సబ్ ఫీచర్

చిరు నటనల సిరివెన్నెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పాత్ర చేసినా దానికొక బాణీని ఆపాదించగల నటుడు మిశ్రో. పాటకు బాణీగానీ, పాత్రకేంటని అనుకోవచ్చు. కానీ, మిశ్రోని తడిమి చూస్తే -ఔను పాత్రకూ బాణీ ఉంటుందంటాం. నలుగుర్ని కూడేస్తే నాటకమనుకునే అనుభవం నుంచి మొదలైన నట ప్రస్థానం -గొప్ప దర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేంత వరకూ సాగింది. కత్తి.. బ్లేడు.. నరుకు లాంటి భావధారిద్య్ర సినిమాలను నాలాంటి వాళ్లు భరించలేకపోతున్నారంటూ ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్న మిశ్రోతో ఈవారం వెనె్నల అతిథి ముచ్చట్లు.
అదృష్టం ఉండాలేగానీ ఎడారిలో పడ్డా బ్రతికేస్తారట. కానీ మిశ్రో ఎడారిలో లేకపోయినా అదృష్టం మాత్రం ఎప్పుడూ వెన్నంటే వుంటుంది. ఏ పాత్ర చేసినా దాన్ని ఒకస్థాయిలో నిలబెట్టారాయన. ఈ పాత్ర మిశ్రో చేస్తేనే బాగా వచ్చింది అనిపించారాయన. పుట్టి పెరిగిందంతా వైజాగ్‌లోనే. బికాం పూర్తిచేసి పోర్ట్ ఉద్యోగి అయ్యాడు. కానీ నటించే సత్తావున్న మనసు ఊరుకోదు కదా! ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్నట్లు, తోటి ఉద్యోగస్థులతో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించారు. నాటకం వేశాకే ఆంధ్రా యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్‌లో సీటు వెతుక్కుంటూ వచ్చింది. నటన, దర్శకత్వంలో నాలుగేళ్ల టెక్నికల్ కోర్సులో చేరారు. గురువు కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంచి నటుడయ్యాడు. ఆయనే సుశీల్ కుమార్ మిశ్రో.
1945లో శశిభూషణ్ మిశ్రో, సరోజినిదేవి మిశ్రో దంపతులకు ముద్దుల కొడుకుగా జన్మించారు. వారి పూర్వీకులు పర్లాకిమిడి రాజు దగ్గర కొలువుకోసం పూరి నుండి వలసవచ్చిన కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు. పర్లాకిమిడి రాజు టెక్కలివద్ద పరశురామాపురాన్ని వీరి జాగీరుగా ఇచ్చారు. దాదాపు 120 ఏళ్ళ క్రితం మిశ్రో పూర్వీకులు వైజాగ్ వచ్చేశారు. కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద వారి ఇల్లు. అప్పట్లో అక్కడ చాలా పెద్ద ఆరుబయలు స్థలం ఉండేది. అక్కడ పండగలకు, పబ్బాలకు బోలుడన్ని కార్యక్రమాలు జరిగేవి. హరికథలు, బుర్రకథలు, నాటకాలు ప్రదర్శించేవారు. చిన్నవాడైన మిశ్రో ఆ కార్యక్రమాలన్నింటినీ నోరు వెళ్ళబెట్టుకొని చూచేవాడు. వీళ్లు ఇలా ఎలా నటిస్తున్నారు? ఎలా పద్యాలు పాడుతున్నారు? ఎలా ధారణ పట్టి పాటలు పాడుతున్నారు అని ఆ చిట్టిబుర్రలో ఆలోచన మెదిలేది. వెంకటేశ్వర పేటలో ఉన్న పట్నాయక్ అనే మాస్టరు ‘దొంగ’ అనే నాటకాన్ని వ్రాశారు. ఆ నాటకంలో 15ఏళ్ళ మిశ్రోకు ఓ పాత్ర ఇచ్చారు. అలా దుంపలబడిలో తొలిసారిగా మేకప్ వేసుకున్నారాయన. ఆ నాటకానికి మంచి పేరే వచ్చిందాయనకు. ఎ.ఎమ్.కాలేజీలో డ్రెమటిక్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. యువజనోత్సవాలలో అనేక నాటకాలు వేశారు. నలుగుర్ని కూడేస్తే నాటకం అన్నట్లుగా ఆయన నాటక ప్రస్థానం సాగింది. ఆ తరువాత నవ్యభారతి కళామందిర్ అనే అసోసియేషన్ ప్రారంభించి నాటకాలు వేసేవారు. అప్పుడు జరిగిందే గురువు వెంకటేశ్వరరావు ప్రోత్సాహం సంగతి. థియేటర్ ఆర్ట్స్‌లో చేరమని అడిగిందీ ఆయనే, ఢిల్లీ తీసుకువెళ్లి ‘పావలా’ అనే నాటకాన్ని వేయించిందీ ఆయనే. పావలా శ్యామల వీరి టీమ్‌లో వున్న నటీమణే. అలా థియేటర్ ఆర్ట్స్ తరఫున నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు. ఆ నాటకాలకు అనేకమంది పెద్దవాళ్లు వచ్చి చూసేవాళ్లు. అనుకోకుండా ఓసారి నిర్మాత దేవీ ప్రసాద్, గంగాధరరావు వచ్చి వీరి ప్రదర్శించిన నాటకాన్ని చూశారు. ఆ సమయంలో వారు ‘నీడలేని ఆడది’ సినిమా రూపొందించే ప్రయత్నంలో భాగంగా కొత్త నటీనటుల కోసం వెతుకుతున్నారు. నాటకాన్ని చూశాక ఆ చిత్రంలో ఓ పాత్ర ఇచ్చారు మిశ్రోకి. సినిమా అంటే ఆనందం కదా, సరదాగా వెళ్లి చేశాను అంటారాయన. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది. ఒక సినిమాను చూసి మరో సినిమా పాత్ర వెతుక్కుంటూ వచ్చేది. బోనం ఆంజనేయులు అనే నిర్మాత ‘అయినవాళ్ళు’ చిత్రం రూపొందిస్తూ ఓ పాత్రను చేయమన్నారు. ఆ తరువాత కె.విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘మాంగల్యానికి మరో ముడి’ చిత్రంలో రమాప్రభ పెయిర్‌గా వేశారు. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాతోనే దర్శకులు విశ్వనాథ్ బాగా పరిచయం అయ్యారు. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో దర్శకుడు జంధ్యాల కూడా ఓ మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. జంధ్యాల నాటకాలు వేసే సమయంలోనే బాగా పరిచయమున్న వ్యక్తికావడం కలిసివచ్చింది. ఆ తరువాత అనేక సినిమాలు చేస్తూ ఉండగా, ‘సాగర సంగమం’ చిత్రంకోసం విశ్వనాథ్ పిలిచారు. ఆ చిత్రంలో పాత్ర చిన్నదైనా అందరికీ గుర్తుండిపోయే పాత్ర మిశ్రోది. సినిమా మొత్తం నృత్యప్రధానంగా సాగుతుంది కనుక, ఇప్పటి సినిమాలలో నృత్యాలు ఎంత అధమస్థాయిలో వున్నాయో తెలిపే ఓ సినిమా నృత్య దర్శకుడి పాత్ర అది. డాన్స్ అంటే అభిమానం లేదు, కళాకారులంటే అన్నిటికన్నా హీనం అనే భావనలో వుండే ఓ నృత్యదర్శకుడి పాత్ర అది. కళాకారులకన్నా మైఖేల్ అనే కుక్కకు ప్రాధాన్యమిచ్చే పాత్ర అది. ఆ పాత్రతో అందరికీ తెలిసిపోయాడు మిశ్రో. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు కె.బాలచందర్ దర్శకత్వంలో ‘మరోచరిత్ర’ సినిమాలో పట్ట్భా పాత్ర. బాలచందర్ మిశ్రోలో వున్న నటుణ్ణి గుర్తించారు. అందుకే వెంటనే కమలహాసన్, రజనీకాంత్, జయప్రద ప్రధాన తారాగణంలో రూపొందించిన ‘అందమైన అనుభవం’ చిత్రంలో కమెడియన్‌గా పెద్దవేషానే్న ఇచ్చారు. ఆ చిత్రంతో తన స్టామినా ఏంటో తెలుగు, తమిళ పరిశ్రమలకు తెలిపాడు మిశ్రో. ఇది నాణేనికి మరోవైపు. ‘సిరివెనె్నల’ తాతగారి పాత్ర మన ఇంట్లో నిత్యం చూసే తాతయ్యలను గుర్తుచేస్తుంది. ‘విధాత తలపున ప్రభవించినది’ అన్న గీతంలో మొదట్లో వచ్చే మాటలు ఆయనవే. స్వాతికిరణం, శృతిలయలు, స్వయంకృషి.. ఇలా అద్భుతమైన క్లాసికల్ సినిమాలలో గొప్ప దర్శకులతో పనిచేసి శభాష్ అనిపించారు. ఎం.ఎస్.రెడ్డి రూపొందించిన ‘ప్రేమకథ’ అనే చిత్రం మంచిపేరు తెచ్చింది. అందమైన అనుభవంలో ‘ఏయ్ 70 ఎంఎం’ అనే డైలాగుతో గుర్తింపు వచ్చింది. నటన సాగిస్తుండగా, పోర్ట్‌లో ఉద్యోగం ఎలా చేయాలన్న సందిగ్ధావస్థ మిశ్రోది. అంతే, బాలచందర్‌ని సలహా అడిగారు. దానికాయన నీ లైఫ్ నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరినీ సలహా అడగొద్దు అని జవాబిచ్చారు. సినిమాలలో వచ్చే ఆదాయంతో ఇబ్బంది పడేకన్నా, కుటుంబం గడిచేందుకు ఉపకరించే ఉద్యోగమే మంచిదన్న భావనతో ఆయన వైజాగ్‌లోనే ఉండిపోయారు. ఎవరైనా మంచి పాత్ర ఉంది, రండి అని అంటే వెళ్లి చేశారు. మరో చరిత్ర, అందమైన అనుభవం రూపొందించే సమయంలో బాలచందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. మంచి దర్శకులతో పనిచేశాను. బాపు దర్శకత్వంలో ఓ పాత్ర చేస్తే బాగుండు కదా అని అనుకున్నారు. అదే సమయంలో బాపు ‘శ్రీ్భగవతం’ సీరియల్ రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ వాసుతో మిశ్రో సినిమా ఒకటి చూపించి ఇలాంటి వ్యక్తి అయితే తనకు బాగుంటుంది అన్నారట ఆయన. వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ వాసు, అలాంటి వ్యక్తి ఏంటండీ.. అతనే ఉన్నాడు ఇక్కడ అన్నారు. వెంటనే బాపు ఆయన్ని పిలిపించమన్నారు. బాపుగారినుంచి కబురొచ్చింది. నమ్మలేకపోయాడు మిశ్రో. కానీ అది నిజం. ‘‘అదృష్టం వెంబడి మనం పరిగెత్తకూడదు.. అదృష్టం మన వెంబడి పరిగెత్తాలి’’ అంటారాయన. అలా శ్రీ్భగవతంలో శకుని పాత్ర వరించింది మిశ్రోకి. దాంతో మంచి గుర్తింపూ వచ్చింది. అలా 30 సీరియల్స్ చేశారాయన. నాటకాలు చిన్నప్పటినుండి వేస్తూనే ఉన్నాను, 16 నాటకాలు రాశాను. దాదాపు ఒక వెయ్య ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. ఓ నాటకాన్ని రాయడానికి వస్తువుగా వుండే కథలో ఓ మెసేజ్ వుండాలి.. చూడటానికి ఆసక్తిగా వుండాలి.. ప్రేక్షకుణ్ణి నవ్వించి, ఏడిపించేదిగా ఉండాలి. అలా ఉండే నాటకాలే నేను రాస్తానంటారాయన. చప్పగా వుండి, ఎప్పుడు అయిపోతుందా అన్నట్టు ఉండే అది నాటకం కాదు అని ఆయన భావన. దర్శకుడు విశ్వనాథ్ అంటే ఆయనకు ఓ నమ్మకం.. ఓ మాస్టారు.. ఆయన ఓ మంచి యాక్టర్ అంటారాయన. షూటింగ్‌లో ఆయన చెప్పే విధానం, డైలాగ్ మాడ్యులేషన్, యాక్టింగ్ చేసి చూపే విధానం నాకు నచ్చుతుంది అంటారాయన. తనకు ఏది కావాలో అది చేసి చూపించి మన దగ్గర రాబట్టుకుంటారాయన. అదే బాలచందర్ అయితే, ఏమీ కలుగజేసుకోరు. మనం చేస్తుంటే అలాగే వద్దు.. ఇంకొద్దిగా.. ఆ.. ఆ.. అంత వద్దు అంటూ తనకేది కావాలో అది చేయించుకుంటారాయన. బాపుగారైతే.. నాకేం తెలియదు అన్నట్టు కూచుంటారు. అన్నీ మనచేతే చేయించుకుంటారు.. అంటూ దర్శకుల గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు మిశ్రో. అలాంటివాళ్ళే గొప్ప దర్శకులని ఆయన అభిప్రాయం. సినిమాపట్ల పెద్ద వ్యామోహం ఏనాడూ లేదు. ఆయనకు ఇద్దరు అబ్బాయిలు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. నలుగురు మనవళ్లు.
ఆయన నటనకు, ప్రతిభకు పది నంది అవార్డులు వరించాయి. ఇపుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. మెమరీ లాస్ వచ్చేస్తుందంటూ నవ్వేశారు. పూర్వం ఇంటికి దీపం ఇల్లాలు, నమ్మినబంటు లాంటి పేరున్న సినిమాలు వచ్చేవి. ఇపుడేంటండీ?.. కత్తి.. బ్లేడు.. నరుకు లాంటి భావదారిద్య్ర సినిమాలు వస్తున్నాయ్. ఇపుడొస్తున్న కుర్రాళ్లకు ఓపికే లేదు. ఎంత త్వరగా ఎన్టీఆర్, ఎస్వీఆర్ అయిపోవాలని చూస్తున్నారు. ఆరాటాలు పెరిగాయి. సినిమాల్లో చెత్త పెరిగిపోయింది. ఓవర్‌నైట్‌లోనే గొప్ప హీరో అవ్వాలనుకుంటారు. దానికి పునాది అయిన నాటకాల జోలికి మాత్రం రావడంలేదు. ఇంక బిల్డింగ్ ఎలా నిలబడుతుందీ అంటూ చమత్కరించి ముగించారాయన.

-సరయు శేఖర్, 9676247000