తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఉద్యమాల ఉపాధ్యాయుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్య లాల్‌జెండా నీలజెండాతో దోస్తీ చేస్తున్నది. రెంటి మేళవింపుతో కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు హెచ్చయ్యాయి. ఐతే లాల్‌జెండా వైపునుండి ఈ ప్రయత్నాలు ముమ్మరం కావడం విశేషం. ప్రజల కోసం పనిచేసే ఈ పార్టీలు ప్రజల మన్నన చూరగొనడంలో విఫలమయ్యాయా? ఎందుకు ఏ ఎన్నికల్లోనూ రాణించలేకపోతున్నాయి. ప్రజాభిమానం చూరగొనలేకపోతున్నాయి. ఆయా పార్టీల నాయకుల లోపమా లేదా పార్టీ ప్రజల చెంతకు వెళ్ళే మార్గంలో ప్రతిబంధకాలా? వీరి సైద్ధాంతికబలం పార్టీని ఎందుకు ముందుకు నడిపించలేకపోతున్నది. ఇదే పరిస్థితి విప్లవ పార్టీలు, గ్రూపులు కూడా ఎదుర్కొంటున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమిటో నలభై ఐదేళ్ళనుండి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ విషయం పట్ల కొంతమంది చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. వారిలో ‘ఉసా’ (ఉ.సాంబశివరావు)ఒకరు. అందుకే ఈసారి ఆయన ముచ్చట్లు.
ఏమాత్రం మారనివాళ్ళ గురించి మాట్లాడుకోవడం వృథా. మన శక్తి, వారి సమయం ఎందుకు పాడుచేయాలి? వారిని వాళ్ళ చట్రంలో అలాగే ఉంచక తప్పదు. ఐతే అలాంటి పార్టీలు, వ్యక్తులు కూడా సామాజిక మూలాల గురించి ఇపుడు మాట్లాడక తప్పడంలేదు. విచిత్రం ఏమంటే ఉసాలాంటివారైనా, నాలాంటివారైనా నాలుగు దశాబ్దాలుగా, మనం నిలిచిన ‘సమాజం’ పునాది, ఉపరితలాలు చాలా ముఖ్యం. వీటిని మార్చడానికి సైద్ధాంతిక బలంతోపాటు, ఆ సమాజం గురించి అధ్యయనం, సమస్యల అవగాహన లేకుండా ఎన్ని సిద్ధాంతాలున్నా ఫలితం సున్న అని గత డెబ్భై ఏళ్ళ అనుభవం దృష్ట్యాకూడా చెప్పవచ్చు.
ఎక్కడి ప్రజా రాజకీయ సిద్ధాంతాల వెలుగైనా ఈ నేల మీద ప్రసరించాలి. సిద్ధాంతం తన పని తాను చేసుకుంటూ పోలేదు. దాని నీడ కింద దానిని పండుకోబెట్టే శక్తులుంటాయి. ఆ శక్తులే ఈ దేశంలోని అగ్రవర్ణాలు.
సిద్ధాంతం ప్రజలలోకి ఇంకిపోవాలి. అపుడే దాని ప్రభావం పనిచేస్తుంది. ప్రజలలోకి చేరాలంటే నాయకులకి, నిర్మాణాలకి ప్రజల అసలు బాధలు, సమస్యల గురించి తెలియాలి. వారు పడని బాధని బాధగా, వారు ఎదుర్కోని సమస్యని సమస్యగా చూసేవారిని ఏమందాం. ప్రజల ముసుగులో ప్రజలని పక్కదారి పట్టించేవారిగానే చూడాలి. ఆ పని ప్రజలు చేసేశారు. అందుకే పార్టీలు, వ్యక్తులు పక్కన పడిపోయారు. ఒకరిద్దరు అగ్రవర్ణాల వామపక్షవాదులు తమ అస్తిత్వ పోరాటంలో భాగంగా ఒంటరిగా వ్యక్తులుగా నిలబడ్డారు. కాని వారి నిర్మాణాలు చప్పబడిపోయాయి. ప్రభావరహిత విగ్రహాలలాగా మిగిలిపోయారు.
అందుకు కారణం ఏమిటి?
వీరు తమ అగ్ర వర్గకుల స్వభావంతో ప్రజలతో మమేకం కాలేదు. కుల సమస్యని తమకి అనుకూలంగా పక్కన పడేశారు. తమ కులాధిపత్యాన్ని కార్యకర్తలపై చూపారు. అందుకే నాయకులు మిగిలారు. కార్యకర్తలు ఉడాయించారు. ప్రగతిశీల సామాజిక, సాహిత్య రంగాలలో కొట్టొచ్చే దృశ్యం ఇది. అందుకే తమకోసం కొంతమంది క్లోనింగ్ రచయితలను తయారుచేసుకోక తప్పలేదు. ఇప్పుడు అలనాటి ఔన్నత్యం నేల దిగక తప్పలేదు.
ఈ పరిస్థితిని, సమస్యలను ఉసా లాంటివారు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. ఐనా బేఖాతరు చేసిన అగ్ర కుల అహంకారం మొత్తం కష్టజీవులకు అన్యాయం చేసింది. వారి తరఫున నిలిచిన ఉసాలాంటి ఎందరో నాయకులను పక్కన పెట్టారు. సైద్ధాంతిక చర్చలకు రాలేదు. పైగా వీరు ప్రతిపాదించిన అంశాలను తమకు అనుకూలంగా విస్మరించారు. ఆ తరువాత అ దే బాటలో ఎంతోకొంత మార్పుతో స్వీకరించక త ప్పలేదు. కాని అప్పటికే వారు చేసిన ఆలస్యం ఘోరమైన నిర్వీర్య పరిస్థితికి దారితీసింది.
గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు గ్రామంలోని నిరక్షరాస్య కుటుంబంలో ఉసా పుట్టాడు. అక్కడే చదువుకున్నాడు. డిగ్రీ చదువుతుండగా విప్లవోద్యమంలోకి వెళ్లాడు. వైద్యునిగా గుర్తింపు ఉన్నా, తండ్రికి పెద్దలు ఊరి పెద్దలు గౌరవం ఇవ్వలేకపోవడం గమనించాడు. అన్నలు, బాబాయి తమ క్షురక వృత్తికాకుండా తంజావూరుకు వెళ్లి డోలు వాద్యం, సన్నాయిలో తర్ఫీదు పొంది కళాకారులుగా గుర్తింపు పొందారు. తనకే కాదు బాల్యంనుండి లక్షలాది మందిపై కులం అణచివేతని ప్రత్యక్షంగా చూశాడు. అమానవీయత, దోపిడీ, మనిషిగా చూడనితనం ఈ దేశంలో వర్ణవివక్ష కన్నా పెద్ద సమస్య అని జీవితం పాఠం చేసి నేర్పింది. మనిషిగా గౌరవం పొందలేకపోతే విప్లవం కూడా చేయలేదని అర్థంచేసుకున్నాడు. ఈ వివక్షని ఎదుర్కోవడంకోసం మొదట హేతువాదిగా, నాస్తికుడిగా, నవ్య మానవతావాదిగా అనేక ఆలోచనల రాపిడులకి గురయ్యాడు. చాలా ముందే కుల ఆధిపత్యంపై ‘సామాజిక సైతాన్’ కవిత రాసి ఆడిపాడాడు. కులం భూస్వామ్య వ్యవస్థలో భాగం. అందుకే సరైన దారిలో దానిమీద పోరాడుదాం రమ్మన్నాడు. నిజమే కామోసు అనుకుని బడిని, ఇంటిని వదిలివెళ్ళాడు. కాని చివరకు తెలిసిందేమిటంటే తప్పుదారి పట్టానని!
కుల పోరాటం నుండి వర్గపోరు జరగాలని భావించాడు. రాజకీయ హింస ఒక్కటే కాదు, కుల హింసకి గురయ్యేవారిని కూడా పట్టించుకోవాలని తపించాడు. కులంవల్ల హింసించేవాడు, హింసింపబడేవాడు ఇద్దరూ అమానవులుగా మారే ప్రమాదం ఉంది. ఈ దేశంలో కుల పీడన తగ్గిపోయే క్రమంలోనే విప్లవం సాధ్యం అవుతుందని ప్రగాఢంగా విశ్వసించాడు. అందుకే ఆర్థిక సామాజిక హింసల సరసన కులపీడనని చేర్చాలని తపించాడు. ఫలితంగా తాను పనిచేసే విప్లవ నిర్మాణానికి తన ఆలోచనల డాక్యుమెంట్ ఇచ్చాడు. అగ్రకుల అహంభావం దానిని చదవకుండానే నిరాకరించింది. చదివి కూడా చర్చించలేదు. ఫలితంగా అపవాదులతో బయటపడ్డాడు.
బాల్యంలో తల్లితోపాటు కూలికి వెళ్లినపుడు అనుభవించినది పేదరికం ఒక్కటే కాదు- కులం పేరుతో దూషణ, అగౌరవం. శ్రమజీవులందరి ప్రత్యక్ష అనుభవం అది. నాలుగు రోజులు పస్తులుండవచ్చునేమో గాని, భూమిలేకపోయినా గౌరవంగా కూలి పనిచేసి బతుకవచ్చునేమోగాని కులం వల్ల ఈసడింపు, తిరస్కారం భరించలేనిది. ఆ పేరుతో సదా ఆత్మన్యూనతకి గురికావడం, ఆ వర్గాలవారికి భరించలేని బాధ. రేపు తన కొడుకులు, కూతుళ్ళు ఇదే పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది అనే ఆలోచన భరించలేనిది. ఇంతటి అవమానకర జీవిత సమస్యని వామపక్షాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ముప్ఫై ఐదేళ్ళు ఉసా ప్రశ్నిస్తూనే వున్నా డు. అతని ప్రశ్నల పరంపర వామపక్షీయ అగ్రకులాన్ని అతలాకుతలం చే సింది. కారంచేడు ఘటనలో ‘బలహీనవర్గాల సమాఖ్య’ కూడా ఏమీచేయలేకపోయింది. ఆత్మగౌరవం కోసం దళితులు పోరాడారు. కారంచేడు ఓ ముఖ్య బాధ్యుడి పేరు కేసులో లేదు. మరి న్యాయం ఎలా జరుగుతుంది? ఇది కుల ఆత్మగౌరవ పోరాటం.
‘జనసాహితి’ సంస్థలో సభ్యునిగా ‘మేం పాడతాం’వంటి ఎన్నో రచనలు చేశాడు. ‘ఓ లాలి, పాడాలి, ఈ జోలపాటలో ఆపాలి, నీ గోల, పాపాయి’ వంటి పాటలు ఉసాని కవిగా నిలబెట్టాయి. పార్టీ చేబట్టిన ‘కొండ మొదలు’ పోరాటంలో ఉండి, దానిని ‘ఎర్రపూలు’ నృత్యరూపకంలో కళ్ళకు కట్టించాడు. ఆ తరువాత దళిత అస్తిత్వ ఉద్యమానికి తన వంతు చేయూత అందించాడు. అంటరానివాళ్ళ సమస్య మొదట అంతరించాలనే ఆశయం ఆయనిది.
కుల నిర్మూలన ఎజెండాని పక్కపెట్టి ఎర్రజెండా ముందుకు తీసుకుపోవడం ఈ దేశంలో సాధ్యంకాదని ఎలుగెత్తిచాటాడు. వ్యాసాలు రాశాడు. వందలాది వేదికలపై నుండి ప్రసంగించాడు. కుల చర్చవల్ల వర్గ ఐక్యతకి దెబ్బ తగులుతుంది అని ఒకే కుల వర్గ సామాజికులు కలిసికట్టుగా వాపోయారు. కాని కోట్లాది మంది ఆ సమస్య బాధితులని తమతో ఎలా నడిపించగలమో ఆలోచించలేదు. వీరి దృక్పధం వల్ల మాత్రమే దశాబ్దాలపాటు విప్లవోద్యమం వెనుకంజ వేయక తప్పలేదు. ఆ రకంగా భారతదేశంలో పోరాటాన్ని ఖూనీ చేశారని అంటాడు ఉసా.
అందుకే ‘నూతన ప్రజాస్వామిక విప్లవ వేదిక’ని 1988లో ఏర్పాటుచేశాడు. ‘కుల నిర్మూలన, మార్క్సిస్టు దృక్పథం’ పుస్తకం తయారీలో భాగం పంచుకున్నాడు. ‘కుల ఎజెండాని పక్కనపెట్టి ఎర్రజెండాని ముందుకు తీసుకుపోగలరా’ పుస్తకం కూడా ప్రచురించాడు.
వామపక్షాలు రాజారామ్మోహనరాయ్, గురజాడ, వీరేశలింగం వంటి సంస్కర్తలను మోశాయి. జాషువాను ఏ వామపక్ష సాహిత్య సంస్థ కూడా గౌరవించలేదు. కారణం అంతా అగ్రవర్ణాలవారే కావడంవల్ల కమ్యూనిజం కూడా తాలుగింజైంది అంటాడు. కుల బానిసత్వం, దోపిడీ రూపుమాపే సిద్ధాంతం, ఆచరణ విధానం ఇంకా పూర్తిగా అంగీకరించని మనస్తత్వంతో కుళ్లిపోతున్నదంటాడు. వీరు ఫూలే, అంబేద్కర్ రచనలు చదివి మెచ్చుకోరు, విమర్శించరు. వీరిని భారతీయ సామాజిక విప్లవకారులుగా గుర్తించకపోవడం తప్పు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. ఈ పక్షపాత ధోరణివల్ల సామాజిక సమగ్రతకోణం విస్మరించినట్లయ్యింది.
మార్క్సిజాన్ని కులదోపిడీకి అన్వయించలేకపోవడం విప్లవ వామపక్షాల వైఫల్యం. తమ వైఫల్యాన్ని శివసాగర్ వంటి అనేకమందిని తొలగించి కప్పిపుచ్చుకోవడం జరిగింది. ఆయన మా పుస్తకాలు డాక్యుమెంట్లు చదివి కలిసి పనిచేయడానికి అంగీకరించాడు. ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్ సెంటర్’ ఏర్పాటుచేసి ‘ఎదురీత’ పత్రిక నడిపాం. అపుడే ‘పాత పాట సాక్షిగా కొత్తపాట’ పుస్తకం వేశాను. లోతైన సామాజిక స్పృహలేని రాజకీయ సైద్ధాంతికత నిరుపయోగం అని నమ్మాను. ఆ తరువాత దళిత రచయితలు కవుల మేధావుల వేదికతో కూడా పనిచేశానని అంటాడు. దళిత సాహిత్యం, విప్లవ సాహిత్యం కాదు అని విప్లవ రచయితలు అన్నారు. ఐతే విప్లవ సాహిత్యం దళిత ప్రజలకి దూరమైన సాహిత్యం అని అనక తప్పదు అని చెప్పాడు. ఆదర్శ విప్లవ పోరాటం చేసేవారు అగ్రవర్ణాలవారు. తమ జీవిత మార్పుకోసం పోరాడేవారు కష్టజీవులు. ఈ కష్టజీవి నాయకత్వంలోనే ఎప్పటికైనా ఉద్యమం విజయవంతం అవుతుందంటాడు. ఆ తరువాత మారోజు వీరన్నతో కలసి వర్గ కుల జమిలి పోరాటంలో తనదైన పాత్ర వహించాడు.
తెలంగాణ ఉద్యమకాలంలో ఆంధ్రలో ‘సామాజిక జైఆంధ్ర మహాసభ’ ఏర్పాటుచేశాడు. తెలంగాణకోసం ప్రజలను సమీకరించాడు. ఇక్కడ తెలంగాణ మహాసభ ఏర్పాటుచేసి ప్రజల మద్దతు కూడగట్టాడు. కొండా లక్ష్మణ్ బాపూజీతో కలిసి ‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాల తోడ్పాటు’ నినాదంతో పనిచేశాడు.
ప్రస్తుతం- వీరన్న విగ్రహ పరిరక్షణ కమిటీ, బహుజన ప్రతిఘటన వేదిక ఏది ఏర్పాటుచేసినా ప్రజలలో ఒకడిగా ఆలోచిస్తూ వారికోసం నిలబడడం అతని మొక్కవోని తనానికి నిదర్శనం.
ఉద్యమాలకి ఆలోచనల అండ, సైద్ధాంతిక మార్గదర్శనం, నిర్మాణంలో తోడ్పాటుగా ఉండి తన స్థానాన్ని ఉసా నిలుపుకున్నాడు. ఆయన ఇచ్చిన సామాజిక అవగాహనని ఎంతవరకు తీసుకున్నారని కాదు. ఆ దిశగా ఆలోచించక తప్పని పరిస్థితి తెచ్చాడు. అది ముఖ్యం. అక్కడే ఉసా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. నిలకడగా, స్థైర్యంగా సామాజిక రాజకీయ విప్లవంకోసం నిలబడిన అతి కొద్దిమందిలో ముందువరుసలో ఉన్నాడు. బిఎస్‌పి పార్టీ కేవలం కులానికే పరిమితం కావడం సరికాదు. వర్గాన్ని గుర్తించకపోతే ధనిక వర్గంతో రాజీపడే అవకాశం ఉందని ముందే చెప్పాడు. కుల వర్గ వాదాలు కుదింపునకి గురికావడమే వైఫల్యానికి కారణం. అందుకే రెండింటిని రాపిడి చేసి ఒక శక్తి పుట్టించాలని భావిస్తాడు. అలా ఒంటరిగా, పదిమందితో కలిసి చేస్తున్న ప్రయాణంలో నిరంతర యాత్రికుడు! ప్రజల ఆత్మీయ మిత్రుడు!
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242