సంపాదకీయం

ఆకాశమే హద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛా విపణి మాయాజాలం చిత్ర విచిత్ర విన్యాసాలను చేస్తోంది. వినియోగదారునికి తెలియకుండా దోపిడీ చేయడం వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- మన నెత్తికెత్తిన ఈ ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- మాయ! తాము దోపిడీకి గురవుతున్నామని తెలిసినప్పటికీ, ‘ఇలా గురికావడం చాలా గొప్ప..’ అన్న అనుభూతి వినియోగదారులను ఆవహించడం ‘మాయాజాలం’లోని మరో విన్యాసం. మన బతుకులను బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీ నేషనల్ కంపెనీస్- నిర్దేశిస్తున్నాయి. ఈ సంగతి తెలిసినవారు, తెలియని వారు సమానంగా ఈ నిర్దేశాలకు అనుగుణంగా బతుకులను మార్చుకుంటున్నారు. డైనమిక్ ప్రయిసింగ్- క్రియాశీల శుల్కం- విధించడం అన్నది గొప్ప పదజాలం. వినియోగదారుని అవసరం వాణిజ్య ప్రముఖులకు అవకాశం. ‘అవసరం’ అత్యవసరమైనకొద్దీ సేవలను పొందడానికి చెల్లించవలసిన శుల్కాలు పెరుగుతాయి. ‘వోలా’, ‘ఉబర్’ అన్న సంస్థలు పోటీపడి ప్రయాణ శుల్కాలను పెంచగలగడానికి కారణం ఈ ‘డైనమిక్ ప్రయిసింగ్’.. విమాన సేవల నిర్వాహకులు ఈ ‘డైనమిక్ ప్రయిసింగ్’ ద్వారా భారీగా దోచేశారు. విమానాలను ఎక్కగలిగేవారికి ఇలా దోపిడీకి గురికావడం ఓ లెక్క కాదు. కానీ నగరాలలో ‘క్యాబ్’- కారు - ఎక్కి పయనించే మధ్యతరగతి వారు, బస్సులలో దూర ప్రయాణాలు చేసే సామాన్య జనాలు సైతం ఈ ‘డైనమిక్’ దోపిడీకి గురవుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఈ ‘బహుళ జాతుల వాణిజ్య సంస్థల’ దోపిడీని మరింతగా వ్యవస్థీకరించడానికి నడుం బిగించారట! విమానాశ్రయాలను ‘రద్దీ సమయం’ - పీక్ అవర్-లో ఉపయోగించుకునే విమానయాన సంస్థలపై ‘అదనపు సుంకం’ విధించాలని ‘్భరత విమానాశ్రయ నిర్వహణ సంస్థ’ వారు తీవ్రంగా యోచిస్తున్నారట! ‘రద్దీ సమయం’ అని అంటే అత్యధికంగా విమానాలు విమానాశ్రయంలో దిగే సమయం లేదా ఆకాశంలోకి ఎగిరే సమయం. విమానాశ్రయం ఖాళీగా ఉండే సమయంలో దిగివచ్చే లేదా ఎగిరివెళ్లే విమానాలు ఈ అదనపు సుంకాన్ని చెల్లించ పనిలేదట! కానీ రద్దీగా ఉండే సమయంలో ‘ఎగిరిపోయే’ లేదా ‘అవతరించే’ విమానం వారు అదనపు సుంకాన్ని చెల్లించాలట! అందువల్ల అదనపు సుంకానికి భయపడి కొన్ని విమాన సంస్థలు ‘రద్దీ’ సమయంలోకాక ఖాళీగా సమయంలోనే తమ విమానాలను నడిపే అవకాశం ఉన్నట్టు ‘విమానాశ్రయ నిర్వహణ సంస్థ’ అధికారులు నిర్ధారించారట! ఈ అదనపు ‘సుంకం’ చెల్లించవలసింది నిజానికి ప్రయాణీకులు. ఎందుకంటె ఈ అదనపు సుంకం- సర్‌ఛార్జ్- చెల్లించే విమానయాన సంస్థలు ప్రయాణ శుల్కాని పెంచుతాయి..
విమానాలకూ, ధరలకూ మధ్య సమానత్వం ఉంది. అవీ ఇవీ కూడ ఆకాశంలో విహరించడం ఈ సమానత్వం. భూమిమీద ఉండే వస్తువుల ధరలూ, భూమిపై పరిగెత్తే వాహనాలలో ప్రయాణం ఖర్చులు ఆకాశానికి ఎగురుతున్నాయి. అందువల్ల ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న విమానాలలో ప్రయాణం ఖర్చులు మరింత ఎత్తులో ఉండడం న్యాయం. అందువల్లనే విమానయాన సేవల నిర్వాహకులు ఈ న్యాయాన్ని పాటిస్తున్నారు. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’లో ప్రభుత్వేతర రంగ విమానాలలో కంటె అధిక ప్రయాణ శుల్కాలను వసూలు చేస్తారన్నది జరుగుతున్న ప్రచారం. ఇది నిజమా? లేక ‘స్వేచ్ఛావిపణి’ సృష్టించిన మాయాజాలమా? అన్నది ఎడతెగని మీమాంస.. ఇప్పుడు విమానాలలో ప్రయాణ శుల్కాలు- ఫేర్స్- మరింత పెరగడానికి వీలుగా ‘్భరత విమానాశ్రయ సంస్థ’- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఏఏఐ- వారు ఈ అదనపు సుంకాన్ని విధిస్తున్నారట. అదనపు సుంకాన్ని విమానయాన సంస్థలు చెల్లిస్తాయన్నది భ్రమ. ‘తాగినోడు కడతాడు తాటి పన్ను..’ అని అన్నట్టుగా ఈ అదనపు సుంకాన్ని నిజానికి చెల్లించేది ప్రయాణీకులే. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలో నైతిక మూల్యాలు, వాటికున్న అర్థాలు మారిపోతున్నాయన్న వాస్తవానికి ‘క్యాబ్’లోను, ‘బస్సుల’లోను, ‘విమానాల’లోను అమలు జరుగుతున్న ఈ ‘డైనమిక్ ప్రయిసింగ్’ ఒక ఉదాహరణ మాత్రమే. రైళ్లలో ‘ప్రీమియర్ ప్రయిసింగ్’- ప్రాధాన్య శుల్కం వసూలుచేయడం కూడ ఇలాంటిదే! గతంలో ‘సినిమా హాళ్ల’వద్ద ‘టిక్కెట్ల’ను ‘బ్లాక్’లో అమ్మేవారు. అవసరం అని భావించిన వీక్షకులు ‘రూపాయి’ టిక్కెట్టుకు ‘రెండు’ ‘మూడు’ ‘ఐదు’ చెల్లించి కొనేవారు. అలా ‘టిక్కెట్లు’ ఉన్న ధరకంటె ఎక్కువ ధరకు అమ్మడం నేరం. అమ్మిన వారిని పోలీసులు పట్టుకొని ‘నేరస్థుల’ నుంచి ఒకటి, రెండు రూపాయలను వసూలుచేసుకొని వెళ్లేవారు. ‘ప్రపంచీకరణ’ వల్ల ఏర్పడిన ‘స్వేచ్ఛావిపణి’ అక్రమాన్ని సక్రమంగా మార్చేసింది. ఇదీ ‘డైనమిక్ ప్రయిసింగ్’...
పూర్వం మధ్యతరగతి వారు అవసరమైనప్పుడు ‘కిరాయి కారు’లో వెళ్లేవారు. ఆ కిరాయి వాహనం పేరు ‘టాక్సీ’. ‘టాక్సీ’ అన్నది ఇంగ్లీషు పేరు. కానీ ఇప్పుడు ‘టాక్సీ’ని ‘క్యాబ్’ అని అంటున్నారు. ‘క్యాబ్’ అన్నది ప్రపంచీకరణ ఫలితంగా వ్యాపించిన ‘అమెరికా’ పేరు. ఆంగ్లేయులు మనపై పెత్తనం చెలాయించిన రోజులలో బ్రిటన్ వారివలె ప్రయత్నించిన వారి వారసులు ‘ప్రపంచీకరణ’ యుగంలో అమెరికా వారి వలె ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ‘టాక్సీ’ అన్న పదాన్ని ‘క్యాబ్’ మింగేసింది. ‘క్యాబ్ అన్న పదం తెలియకపోతే నీవు నాగరికుడవు కావు, అమెరికాతో నీకు సంబంధం లేదు...’ అన్నది ‘మార్కెట్ ఎకానమీ’ చెప్పిన పాఠం. గతంలో నగరాలలో ‘రోడ్డు’పై నిలబడి ‘ఆటోరిక్షా’ను పిలిచినట్టుగా ‘టాక్సీ’ని పిలుచుకొనేవారు. ఇప్పుడు అలా కుదరదు. ‘్ఫన్’చేసి ‘క్యాబ్’ను ‘బుక్’చేయాలి. ‘నీవద్ద స్మార్ట్ఫోన్ లేకపోతే నువ్వు ‘క్యాబ్’ ఎక్కడానికి పనికిరావు.. అందువల్ల ‘స్మార్ట్’్ఫన్ కొని తీరాలి.’ మార్కెట్ ఎకానమీ చెబుతున్న మరో పాఠం ఇది. ‘వోలా’ లేదా ‘ఉబర్’- ఈ రెండు కంపెనీల ‘క్యాబ్’లపై మన బతుకులు ‘గమ్యం’ చేరడం ఆధారపడి ఉంది. ఎంత శుల్కం- ఫేర్- చెల్లించాలన్నది నీ ప్రయాణం అవసరాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ‘క్యాబ్’ కంపెనీ వాడు నిర్ణయిస్తున్నాడు. రద్దీ లేని సమయంలో భాగ్యనగరం వంటిచోట్ల పది కిలోమీటర్లు పయనించడానికి నూట పాతిక రూపాయలు వసూలు చేస్తారు. రద్దీ పెరిగినకొద్దీ లేదా ‘గిరాకీ’ పెరిగినకొద్దీ ఈ ‘నూట పాతిక’ రూపాయల శుల్కం పెరిగిపోతుంది. మరీ రద్దీ సమయంలోను, మరీ అత్యవసరం అయినప్పుడు వినియోగదారుడు- ప్రయాణీకుడు- పది కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగువందల పాతిక రూపాయలు కూడ చెల్లించవలసిందే. ఇలా ‘వోలా’, ‘ఉబర్’ వంటి సంస్థలు ఒకటికి నాలుగు రెట్లు ప్రయాణీకుల వద్ద వసూలు చేయడానికి ‘డైనమిక్ ప్రయిసింగ్’ అని పేరు. ఈ ‘దోపిడీ’ చేయడానికి తార్కికమైన ప్రాతిపదిక ఏది? అన్నదానికి సమాధానం రాదు. ఇదే ‘మార్కెట్ ఎకానమీ’ మాయ!
ప్రభుత్వరంగ సంస్థల బస్సులలో సైతం ఈ దోచుకునే పద్ధతి వ్యవస్థీకృతమైంది. రైళ్లలో సైతం ‘ప్రీమియమ్’, ‘తత్కాల్’ పేర్లతో ప్రయాణీకుల ‘అత్యవసరాన్ని’ అవకాశంగా మలుచుకున్నారు. ‘తత్కాల్’ పేరుతోనే ‘అసలు’ శుల్కం కంటె ఎక్కువ ‘్ఛర్జీలు’ దండుకుంటున్నారు. భూమిమీద నిలవని ఈ ‘దోపిడీ’ గగన తలానికి ఎగిరింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన ‘విమానం’ శుల్కం కంటె, తిరిగి రావడానికి రెట్టింపు శుల్కం...! ఒక్కోసారి తిరిగి రావడానికి అయ్యే ‘శుల్కం’కంటె వెళ్లడానికి వసూలు చేసే శుల్కం ఎక్కువ. ఇదీ అంతుపట్టని ‘డైనమిక్’- దోచుకునే -వ్యవస్థ! ‘అగ్రహారం పోతే పోయింది.. యాక్టు- చట్టం- తెలిసింది!’ అన్నట్టుగా దోపిడీకి గురవుతున్న ప్రయాణీకులు ఆనందపరవశులైపోతున్నారు.. ‘డైనమిక్ ప్రయిసింగ్’ అన్న పదాలు తెలిశాయి.. అదీ నకిలీ పారవశ్యం!!