సంపాదకీయం

చంద్రబాబు చాణక్యం ఫలిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు పూర్వరంగంగా ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ నినాదంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఉద్యమాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కారుతో తెగతెంపులు చేసుకొన్న చంద్రబాబు కాంగ్రెస్‌కు సన్నిహితం అవుతున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదులపై తెదేపా ఆవిర్భవించింది. ఇపుడు తెదేపా గనుక కాంగ్రెస్‌కు సన్నిహితమైతే అది ఆత్మహత్యా సదృశమే కాదు, ఎన్‌టిఆర్ ఆత్మక్షోభించే చర్య. చంద్రబాబు రాజకీయ మేధావి, వ్యూహకర్త. ఈ రెండింటినీ మించి కష్టించి పనిచేసే మనస్తత్వం ఉంది. ఈ లక్షణాలు మిగతా పార్టీల నేతల్లో చాలామందికి లేవు.
సీమాంధ్రలో వైకాపా అధినేత వైఎస్ జగన్ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన వెనుక దళిత క్రైస్తవులూ ఉన్నారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వెనుక కాపు సామాజిక వర్గం ఉంది. ఆయన సినీ గ్లామర్‌తో కుర్రకారును ఆకర్షిస్తున్నాడు. జగన్, పవన్‌లను తట్టుకునేందుకు చంద్రబాబు- ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నాడట! ఆయన కాంగ్రెస్‌తో జట్టు కడితే- తానెక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్టేనని ప్రత్యర్థులు ఆరోపించే అవకాశం ఉంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో మోదీ సర్కారు విఫలమైంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రానికి బొత్తిగా గౌరవం లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు పట్ల గత కొంతకాలం మోదీ ముభావంగా ఉన్నట్టు అనేక పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ‘పద్మ’ పురస్కారాల కోసం చంద్రబాబు సర్కారు సిఫారసు చేసిన జాబితాను కేంద్రం పక్కన పడేసింది. పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయటం లేదు. తాము ఇచ్చిన నిధులకు చంద్రబాబు సరైన లెక్కలు చెప్పడం లేదని భాజపా నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మోదీతో తెగతెంపులు చేసుకోవడం, అనువంశిక పాలనకు అద్దం పట్టేలా తన కుమారుడు లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి చంద్రబాబు చర్యలపై వ్యతిరేకత లేకపోలేదు. రాష్ట్ర విభజన పేరుతో సీమాంధ్రుల నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్‌తో చేయి కలపాలని చంద్రబాబు భావిస్తున్నారని, మరోవైపు తెలంగాణలో తెరాస అధినేత కేసీఆర్‌కు దగ్గరవుతున్నారని ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా గతంలో కంటే భిన్నంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
కెసిఆర్, చంద్రబాబు ఔనన్నా, కాదన్నా మళ్లీ 2019లో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణం. అలాంటపుడు చంద్రబాబు కేంద్రంలో ఎందుకు శత్రుత్వం పెట్టుకుంటున్నట్లు? ‘్భజపాతో సన్నిహతంగా ఉంటూ వైకాపా అధినేత జగన్ కేసుల నుంచి బయటపడేందుకు వ్యూహరచన చేస్తున్నాడు.. పవన్ కల్యాణ్‌ను తనకు అనుకూలంగా వాడుకునేందుకు ‘కమలనాథులు’ కసరత్తు చేస్తున్నారు..’- ఇవి ఇటీవల టిడిపి కార్యకర్తలు గణేశ హోమం చేసిన ప్రాంగణంలో ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు. ఇందులో వాస్తవమెంత?
రానున్న పది నెలలలో భారత రాజకీయాలు అనూహ్యంగా మారబోతున్నాయి. ఈ దశలో చంద్రబాబు చాలా తొందరపడినట్లు కన్పడుతుంది. ప్రత్యేక హోదా సంగతి ఎలా ఉన్నా, ప్యాకేజీ భారీగా ఇస్తే చాలు అని లోగడ అన్నది చంద్రబాబే. రాజ్యాంగాన్ని పార్లమెంటులో సవరించైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. ఈ దిశగా ప్రయత్నాలు చేయడానికి బదులు చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో భావోద్రేకాలను రెచ్చగొడితే ఏమవుతుంది? సీమాంధ్రలో రాజకీయ అస్థిరత చోటుచేసుకుంటోంది. ఆంధ్రోళ్లమీద విద్వేషాన్ని రగిలించి కెసిఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చాడు. మరి ఈ నాలుగేళ్లలో ఏమయింది? ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు తలకుమించిన భారం వచ్చిపడింది. సాగునీటి ప్రాజెక్టులు, నూతన రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైన అంశాలు. ఒకరకంగా ఇజ్రాలీయులు ఈజిప్టు వదలి సినాయ్ పర్వతం వద్ద నేటికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం తమ మాతృభూమిని మోసెస్ జాషువాల నాయకత్వంలో అనే్వషించుకుంటూ వెళ్లిన బృహత్ కార్యం వంటిది ఇది. కాబట్టి చంద్రబాబు పట్ల మొత్తం భారతదేశం సానుభూతి చూపవలసి ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు సంపన్న తెలంగాణ రాష్ట్రం- ఈ నాలుగేళ్లల్లో అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులను ఆస్తులుగా చూపించారు అని ‘కాగ్’ తన నివేదికలో పేర్కొన్నది. విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా దివాలా తీసింది. ఈ నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత ఉన్నా సోనియా గాంధీ కాని, నరేంద్ర మోదీ కాని పట్టించుకోలేదు. ఏవో కంటితుడుపు చర్యలు కొన్ని చేపట్టారు. కాబట్టి ఏపీ ప్రజలది ధర్మాగ్రహం అనటంలో సందేహం లేదు. హోదా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న తెదేపా సహా మిగతా అన్ని పార్టీలూ పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి.
చంద్రబాబుకు రాజకీయ చాణక్యుడు, స్థితప్రజ్ఞుడు అనే ప్రశంసా పత్రాలు ఉన్నాయి. విద్యార్థి దశలో కాంగ్రెస్‌లో పనిచేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి సారధి అయినారు. ఆ తర్వాత జనతాదళ్ కన్వీనర్ అనారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలను అక్కున చేర్చుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత బిజెపికి చేరువ అయినారు. నాలుగేళ్ల తర్వాత ఇపుడు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవన్నీ రకరకాల ఎత్తులు- జిత్తులు- పొత్తులు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎందుకు స్థిరత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు? విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఒప్పందం జరిగింది. ఏడాది తిరగకముందే చంద్రబాబు వెలగపూడికి రాజధానిని తరలించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులను, సినీ పరిశ్రమను గాలికి వదిలివేశారు. వారిని ఇటు కెసిఆర్ కాని అటు చంద్రబాబు కాని పట్టించుకోకపోవడం విచారకరం.
ప్రత్యేక హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు తొలుత పట్టుపట్టారు. మళ్లీ మాట మార్చి ప్రత్యేక హోదా సర్వరోగ నివారిణి కాదు, భారీ పాకేజీ ఇవ్వండి అన్నారు. ఇపుడు మరోసారి మాట మార్చి ప్రత్యేక హోదా ఆంధ్రుల జన్మహక్కు అంటూ ఉద్యమం మొదలుపెట్టి బిజెపితో దోస్తీని వదులుకున్నారు. రాష్ట్రాన్ని నిలువునా ముంచిన సోనియా, రాహుల్ గాంధీతో మైత్రి మొదలుపెట్టారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో టీడీపీ కీలక నేతలు టిఆర్‌ఎస్‌లో చేరటంతో కెసిఆర్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నారు. కోదండరామ్‌కు భయపడ్డ కెసిఆర్ ఎవరు తనకు మద్దతునిచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఓటుకు నోటు కేసు, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి.
ఈ ఏడాది జనవరిలో నరేంద్ర మోదీని కలిసి 13 అంశాలతో కూడిన ఒక వినతిపత్రం చంద్రబాబు సమర్పించారు. అందులో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలున్నాయి. గవర్నరుపై ఫిర్యాదు కూడా ఉంది. ఓపికతో విన్న మోదీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చకపోయేసరికి గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పార్లమెంటలో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాత్రం చంద్రబాబు వైపు కనె్నత్తి చూడకపోవడం గమనార్హం. తెలంగాణలో కెసిఆర్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకొని 20 అసెంబ్లీ సీట్లకు తెదేపా పోటీ చేయడానికి ఒప్పందం జరినట్లు వార్తలు విశ్వసనీయంగా వచ్చాయి. చంద్రబాబు, కెసిఆర్, దేవెగౌడ, మమత బెనర్జీ, శివసేన కలి తృతీయ ఫ్రంటు గూర్చి మాట్లాడుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ‘ప్రత్యేక హోదా’కు సంబంధించి ఒత్తిడి తెచ్చిన విషయం ఇపుడు అంతా మరచిపోయారు. నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్ గత్యంతరం లేక తల ఊపాడు. 2014లో యుపిఏ ప్రభుత్వం పడిపోవటంతో విభజన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఎన్‌డిఏ ప్రభుత్వం మీద ఉంది.
2017 రిపబ్లిక్ డే సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ - కేంద్రం నుండి ఏపీ పొందినంత ఆర్థిక ససాయం మరే రాష్ట్రం పొందిందో చూపండంటూ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఇపుడు ఎలాంటి నిధులూ అందలేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో అల్లరి చేశారు.
2500 కోట్ల రూపాయలు నూతన రాజధాని నిర్మాణం, రోడ్లు ఇతర వ్యవస్థల నిమిత్తం కేంద్రం నుండి ఏపికి అందినమాట వాస్తవం. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటి వంటి సంస్థలు వచ్చాయి. చంద్రబాబు తన అస్తిత్వం కోసం బిజెపికి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. తమిళ నటుడు కమలహాసన్‌ను కర్నాటక ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ఓటు చేయించవలసిందిగా కోరాడు. తనను హైదరాబాద్ నుండి తరిమికొట్టిన కెసిఆర్‌తో చేతులు కలిపాడు. పోలవరం జాతీయ ప్రాజెక్టు స్టేటస్ పొందుతుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఇది ఏపీకి కలసివచ్చే అంశమే. ఐతే కాగ్ నివేదికలో యుటిలైజేషన్ సర్ట్ఫికెట్‌ను కోరడం జరిగింది. అది ఇవ్వవలసిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం మీద వుంది. ఇక విశాఖ రైల్వే జోనును ఎన్‌డిఏ ఏర్పాటుచేయలేదనే ఆరోపణ సమంజసమే. స్పెషల్ స్టేటస్ వల్ల 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీ, 90 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు లభిస్తాయి. ఇవి ఏపీకి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. మోదీ ప్రభుత్వం ఈ బాధ్యత నుండి తప్పించుకోజాలదు. ఎందుకంటే ఏపీ ప్రజలను అనాథలను చేసి, వారితో వివిధ రాజకీయ పార్టీలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాయి. హోదా ఉద్యమం ఇపుడు గ్రామ స్థాయికి చేరింది. ఇది బిజెపి పునాదులను కదిలిస్తుంది. బిజెపి నాయకుడు కంభంపాటి హరిబాబు ఇటీవల ఒక లేఖను విడుదల చేస్తూ, ఏపీకి కేంద్రం చేసిన సాయం గురించి గణాంకాలను ఉటంకించారు. అయితే ఆ లేఖను ఎవరూ పట్టించుకోలేదు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే ఉద్యమంతో వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహించగా వామపక్ష పార్టీలు మద్దతునిచ్చాయి.
తెలుగుదేశం పార్టీ అవతరణ ‘కాంగ్రెస్ వ్యతిరేకత’ అనే పునాదిమీద జరిగింది. మరి ఇవాళ వైయక్తిక స్వార్థంతో చంద్రబాబు చేస్తున్నదేమిటి? అంతరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు, కేసీఆర్ పరోక్షంగా దోహదం చేస్తున్నారు. కెసిఆర్ బెంగుళూరు వెళ్లి దేవగౌడ పార్టీకి ఓటువేయవలసిందిగా అక్కడి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసి వచ్చారు. ఇవన్నీ చూచినపుడు మనకు భారతదేశ చరిత్రలో అంభి, జయచంద్, రాజా మాన్‌సింగ్‌లు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటారని తెలుస్తున్నది. చంద్రబాబు తన మొండి వైఖరితో తన పార్టీకి, ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి మేలు జరిగే అవకాశాలే ఎక్కువ.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668