సంపాదకీయం

ప్రగతి భ్రాంతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ధూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల గురించి ఇప్పుడు మళ్లీ ‘రాజకీయపు’ రచ్చ మొదలైంది. 2004-2014 సంవత్సరాల మధ్య కొనసాగిన కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఐక్యప్రగతి కూటమి’- యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్- యుపీఏ- ప్రభుత్వ పాలన కాలంలో పెద్దగా ప్రగతి జరగలేదన్నది ‘కేంద్రీయ గణాంక కార్యాలయం’- నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్-ఎన్‌ఎస్‌ఓ- వారి సరికొత్త నిర్ధారణ. ‘జాతీయ గణాంక సాధికార సంస్థ’- నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్-ఎన్‌ఎస్‌సి- వారు నియమించిన అధ్యయన బృందం వారు ఈ ‘కొత్త ప్రగతి గణాంకాల’ను నిర్ధారించారట! ఈ వివరాలు బుధవారం నాడు వెల్లడైన వెంటనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతాపార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ‘ఎన్‌ఎస్‌సి’ వెల్లడించిన వివరాలు ప్రామాణికమైనవన్నది ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం చెప్పిన మాట! కానీ ‘నీతి ఆయోగ్’ వారు, కేంద్ర ప్రభుత్వం వారు వాస్తవాలను తల్లకిందులు చేస్తున్నారన్నది కాంగ్రెస్ పార్టీ వాదం. ‘రెండుకు రెండు కూడితే ఎనిమిది ఔతుందన్న’ రీతిలో కేంద్ర ప్రభుత్వం అంకెల గారడీని సృష్టించిందట.. కాంగ్రెస్ ఆరోపణ ఇది! కానీ కాంగ్రెస్ పాలన కాలంలో జరిగిన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- ‘గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్టు’-జిడిపి- వృద్ధి శాతం గతంలో ప్రచారమైన స్థాయి కంటె తక్కువ అన్న వాస్తవాన్ని తాము కనిపెట్టలేదని, స్వతంత్ర ప్రతిపత్తికల ‘కేంద్ర గణాంక సంస్థ కార్యాలయం వారు’ ఈ వాస్తవాన్ని నిగ్గుతేల్చారని అరుణ్ జైట్లీ అంటున్నాడు. ఈ కేంద్ర గణాంక సంస్థ కార్యాలయంపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు కాని ప్రభుత్వానికి కానీ ఎలాంటి నియంత్రణ అధికారం లేదని కూడ జైట్లీ గురువారం వెల్లడించాడు! అందువల్ల ‘యుపీఏ’ ప్రభుత్వ కాలం నాటి ‘ప్రగతి’ ‘గణాంక సంస్థ’ నిర్ధారించిన స్థాయిలోనే ఉండడం వాస్తవమన్నది జైట్లీ చెబుతున్నమాట! ఇలా ‘జీడీపీ’ లెక్కలు తారుమారు కావడానికి కారణం రూపాయి వాస్తవ మూల్యం మారుతుండడమే కారణమట! రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండడం వల్ల, ధరలు ద్రవ్యోల్బణం పెరుగుతుండడం వల్ల ‘ఉత్పత్తి పరిమాణం’ విలువ కూడ పెరిగినట్టు కనిపిస్తుంది. అందువల్ల 2004-2005 నాటి ధరలతో పోల్చినప్పుడు 2011-2012 నాటి ధరల ప్రాతిపదికగా ఉత్పత్తుల విలువ ‘జీడీపీ’ పరిమాణం విలువ ఉల్బణానికి- పెరుగుదలకు- గురై ఉండాలి. ఎందుకంటె ఆ ఏడేళ్లలో ధరలు పెరిగి ఉంటాయి కనుక. ఉదాహరణకు 2004లో ఉత్పత్తి అయిన కిలో కందిపప్పు విలువ నలబయి రూపాయలు కాగా 2012లో ఈ విలువ డెబ్బయి రూపాయలై ఉండవచ్చు! ఈ ప్రాతిపదికన ‘జీడీపీ’ పరిమాణం ‘విలువ’ క్రమంగా పెరుగుతోంది. ఇది సహజం కానీ ఈ ప్రాతిపదిక ఆధారంగా ఒకసారి జరిగిన ‘వృద్ధి’శాతం ఎలా తగ్గిపోతుందన్నది సామాన్యులకు అంతుపట్టని వ్యవహారం. ఒక ఏడాది వంద రూపాయలు ఉండిన ఉత్పత్తి విలువ మరుసటి ఏడాది నూట పది రూపాయలు అయినప్పుడు ద్రవ్యోల్బణాన్ని అధిగమించి జరిగిన ‘వృద్ధి’ని మాత్రమే పరిగణించాలి! కానీ ప్రభుత్వాలు ‘ద్రవ్యోల్బణాన్ని’ రూపాయి విలువ తగ్గడాన్ని పరిగణించకుండానే ‘జీడీపీ’ పెరుగుదలను లెక్కకడుతున్నాయన్నది బహిరంగ రహస్యం!! నిజానికి ఈ ‘వైపరీత్యం’ అన్ని పార్టీల నిర్వహణలోని ప్రభుత్వాలకు సమానం..
అందువల్ల ప్రభుత్వాలు చాటుకుంటున్న ‘జీడీపీ’ వృద్ధి శాతం కంటె వాస్తవ వృద్ధిశాతం తక్కువగానే ఉండడం సహజం. ఈ వాస్తవాన్ని ‘స్వతంత్ర’ సంస్థ అని జైట్లీ చెబుతున్న ‘కేంద్ర గణాంక సాధికార సంస్థ’ వారు ధ్రువపరిచారు. ఈ ధ్రువీకరణ ప్రకారం 2004-2014 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వం నడచిన కాలంలో ‘జీడీపీ’ 6.8 శాతం పెరిగింది, 2014 నుంచి ఇప్పటివరకు ‘్భజపా’ప్రభుత్వం నడుస్తున్న కాలంలో ‘జీడీపీ’ 7.3 శాతం పెరిగింది. ఇవి సాలీనా సగటు పెరుగుదల వివరాలు! అందువల్ల ఉభయ పక్షాల పాలనల మధ్య తేడా అర్ధ శాతం పెరుగుదల మాత్రమే! దీనివల్ల కాంగ్రెస్ బాధపడవలసిన పని లేదు, ‘్భజపా’ గొప్పగా బాకా ఊదవలసిన పనిలేదు, అసలు విషయం ఇది కాదు. ‘జిడిపి’తొమ్మిది శాతం పెరిగిందని, ఎనిమిది శాతం పెరిగిందని 2004-2014 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ ‘బాకా’ ఊదడం చరిత్ర. ఆ ‘స్థాయి’లో పెరుగుదల జరగలేదని ఏడు శాతం కంటె తక్కువ స్థాయిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో ‘జీడీపీ’ పెరిగిందని నిర్ధారణ కావడం వల్ల ఆ ప్రభు త్వం చేసిన ప్రచారంలోని ‘డొల్ల’తనం బైటపడింది. ఈ డొల్లతనాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేని కాంగ్రెస్ కొత్త గణాంక వివరాలు కల్లలని బుకాయిస్తోంది..
‘జీడీపీ’ వృద్ధి శాతం మాత్రమే నిజమైన ప్రగతికి కొలమానం కాదన్నది గ తంలో సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాట. ‘వినిమయ ద్రవ్యం’-రూపాయి- విలువ నిలకడగా ఉండడం, ధరలు ద్రవ్యోల్బణం అదుపుతప్పకుండా ఉండడం ‘ప్రగతి’కి ఇతర ప్రాతిపదికలు! రూపాయి విలువ- అమెరికా డాలర్ ప్రాతిపదికగా- నానాటికీ నశించిపోతున్న వైపరీత్యం ఏళ్లతరబడి కొనసాగుతోంది. పెట్టుబడులను పెంచడానికి వీలుగా బ్యాంకులు ‘వడ్డీ’శాతాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు నిరంతరం కోరుతున్నాయి. మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కోరింది, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ‘్భజపా’ ప్రభుత్వం ఇదే కోరుతోంది. కానీ ఇలా పెట్టుబడులను పెంచడానికి తీసుకుంటున్న చర్యలు ధరలను ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికీ రిజర్వ్ బ్యాంక్‌కూ మధ్య, ప్రస్తుత ప్రభుత్వానికీ రిజర్వ్ బ్యాంకుకు మధ్య విధానపరమైన విభేదాలు ఏర్పడడానికి ఇది ప్రధాన కారణం. పెట్టుబడులు పెరగడం వల్ల ఉత్పత్తులు పెరుగుతాయని ‘జిడిపి’ పెరుగుతుందని ప్రభుత్వ నిర్వాహకులు భావిస్తున్నారు. అందువల్ల ‘వడ్డీ’ శాతం తగ్గాలట. ఈ విషయంలో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం అవలంబించిన ‘ఆర్థిక నీతి’ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. ఇదీ ‘ప్రగతి భ్రాంతి’కి కీలకం! ఈ ‘ప్రగతి భ్రాంతి’కి ప్రాతిపదిక ప్రపంచీకరణ! కానీ వడ్డీలు తగ్గడంవల్ల ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి పెరిగి ధరలు ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. అందువల్ల పదే పదే ‘వడ్డీ’శాతాన్ని తగ్గించడానికి ‘రిజర్వ్ బ్యాంక్’ సిద్ధంగా లేదు. ధరలు ద్రవ్యోల్బణం పెరగకుండా, రూపాయి విలువ భయంకరంగా దిగజారిపోకుండా పెట్టుబడులను పెంచగల ‘సమన్వయ’ ఆర్థిక సూత్రాన్ని ఆవిష్కరించలేక పోవడం దశాబ్దుల వైపరీత్యం. ప్రపంచీకరణ నెలకొన్న తరువాత, ‘స్వేచ్ఛా విపణి’ నడికొన్న తరువాత ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాల నియంత్రణ పూర్తిగా నశించింది. నియంత్రించడానికి యత్నించడం ‘స్వేచ్ఛా విపణి’ స్వభావానికి విరుద్ధమట! అందువల్ల ‘స్వేచ్ఛా విపణి’ పేరుతో ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’లనే మారీచ మృగాలు దేశమంతటా సంచరిస్తున్నాయి, ‘బంగారు వనె్నల’ ప్రగతి భ్రాంతిని కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం ఆవిష్కృతవౌతున్న ‘జిడిపి’ గణాంకాలు ఈ ప్రగతి భ్రాంతికి ప్రతీకలు. ఎందుకంటె ‘జిడిపి’లో యాబయి నాలుగు శాతం ‘సేవల’- సర్వీసెస్- రంగం నుంచి లభిస్తోంది. సేవల రంగంలో కన్పించే ‘ప్రగతి’ కేవలం కృత్రిమమైనది, అది ‘బలుపు’కాదు ‘వాపు’మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం అసలు సిసలైన ప్రగతి. కానీ మన ‘జిడిపి’లో వ్యవసాయ ఉత్పత్తుల వాటా కేవలం పదిహేడు శాతం. పారిశ్రామిక ఉత్పత్తులు ప్రాధాన్య క్రమంలో రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల వాటా ఇరవై తొమ్మిది శాతం. ఈ పరిస్థితి, ప్రాధాన్యాలు మారాలి, ‘జిడిపి’లో వ్యవసాయ, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ‘వాటా’ మొదటి స్థానానికి రావాలి, కనీసం రెండవ స్థానానికైనా రావాలి. శతాబ్దులకు పూర్వం ప్రపంచ వాణిజ్యంలో ‘అఖండ భారత్’ వాటా నలబయి మూడు శాతం. ఇందుకు కారణం వ్యవసాయ ఉత్పత్తులు, వికేంద్రీకృత పరిశ్రమలు. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో ‘అవశేష భారత్’ వాటా ఆరు శాతం కంటె తక్కువ. ‘ప్రగతి’గతి ఏవైపునకు..??