సబ్ ఫీచర్

పల్స్ పట్టిన కళాకారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ పల్స్ తెలిసిన వైద్యుడాయన. నాన్న అడుగులో అడుగేస్తున్నపుడే -ప్రజానాట్య మండలి ఎన్నో పాఠాలు నేర్పించింది ఆయనకు. నాన్న ఎంపిక చేసుకున్న బాల ఆర్టిస్టుగా తెరపైకి అడుగుపెట్టడంతోనే -సెనే్సషన్ క్రియేట్ చేసే కృషిని ఒడిసిపట్టుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే కావొచ్చు. చేసినవి అసలు లెక్కలోకే రాకపోవచ్చు. కానీ, ఆ తక్కువ నుంచి ఆయన నేర్చుకున్నది పది జీవితాలకు సరిపడేంత. ఆ పల్స్ పట్టిన కుర్రాడెవరో కాదు -రెడ్‌స్టార్ మాదాల రంగారావు కొడుకు రవి. ఈ వారం ముచ్చట్లకు వెనె్నల అతిథి.
మాదాల రంగారావు, పద్మావతి ముద్దుల కొడుకుగా ప్రకాశం జిల్లా మైనంపాడులో జన్మించాడు మాదాల రవి. తండ్రి ప్రారంభించిన నవతరం పిక్చర్స్ సంస్థ అనేకానేక విప్లవ భావాల చిత్రాల సమాహారాన్ని చిత్రసీమకు అందించింది. అందులో తొలిచిత్రం -యువతరం కదిలింది. తొలి సినిమాకే అవార్డులను మూటగట్టుకుంది. ఆ ఉత్సాహమే తరువాత -ఎర్రమల్లెలు చిత్రాన్ని రూపొందించేలా చేసింది. అప్పట్లో సినిమా మొదలుపెట్టగానే -పాటల రికార్డింగ్ మొదట పూర్తి చేసేవారు. ఆ పాటలని ఇంటికి తెచ్చుకుని వినడం మాదాల రంగారావు అలవాటు. అలాంటి పాటల్లో ఇప్పటికీ వినిపిస్తున్న పాట -నాంపల్లి టేసన్ కాడి రాజా లింగో/ రామా రాజ్యం తీరు చూడూ శివా శంభులింగ. పాట అద్భుతంగా వచ్చింది. దీన్ని ఎలా తెరకెక్కించాలోనని కళ్లు మూసుకుని ఆలోచిస్తున్నాడు మాదాల రంగారావు. ఆ ఆలోచనల నుంచి తేరుకుని -కళ్లు తెరిచేసరికి పక్కగదిలో అదే పాటకు డ్యాన్స్ చేస్తూ ఓ కుర్రాడు కనిపించాడు. ఆ పిల్లాడే -మాదాల రవి. వెంటనే ఆ పాత్రకు అతనే్న నిర్ణయించాడు నిర్మాణ సారథి రంగారావు. ధవళ సత్యం దర్శకత్వంలో ఎర్రమల్లెలు సినిమా రూపొందింది. అద్భుత విజయం సాధించింది. సినిమా సాధించిన విజయం ఒక ఎత్తయితే, నాంపల్లి టేసన్ కాడి.. పాటకొచ్చిన గుర్తింపు మరో ఎత్తు. ఆ పాటతో అప్పుడే గాయనిగా అడుగులేస్తున్న ఎస్పీ శైలజకు నంది అవార్డూ దక్కింది. పాటలో నటించిన మాదాల రవికి ఉత్తమ బాలనటుడు అవార్డునూ తెచ్చిపెట్టింది. ఒక్కసారి పాట గురించి చెప్పండి అన్నపుడు -ప్రజా నాట్యమండలి ప్రభు రాసిన ఆ పాటను ఒంగోలులో చిత్రీకరించారు. విశేషమేమిటంటే, ఒంగోలులో అనేక లొకేషన్స్‌లో షూట్ చేసినా, చిత్రీకరణ మాత్రం ఒక్కరోజులో పూర్తి చేశారు. ఉదయం ఎనిమిదిన్నరకు షూటింగ్ మొదలుపెడితే సాయంత్రం 3 గంటలకు పాట షూటింగ్ పూరె్తైంది. ఇప్పటికీ ఇదొక రికార్డుగా పరిశ్రమలో చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఓ పాట చిత్రీకరణకు మినిమమ్ రెండు మూడు రోజులు పడుతుంది. కానీ అంత తక్కువ టైంలో రూపుదిద్దుకున్న ఆ పాట రికార్డు చెక్కుచెదరలేదు. అదే ఇప్పటికీ ఆనందకరమైన విషయం’ అంటూ గుర్తు చేసుకున్నాడు మాదాల రవి. ‘ప్రజా నాట్యమండలిలో నాన్న యాక్టివ్ పార్ట్‌గా ఉండేవారు. ఆయనను కలిసేందుకు ఇంటికి వచ్చివెళ్లే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. బి గోపాల్, టి కృష్ణ, ధవళ సత్యం, నల్లూరి వెంకటేశ్వర్లులాంటి పెద్దవాళ్ల పరిచయం నాకు అక్కడే. ఎర్రమల్లెలు షూటింగ్ ఒంగోలులో జరుగుతున్నపుడు -షూటింగ్ చూడటానికి వచ్చిన సుత్తి వీరభద్రరావుకు సినిమాలో పాత్ర దొరికింది. అదే లాయరు పాత్ర. ఎర్రమల్లెలుతో పరిశ్రమకు అడుగు పెట్టినవాళ్లు అనేకమంది గొప్పవాళ్లయ్యారు. ట్రెండ్‌సెట్ ఫిల్మ్‌గా నిలిచి -తరువాత విప్లవ చిత్రాలకు ఒరవడి దిద్దిన సినిమా అది. దానికి సారథ్యం వహించింది మా నాన్న అని చెప్పుకుంటున్నపుడు -గుండెల్లో ఆనందం కుదురుండనివ్వదు’ అంటారు రవి.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రారంభం నుంచి ఇప్పటివరకూ వున్న ఉత్తమమైన 100 పాటలను ఎంపిక చేస్తే అందులో ఒకటిగా నాంపల్లి టేసను కాడి.. పాట ఉంటుంది.
రవి బాల్యమంతా చెన్నైలోనే గడిచింది. మైలాపూర్‌లోని కేసరి హయ్యర్ సెకండరీ హైస్కూల్‌లో చదివారు. నవతరం ఆఫీసు అక్కడ కళాకారులకు పుట్టిల్లుగా ఉండేది. తెరపైనే కాక, ఆఫీసులోనూ ప్రజా కళలు కళకళలాడేవి. చదువులోనూ ముందుండేవాడు రవి. అలా ప్రజానాట్య మండలిపై బాల్యం నుంచే అభిమానం పెంచుకోవడంతో -అక్కడికొచ్చే పెద్దల సాంగత్యంలో అనేక ప్రాపంచిక విషయాలను ఆకళింపు చేసుకునే అవకాశం వచ్చిందంటారు రవి.
ఎర్రమల్లెలు చిత్రం తరువాత ‘స్వరాజ్యం’ అనే చిత్రంలోనూ బాలనటుడిగా మరో పాత్ర చేశారు. చెన్నైలోనే అనేక మురికివాడల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఒకరకంగా స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాన్ని అప్పట్లోనే రూపొందించారని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను అంటారు రవి. అయితే కాలక్రమంలో సినిమాలకన్నా చదువు ముఖ్యమన్న అవగాహన వచ్చాక -మెడిసిన్ చేయడానికి రష్యా వెళ్లిపోయాను అంటున్నారు రవి. రష్యాలో జనరల్ ఫిజీషియన్ ఎండి, బిఎం, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో పట్ట్భద్రులయ్యారు. ‘రష్యాలో కమ్యూనిజం కూలిపోయిన తరువాత మాకు స్కాలర్‌షిప్‌లు రావడం కష్టమయ్యేది. అందుకోసం అప్పట్లోనే అక్కడ అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి రావడంతో కొత్త జీవితాన్ని చూసే అవకాశం దక్కింది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా బాధ్యతలు.. రెండూ నిర్వర్తించా’ అంటారాయన. ఫార్మాస్యూటికల్ రంగంలో కృషిచేస్తూ దాదాపు 120 దేశాల కళాకారుల మధ్య కల్చరల్ సెక్రటరీగా అనేక సాంస్కృతిక విధానాలను ఆకళింపు చేసుకున్న అనుభవం రవికి కలిగింది. రష్యా అంటేనే కమ్యూనిజం. మే డేకి రెపరెపలాడే ఎర్రజెండాలు దేశమంతా కన్పిస్తాయి. కానీ కమ్యూనిజం కూలిపోయిన వెంటనే ఎర్రజెండా కనిపించడానికి వీల్లేదని మే డేనాడు హుకుం జారీ చేసింది అప్పటి సర్కారు. కానీ కళాకారులుగావున్న విద్యార్థులంతా వీధుల్లోకొచ్చి ర్యాలీ నిర్వహించి మే డేను సెలబ్రేట్ చేశాం అంటారాయన. ‘ఆ కార్యక్రమం మొత్తం నా నాయకత్వంలో జరగడం మర్చిపోలేని ఘటన. రష్యాలో చేసిన ఈ పనికి నాన్న ననె్నంతో మెచ్చుకున్నారు’ అంటూ ముచ్చటైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రవి. తరువాత ఇండియావచ్చి విప్లవ చిత్రాలకు వారథిగా ఉండాలని తండ్రి అనుసరిస్తోన్న విప్లవ విధానాల్లో పాలుపంచుకోవాలని అనుకున్నాడు రవి. ఆ టైంలోనే నేను సైతం చిత్రంలో హీరోగా పరిచయమయ్యారు. ‘సినిమాలో వచ్చే ఆదాయాన్నంతా మళ్లీ సినిమా నిర్మించడానికే నాన్న ఖర్చు పెట్టేవారు. తనకంటూ ఒకింత దాచుకున్న ఘటన నాకు ఒక్కటీ తెలీదు. అలా, ఒక్కోసారి ఇంటి బాడుగలు కట్టడానికీ ఇబ్బంది పడిన సందర్భాలు నాకు అనేకం గుర్తున్నాయి. అందుకే మన విధానాలను మనం పాటిస్తూ, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెబుతుంటాను’ అంటున్నారు రవి. 2001లో డాక్టర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టి 2003లో చిత్రాన్ని ప్రారంభించారు. అదే ‘నేను సైతం’. అదే 2003లో విడుదలైంది. ‘మొదటి సినిమా విడుదలయ్యాక అర్థమైన విషయమేంటంటే, బేసిక్‌గా చిన్న సినిమాలకు చాలా ఇబ్బందులు ఉంటాయని. ముఖ్యంగా పర్సెంటేజీ విధానంలో ఒక ఇబ్బందివుంటే, ఇపుడు అనుసరిస్తోన్న రెంటల్ విధానంలో మరింత నష్టం కన్పించింది చిన్న సినిమాలకు. ప్రేమ కథానాయికగా ‘మా ఇలవేల్పు’ చిత్రంలో నటించారు. ఆ తరువాత బ్రోకర్-2లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ చిత్రంలో ఆయనపై చిత్రీకరించిన ‘నాకేంటి..’ పాటకు మంచి గుర్తింపొచ్చింది. ఆ పాట రాసిన చైతన్యప్రసాద్‌కు నంది అవార్డూ దక్కింది. పంచముఖి చిత్రంలో ఆర్యన్ రాజేష్, సుమన్, కృష్ణుడితో కలిసి నటించారు. దేశంలో సిపిఐ, సిపిఎం వేరువేరు పార్టీలుగా ఉండటం నాకు సుతరామూ ఇష్టం ఉండదు. ఆ రెండూ ఒకటి కావాలన్నది, దేశ ప్రజలకు ఉచిత వైద్యం అందాలన్నదే నాకున్న కోర్కెలు. ‘నా ఐడియాలజీలో వున్న రెండు కోరికలు ఎప్పటికి తీరతాయో’ అంటూ భవిష్యత్‌పై ఆశావహ దృక్పథం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసినట్టే అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, తద్వారా ప్రజావైద్యం ఉచితంగా సాగాలని, అలాగే విద్య కూడా ఉచితంగా అందాలని కోరుకుంటున్నా’ అంటున్నారు రవి. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాలూ సందర్శించి నివేదిక తయారు చేసుకున్నారాయన. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఈ ఏడాది నుంచి మాదాల మెమోరియల్ మూవీస్ పేరిట చిత్ర నిర్మాణం, బయటి చిత్రాల్లో చేస్తానని చెప్పారు. ‘సినిమా రంగానికి వచ్చి ఏదో సాధించానని నేనెప్పుడూ అనుకోను. లెజెండరీ ఫాదర్ కొడుకుగా, సక్రమంగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిపరంగా విజయం సాధించాను. కానీ రెండు విషయాల్లో నిరాశ తప్పడం లేదు. ఒకటి వామపక్షాల ఐక్యత, రెండు ప్రజలందరికీ ఉచిత వైద్యం.
నాకు భరత్, అమృత ఇద్దరు పిల్లలు. మా నాన్న ప్రారంభించిన సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నలుగురికీ మేలు చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నా’ అంటూ ముచ్చట్లు ముగించారు మాదాల రవి.

-సరయు శేఖర్, 9676247000