సబ్ ఫీచర్

16ఎంఎం.. సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖానికి రంగేసుకున్నోడే -కళాకారుడు అనుకునేవాడిని. వేసుకున్న రంగులు కడుక్కుని అద్దంలో అసలు ముఖం చూసుకునే సందర్భం వచ్చిన ప్రతిసారీ -నేనేంటో నాకు తెలిసేది. అప్పుడర్థమయ్యేది -నన్ను నేను తెలుసుకోవడమే నిజమైన కళ అని. అలా నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం మొదలెట్టా. వెతుక్కుంటూనే ప్రయాణించా. ఆ ప్రయాణంలో అర్థమైన విషయం ఒక్కటే -కోటి వేషాలు కూటి కొరకేనని. నాలో గొప్ప కళాకారుడు లేడని నాకు అర్థమైన తరువాత -తెరకెక్కిన గొప్ప కళాకారులను ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడం మొదలెట్టా. అదే గొప్ప కళ అనిపించింది. అదే బతుకుదెరువునీ ఇచ్చింది. నేను కళాకారుడిని కాకపోయినా -కళను నమ్ముకున్నందుకు న్యాయమే జరిగింది అంటాడు భాస్కరరావు.
సినిమా అంటే కొంతమందికి రంగుల కళ. ఇంకొంతమందికి రంగుల కల. రెండోకోవకు చెందిన నాలాంటి వాళ్లకు -కల ఎప్పటికీ కూడుపెట్టదన్న కళను ముందే గ్రహించడమే నాకున్న గొప్ప కళ అంటూ నవ్వేశారు భాస్కర రావు. అసలు ఎవరీ భాస్కర రావు. గొప్ప కళాకారులను ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడమేంటి? అదేం కళ?లాంటి ప్రశ్నలు బుర్రను తొలిచేస్తున్నాయి కదూ. వాటికి సమాధానాలు తెలియాలంటే -ఈవారం అతిథి భాస్కర రావు సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
**
చిలకలూరిపేటలో -శంకర లింగం, నాగరత్నమ్మల కడుపున రెండో కొడుకుగా పుట్టినవాడే భాస్కర రావు. సొంతూళ్లో ఎస్సెస్సెల్సీ చదివాడు. అందమైన దృశ్యాన్ని ప్రపంచానికి చూపించడమే గొప్ప కళగా భావించి -1956 నుంచీ ఫొటోగ్రఫీపట్ల ఆకర్షితుడయ్యాడు. అది నేర్చుకునే క్రమంలో -నాటక ప్రపంచానికి పరిచయమయ్యాడు. అప్పటికి టీనేజ్‌లో ఉన్నాడు కనుక -నాటకం కోసం స్టేజ్ ఎక్కడమే గొప్ప అనిపించింది. దానికితోడు -చుట్టూ అలాంటి వాతావరణమే ఉండటంతో బలమైన ప్రభావమే చూపించింది. నాటక ప్రపంచంలో అప్పటికే సంచరిస్తున్న కళాకారులు కొందరు -సమాజాలవైపు భాస్కర రావునూ లాక్కెళ్లారు. 1961లో ‘చైర్మన్’ నాటకాన్ని తొలిసారి ప్రదర్శించాడు భాస్కర రావు. అలా వేషాల జర్నీ మొదలైంది. చుట్టుపక్కల ఊళ్లలో నాటకాలాడటం మొదలైంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా -చాలామంది నటుల్లాగే భాస్కర రావు ప్రయాణం కూడా మద్రాస్‌కే చేరింది. మద్రాసులో హీరోగా ‘శిక్షార్హులు’ నాటకం ప్రదర్శించాడు. దానికి ఉత్తమ ద్వితీయ నాటకం అవార్డొచ్చింది. అదే ఊపుతో నెల్లూరు తదితర ప్రాంతాల్లో నాటకాలాడి బహుమతుల మీద బహుబతులు సంపాదించాడు. భాస్కర రావు ట్రూప్‌కి మంచి ఆదరణ లభించింది. ఇక నెక్ట్స్ టార్గెట్ -సినిమా అనుకున్నాడు. నాటకాల్లో హీరో పాత్రలు వదిలేసి -సినిమాలో చిన్నాచితకా వేషాలు వేయాలా? అన్న ప్రశ్న ఎదురైంది. మనసు వద్దని వారిస్తున్నా -మెదడు మాత్రం ఓ ప్రయత్నం చేస్తే తప్పులేదుగా అని హెచ్చరించింది. అలాంటి ఆలోచనల మధ్య ఓసారి మద్రాసు ప్రయాణం చేస్తుండగా -దర్శకుడు ఎంఎస్ కోటారెడ్డి పరిచయమయ్యారు. ఆ కలయికలో -16ఎంఎం సినిమాల ఆలోచనను భాస్కరరావుకు చెప్పాడు కోటారెడ్డి. త్వరలో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని చెప్పి, భాస్కర రావును పిలిచి అవకాశం కూడా ఇచ్చారు. అదే సత్యనారాయణ, మాధవి, జయచిత్ర, రామకృష్ణ ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న ‘ప్రయాణంలో పదనిసలు’. ఆ చిత్రంలో నాగేష్‌తో కాంబినేషన్ సీను. ‘కమెడియన్ ముందే కమెడియన్‌లా నటించడమంటే ఇబ్బందికరమే. కానీ నాటకాల అనుభవం ఉందిగా. అదే కొండంత ధైర్యాన్నిచ్చింది. నాగేష్‌కు దీటైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. నాగేష్ మెచ్చుకున్నారు. ప్రయత్నం చెయ్యి, వృద్ధిలోకొస్తావ్ అన్నారు’ అంటూ తొలి షూటింగ్ ముచ్చట గుర్తు చేసుకున్నాడు భాస్కర రావు. అక్కడి నుంచి ఎంఎస్ కోటారెడ్డి రూపొందించిన ప్రతి చిత్రంలో ఏదోక పాత్ర నాకోసం ఉండేది. ఎస్‌ఐ, పొలిటికల్ లీడర్, వడ్డీవ్యాపారి, సమాజ సహాయకారి.. ఇలాంటి పాత్రలు చేస్తూ వచ్చా. కానీ -నాలాంటివాళ్లు గొప్ప కళాకారులు కాలేరన్న విషయం త్వరగానే అర్థమైంది. నన్ను నేను అంచనా వేసుకోడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు అంటారు భాస్కర రావు. అయితే, తన గురించి తను తెలుసుకోవడమే నిజమైన జీవించే కళ (ఆర్ట్ ఆఫ్ లివింగ్) అన్న విషయం అక్కడినుంచే అర్థమైందంటారు ఆయన. ‘ముఖానికి రంగేసుకుంటే -సెట్లో కనిపించే జిగేలు వెలుగులు జీవితంలో కనిపించవని అర్థమైంది. అప్పుడు -రైల్లో వెళ్తున్నపుడు కోటారెడ్డి చెప్పిన 16ఎంఎం చిత్రాల సంగతి గుర్తుకొచ్చింది. వాకబు చేశాను. 16ఎంఎం సినిమా రీళ్లను ఎలా సంపాదించాలో తెలుసుకున్నా. దానిపై పెద్ద కళాత్మక వ్యాపారం సాగుతోందని అర్థమైంది. అలా -కొన్ని సినిమాల ప్రింట్లు సంపాదించాను. బుల్లి ప్రొజెక్టర్లు తీసుకొని సొంతూరు, చుట్టుప్రక్కల పల్లెలకు వెళ్లేవాడిని. చీకటి పడ్డాక రోడ్డుపై 16ఎంఎం తెరను కట్టి సినిమాల ప్రదర్శన మొదలెట్టా. లవకుశ నుంచి గుండమ్మకథ, గండికోట రహస్యం, గోపాలుడు భూపాలుడు, అగ్గిమీద గుగ్గిలం లాంటి సినిమాలను ప్రదర్శించేవాళ్లం. పెద్దగా థియేటర్లు లేని ఆ రోజుల్లో -మా రోడ్డు థియేటర్ సినిమాలకు ప్రాధాన్యత పెరిగింది. ఆడియన్స్ బాగానే వచ్చేవారు. ఎక్కడికో పట్నంపోయి చూసేకన్నా సొంతూళ్లోనే చీకటిపడ్డాక రూపాయికి దొరికే సినిమా పట్ల ఆకర్షితులయ్యారు. నిజానికి అప్పటి ఎన్నో సినిమాలను, అందులో నటించిన గొప్ప కళాకారులను జనం వద్దకు నేనే తీసుకెళ్లా’ అంటాడు భాస్కర రావు నవ్వేస్తూ. అలా -రాత్రిపూట సినిమాలు, తెల్లారితే కారులో మద్రాసుకు ప్రయాణం. అక్కడ సినిమాల్లో వేషాలుంటే చేసేసి -మళ్లీ కొత్త 16ఎంఎం ప్రింట్లు సంపాదించి ఊరికి రావడం. ఇలా ఎంతకాలం కష్టపడ్డానో గుర్తులేదు కానీ, దాదాపుగా మద్రాసును చిలకలూరిపేట, పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చేశాను’ అంటారు నవ్వేస్తూ.
ఇక నటనపరంగా -పార్వతీ పరమేశ్వర్లు, పొదరిల్లు, ఇల్లాలిముచ్చట్లు, కల్యాణచక్రవర్తి, నా మొగుడు బ్రహ్మచారి, సీతాపతి సంసారం, గీత సంగీత, అల్లుడుకోసం, నాంపల్లి నాగు తదితర చిత్రాల్లో మురళీమోహన్, చిరంజీవి, చంద్రమోహన్ వంటి ఉద్దండులతో కలిసి నటించారు. ముఖ్యంగా కల్పనారాయ్‌తో ఆయన చేసిన డోకు టైలర్స్ హస్య సన్నివేశాలు భాస్కరరావుకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇలా సినిమాలు చేసుకుంటూ తన 16ఎంఎం సినిమాల ప్రదర్శనను ఒక్క ప్రొజెక్టర్‌నుండి 15 ప్రొజెక్టర్లకు పెంచాడు. 16ఎంఎం ప్రింట్లు సంపాదిస్తూ -మరిన్ని ఊళ్ళలో ప్రదర్శించేవాడు. అలా తెలంగాణలో భువనగిరి, హైదరాబాద్‌లాంటి ప్రాంతాల్లోనూ పండుగలు, పబ్బాలకు సినిమాలు ప్రదర్శించే స్థాయికి వచ్చాడు భాస్కర రావు. ఇలా తన పని తాను చేసుకుంటూ వెళ్లి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే -రెండు థియేటర్లు, రెండు లాడ్జిలకు యజమాని అయ్యాడు. తరువాత సినిమా థియేటర్లు పెరిగాయి. 16ఎంఎం సినిమాల ప్రదర్శన సాగలేదు. అప్పటికే టీవీలు ప్రతి ఇంట్లోకీ ప్రవేశించటం మొదలెట్టాయి. ‘దాదాపు 300 సినిమాలకు సంబంధించిన రీళ్లు నా దగ్గరుండేవి. వాటిని ఏంచేయాలా? అనుకుంటున్న సమయంలో మద్రాస్‌లో ఓ ఎగ్జిబిషన్‌కు వెళ్లా. అక్కడి పరిస్థితులు చూసి, త్వరలో ప్రపంచాన్ని టెలివిజన్ ఏలబోతుందన్న విషయాన్ని గ్రహించా. ప్రతి ఇంటికీ టీవీ ఎలా రాబోతుందో కొన్ని కంపెనీలు డెమాన్‌స్ట్రేషన్ ఇచ్చి చూపించాయి. అప్పుడర్థమైంది -ప్రతి ఇల్లూ థియేటర్‌గా మారిపోనుందని. సో, తెల్లగుడ్డ తెర సినిమాలు చూసే జనం తగ్గుతున్నారు. వెంటనే -అప్పటి వరకూ సేకరించిన 16ఎంఎం సినిమా రీళ్లని మంచి రేటుకు అమ్మేశాను. మంచి లాభాలొచ్చాయి. నేను ముందు జాగ్రత్తపడి ఉండకపోతే -తీవ్రంగా నష్టపోయేవాడిని.. అంటూ ఆనాటి పరిస్థితుల్ని వివరించారు భాస్కర రావు. ప్రస్తుతం చిలకలూరిపేటలోనే ఆయన నివాసం. థియేటర్ల ముచ్చట తీరింది. లాడ్జిల ముచ్చటా చూశాను. ప్రస్తుతం ఓ కల్యాణమంటపం కట్టించి దాంతోనే జీవనం సాగిస్తున్నా. నా భార్య పేరు పార్వతి వర్థనమ్మ. ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఉన్నన్నాళ్లు నలుగురికీ సేవ చేయాలని కోరిక అంటూ తన జీవిత విశేషాలు వివరించారు. రంగుల ప్రపంచాన్ని జనానికి చూపించి జీవితంలో విజయం సాధించిన భాస్కర రావు -సినిమాల్లో తన పాత్రలకు సంబంధించీ ఎన్నో ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. అవి వచ్చేవారం.

-సరయు శేఖర్, 9676247000