పుడమి మొత్తం ఒకే పల్లెగా ఏర్పడిపోతోందట- నిజానికి ఒకే అంతర్జాతీయ ‘సత్రం’గా ఏర్పడుతోంది- అందువల్ల ఏ దేశం కూడ ‘ఒంటరి’గా ఉండజాలదన్నది వాణిజ్య నీతి. ప్రతి దేశంలోని పరిణామాల ప్రభావం ప్రతి ఇతర దేశంలోను ప్రస్ఫుటిస్తోండడం ‘అంతర్జాతీయ అనుసంధానం’-అన్న ప్రచారం మారుమోగిపోయింది. ఈ ‘వాణిజ్య అనుసంధానం’కంటె అనేక ఏళ్లు పూర్వమే ‘అంతర్జాతీయ కాలుష్య అనుసంధానం’ జరిగిపోయి ఉండడం నిశ్శబ్ద విష విప్లవం.. సత్రాన్ని చెత్తతో నింపుతున్నది సంపన్న దేశాలవారు, ఊడ్చి ఎత్తిపోస్తున్నది వర్ధమాన దేశాలవారు, ఇదీ కాలుష్య ‘ప్రపంచీకరణ’..
చైనా తాను నిర్నిరోధకంగా దురాక్రమించిన టిబెట్‌ను ఇష్టం వచ్చినట్టు తవ్వేసింది, కుళ్లగించి పారేస్తోంది, కొల్లగొడుతోంది. ఈ ‘కొల్లగొట్టుడు’వల్ల కాలుష్యం పెరిగింది. యాబయి ఏళ్లలో హిమాలయ పర్వత శ్రేణులలోని పదమూడు శాతం ‘మంచు దిబ్బలు’- గ్లాసియర్స్- కరిగిపోవడానికి ఇదీ కారణం. ఉత్తరఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రాకృతిక వైపరీత్యాలకు చైనా ఇలా హిమాలయ శ్రేణులను- టిబెట్‌ను- ‘ఉడక బెడుతుండడం’కారణం. ప్రవర్ధమాన దేశాలను నిరంతరం కాలుష్యంతో నింపుతున్న రసాయన ఔషధాలు, తిను బండారాలు, విత్తనాలు, ఎఱువులు, క్రిమిసంహారక రసాయనాలు అమెరికా, ఐరోపా చైనాల నుండి దిగబడుతున్నాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యాన్ని పరిసరాల స్వచ్ఛతను దశాబ్దుల తరబడి చెడగొడుతున్నాయి. వీధులను ఊడ్చి చెత్తను ఎత్తిపోయడం వల్ల, బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించడం వల్ల, గంగను ఇతర నదులను క్షాళన చేయడం వల్ల స్వచ్ఛత ఏర్పడవచ్చు, కానీ పదింతలుగా విదేశాల నుండి కాలుష్య కారకాలు వచ్చి పడుతున్నాయి. స్వచ్ఛ్భారత్ పునర్ నిర్మాణం ఎలా సాధ్యం?? చైనా నుంచి వచ్చి పడిన ‘గాలిపటాలు’, వాటిని ఎగురవేసే ‘దారం’ స్థానిక కుటీర పరిశ్రమల చిట్టి యజమానుల పొట్టకొట్టడం వాణిజ్య బీభత్సం, అవి పర్యావరణాన్ని పాడుచేయడం, పక్షుల ప్రాణాలను తీయడం కాలుష్య బీభత్సం! అమెరికా ఐరోపా చైనా దేశాలవారు ‘పాతపడి పనికిరాని’ ఓడల నిండా విష రసాయన వ్యర్థాలను ఇతర పారిశ్రామిక కాలుష్యాలను నింపుకొని వచ్చి, ఇతర దేశాల సముద్ర తీరాల సమీపంలోని జలాలలో ఆ ఓడలకు కన్నాలుకొట్టి ముంచేసిపోతున్నారు. ఇదీ ప్రచారం కాని ‘ప్రపంచీకరణం’.. కాలుష్య ‘అనుసంధానం’..
గయ్యాళిగంపలు చెత్తపొట్లాలను ఇతరుల గృహాల ప్రాంగణాలలోకి విసిరివేసినట్టుగా, తమకు, తమ వ్యవసాయదారులకు పనికిరాని ‘బీటీ’ పత్తి విత్తనాలను ‘జీఎమ్’ విత్తనాలను సంపన్న దేశాలవారు మన దేశంలోకి ఇతర ప్రవర్ధమాన దేశాలలోకి వెల్లువెత్తిస్తున్నారు. ‘ప్లాస్టిక్’ పెంచిన పర్యావరణ కాలుష్యాన్ని మరింత పెంచడం ‘బీటీ’ రసాయనం లక్ష్యం! అమెరికా 2007 వరకు పదేళ్లపాటు మన దేశపు మామిడిపళ్ల దిగుమతిని నిషేధించింది. మన రైతులు మామిడి చెట్లను రసాయనపు ఎఱువులు వేసి క్రిమిసంహారాలను వాడి పెంచారన్నది ‘నిషిద్ధ’కారణం! ఆ ఎఱువులను, క్రిమిసంహారాలను మన రైతులకు అంటగట్టినది అమెరికా సంస్థలు.. ‘కాలుష్య అంతర్జాతీయ అనుసంధానం’ జరుగుతున్న తీరుకు ఇది ఒక్కటే కాదు సాదృశ్యం!