తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అతడొక నిరుపమానుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్లపల్లి రామారావు (1917-2001) రచనల కన్నా ఆయన జీవితం చాలా గొప్పది. ఆయన గొప్ప మానవతావాది, ఇతరుల కష్టాలను చూసి కన్నీ టి పర్యంతం అవుతాడు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినా ఇసుమంత గర్వం లేదు. నిరాడంబరుడు. ఏ రకమైన ప్రలోభాలకు లోనుకాలేదు. రచనల ద్వారా కీర్తిప్రతిష్టలు వచ్చినా వాటిని అటు పక్కగా పెట్టి, తాను తనలాగే జీవించాడు. అతనొక గొప్ప కథకుడు. లభించినవి పదహారు కథలే అయినా ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. ఆనాటి సామాజిక రాజకీయ ఫ్యూడల్ వ్యవస్థని తన రచనలలో కళ్ళకు కట్టినట్లు చూపాడు. ఆంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 1945లో అచ్చువేసిన ‘జైలు’ ఎనిమిది కథల సంకలనం ఒక సంచలనం. అచ్చయినవి ఐదు పుస్తకాలే. అచ్చుకు పంపని అముద్రిత సాహిత్యం ఎంతో ఉంది. చుక్కలు, మెరుపులు, ఆత్మవేదన, అక్షరదీప్తి వంటి అచ్చయిన కవితా సంకలనాలలో పొట్లపల్లి వారి భావుకత తెలుగు కవిత్వానికి కొత్త వొరవడి అందించింది. అభ్యుదయ కవిత్వం నుండి సామాజిక భావాలను, కాల్పనిక కవిత్వంలోంచి లోతైన భావుకతని గ్రహించి తనదైన విలక్షణ శైలిని ఏర్పరచుకున్నాడు. ఒకవైపు గేయం, మరోవైపు వచన కవితారూపం అతని కవిత్వ ప్రతిభకు అద్దం పడతాయి. ‘ఎవడు ఇక్కడ రైతు/ ఎవడు ఇక్కడ రాజు/ కష్టించు వాడొకడు/ కాజేయు వాడొకడు’ అనే కవిత తెలుగు గేయ కవిత్వంలో తలమానికమైనది. కాళోజి, పి.వి.నరసింహారావు వంటివారు పొట్లపల్లి కవిత్వానికి పెద్ద అభిమానులు.
చుక్కలు, మెరుపులు, ఆత్మవేదన, అక్షరదీప్తి కవితా సంకలనాలలోని కవితలు కవిత్వ రూపానికి, వస్తువుకి సరికొత్త కవిత్వ హంగులు. ఇంత గొప్పగా, ఇంత సులభశైలిలో, గాఢంగా మనసుకు హత్తుకునే రీతిలో కవిత్వం ఉంటుందా? అనిపించే శైలి అతనిది. పొట్లపల్లి నిరాడంబర స్వభావం వలెనే అతని రచనలు సాదాసీదాగా ఉంటాయి. కాని తనదైన గొప్ప ముద్రవేసి, పాఠకుడిని అత్యంత ప్రభావితం చేస్తాయి. పొట్లపల్లి చివరి కాలంలో ఉరుదూ భాషలో అనేక కవితలు రాశాడు. ఐతే వాటిని పుస్తకంగా తీసుకురావాలని ఆయన ఏనాడూ ఆశించలేదు.
కథలతోపాటు అనేక గల్పికలు రాశాడు. ‘జైలు డైరీ’ రాశాడు. ఉరుదూలోంచి పిల్లల కోసం ‘ముల్లా కథలు’ అనువదించాడు. అవి అనువాద రచనలు అని ఏకోశాన అనుపించవు. సర్‌బరాహి, పగ, పాదధూళి, న్యాయం వంటి నాటికలలో 1940ల నాటి పరిస్థితిని కళ్ళకు కట్టాడు. భిన్నమైన పాత్రలు, చక్కని తెలంగాణ జానుతెనుగు, నుడికారాలు, మాండలిక పదాలతో రాసిన నాటకాలు సజీవ జీవన దృశ్యాలు. ‘నీలవేణి’ అనే అసంపూర్తి నవల ఆయన గ్రామీణ అనుభవాలకి తార్కాణంగా నిలుస్తుంది.
పొట్లపల్లి వంటి రచయిత మరొకరిని తెలుగు సాహిత్యంలో ఉదహరించలేం. సాహిత్య విలువలు సమాజ విలువలలో ఒక భాగం. ఈ విలువలని పెంచినవారిలో వీరొకరు. పొట్లపల్లి జీవితం- రచనల మధ్య పాటించిన విలువలు గొప్పవి. చాలామంది రచయితల జీవితం వేరు, రచనల సారం వేరు. వీటి మధ్య సయోధ్య లేని ప్రయాణం పాఠకులకి రోత పుట్టిస్తుంది. రచయితకి సమాజంలో కులం, మతం, ప్రాంతం, ప్రాపంచిక దృక్పథం, వృత్తి, ప్రవృత్తి వంటివి అనివార్యం. వీటి అన్నింట్లో తాను వ్యక్తం చేసిన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక విలువలు అతని వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ఈ విషయంలో పొట్లపల్లిని గిట్టనివారు కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే అతను జీవించిన తీరు, రచించిన రచనల శైలి అంతా ఒకటే. ఎలాంటి అంతరం లేదు. వాటి మధ్య హాయి గొలిపే ఐక్యత ఉంది.
చాలామంది వీరోచితం గా రాస్తారు. అంతిమంగా భీరువుల్లా మారిపోతారు. కొంతమంది బిక్కుబిక్కుమంటూ రాయడానికి మాత్రం వీరోచితంగా రాస్తారు. పరీక్షకి నిలబడేనాటికి కంపరమెత్తి అటు ఇటు కాకుండా పోతారు. అందుకే రచయితలను పాఠకులే కాదు, ప్రజలు కూడా విశ్వసించలేని పరిస్థితి దాపురిస్తుంటుంది. రాజకీయ సైద్ధాంతిక అనుబంధ, నిబద్ధతలను గమనించవలసిన రచయితలు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ద్వైదీభావన, ద్వంద్వ ప్రమాణాలు లేనివాడు. ఆచరణకి తగిన రచనలే చేశాడు. కాబట్టే ఆళ్వారుస్వామి, కాళోజి వంటివారు అతడిని అమితంగా ఇష్టపడ్డారు. కొందరు భౌతికంగా ‘కవి’ని ఇష్టపడతారు. మరికొందరు లోని ‘వ్యక్తి’ని ఇష్టపడతారు. ఇద్దరినీ కలిపి ఒకేలా ఇష్టపడడం అరుదు. ఒకే భావజాలం కలిగిన, రచయితలను, సమకాలికులని ఇష్టపడడం చాలా తక్కువ. కాని పొట్లపల్లిని అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే- రాసిన దాన్ని నమ్మి రాశాడు. రాయడానికి ప్రేరణ సమా జం నుండి గ్రహించాడు. ఏ ప్రగతిశీల రాజకీయ సంస్థలో లేకున్నా, ఉండీ లేనట్లుండే రచయితలలా కాకుండా, వారికన్నా ఎ క్కువ సైద్ధాంతికంగా, సామాజిక పరంగా, శక్తిమంతంగా రాశాడు. రాయని కాలాలలో గడిపిన జీవితంలో రాజీలేనితనం ప్రదర్శించాడు.
తన సామాజిక స్థాయిని ఉపయోగించుకుని, తనకి గల పేరుప్రఖ్యాతులను ఆధారం చేసుకుని పురస్కారాలు పొందగలిగి కూడా వాటికి దూరంగా ఉన్నాడు. తన పుస్తకాల ప్రచురణ కోసం తహతహలాడలేదు. వాటి ఆవిష్కరణల కోసం ఆలోచనే చేయలేదు. అవి తన పుస్తకాలేనా? అన్నంత దూరంగా ఉన్నాడు. రచనలని సాహిత్యకళగా భావించాడు. కాబట్టే అక్షరాలని అంతటి శక్తితో కేంద్రీకృతం చేయగలిగాడు. సాహిత్యకారులతో కులం వారిగా, సైద్ధాంతికత పేరుతో, ప్రాంతం అభిమానంతో చుట్టూ ఒక మందని తయారుచేసుకోవాలని ఏనాడూ అనుకోలేదు.
ప్రభుత్వ సంస్థలని తన దరిదాపులోకి చేరనివ్వలేదు. పైగా ఈసడించాడు. శ్రీశ్రీ చేసినట్లు ‘రాజ్యం’ ఇచ్చే డబ్బుకి ఆశపడితే అది దిగజారుడుకే దారి తీస్తుందని బలంగా విశ్వసించాడు. సామాజిక, రాజకీయ రంగాలకి చెందిన రచయితలు మాత్రం తప్పకుండా దాని ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఆశించాడు. దానిని ఆచరించాడు. ‘రాజ్యం’తో, దాని ‘నిర్మాణా’లతో సమస్యలు తలెత్తి సాహిత్య విలువలు తరిగిపోయే అవకాశాలు ఉన్నాయని తన రచనలలో భావించాడు. రచయిత వేరు. రసస్రష్ట అయిన రచయిత వేరు. మనకి రచయితలు బోలెడు. రసస్రష్టలు త క్కువ. ‘స్రష్ట’అనే పదాన్ని రచయితకి అన్వయించడంలోనే పొట్లపల్లి విలువల తపన వేరుగా కనుపిస్తుంది. విప్లవ కవులు, ప్రతిఘటన కవులు, యోగులు, తత్వకవులు, కొందరు భక్తికవులు రాజుని, రాజ్యాన్ని లెక్కచేయలేదు. వీరు రా జ్యయంత్రానికి వెలుపల ఉంటారు. దాని పరిధిలో ఉండే ఆస్థానకవులు వేరే. అలాగే సాధారణ కవులు, రచయితలు వేరే. శ్రీశ్రీ, సినారె, ఆరుద్ర వంటివారు కవులు. కాని స్రష్టలు కాదు. వీరు తాయిలాలకు ఆశపడే లౌకిక కవులు. పైగా ఆశపడనట్లుగా నటిస్తారు. వీరు ఆ ఆకర్షణ వలయంలో పరిభ్రమిస్తుంటారు. వీరిది ద్వంద్వ వైఖరి. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు మాత్రమే కవికీ, స్రష్టకి తేడా తెలుస్తుంది. పురస్కారాలు, శాలువాలు, గుర్తింపులు- వీటికోసం పడే తపన పట్ల ఆయనకి ఏమాత్రం ఇష్టంలేదు. అట్లని వేరేవాళ్లు తీసుకుంటే తనకు అభ్యంతరం ఉండదు. అసలు అటువైపు దృష్టిసారించడు. కాని వాటి పట్ల తిరస్కారంగా ఉన్న స్రష్టలు వాటికి లొంగిపోతే సమాజంలో విలువలు పతనం చెందుతాయని ఆవేదనకి లోనయ్యాడు. సరిగ్గా అదే పని చేశాడు పొట్లపల్లి.
కాళోజి ‘పద్మవిభూషణ్’ తీసుకున్నప్పుడు పొట్లపల్లి తన ఆత్మీయునికి అత్యున్నత పురస్కారం వచ్చిందని శుభాకాంక్షలు తెలపలేదు. అట్లని నిశ్శబ్దంగా ఉండిపోలేదు. ‘ప్రశ్న’ ఇచ్చేవాడు ఎందుకిచ్చాడని కాదు; ప్రశ్న/ తీసుకునేవాడు ఎందుకు తీసుకున్నాడు అనీ.’’ అని ఉరుదూలో కవిత రాశాడు. దీనికి కాళోజి జవాబు ఏం చెప్పాడో తెలియదు. కాని ఈ ప్రశ్న మొత్తం సాహిత్య ప్రపంచానికి వేసిన ప్రశ్న. తనకు పరిచయం ఉన్న వ్యక్తి పైగా అత్యంత ఆత్మీయుడు. పేరుప్రఖ్యాతులు ఉన్నా ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఉరుదూ కవితలో ప్రశ్నించాడు. తమకు పరిచయం గల లేదా తమ సంస్థలలో పనిచేస్తున్నవారు తాయిలాలకోసం ఎగబడి తీసుకుంటుంటే కొందరు ప్రగతిశీల పెద్దలు చూస్తూ ఊరుకుంటున్నారు. తీసుకున్నాక పోనీలే అనో, మొక్కుబడిగా సంస్థ ద్వారా కనుపించీ కనబడని ఖండనో ఇవ్వడం ఆనవాయితీ. కాని పొట్లపల్లి కాళోజిని ‘నీవు పురస్కారాన్ని తిరస్కరించే పని’ అని స్పష్టం చేశాడు. కవిత్వం రాసి కుండబద్దలు కొట్టాడు. కాళోజికి ఆ గుర్తింపువల్ల ఒరిగిందేమిటో తెలీదు. కాని పొట్లపల్లి వ్యక్తిత్వం మాత్రం ఎన్నోరెట్లు పెరిగింది. పొట్లపల్లికి సాహిత్యలోకం ఈ విషయంలో నీరాజనం ఇవ్వలేదు. కాని అతను రేకెత్తిన ప్రశ్న, సహచర రచయితలు పాటించలేదని మాత్రం చెప్పవచ్చు. ఇవ్వాళ పొట్లపల్లి లాంటి నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తులు లేకపోడవం బాధాకరం.
1967లోనే ఆంగ్ల పత్రికలలో నక్సల్‌బరిలో జరుగుతున్న పరిణామాల్ని పత్రికల ద్వారా పరిశీలించిన పొట్లపల్లి తన అక్షరదీప్తి (1993) సంకలనంలో ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా విమర్శనాత్మకంగా రాసిన కవితలోని కొన్ని చరణాలు చూద్దాం-
‘తుపాకీ గొట్టంలో నుండి అధికారం ఉద్భవిస్తుంది
అనే ఆలోచన ఎవరి తలనుంచి ఉద్భవించిందో కాని,
అది కంటబడ్డ ప్రతివాడి తల తిరగడం
ఆరంభిస్తుంది..’’
.....
తుపాకీ గొట్టంలో ఆవేశం పాలు తప్ప ఆలోచనా
భాగం శూన్యంగా కనిపిస్తుంది.
తుపాకీ గొట్టంతోపాటు దేశ కాల పరిస్థితులు, దాని
విప్లవ పరిపక్వత, దానికోసరం కావలసిన సుదీర్ఘమైన
ఎదురుచూపు, రక్తప్రవాహంలో ఎదురీత,
అపజయాలను విజయాలుగా మార్చే దక్షత...
.....
తుపాకీ వాడి చేతిలో ఉంటుందో,
తుపాకీ చేతిలో వాడుంటాడో తెలియదు...
ఈ కవితని విశే్లషిస్తూ- ‘‘తుపాకీ గొట్టం ద్వారా అధికారం సిద్ధించడమనే’ది ఒకానొక రాజకీయ అవగాహనగా చెప్పుకుంటారు విప్లవకారులు. రామారావు చెప్పిన ఈ కవితలో ఏమాత్రం సంకోచం లేకుండా దేశ పరిస్థితులు, దాని విప్లవ పరిపక్వత, దానికై సుదీర్ఘ ఎదురుచూపు, రక్తపాతం, జయాపజయాలు, మృత్యువు.. వీటి గురించి విప్పిచెప్పకుండా, విప్లవకారులు తుపాకి మరొకరికి అందించడం ఏమాత్రం సమంజసం కాదన్న అభిప్రాయం కనిపిస్తుంది. ఆవేశం ఉన్నవాడికల్లా తుపాకీ చేతికిస్తే అది పిచ్చోడి చేతిలో రాయిలాగే ఉంటుంది కానీ, ప్రయోజనం వుండదని పొట్లపల్లి భావించినట్లు కనుపిస్తుంది.’’ (పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం- సాహిత్యం, భూపాల్, 2012 పేజీ 104) అని రాశాడు.
ఇలా పొట్లపల్లి ఎలాంటి శషబిషలు లేకుండా జీవితం, అధ్యయనం, అనుభవంలోంచి ఇలాంటి విషయాలను కరాఖండిగా చెప్పాడు. అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. ఉన్నతమైన వ్యక్తిత్వం మాత్రమే సరిపోదు. అందుకు తత్వవేత్తకున్న ‘విజన్’కావాలి. ఈ కవితని భూపాల్ తన సిద్ధాంత వ్యాసంలో మొత్తంగా ఉటంకించి పాఠకులను ఆలోచించేలా చేశాడు.
అహంకారాలు, ఆశలు, ఆధిపత్య, అధికారాలతో నిర్మించుకున్నవి ఏవైనా అవి కూలిపోక తప్పవని పొట్లపల్లి భావన. ఆనాడైనా ఈనాడైనా ఇతరుల మీద తానే అధికుడనని చెలాయించే తత్వం సరికాదని హితవు పలికాడు. ఎలాంటి పక్షపాతం లేకుండా పాఠకులతో సంభాషించే శైలి పొట్లపల్లివారిది. అతని అనుభవజ్ఞానం నుండి మా త్రమే చెప్పిన విషయాలు పాఠకుల, ప్రజల స్థాయిని ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది. సాహిత్యానికి అంతకంటే మించిన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అలాంటి కవి, రచయితలలో చెప్పుకోదగిన వాడి గురించి ‘‘నిరుపమాన రచయిత’’ గ్రంథాన్ని అందిస్తున్న ‘‘పొట్లపల్లి వరప్రసాదరావు ఫౌండేషన్’’ వారికి నా అభినందనలు.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242