సబ్ ఫీచర్

బులిపించే జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటనకు
-నిర్వచనం తెలీని తొలినాళ్లవి.
పాత్ర స్వభావాన్ని
-కళ్లకు కట్టినట్టు చెప్పేవారు.
పాత్ర స్వరూపాన్ని
-గీతల బొమ్మల్లోనూ చూపించేవారు.
‘ఇలా చేయమ్మా’ -అంటూ అనునయంగా చెప్పేవారు. అలాగే చేసేదాన్ని. ఎలాగైతే చెప్పారో అలాగే చేసి చూపించేదాన్ని. సన్నివేశాన్ని పండించేదాన్ని.
‘బాగా చేశావమ్మా’ అంటూ దర్శకుడినుంచి ఒక గొంతు వినిపిస్తే -‘అంత బాగా చేయకు’ అంటూ పక్కనుంచి రెండు గొంతులు ప్రామ్టింగ్ చేసేవి. ఆ రెండు గొంతుల్లో ఒకటి అభిమానానిదైతే.. ఇంకోటి ఆధిపత్యానిది.
నటిగా రూపాదేవికి ఎదురైన చిత్రమైన అనుభవిది. నటిగా తొలినాళ్లలో బిత్తరచూపులొక్కటే ఆమె -సమాధానం. ఆ సంఘటనలు గుర్తుకొచ్చినపుడు నిండుగా నవ్వుకోవడమే ఇప్పటి -జ్ఞాపకం. చిత్రమైన సంఘర్షణల మధ్యా జీవిత సన్నివేశాన్ని బ్యాలెన్స్ చేస్తూ సాగించిన నిండైన ప్రయాణంలో.. మరికొన్ని ‘రుతురాగాలు’ ఈవారం.

ముందే చెప్పానుగా -నటిగా కొంతమంది దర్శకులతో పని చేయడం గొప్ప అనుభవంలా అనిపించేది. ఆర్టిస్టులకు బొమ్మలతో స్క్రిప్ట్ చెప్పడం దర్శకుడు బి నరసింగరావుకు మెగాఫోన్‌తో పెట్టిన విద్య. సన్నివేశాన్ని ఆర్టిస్టుల మెదళ్లపై శాశ్వతం చేసేసేవారు. అంతకుమించిన అనుభవజ్ఞుడు -బొమ్మల బ్రహ్మ బాపు. దర్శకుడు బాపు దగ్గర స్క్రిప్ట్ రాతకంటే గీతల్లోనే ఎక్కువ ఉండేది. ఆయన కొన్నాళ్లు డిడి చానెల్‌కు తెలుగు పాఠాలు ఎలా చెప్పాలి? అన్న అంశంపై కొన్ని ఎపిసోడ్స్ చేశారు. ఆ ఎపిసోడ్స్‌లో నా పాత్ర టీచర్. ఆ టైంలో -బాపు వర్క్ స్టయిల్ చూస్తుంటే అదే గొప్ప ఎడ్యుకేషన్ అనిపించేది. తలలో పూలు ఏ రంగులోవుండాలి. చీర అంచు ఎలా కనిపించాలిలాంటి అంశాలను ఆయన బొమ్మల్లోనే చూపించేవారు. ఆర్టిస్టుల దగ్గర్నుంచి ఆయనకు కావాల్సిన ఇన్‌పుట్ రాబట్టేవారు’ అంటూ ఆనాటి పని పాఠాలను గుర్తు చేసుకున్నారు రూపాదేవి.
ఒకసారి -‘హాలూజైను అనే చిత్రంలో నేను, రాజ్‌కుమార్ కలిసి నటించాం. మంచి పాత్ర అది. పురందరదాసు కీర్తనలు సమయోచితంగా దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఆ చిత్రంలో ఉపయోగించారు. దర్శకుడు సింగీతం ఎంతటి బలమైన సన్నివేశాన్నైనా పసి పిల్లలకు చెప్పినట్టు నవ్వుతూ చెబుతారు. ఇక్కడ ఇలా నిలబడాలి. ఈ ఎక్స్‌ప్రెషన్ ఇలా పలికించాలి.. అంటూ సున్నితంగా వివరించేవారు. ఆయన చెప్పే విధానం నా మనసుకు బలంగా హత్తుకునేది. జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని -ఆయన ఎలా చెబితే అలా చేసేదాన్ని. ఎంత బోల్డ్‌గా అంటే ‘దర్శకుడు చెప్పింది చేయడమే నాకు తెలుసు’ అన్నట్టు చేసేదాన్ని. అది కథానాయకుడి తరఫు అభిమానులకు గిట్టేది కాదు. సెట్‌లోనే నాకు వంకలు పెట్టేవారు. రాజ్‌కుమార్ ఎంతగా నటిస్తే, అంతకుమించి చేయకూడదు నువ్వు’ అంటూ ఆంక్షలు పెట్టేవారు. అసలలా ఎందుకు చేశావంటూ ప్రశ్నించేవారు. ఆయనకన్నా గొప్ప నటివా? అని నిలదీసేవారు. అదంతా తెలీని నేను అమాయకత్వంతో దర్శకుడు చెప్పారు, చేశాను అనేదాన్ని. అవన్నీ ఇపుడు గుర్తొస్తుంటే భలే నవ్వొస్తుంటుంది అంటూ గుర్తు చేసుకున్నారు రూపాదేవి.
తెలుగులో తీర్థయాత్ర అనే చిత్రంలో నటించాను. ఆ చిత్రంలో కథానాయకుడు శాపవశాన కోతిలా మారతాడు. కథ ప్రకారం అంతా కథానాయికను ‘నీ మొగుడు కోతి’ అంటూ హేళన చేస్తారు. అదేమాటను షూటింగ్‌లోనూ అంటూ నన్ను ఆటపట్టించేవారు. ఆ చిత్రంలో అమ్మవారిగా నటించిన కెఆర్ విజయను అంతా అపరకాళికా దేవిలా భావించేవారు. ఆమెకూడా చక్కగా అమ్మవారే దిగివచ్చినట్టు నటించేవారు.
నాగకన్య అనే కన్నడ చిత్రంలో నటిస్తున్న టైంలో -పాముతో కలిసి నటించాలి. నాకేమో పామంటే చచ్చేంత భయం. పాముతో నటించనంటూ మారాం చేసేదాన్ని. భయమేం లేదు, నువ్వు చేయగలవు అంటూ ప్రోత్సహించేవారు దర్శకుడు, యూనిట్ సభ్యులు. అందులోనూ రాత్రి షూటింగ్. దానికితోడు వాన. ఇక చూడాలి నా అవస్థ. ఆ షూటింగ్ ఉన్నాన్నాళ్లూ దినదినగండంగా ఉండేదంటే నమ్మండి.
మరోసారి అనంత్‌నాగ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నా. ప్రేమికులిద్దరూ పరిగెడుతూ, వెళ్లిపోతున్న లారీని అందుకుని ఎక్కాలి. మొదటి టేక్ బాగా వచ్చింది. కానీ ఫైట్‌మాస్టర్ మరో టేక్ తీద్దామన్నారు. మొదటి టేక్ బాగుందని దర్శకుడు చెప్పినా, ఫైట్ మాస్టర్ సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో మరో టేక్‌కు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడే చెప్పారు. మొదటి షాట్ బాగానే వచ్చింది కానీ, రెండో షాట్ కూడా అంతే జాగ్రత్తగా చేయమని. స్పీడ్‌గా వెళ్తున్న లారీనుంచి వచ్చి గాలి లాగేయగలదు జాగ్రత్త అని చెప్పే పంపించారు. యూనిట్ సభ్యులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూనే పరిగెడుతున్నా, లారీ స్పీడ్ కారణంగా వచ్చిన గాలి లాగేయటంతో రోడ్డుమీద పడిపోయాను. అప్పటికి హీరోయిన్ అంటే ఎటువంటి దెబ్బలు తగలకుండా చిన్న పాపాయిలా చూసుకుంటారు. నేను పడిపోయేసరికి యూనిట్ అంతా పరుగులు పరుగులులతో అక్కడికి వచ్చేసింది. రోడ్డుమీద పడడంతో చిన్న చిన్న దెబ్బలతోనే ప్రమాదం తప్పింది. నటీనటుల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు తప్పదు -అంటూ వివరించారు రూపాదేవి.
ఆమధ్య ఓసారి షఫి హీరోగా ఓ ఎన్‌ఆర్‌ఐ రూపొందించిన ‘ష్..!’ చిత్రంలో మంత్రగత్తెగా చేశా. మొదటినుండీ పాజిటివ్ పాత్రలు చేసిన నాకు, ఆ పాత్ర సరికొత్తగా అనిపించింది. సహజంగా నెగెటివ్ పాత్రలను నటీనటులు చేయడానికి ఒప్పుకున్నారంటే, ఆ పాత్రలో నటించడానికి మంచి స్కోప్ ఉందనే అర్థం. అలాంటి అవకాశం నాకు ఆ పాత్రలో లభించిందనుకుంటాను. అయితే క్లైమాక్స్ వరకూ ఆ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉండదు. కథానాయకుడికి సహాయం చేసే పాత్రగా మధ్యలో మారుతుంది. దీంతో నా అభిరుచికి తగిన విధంగా ఆ చిత్రంలో నటించాను. స్క్రిప్ట్‌ను మొదట ప్రత్యేక మాండలికం అనేది లేకుండా సినిమా భాషలోనే రాసుకున్నారు. కానీ సినిమా అంతా తెలంగాణ ప్రాంతంలో చిత్రీకరించడంతో -సినిమాలో నా పాత్రకు సంబంధించిన భాష అంతా అదే స్లాంగ్‌లో ఉంటుంది. మామూలు భాషలోవున్న డైలాగులన్నింటినీ షూటింగ్ సమయంలోనే తెలంగాణ మాండలికంలో మార్చి చేయడం జరిగింది. ఆ సినిమాలో నేను చేసిన నటనకు మంచి గుర్తింపు లభించింది. అనేకమంది సరికొత్త పాత్రలో కనిపించానని చెప్పారు. గతంలో ఇలాంటి పాత్రలను మహామహుల్లాంటి ఎస్‌వి రంగారావు, సత్యనారాయణ, రాజనాల, విజయలలిత లాంటివారు చేశారు. వారిని అనుకరించకపోయినా ఆ ముద్ర నాపై ఏ సన్నివేశంలోనూ పడకుండా జాగ్రత్తగా నటించాను.
ఓసారి హనుమాన్ ప్రసాద్ రూపొందిస్తున్న ‘్ఛయ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలోనూ నాది మంచి పాత్ర. ఓ రోజు షూటింగ్ చెరువు దగ్గర జరుగుతోంది. అక్కడికి నిర్మాత కుమారుడు కూడా వచ్చాడు. సహజంగా చిన్న పిల్లలకి నీటిలో ఈతకొట్టాలనే సరదా ఉంటుంది. అలా ఆ బాబు నీళ్లలోకి దిగగానే ప్రమాదంలో పడ్డట్టుగా కొట్టుకుపోతున్నాడు. అది చూసి వాళ్ల నాన్న చెరువులోకి దూకేశాడు. ఇద్దరూ ప్రమాదంలో ఉన్నపుడు, అక్కడేవున్న నేను వారికి చెయ్యి అందించి పైకి లాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. తరువాత నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అంత ధైర్యంగా చెయ్యి అందించాను కదా, నాకు ప్రమాదం జరిగితే ఏమవుతుంది అని. కానీ అంతా సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు యూనిట్ సభ్యులంతా.
ఆర్టిస్టులకు సవాల్ విసిరే పాత్రలు వస్తేనే ఆనందం. అలాంటిదో పాత్ర ‘కమ్లి’ చిత్రంలో చేశా. ఆ చిత్రంలో నందితాదాస్‌తో నటించడం ఓ మరుపురాని సంగతి. ఆ చిత్రం కోసం బంజారా భాష కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. సినిమా కథనంలోవున్న ఫిలాసఫీని నా పాత్ర ద్వారా చెప్పిస్తారు. నటులకు ప్రతి పాత్రా ఓ సవాలే. అలా నేను ఏ పాత్రనైనా నాకు సవాల్‌గానే భావిస్తాను. ఆ పాత్రకు వున్న ప్రాధాన్యతను బట్టి నా స్టైల్లో నటించే ప్రయత్నం చేస్తాను. ఇటీవల కృష్ణంవందే జగద్గురుమ్, అసుర, తమిళంలో ఎచ్చిల్ ఇరవుగళ్ చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించాను. నాకు సవాల్ విసిరే పాత్రలో నటించడానికి ఎప్పటికీ సిద్ధంగానే ఉంటా -అంటూ ముగించారు ఉత్తమ నటి రూపాదేవి.

-సరయు శేఖర్, 9676247000