సంపాదకీయం

‘అగతి తార్కిక‘ రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలన్న భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని వామకూటమి-లెఫ్ట్‌ఫ్రంట్-నిర్ణయం సైద్ధాంతికమైన దివాళాకోరుతనానికి పరాకాష్ఠ! గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టుకట్టింది! 1977 నుండి ముప్పయి నాలుగేళ్ల పాటు ఏకధాటిగా బెంగాల్‌ను పాలించిన వామకూటమి 2011 నాటి శాసన సమరంలో ఘోర పరాజయం పాలు కావడం రాజకీయ విప్లవ విస్ఫోటనం! 2001లోనే మమతా బెనర్జీ పార్టీ వామపక్షాలను ఓడించి అధికారంలోకి వస్తుందని భారీ ఎత్తున ప్రచారమైంది! అయితే భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని మూడవ కూటమి జాతీయ ప్రజాస్వామ్య సంఘటన-ఎన్‌డిఏ-్భరీగా వోట్లు చీల్చివేయడంతో వామకూటమి లాభపడింది, 294 స్థానాలున్న బెంగాల్ శాసనసభలో 198 స్థానాలను గెలిచింది. మమతా బెనర్జీ కూటమికి దక్కింది కేవలం 88 స్థానాలు! 2006 నాటి ఎన్నికలలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో అధికార వామకూటమి కూటమి మరింత లాభపడింది, 235 స్థానాలను గెలిచింది. బెంగాల్ దీదీకి దక్కింది 29 స్థానాలు మాత్రమే! అందువల్ల 2011 నాటి ఎన్నికలలో మమతా బెనర్జీ సాధించిన విజయం విప్లవ విస్ఫోటనం! తృణమూల్ కాంగ్రెస్-కాంగ్రెస్ కూటమి 226 స్థానాలు గెలుకుకోగలిగింది. మమతా బెనర్జీ పార్టీ స్వయంగా 184 స్థానాలను గెలుచుకుని బెంగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగింది. ఈ విప్లవ ప్రకంపనలు 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో మరింతగా ప్రస్ఫుటించాయి. నలబయి రెండు లోక్‌సభ స్థానాలున్న బెంగాల్‌లో సిపిఐఎమ్ కేవలం రెండు సీట్లు గెలవడం దీదీ ప్రభంజన పరంపర కొనసాగుతోందనడానికి నిదర్శనం! ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్‌లో తిరుగులేని శక్తి అన్నది సిపిఐఎమ్ వారి భయం. 2014 నాటి ఎన్నికలలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసినప్పటికీ సిపిఐఎమ్ నాయకత్వంలోని వామకూటమికి లాభించలేదు! తృణమూల్ కాంగ్రెస్‌కు ముప్పయి నాలుగు లోక్‌సభ స్థానాలు లభించగా కాంగ్రెస్ మరో నాలుగింటిని గెలవగలిగింది! అన్నిటికంటె మించి భారతీయ జనతాపార్టీ బెంగాల్‌లో ఎదుగుతుండడడం సిపిఐఎమ్‌కు కలవరం కలిగిస్తున్న పరిణామం...
గత లోక్‌సభ ఎన్నికలలో భాజపా బెంగాల్‌లో రెండు స్థానాలను గెలవగలిగింది. ఆ పార్టీకి పద్దెనిమిది శాతం వోట్లు లభించడం సిపిఐఎమ్‌కు మింగుడుపడని వ్యవహారం! బెంగాల్ ప్రజలు సిపిఐఎమ్ కూటమికి దూరమైపోతున్నారన్న దానికి ఇది నిదర్శనం. 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీకి నలబయి రెండు శాతం వోట్లు వచ్చాయి. 2014 నాటి ఈ వోట్ల శాతం ఇరవై నాలుగు శాతానికి దిగజారింది. పద్దెనిమిది శాతం వోట్లను సిపిఐఎమ్ కోల్పోయింది. వామకూటమిలోని భారత కమ్యూనిస్టు పార్టీ-సిపిఐ తదితర చిన్న పార్టీల బలం మరీ ఘోరంగా దిగజారిపోవడంతో మొత్తం కూటమికి లభించిన వోట్లు ముప్పయి శాతం మాత్రమే! ఇలా వామకూటమి కోల్పోతున్న వోట్లు భాజపాకు బదిలీ అయిపోతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసినప్పటికీ భాజపా ప్రభావం కారణంగా తమకు మరో సారి ఓటమి తప్పదన్నది వామకూటమి భయం! భాజపా తృణమూల్ వోట్లను కాక వామ కూటమి వోట్లను చీల్చుతున్నట్టు 2014 లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన స్థానిక, పంచాయతీ ఎన్నికల ద్వారా మరోసారి ఋజువైంది. అందువల్ల కాంగ్రెస్ తృణమూల్ కూటమిలో ఉండరాదన్నది మార్క్సిస్టుల వ్యూహంలో భాగం.. కాంగ్రెస్ విడివిడిగా కూడ పోటీ చేయరాదు...అందువల్ల 1998 అక్టోబర్ తీర్మానం స్ఫూర్తి మార్క్సిస్టులకు గుర్తుకువచ్చింది.
ఇలా ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలన్న వామపక్షాల నిర్ణయం విజయవిశ్వాసం అడుగంటిపోయిందన్న వాస్తవానికి ప్రతిబింబం. 1977లో దేశంలో అత్యవసర పరిస్థితి- ఎమర్జెన్సీ-తొలగిపోయినప్పటినుంచి పశ్చిమ బెంగాల్‌లోను, కేరళలోను వామపక్షాలు కాంగ్రెస్‌కు బద్ధ శత్రువులు! ఇప్పుడు కేరళలో మాత్రం ఈ రాజకీయ వైరుధ్యం కొనసాగుతోంది, పశ్చిమ బెంగాల్‌లో వామకూటమి ఒడిలో కాంగ్రెస్ చేరిపోయింది! ఇలా ఏప్రిల్, మే నెలలలో పోలింగ్ జరిగే రెండు ప్రధాన రాష్ట్రాలలో ఒకచోట కాంగ్రెస్ కూటమి, వామప్రజాస్వామ్య కూటమి పరస్పరం వ్యతిరేక ప్రచారం కొనసాగించనున్నాయి, మరోచోట భుజం భుజం కలిపి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రచారాస్త్రాలను సంధించనున్నాయి. కాంగ్రెస్‌తో అవసరమైనప్పుడల్లా అవసరమైన చోటల్లా చేతులు కలపాలన్నది 1998 అక్టోబర్‌నుంచి భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ-సిపిఐఎమ్-వారు అనుసరిస్తున్న విధానం. భారతీయ జనతాపార్టీ ఎదుగుదలను అరికట్టడానికి ఈ విధానం అనివార్యమన్నది 1998 అక్టోబర్‌లో కలకత్తాలో జరిగిన సిపిఐఎమ్ ప్రతినిధి సభ-కాంగ్రెస్-చేసిన తీర్మానం! భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో 1998లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిపిఐఎమ్‌వారు ఈ తీర్మానాన్ని చేయవలసి వచ్చిం ది! 1960వ దశకంలో భారత కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తరువాత ఏర్పడిన సిపిఐఎమ్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం అప్పటివరకు నడిచిన చరిత్ర! సిపిఐ 1977 వరకు కాంగ్రెస్ తోకగా పనిచేసి ఆ తరువాత మార్క్సిస్టు పార్టీ నాయకత్వంలోని వామకూటమిలో చేరిపోయింది! 1998లో భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తరువాత వామకూటమి దేశమంతటా కాంగ్రెస్‌కు తోకగా మారడం సైద్ధాంతిక స్ఫూర్తికి తిలోదకాలిచ్చిన విపరిణామం! గ్రీష్మ తాపం సకల జీవ జాలానికీ సమష్టి శత్రువు కావడం వ్యవహార వాస్తవం. ఎండవేడమిని భరించలేని కప్ప పాము నీడన విశ్రమించిందని, పాము నెమలి పింఛాన్ని గొడుగుగా చేసుకుని సూర్యుని ధిక్కరించిందని ఋతుసంహారం కావ్యంలో మహాకవి కాళిదాసు వివరించాడు! కప్ప పాము సహజ శత్రువులు, పాము నెమలి బద్ధ విరోధులు! అయినప్పటికీ చండమార్తాండుని ధాటి శత్రువులను మిత్రులుగా మార్చింది! వామకూటమి వారు కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి ఏకైక ప్రయోజనం భాజపా విస్తృతిని నిరోధించడమని సిపిఐఎమ్ వారే స్వయంగా 1998లో చెప్పుకున్నారు! బెంగాల్‌లో మమతమ్మ భయం...దేశమంతటా భాజపా ప్రమాదం!
ఈ ఎన్నికల తరువాత భాజపా అంతరించిపోవడం ఖాయం అని 1989నుండి ప్రతి ఎన్నికల సమయంలోను సిపిఐఎమ్ వారు జోస్యం చెప్పినట్టు చరిత్రలో నమోదై ఉంది. కానీ ప్రతి ఎన్నిక తరువాత వామపక్షాల పలుకుబడి తగ్గిపోతుండడం అప్పటినుంచి జరిగిపోతున్న గతి తార్కిక విపరిణామ క్రమం! ఖమ్మం నగర పాలికకు జరిగిన ఎన్నికలలో సిపిఐఎమ్, సిపిఐ రెండేసి చొప్పున స్థానాలను గెలుచుకోవడం గతి తార్కిక సైద్ధాంతిక వైఫల్యానికి బహుశా పాతాళపుటంచు కావచ్చు! సిపిఐఎమ్ జాతీయ స్థాయి హోదాను సైతం కోల్పోయే ప్రమాదం దాపురించింది! అందుకే కాంగ్రెస్ చంకనెక్కి బెంగాల్‌లో ఊరేగడానికి ఉవ్విళ్లూరుతోంది!