సంపాదకీయం

ఛోటారాజన్‌కు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛోటారాజన్‌కు, అతగాడి ముఠాకు చెందిన మరో ఎనిమిది మంది భయంకర నేరస్థులకు ముంబయిలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగృహవాస శిక్షను విధించడం హర్షణీయం. జ్యోతిర్మయి డే అనే పత్రికా రచయిత- జర్నలిస్ట్-ను 2011 జూన్ పదకొండవ తేదీన కాల్చి చంపిన ఈ దుర్మార్గులకు తగిన శిక్ష లభించడం న్యాయ ప్రక్రియ సాఫల్యానికి అరుదైన నిదర్శనం. ప్రభుత్వ న్యాయవాదులు, పోలీసులు నేరాలను సందేహ రహితంగా నిరూపించనందున వందల అభియోగాలు న్యాయస్థానాల్లో ధ్రువపడడం లేదు. ఫలితంగా వేల నేరస్థులు శిక్షను పొందకుండా తప్పించుకుంటున్నారు. కానీ జ్యోతిర్మయి డేను పొట్టన పెట్టుకున్న తోడేళ్లు అలా తప్పించుకోలేక పోవడం అరుదైన న్యాయ విజయం. అయితే, ఛోటారాజన్ లాంటి మానవరూప పిశాచులు పాల్పడిన ఘోర నేరాలలో ఈ జర్నలిస్ట్‌ను హత్య చేయడం ఒకటి మాత్రమే. ఛోటారాజన్ భయంకర దేశ విద్రోహ బీభత్స కలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు, అభియోగాలు రెండు దశాబ్దులకు పైగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అభియోగాల నుంచి తప్పించుకొనడానికై విదేశాలకు పారిపోయిన ఛోటారాజన్ 2015 అక్టోబర్‌లో ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో పట్టుబడడం కూడ మన నేర పరిశోధకులకు లభించిన అరుదైన విజయం. మన దేశంలో భయంకర హత్యాకాండలను జరిపించి దావూద్ ఇబ్రహీం వంటి జిహాదీ బీభత్సకారులు దేశం నుండి చల్లగా జారుకోగలిగారు. పాకిస్తాన్‌లో విలాసంగా జీవిస్తున్న ఈ జిహాదీ బీభత్సకారుడిని మనం పట్టుకోలేక పోవడం నడుస్తున్న వైపరీత్యం. పాకిస్తాన్ మనకు- శత్రుదేశం, దావూన్ ఇబ్రహీం వంటి తోడేళ్లను ఉసిగొల్పుతున్న దేశం, మన దేశంలో హత్యాకాండ జరుపుతున్నవారికి ఆశ్రయం ఇస్తున్న దేశం. దావూద్ అనే పిశాచాన్ని మనం పాకిస్తాన్ నుంచి ఈడ్చుకొని రాలేకపోవచ్చు. కానీ మనకు మిత్రదేశాలుగా చెలామణి అవుతున్న దేశాల్లో నక్కి ఉన్న నేరస్థులను సైతం మనం మన దేశానికి తరలించుకొని రాలేకపోతుండడం దశాబ్దుల వైఫల్యం. అందువల్ల బాలి ద్వీపంలో ఛోటారాజన్ పట్టుబడడం కూడ మనకు లభించిన అరుదైన విజయం.
మన దేశంలో ఘోరాలు, దారుణాలు, పైశాచిక కృత్యాలు, రాక్షస క్రీడలు జరిపి నేరస్థులు సరిహద్దులు దాటిపోవడం, ఆజీవనం విదేశాల్లో ఉండిపోవడం విస్మయకరమైన పరిణామాలు. 1980వ దశకంలో భోపాల్‌లోని ‘యూనియన్ కార్బయిడ్’ ఎఱువుల పరిశ్రమ నుంచి విషవాయువు వెలువడింది, అనేకమంది ప్రాణాలను తీసింది. ఇలా విషవాయువు వెలువడడానికి కారణం యాజమాన్యం వారి క్రూరమైన, ఘోరమైన నిర్లక్ష్యం. కానీ ‘యజమాని’ వారెన్ ఆండర్సన్ విమానమెక్కి అమెరికాకు పారిపోయాడు. మళ్లీ అతని ఆచూకీ లభించలేదు. ‘్భఫోర్స్’ హావిట్జర్ శతఘు్నల కొనుగోళ్లలో భారీ అవినీతికి కారణభూతుడైన ఒట్టావియో కుత్రోచీ అనే ఇటలీ కుత్సితుణ్ణి దశాబ్దుల పాటు మనం పట్టుకోలేదు.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జకీర్ నాయక్ వంటి నేరస్థులు విదేశాల్లో దర్జాగా జీవిస్తుండడం ఈ వైఫల్య చరిత్రలో ప్రస్తుత ఘట్టం. ఛోటారాజన్ విదేశాల్లోనే ఉండిపోకుండా నిరోధించగలగడం మన ప్రభుత్వానికి లభించిన అరుదైన సాఫల్యం. జ్యోతిర్మయి డేను పొట్టన పెట్టుకున్న ఛోటారాజన్ ముఠాకు హత్య జరిగిన తరువాత ఏడేళ్లలోనే శిక్షలు నిర్ధారణ కావడం న్యాయ ప్రక్రియలో ప్రస్ఫుటించిన అరుదైన వేగానికి సాక్ష్యం. ఏళ్ల తరబడి విచారణ పూర్తికాని అభియోగాలు ఎన్నో.. ఎనె్నన్నో..
ముంబయిలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లోను పట్టణాల్లోను అసాంఘిక శక్తులు విశృంఖల విహారం చేస్తుండడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్వాహకుల వైఫల్యం. ఈ అసాంఘిక శక్తులు మాదకద్రవ్యాలను చెలామణి చేస్తున్నాయి, స్థిరాస్తి వ్యాపారంలో చొరబడి ఉన్నాయి, లైంగిక వ్యాపారం- హ్యూమన్ ట్రాఫికింగ్- ముఠాలుగా విస్తరించి ఉన్నాయి, సినిమా రంగంలో చేరిపోయి వికృత విష విన్యాసాలను సాగిస్తున్నాయి, దేశద్రోహపు ముఠాలతో అనుసంధానమై ఉన్నాయి. ఛోటారాజన్ వంటి ముఠాల నిర్వాహకులు దావూద్ ఇబ్రహీం వంటి పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స ప్రతినిధులతో జట్టు కట్టడం ఆశ్చర్యకరం కాదు. ఈ ముఠాలు అమాయకులైన ప్రజలను హత్య చేస్తున్నాయి, వివిధ సామాజిక సాంస్కృతిక ఆర్థిక వ్యవసాయ కార్మిక ఉద్యమాల కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాల గుట్టును రట్టు చేస్తున్నాడన్న భయంతోనే ఛోటారాజన్ ముఠావారు జర్నలిస్ట్ జ్యోతిర్మయి డేను హత్య చేశారు. జ్యోతిర్మయి డే హత్య ప్రతీక మాత్రమే. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియపై దాడులు జరుగుతుండడం ఈ ప్రక్రియను నిరోధించడానికి రకరకా సమాజ ద్రోహులు, దేశద్రోహులు యత్నిస్తుండడం అసలు వైపరీత్యం. ఇలా యత్నిస్తున్న ముఠాలలో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలై పరస్పరం హత్యాకాండలకు దారితీస్తోంది. ఛోటారాజన్‌కు, దావూద్ ముఠాలకు మధ్య ఇలా బెడిసికొట్టింది. మన ప్రభుత్వ నిఘా విభాగాలకు పట్టుబడతానన్న భయం కంటె దావూద్ ముఠాల హంతకులు తనను మట్టుబెడతారన్న భయం 2015వ సంవత్సరానికి పూర్వం ఛోటారాజన్‌ను హడలెత్తించింది. దీంతో ఇతగాడు ఒక దేశం నుంచి మరో దేశానికి పారిపోయి చివరికి మన ప్రభుత్వ భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. ఇలా అసాంఘిక శక్తులు ముఠాలుగా ఏర్పడి ఎర్రచందనం నుంచి మాదకద్రవ్యాల వరకు చెలామణి చేయగలగడానికి కారణం పాలకులతోను, విపక్షాల్లోని రాజకీయ ఘరానాలతోను ఈ నేరస్థులకున్న పలుకుబడి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వయంగా నేరాలను చేస్తుండడం ప్రజాస్వామ్య ప్రక్రియను నిలదీస్తున్న విపరిణామం. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దిలో ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో ‘టామనీ హాల్’, ‘గ్యాస్ రింగ్’ వంటి ముఠాలుండేవట! ఈ నేరప్రపంచ ముఠాలు సృష్టించిన అవినీతి, బీభత్సం అంతా ఇంతా కాదు. అమెరికాలోని ‘విలాసాలు’ మూడు దశాబ్దుల తర్వాతనో మరికొంత కాలం తర్వాతనో మన దేశానికి వ్యాపించడం మన భావదాస్యానికి చిహ్నం. ఈ భావదాస్యం మన నైతిక నిష్ఠకు పట్టిన గ్రహణం. ముంబయిలోను ఇతర చోట్ల నేరస్థుల ముఠాలు వెలసి ‘అక్షర శిల్పుల’ను హత్యచేస్తుండడానికి ఇదీ కారణం.
అక్షర మాధ్యమాల్లోను, దృశ్య మాధ్యమాల్లోను క్రియాశీలంగా ఉన్న నిజాయితీపరులను సంఘ విద్రోహులు హత్యచేస్తుండడం ప్రపంచీకరణ యుగంలో విస్తరిస్తున్న బీభత్సం. ఆర్థిక ప్రయోజనాలు అక్రమ ప్రయోజనాలతో జతకూడడం ఇందుకు కారణం. 1990 నుంచి 2017 వరకూ అనేక దేశాల్లో దాదాపు రెండువేల రెండు వందల మంది మాధ్యమాల ప్రతినిధులు హత్యకు గురయ్యారట! వీరిలో నూట ఎనిమిది మంది మన దేశానికి చెందిన ప్రచార మాధ్యమాల ప్రతినిధులు!