సంపాదకీయం

పట్టు వదలని ఉగ్రమూకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీభత్సకారులపై మన సైనికులు ఎడాపెడా జరుపుతున్న ఎదురు దాడులు పెరిగిన భద్రతా ధ్యాసకు నిదర్శనం. పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జమ్ము కశ్మీర్‌లోను, చైనా ఉసిగొల్పుతున్న బీభత్సకారులకు వ్యతిరేకంగా ఈశాన్య ప్రాంతాలలోను మన సైనికులు జరుపుతున్న ఎదురు దాడులు ఉద్ధృతం కావడం హర్షణీయం. ‘హిజ్‌బుల్ ముజాహిదీన్’ జిహాదీ ఉగ్రవాద సంస్థలో పేరుమోసిన హంతకుడు అబ్దుల్ ఖయూమ్ నాజాద్ అనేవాడు బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు! పాకిస్తాన్‌లోనుండి మనదేశంలోకి దొంగచాటుగా చొరబడుతుండిన సమయంలో ఈ బీభత్సకారుడిని మన సైనికులు పసికట్టారట! ఈశాన్య ప్రాంతంలోని నాగాలాండ్‌లో బర్మా-మ్యాన్‌మార్- సరిహద్దు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున టెర్రరిస్టులకు మన సైనికులకు మధ్య ఆరంభమైన ‘సమరం’ బుధవారం కూడా కొనసాగింది. ఈ పోరాటంలో ‘నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’- ఖాప్‌లాంగ్ వర్గం- ‘ఎన్‌ఎస్‌సిఎన్-కె‘ అన్న విద్రోహపు ముఠాకు చెందిన అనేకమంది ఉగ్రవాదులు హతం కావడం ఈ ముఠా వెనె్నముక విరిగిపోయిందనడానికి నిదర్శనం! 2015 జూన్‌నుండి ఈ ‘ఎన్‌ఎస్‌సిఎన్-కె’ ముఠాకు ‘అస్సాం రైఫిల్స్’ జవానులకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది! చైనా ప్రభుత్వం ఈ ఉగ్రవాదులను ఉసిగొల్పుతుండడం బహిరంగ రహస్యం! పాకిస్తాన్ ప్రభుత్వం ఒకవైపున ‘జిహాదీ‘ హంతకులను మన దేశంలోకి తోలుతోంది, ఇది ప్రత్యక్ష బీభత్సం. పాకిస్తాన్ సైనికులు దాదాపుప్రతిరోజు ‘అధీనరేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌ఓసి- వద్ద దొంగచాటుగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఈ ‘కాల్పు లు’ ప్రచ్ఛన్న బీభత్స చర్యలు! పాకిస్తాన్ ‘సైనికులు’ ప్రచ్ఛన్న బీభత్సకారులు. సైనికులు జనావాసాలపై కాల్పులు జరపరు. ఇలా కాల్పులు జరిపే సైనికులు ప్రచ్ఛన్న బీభత్సకారులు! బుధవారం సైతం మన సైనికులు పాకిస్తాన్ రేంజర్ల కాల్పులను ప్రతిఘటించవలసి వచ్చింది! ఇలా మన సైనికుల దృష్టి ఈ ప్రచ్ఛన్న బీభత్సకారుల కాల్పులపై కేంద్రీకృతం అవుతున్న సమయంలో ప్రత్యక్ష బీభత్స కారులైన ‘జిహాదీ’లు ‘రేఖ’ను దాటి మనదేశంలోకి చొరబడిపోతున్నారు. ఇదీ పాకిస్తాన్ ప్రభుత్వం అమలు జరుపుతున్న వ్యూహం! ఈ ద్విముఖ వికృత వ్యూహాన్ని మన సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారన్నదానికి బుధవారం ఘటనలు మరో నిదర్శనం. బుధవారం పాకిస్తాన్ సైనికుల కాల్పులను మన సైనికులు ప్రతిఘటిస్తుండిన తరుణంలోనే ఈ ‘హిజ్‌బుల్’ ముష్కరుడు మనదేశంలోకి చొరబడి హతమయ్యాడు! ‘కాల్పుల’పై దృష్టిని కేంద్రీకరించిన మన సైనికులు తమను పసికట్టలేరన్నది చొరబడుతున్న ‘జిహాదీ’ టెర్రరిస్టుల ధీమా! మన సైనికులు ఈ ‘ఆశ’ను అడియాశ చేయగలిగారు!
ఇలా మన సమర వీరులు- బీభత్స కాండకు వ్యతిరేకంగా- సాగిస్తున్న సంఘర్షణ ఉద్ధృతమవుతున్న కొద్దీ చైనా ప్రేరిత ఉగ్రవాదులు కాని, పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న ‘జిహాదీ’ హంతకులు కాని అణగారిపోవడం లేదు. ఇది సమాంతర విపరిణామం! గత ఏడాది సెప్టెంబర్‌లో మన సైనిక దళాలవారు ‘అధీనరేఖ’ వెంబడి వెలసిన పాకిస్తాన్ జిహాదీ బీభత్సకారుల స్థావరాలపై దాడులు చేసి ఆ స్థావరాలను ధ్వంసం చేసారు. ఈ ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- తరువాత పాకిస్తాన్ బీభత్సకారులు అణగారిపోలేదు, మరింతగా విజృంభిస్తుండడం నడుస్తున్న చరిత్ర! అఫ్ఘానిస్తాన్‌నుంచి పలాయనం చిత్తగించిన ‘అల్‌ఖాయిదా’ బీభత్సకారులు కూడ మనదేశంలోకి చొరబడినట్టు ఇప్పుడు ధ్రువపడింది. ఈ ‘అల్‌ఖాయిదా’ హంతకులు బర్మానుంచి చొరబడి మనదేశంలో అక్రమంగా తిష్ఠవేసి ఉన్న ‘రోహింగియా’లను టెర్రరిస్టులుగా తీర్చిదిద్దుతున్నారని కూడ ధ్రువపడింది! పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వ విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’-ఐఎస్‌ఐ- మన దేశంలోని జిహాదీ ముఠాలను, ఇతర దేశాలలోని జిహాదీ ముఠాలను అనుసంధానం చేసింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని విమానాశ్రయంలో జిహాదీలు బుధవారం జరిపిన పేలుళ్లు ఈ అనుసంధాన బీభత్సంలో భాగం! బీభత్సంపై మన పోరాటం ఉద్ధృతవౌతున్న కొద్దీ పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలు కూడ తమ కలాపాలను మరింత తీవ్రతరం చేస్తున్నారన్నది నిరాకరించజాలని నిజం!
ఈశాన్య ప్రాంతంలో సైతం మన సైనికులు గాలింపు చర్యలను ముమ్మరం చేసిన తరువాత గత రెండేండ్లుగా చైనా ప్రేరిత విద్రోహులు అణగారిపోవడం లేదు! బర్మాలోకి చొచ్చుకుని పోయిన మన సైనికులు ‘ఎన్‌ఎస్‌సిఎన్-కె’ విద్రోహుల బట్టీలను బద్దలు కొట్టిన తరువాత రెండేండ్లు గడచినప్పటికీ ఈ ఉగ్రవాదులు అణగిపోలేదు! మంగళవారం తెల్లవారుజామున ఈ చైనా తొత్తులు మన సైనికులమీద, అనుబంధ సాయుధ దళాల- అస్సాం రైఫిల్స్-మీద దాడులు చేసే దుస్సాహసానికి ఒడిగట్టడం ఇందుకు సరికొత్త నిదర్శనం. మంగళవారం తెల్లవారుజాము నుండి మన సైనికులు జరిపిన ఎదురు కాల్పుల ఫలితంగా అనేకమంది ‘ఎన్‌ఎస్‌సిఎన్-కె’ ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ 2015 జూన్‌లో మన సైనికులు ‘పట్టి పరిమార్చే’ వ్యూహాన్ని-హాట్ పర్సూట్- అమలు జరిపిన తరువాత కూడ బర్మా సరిహద్దులలో ఇంతమంది విద్రోహులు మిగిలి ఉండడమే విస్మయకరం. నాగాలాండ్‌ను మిజోరంను మణిపూర్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను మనదేశంనుంచి విడగొట్టి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఈ ‘ఎన్‌ఎస్‌సిఎన్-కె’ ఉగ్రవాదులు కలలు కంటున్నారు.
ఈశాన్య ప్రాంతాలలో దేశ విద్రోహుల ముఠాల పుట్టలు పెరగడం బ్రిటన్ సామ్రాజ్య వాదులు రూపొందించి వెళ్లిన కుట్ర ఫలితం. మత ప్రాతిపదికపై పాకిస్తాన్ ఏర్పడినట్టే మత ప్రాతిపదికపై నాగాలాండ్ మిజోరం తదితర ప్రాంతాలను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్నది ఈ కుట్ర... ఆ తరువాత ఈ దేశద్రోహపు ముఠాలను చైనా ప్రభుత్వం చేరదీసింది. ‘ఎన్‌సిసిఎన్’ ముఠాలోని కొన్ని వర్గాలు సయోధ్యకోసం కేంద్రప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మరికొన్ని వర్గాలు దేశ వ్యతిరేక బీభత్స చర్యలను సాగిస్తూనే ఉన్నాయి! ఈ ‘ఖాప్‌లాంగ్’ అనే వాడి నాయకత్వంలోని ‘ఎన్‌ఎస్‌సిఎన్’ ముఠావారు 2015 జూన్‌లో మణిపూర్‌లో ఇరవై మంది మన సైనికులను హత్య చేసారు! మన సైనికులు ఆ తరువాతనే బర్మాలోకి చొచ్చుకుని వెళ్లి ‘హాట్ పర్సూట్‌‘’- ఈ విద్రోహుల స్థావరాలను ధ్వంసం చేసారు! ఆ తరువాత ‘ఖాప్‌లాంగ్’ మరణించాడు. అయినప్పటికీ ఈ ముఠా విద్రోహ కలాపాలను కొనసాగిస్తూనే ఉంది! మంగళ బుధవారాలలో హతమైన వారు కాక ఇంకా ఎంతమంది విద్రోహులు మిగిలి ఉన్నారో..??