సంపాదకీయం

‘బహుళ’ సంస్థల బందిఖానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉబర్, ఓలా వంటి ఘరానా వాణిజ్య సంస్థలు నాగరిక జీవన ప్రస్థానాన్ని నియంత్రిస్తుండడం నడుస్తున్న ‘విలాసం’- ఫాషన్-! నగరాలలో మధ్యతరగతి వారి ప్రయాణం ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థల వాహనాల లభ్యతపై ఆధారపడి ఉండడం ‘విస్తృత’మైన దోపిడీ వ్యవస్థలో ఒక అంశం మాత్రమే! స్వేచ్ఛా సమాజానికీ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థకూ మధ్య సంఘర్షణ జరుగుతుండడం దశాబ్దులుగా వ్యవస్థీకృతమై ఉన్న ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-లో భాగం. ఇదీ ‘విస్తృత నియంత్రణ..’ విద్యావంతులు, మేధావులు, రాజకీయవేత్తలు, రాజ్యాంగ కోవిదులు, అధికారులు, అనధికారులు, అందరూ కూడ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు- పరచిన వలలో చిక్కుకొని ఉండడం నాగరిక జీవన దృశ్యం.. తాము ఇలా విదేశీయ వాణిజ్య సంస్థల ‘రంగుల తాళ్ల’ వలలో చిక్కుకొని ఉన్నట్టు ఈ జనానికి తెలీదు, ముంచెత్తుతున్న ‘కృత్రిమ పారవశ్యం’ తెలియనివ్వడం లేదు. ‘స్వేచ్ఛా సమాజం’- డెమొక్రాటిక్ సొసైటీ - స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ - మార్కెట్ ఎకానమీ- సృష్టిస్తున్న నకిలీ బంగారపు వనె్నల కృత్రిమ ప్రగతిని చూసి మోహపడుతోంది, మోసపోతోంది! మోసపోతున్నామన్న ధ్యాస కూడ లేని భారతీయులను విదేశీయ బహుళ జాతీయ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. స్వేచ్ఛా సమాజాన్ని స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ దిగమింగుతోంది! ఇదంతా ‘ప్రపంచీకరణ’. భారతీయ వాణిజ్య సంస్థలను సైతం ‘‘స్వేచ్ఛా వాణిజ్య స్వభావం’’ ఆవహించి ఉండడం ప్రపంచీకరణ! అనాదిగా మన దేశంలోని అన్ని వ్యవస్థలకు ‘సమాజ సమష్టి సంక్షేమం’ స్వభావం, లక్ష్యం! మిగిలిన వ్యవస్థల వలెనే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వ్యవస్థలకు కూడ ‘సంక్షేమం’ ప్రాతిపదిక అయింది. వ్యాపారం పంపిణీ వ్యవస్థ. జాతీయ సమాజ స్వరూపానికి జీవన నాడి వ్యాపారమైంది, వ్యవసాయమైంది! ‘సిర’లు, ‘్ధమను’ల వలె వాణిజ్య సంస్థలు, వణిక్కులు ఉత్పత్తులను దేశమంతటా ‘పంపిణీ’ చేశారు. పాశ్చాత్య ప్రభావంతో ఈ సంక్షేమ వాణిజ్య వ్యవస్థ భగ్నమైంది. విదేశీయ బీభత్స పాలన ఫలితంగా వాణిజ్య వ్యవస్థలో దోపిడీ చేసే వికృతి అంకురించింది. ఈ విషపు అంకురాలు మహా విషవృక్షాలుగా విస్తరించడానికి ‘ప్రపంచీకరణ’ దోహదం చేసింది, ‘సంక్షేమ వాణిజ్య వ్యవస్థ’ అంతరించింది, ‘లభ్యత, గిరాకీ’- సప్లయ్, అండ్ డిమాండ్- ప్రాతిపదికగా జనాన్ని దోచుకొనేందుకు వ్యాపారులకు వీలు కల్పిస్తున్న ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- మన నెత్తినెక్కి తొక్కుతోంది. నగరాలలోను పెద్ద పట్టణాలలోను ‘చతుశ్చక్రవాహనాల- క్యాబ్‌ల-ను నడుపుతున్న ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థలు పరస్పరం పోటీపడి ప్రయాణీకులను దోచుకుంటుండడానికి ఇదీ నేపథ్య భూమిక.. స్వేచ్ఛా వాణిజ్య ప్రాతిపదిక!
ఈ ఘరానా సంస్థలకు మరో పోటీ సంస్థ లేదు. అందువల్ల ‘గుంటనక్క’, ‘తోడేలు’ వలె ఈ వాహన దళారీ సంస్థలు దాడి చేస్తున్నాయి. మతిమాలిన మేకల వలె, గొఱ్ఱెల వలె, ఆవుల వలె మనం- మధ్యతరగతి జనం- ఈ వాహన మృగాలకు బలైపోతున్నాము! ప్రత్యామ్నాయం లేదు, ఏకైక ప్రత్యామ్నాయం నగరాలలో ప్రయాణాన్ని మానుకోవడం. గత ఏడాది కాలంలో ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థలు తమ ‘క్యాబ్’లలో ప్రయాణ శుల్కాన్ని పదిహేను శాతం పెంచాయన్నది సరికొత్త సమాచారం. ఈ ‘పెరుగుదల’ను ఈ వాణిజ్యపు దోపిడీ సంస్థలు ఏకపక్షంగా అమలు జరిపాయట. ప్రభుత్వ నియంత్రణ లేదు, ప్రభుత్వ ప్రమేయం లేదు. బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ వంటి నగరాలలో సొంత వాహనాలు లేనివారికి, సిటీబస్సులలో ప్రయాణం చేయలేని వారికి ‘ఆటోరిక్షాలు’ ‘టాక్సీ’లు ప్రయాణ మాధ్యమాలు! ఐదారేళ్ల క్రితం వరకు రహదారిపై నిలబడి ‘టాక్సీ’- క్యాబ్-ని పిలవడానికి వీలుండేది.‘ప్రపంచీకరణ’ నడికొనడానికి పూర్వం ఈ ‘టాక్సీ’లు ‘స్టాండ్’వద్ద కనిపించేవి. లేదా రహదారిపై ‘ఖాళీ’గా ఉన్న ‘టాక్సీ’లలో ప్రయాణీకులు ఎక్కడానికి వీలుండేది. ‘డ్రైవర్’ టాక్సీకి యజమాని, ‘ప్రయాణ శుల్కా’న్ని - ఛార్జెస్-ను ప్రభుత్వం నిర్ధారించేది, రోడ్డురవాణా నియంత్రణ సంస్థ వారి ‘మీటర్లు’ కార్లకు అమర్చేవారు. ఇదంతా గతమైపోయింది. అమెరికా నాగరికత ప్రభావంతో ‘టాక్సీ’ పేరును ‘క్యాబ్’గా మార్చారు. బ్రిటన్‌పై అమెరికా ఇలా ‘సాంస్కృతిక’ విజయం సాధించడానికి మన దేశం కూడ ఇలా ‘రంగభూమి’ అయింది.
అయితే అయింది.. కానీ రహదారిపై కాని ఇంటివద్ద కాని, ‘స్టాండ్’ వద్ద కాని నిలబడి ‘క్యాబ్’ను పిలవడానికి కాని ఎక్కడానికి కాని ఇప్పుడు వీలులేదు. దేశంలోని లక్షల ‘టాక్సీ’- క్యాబ్-ల యజమానులను ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలు తమ ‘ఉద్యోగులు’గా మార్చేశాయి. సొంతంగా ‘క్యాబ్’ను నడపడం కంటె ‘ఓలా’ లేదా ‘ఉబర్’ నియంత్రణలో పనిచేస్తే తమకు అధికతర ప్రయోజనం కలుగుతుందన్న భ్రమకు ఈ ‘క్యాబ్’ల యజమానులు లేదా చోదకులు-డ్రైవర్స్- గురి అయ్యారు. ఫలితంగా లక్షలాది వాహన చోదకులు- సొంత వాహనాలున్నవారు, అద్దె వాహనాలు నడిపేవారు- ‘ఓలా’తోనో ‘ఉబర్’తోనే అనుబంధితమయ్యారు. మొదట ఈ ‘డ్రయివర్ల’కు గొప్ప ప్రోత్సాహకాలు చూపించిన ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలు ప్రస్తుతం వారిని కట్టుబానిసలుగామార్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ప్రయాణీకులు ప్రధానంగా దోపిడీకి గురి అయ్యారు. ‘ఓలా’, ‘ఉబర్’ల పోటీకి తట్టుకొనలేక చిన్నాచితకా ‘క్యాబ్’ సంస్థలు మూతపడినాయి.. ‘ఉద్ధతుల మధ్య పేదలకుండతరమె’- ‘ఘరానా సంస్థలతో వ్యక్తులతో ఆర్థిక స్థాయి లేనివారు పోటీపడజాలరు’- అన్న మహాకవి వాక్యం నిజమైంది. ప్రస్తుతం దేశంలోని నగరాలలో ఈ రెండు సంస్థలకు అనుబంధంగా ఉన్న వాహనాల- క్యాబ్-లో తప్ప మరో వాణిజ్య వాహనంలో ప్రయాణించడానికి వీలులేని స్థితి ఏర్పడింది. ప్రధానంగా జనావాస ప్రాంగణాల- కాలనీల-లో నివసించే వారికి, శివారు ప్రాంతాలలోని వారికి నిరంతరం ‘బస్సుల’ సౌకర్యం లేదు. అందువల్ల సొంత వాహనాలు లేనివారు ఈ ‘క్యాబ్’లను ఎక్కడం అనివార్యం అయింది. కానీ ఈ ‘క్యాబ్’లను గతంలోవలె కేకవేసి పిలవడానికి వీలు లేదు, ‘్ఫన్’ చేసి పిలవడానికి వీలులేదు. మనవద్ద ‘లావణ్య దూరవాణి’- స్మార్ట్ఫోన్- ఉండాలి లేదా మన ఇంటిలో ‘అంతర్జాల వ్యవస్థ’- ఇంటర్‌నెట్ కంప్యూటర్ సిస్టమ్- ఉండాలి! ఎందుకంటె ‘ఉబర్’, ‘ఓలా’ ‘క్యాబ్’లను పిలవడం ‘ఆన్‌లైన్’- సాంకేతిక జీవనాడి- ద్వారా మాత్రమే సాధ్యం. ఈ రెండూ లేనివారు ప్రయాణాలు మానుకోవాలి లేదా ‘బిక్కుబిక్కుమంటూ’ గంటల కొలదీ ‘బస్‌స్టాప్’లో వేచి ఉండాలి!
ఇలా ‘స్మార్ట్ఫోన్’ కంపెనీలు, ఈ రవాణా సంస్థలు కలిసికట్టుగా జనాన్ని నియంత్రించడం దేశం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ బందిఖానాగా మారిన వాస్తవానికి ఒక ఉదాహరణ మాత్రమే! జనం నియంత్రితులు, బందీలు.. దేశం మొత్తం స్వేచ్ఛా వాణిజ్య- మార్కెట్ ఎకానమీ- శక్తులు నిర్వహిస్తున్న నిర్బంధ గృహం! ప్రభుత్వాలకు ఈ ధ్యాస లేదు, సిగ్గులేదు! బహుళ జాతీయ వాణిజ్య సంస్థల విరాళాలు మెక్కుతున్న రాజకీయ పార్టీలు నిద్రను అభినయిస్తున్నాయి. హైదరాబాదులోని ‘కోఠీ’ నుంచి ‘ఉప్పల్’కు ఈరోజున ‘ఉబర్’ ‘క్యాబ్’లో వెడితే రెండు వందల రూపాయలు వసూలు చేశారు.. రేపు వెడితే ప్రయాణ శుల్కం ఐదువందలు కావచ్చు! ఉదయం వెడితే రెండువందల యాబయి రూపాయలు కావచ్చు. మధ్యాహ్నం వెడితే ఆరువందలు కావచ్చు! ఇదంతా ‘డైనమిక్ ప్రెయిజింగ్’- గిరాకీని బట్టి దండుకునే- విధానమట.. అడిగే దిక్కులేదు! నగరారణ్య రోదనలు వినే ప్రభుత్వం లేదు!!