సంపాదకీయం

‘శబరిమల’ సమీక్ష..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల తీర్పు’ అమలును తాత్కాలికంగా నిలిపివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం నిరాకరించడం విచిత్రమైన పరిణామం. గతంలో సెప్టెంబర్ 28వ తేదీన చెప్పిన తీర్పును సమీక్షించడానికి సర్వోన్నత న్యాయస్థానం వారు మంగళవారం అంగీకరించారు. కానీ సమీక్ష పూర్తయ్యేవరకూ సెప్టెంబర్ 28 నాటి తీర్పును అమలు జరుపరాదన్న అభ్యర్థనను మాత్రం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అంగీకరించలేదు! అందువల్ల శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణ సమీపంలో నెలకొని వున్న ఉద్రిక్తతలు తొలగిపోయే సూచనలు కన్పించడం లేదు. ‘మండల పూజ’, ‘మకరజ్యోతి సందర్శన’ వంటి ప్రధాన ఉత్సవాలు రానున్న రెండు నెలల కాలంలో జరుగనున్న దృష్ట్యా శబరిమల ఆలయ సంప్రదాయ పరిరక్షకులకు, సంప్రదాయ విచ్ఛిన్నకారులకు మధ్య సంఘర్షణలు తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 28న చెప్పిన తీర్పును ‘సంప్రదాయ పరిరక్షకులు’ వారాల తరబడి అడ్డుకున్నారు. ఇలా అడ్డుకునే యత్నంలో వారికీ, సంప్రదాయ విచ్ఛిన్నకారులకు మధ్య సంఘర్షణలు జరగడం, ఉద్రిక్తతలు నెలకొనడం నడిచిన చరిత్ర! ఆలయ ప్రవేశం గురించి గతంలో చెప్పిన తీర్పును తాత్కాలికంగా అమలు జరుగకుండా నిలిపివేసినపుడు మాత్రమే ‘సమీక్ష’కు ఔచిత్యం లభిస్తుంది. ఈ ఔచిత్యం గురించి, తార్కిక ప్రాతిపదిక గురించి సమీక్షకు అంగీకరించిన సర్వోన్నత న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వారు ఎందుకు పట్టించుకోలేదన్నది అంతుబట్టని వ్యవహారం. సెప్టెంబర్ 28న సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పును సమీక్షించాలని, రద్దు చేయాలని కోరుతూ అనేక న్యాయయాచికలు దాఖలయ్యాయి. మంగళవారం నాడు వాటిని విచారించిన ‘సమీక్షా ధర్మాసనం’ ఈ యాచిక -పిటిషన్-లను తోసిపుచ్చి ఉండవచ్చు, సమీక్షకు నిరాకరించి ఉండవచ్చు. అలా జరిగి ఉండినట్టయితే సెప్టెంబర్ 28న అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పు మరోసారి ధ్రువపడి ఉండేది! కానీ ప్రధాన న్యాయమూర్తి గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షకు అంగీకరించింది. సమీక్ష చేయడమంటే సెప్టెంబర్ 28 నాటి తీర్పులోని అంశాలను మరోసారి అధ్యయనం చేయడం, వాద ప్రతివాదాలను విన్న తరువాత ఆ తీర్పును రద్దుచేయడం లేదా తీర్పును అంగీకరించి ధ్రువపర్చడం లేదా నాటి తీర్పులో తగిన మార్పులు చేయడం! అందువల్ల ఈ సమీక్ష జరిగినంత కాలం 28నాటి తీర్పు తుది తీర్పు కాజాలదు. సమీక్ష పూర్తయ్యేవరకూ ఆ తీర్పు అమలు జరుగరాదని కోరడంలోని ఔచిత్యం ఇది, తర్కం ఇది. ఈ ఔచిత్యాన్ని కానీ, తార్కిక ప్రాతిపదికను కానీ సర్వోన్నత న్యాయమూర్తులు అంగీకరించకపోవడం విచిత్రమైన వ్యవహారం!
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి యువతులు, మధ్యవయస్సులోని మహిళలు వెళ్లకపోవడం అనాదిగా సాగుతున్న ఆచారం. పదేళ్లలోపు బాలికలు, యాబయి ఏళ్లు నిండిన మహిళలు స్వామి ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించి సేవించి వస్తున్నారు. పదేళ్లు నిండిన, యాబయి ఏళ్ళు నిండని తరుణ ప్రాయంలోని మహిళలు మాత్రం ఆలయ ప్రవేశం చేయకపోవడం తరతరాల సంప్రదాయం. భారతీయుల జీవన సంప్రదాయాలు మూఢ విశ్వాసాలు కాదు. తార్కిక ప్రాతిపదికపై ఈ సంప్రదాయాలు ఏర్పడి ఉన్నాయి. అందువల్ల ‘పది, యాబయి సంవత్సరాల’ మధ్య వయస్కులైన మహిళలు అయ్యప్ప గుడిలోకి ప్రవేశించరాదన్న ఆచారం మహిళలకు వ్యతిరేకమైన వివక్ష కాదు. పురుషుల ఆధిక్యానికి కానీ, అహంకారానికి కానీ చిహ్నం కూడా కాజాలదు. ఈ నిబంధన సమాజ సమష్టి అభీష్టం మాత్రమే! ఈ సమష్టిలో పది ఏళ్లు నిండిన యువతులు, యాబయి ఏళ్లు నిండని మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలు ఎవ్వరూ ఈ నిబంధన వల్ల తాము ధార్మిక వివక్షకు కానీ, సామాజిక అసమానతకు కానీ గురి అయినట్లు భావించలేదు. ప్రాకృతికమైన, సహజమైన మానవ శరీర స్వరూప స్వభావాలకు అనుగుణంగా మాత్రమే ‘ఈ పరిమిత వయోజనుల’ ఆలయ ప్రవేశాన్ని నిషేధించే నిబంధన ఏర్పడి ఉంది. ఇది వివక్ష కాదు, ప్రకృతి స్థితమైన సృష్టిగతమైన మానవ జీవన వ్యవస్థ! ఈ ప్రాకృతికమైన మానవ స్వరూప స్వభావాలను ఎవ్వరూ మార్చలేరు. స్ర్తి పురుష మానవ శరీర స్వరూపాలు, స్వభావాలు, క్రియలు, ప్రతిక్రియల మధ్య స్పష్టమైన అంతరం ఏర్పడి ఉండడం సృష్టిగత సహజ వ్యవస్థ! ఈ ‘అంతరం’ అసమానతకు చిహ్నం కాదు, ఈ ‘అంతరం’ ఉభయులకూ - స్ర్తి పురుషులకు - సహజంగా లభించిన విలక్షణ వైవిధ్యం. ఈ విలక్షణ వైవిధ్యాల మధ్య గల సమన్వయం దాంపత్యం, కుటుంబం, సమాజ సంప్రదాయం, ధర్మం, సంస్కృతి, జాతీయత, ప్రపంచం, విశ్వం... శబరిమల ఆలయ ప్రవేశ సంప్రదాయం ఈ విలక్షణ వైవిధ్యం!
ఈ సంప్రదాయం ప్రాతిపదికగా స్ర్తి పురుషుల మధ్య కృతకమైన, కృత్రిమమైన వైవిధ్యాలను కల్పించడానికి ప్రయత్నిస్తున్నవారు విదేశీయ వికృతులకు వారసులు! తల్లీ కొడుకుల మధ్య, తండ్రీ కూతుళ్ల మధ్య, అమ్మానాన్నల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, అక్కా తమ్ముళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య వైరుధ్యం లేకపోవడం హైందవ జాతీయ జీవన ప్రాతిపదిక అయిన కుటుంబ స్వభావం! విభేదాలు, వైరుధ్యాలు సహజం కాదు, అపవాదం - ఎక్సెప్షన్- మాత్రమే. వరి పొలంలో కలుపుమొక్కలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉండగలవు? కుటుంబం, సమాజం వరి పొలం.. కృత్రిమ వైరుధ్యాలు కలుపుమొక్కలు! శరీరంలోని స్వస్థత కుటుంబ స్వభావం, రోగం రావడం అపవాదం! కానీ అపవాదమైన వికృతిని మాత్రమే భూతద్దంలో చూపి కొండంతగా ప్రచారం చేస్తున్నవారు, వికృతిని సమగ్ర సంస్కృతిగా చిత్రీకరిస్తున్నవారు మాత్రమే మహిళలు అనాదిగా అణచివేతకు, అసమానతకు గురవుతున్నారని ప్రచారం చేస్తున్నారు. శబరిమల సంప్రదాయాన్ని భగ్నం చేయాలని యత్నించడం ఈ ప్రచారంలో భాగం! దీన్ని మహిళలు నమ్మడం లేదు. మహిళలు అయ్యప్ప దేవాలయ ప్రవేశాన్ని కోరుతున్నారు, అలా నిజమైన భక్తురాండ్లు తమకు ‘పదేళ్లు రాక పూర్వం’ గుడిలోకి వెళ్లివస్తున్నారు, యాబయి ఏండ్లు నిండేవరకూ వేచి ఉండి ఆ తరువాత ఆలయ ప్రవేశం చేయగలుగుతున్నారు! ఈ సమన్వయ వ్యవస్థను భగ్నం చేయడానికి, మాతృదేశానికి అంతర్జాతీయ సమాజంలో చెడ్డపేరు తేవడానికి యత్నిస్తున్నవారు మాత్రమే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని వ్యితిరేకిస్తున్నారు. నిజానికి మనదేశంలో పురుషుల కంటే మహిళలు అధికులు. సమానత, ‘ఏకరూపత’ అన్నవి వైవిధ్య విధ్వంసకాలు కారాదు. ‘‘సహస్రంతు పితృన్ మాతా గౌరవే ణాతి రిచ్యతే..’’ తండ్రి కంటే తల్లి వేయి రెట్లు గొప్పది- పురుషుని కంటే మహిళ వేయి రెట్లు గౌరవ ఆధిక్యం కలది! అందువలననే మహిళ మాతృమూర్తి అయ్యింది. తండ్రికంటే తల్లి అత్యధికంగా పూజనీయురాలు అయ్యింది. ఇది అనాదిగా స్వజాతీయ జీవన వ్యవస్థ! వివక్ష ఎక్కడుంది?
వివక్ష ఉందని చెబుతున్నవారు జనవరి 22లోగా శబరిమల ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికి యత్నించవచ్చు. ఈ ‘ఉల్లంఘన’ను వ్యతిరేకించేవారికి, ఉల్లంఘించే వారికి మధ్య ఘర్షణలు తీవ్రతరం కావచ్చు. ఈ రెండు నెలల కాలంలో ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించి పది, యాబయి ఏళ్లమధ్య వయస్కులైన మహిళలు కొందరు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారనుకోండి! ఆ తరువాత సర్వోన్నత న్యాయస్థానం వారు సెప్టెంబర్ 28 నాటి తీర్పును రద్దుచేస్తే ఏవౌతుంది? జరుగవలసిన నష్టం జరిగిపోయి ఉంటుంది. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం వారు ఇప్పుడైనా పునరాలోచించి, సెప్టెంబర్ 28 నాటి తీర్పును తాత్కాలికంగా నిలిపివేయడం మేలు. ఒకవేళ ఆ తీర్పు సరియైనదని ధ్రువపడినప్పటికీ నష్టం లేదు. ఈ సంప్రదాయ వ్యతిరేకులు అపుడు ఆలయ ప్రవేశానికి యత్నించవచ్చు.. శబరిమల వివాదం వౌలిక సామాజిక హితానికి సమన్వయానికి సామరస్యానికి సంబంధించినది. అందువల్ల మరింత విస్తృత సర్వోన్నత ధర్మాసనం ఈ వ్యవహారాన్ని సమీక్షించాలి!