ఉన్నమాట

కరెన్సీ కష్టాలు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్రమోదిగారి సలహాదారులలో ప్రచ్ఛన్న శత్రువులెవరో ఉన్నారు. ఆయన ప్రతిష్ఠను దిగజార్చటానికే వారు కంకణం కట్టుకున్నట్టున్నారు.
సర్జికల్ దాడితో పాపిష్టి పాకిస్తాన్‌కి దిమ్మతిరిగేట్టు చేశాక మోదీని బహిరంగంగా ఒక వంకరమాట అనడానికే విరోధులు జంకేవాళ్లు. అవకాశం కోసం కాచుకుకూచున్న కాంగ్రెసు మైనరు, క్రేజీవాల్ వగైరాలకు పదిరోజుల కింద పెద్దనోట్ల రద్దు తరవాత ప్రాణం లేచొచ్చింది. కూచుంటే లేవలేనివాడు, ఆర్థిక శాస్త్రం ఓనమాలు తెలియనివాడు కూడా ఇప్పుడు మోదిని తప్పు పట్టేవాళ్లే.
సరిగ్గా గురిపెట్టి సవ్యంగా ప్రయోగించి ఉంటే నల్ల డబ్బుపై సర్జికల్ దాడికూడా ఆక్రమిత కాశ్మీర్‌లో మెరపు దాడిలాగే సూపర్‌హిట్ అయ్యేదే. ప్రజల్లో దీనికంటే ఎక్కువ పేరు దానివల్ల మోదీకి వచ్చేదే. సరైన హోమ్‌వర్కు లేకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడనిరీతిలో ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించకుండా, పర్యవసానాలను కానకుండా కీలక సంస్కరణకు ఉపక్రమించటంతో అనవసరపు సమస్యలు చుట్టుముట్టాయి.
అలాగని - పెద్దనోట్ల రద్దు అస్త్రం విఫలమైందనీ చెప్పలేము. దేశ అభివృద్ధికి శాపమైన, సర్వానర్థాలకూ మూలమైన నల్లడబ్బు రాశుల గురించి ప్రతివాడూ మాట్లాడినవాడే తప్ప వాటిని రూపుమాపేందుకు గట్టిపట్టు పట్టిన పాలకుడు ఇప్పటిదాకా లేడు. అధికార సౌధమే అవినీతి పునాది మీద ఆధారపడింది కనుక... అపమార్గాల్లో నిధులు రాబట్టటంలో అన్ని పార్టీలనీ అందెవేసిన చేతులే కాబట్టి, ఉన్న సౌలభ్యాలకు చేజేతులా చేటు తెచ్చుకోవడానికి బతకనేర్చిన ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. ఇంతకాలానికి ఒక ప్రధానమంత్రి బ్లాక్‌మనీ పెనుభూతం మీద ధైర్యంగా, దృఢంగా కత్తి దూయటమే గొప్ప. నల్ల డబ్బును వెలికి తీయిస్తానని ఎన్నికల్లో చేసిన బాసను గాలిమాటగా వదిలెయ్యకుండా, పట్టుదలతో ముందడుగు వేసినందుకు నరేంద్రమోది నిస్సందేహంగా అభినందనీయుడు.
బ్లాక్ ఎకానమీ విస్తృతితో పోల్చితే బ్లాక్‌మనీ పరిమాణం తక్కువే. అడ్డదారిలో అడ్డగోలుగా ఆర్జించిన దానిలో హెచ్చు భాగాన్ని బినామీ ఆస్తుల కింద, బంగారం కింద మార్చుకోవడమో, విదేశీకరెన్సీలోకి మార్చుకుని ఏ స్విస్ బ్యాంకులోనో రహస్యంగా దాచుకోవడమో రివాజు. అవసరాల నిమిత్తం కొద్ది మొత్తాన్ని మాత్రమే నగదు రూపంలో నిలవ చేయటం పరిపాటి. కాని ఆ ‘కొద్ది’ పరిమాణమే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. లెక్కల్లోకి ఎక్కకుండా, ఏ పన్నుకూ అందకుండా, ఆర్థిక వ్యవస్థకూ సమాజానికీ ఏ విధంగానూ ఉపయోగపడకుండా అది అవాంఛనీయ, విధ్వంసక, విద్రోహకర కార్యాల వంటి వాటికి దుర్వినియోగమవుతూంటుంది. కాంట్రాక్టులు కొట్టెయ్యటానికి, అడ్డమైన పనులు చేయించుకోవటానికి లంచాలు పెట్టేదీ మాఫియాలను మేపేదీ, ఓట్లు కొట్టేసేదీ, ఓటర్లకు మందు పోయించేదీ, కోర్టు తీర్పులు కొనుక్కునేదీ ఈ డబ్బుతోటే! కోట్లు ఖర్చుపెట్టి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవాడు, వందలకోట్లు వెచ్చించి సింహాసనం పొందినవాడు పెట్టుబడికి నూరింతలో వెయ్యింతలో వెనకెయ్యడానికి వెనుకాడడు. వేరే రూపాల్లోకి మార్చుకుని పోగా మిగిలిన పెద్ద నోట్ల కట్టలను ఎవరైనా రహస్య అరల్లోనే దాచుకుంటారు.
అదిగో. ఆ కట్టలపాముల మీదికే మోదీ ఇప్పుడు నాగాస్త్రం ప్రయోగించాడు. తగలవలసిన వాళ్లకు తగలవలసిన చోట దెబ్బ పడింది కాబట్టే ఎక్కడెక్కడి అవినీతి చక్రవర్తులూ గంగవెర్రులెత్తి గగ్గోలు పెడుతున్నారు. లక్షల్లోనో, ఒకటో రెండో కోట్లలోనో బ్లాక్‌మనీ ఉన్నవాడు ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడువులోగా నానా గడ్డీకరించి, దానిని కొత్త కరెన్సీ కింద మార్చుకొనగలడు కాని వందల, వేలకోట్లలో డబ్బు మూలుగుతున్నవాడు అంతలేసి మొత్తాలను ఎలా కాపాడుకొనగలడు? అందునా- కరెన్సీ సరఫరాను ప్రభుత్వం వ్యూహాత్మకంగా బిగదీసిన సమయంలో భారీ మార్పిడి కుదరనప్పుడు చెల్లని నోట్ల కట్టలతో బోగిమంటలు వేసుకోవటం కాక ఏమి చేయగలడు? నల్లడబ్బు పీడ ఏ మేరకు విరగడ అయితే ఆ మేరకు మోదీ విజయవంతమైనట్టే.
వెనకాముందు చూసి తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రజలు కూడా అవినీతి తిమింగలాల గిలగిలను చక్కగా ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పటిదాకా డబ్బు చేసి మదించిన బ్లాక్‌మనీ రాయుళ్ల భరతం పట్టే క్రమంలో తమకు కొద్దిపాటి అసౌకర్యం కలిగినా ఓర్చుకోవటానికి జనం సిద్ధపడే ఉన్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు మరోమూడు గంటల్లో రద్దయి పోతాయని, మరునాడు బ్యాంకులు పనిచెయ్యవని, ఆ తరవాతా రోజుకు రెండువేల రూపాయలకు మించి మార్చుకునే వీలుండదనీ నవంబర్ 8 రాత్రి ప్రధానమంత్రి ఉరుములేని పిడుగులాంటి కబురు చెప్పినా... చేతిలో ఆ బాపతునోట్లు చాలానే ఉన్నవారు కూడా సంతోషపడ్డారు. దేశానికి పెద్దలాభం జరగబోతున్నప్పుడు, కొద్ది రోజులు మనం అవస్థపడలేమా అనుకున్నారు. తొలినాళ్ల లోటుపాట్లను సహృదయంతో అర్థం చేసుకున్నారు. పెద్దపెద్ద బ్లాక్‌మనీ కేటుగాళ్లకు వేటు బాగా పడింది సర్కారు వ్యూహం చక్కగా పనిచేస్తున్నది అన్న నమ్మకం కుదిరితే మరికొన్ని రోజులు ఇలాగే పాట్లు పడటానికీ జనం సిద్ధమే.
ఎటొచ్చీ ఆ నమ్మకమే ఇప్పుడు కొంచెం కొరవడింది.
‘‘2జి స్కామ్, కోల్ స్కామ్‌ల్లో వేల కోట్లు కొట్టేసినవాళ్లు కూడా 4వేల రూపాయల కోసం లైనులో నిలబడుతున్నారు’’ అని ప్రధానమంత్రి సంబరంగా ప్రకటించారు. అదే నిజమైతే అంతకంటే కావలసింది లేదు. కాని మామూలు మానవులకంటికి అటువంటి సుందర దృశ్యం దేశం మొత్తం మీద ఎక్కడా కానరావటం లేదు. లక్షల కోట్ల స్కాముల వాళ్లమాట దేవుడెరుగు... ఆఖరికి అమాంబాపతు అక్రమాల ‘నల్ల’నయ్యలు కూడా ఏ బ్యాంకుముందూ, ఏ ఎటిఎం దగ్గరా జాడలేరు. ‘సామాన్య జనం హాయిగా నిద్రపోతున్నారు, బ్లాక్‌మనీ వాళ్లేమో కంటికి కునుకులేక నిద్రమాత్రలు మింగుతున్నారు’ అని ప్రధానిగారికి ఎవరో చెప్పారో తెలియదు. మనబోంట్లకు మాత్రం సాధారణ గృహస్థులు ఇంటి అవసరాల నిమిత్తం చేంతాడంత క్యూలలో చిల్లర డబ్బులకోసం అష్టకష్టాలు పడటమే, ముందుగతి ఏమిటా అని రాత్రిళ్లు నిద్రపట్టక బేంబేలెత్తడమే కానవస్తున్నది. సమస్యలు, అవస్థలు అన్నీ సామాన్యులకే. నల్లడబ్బు మారాజులు దిట్టంగానే ఉన్నారు. నడమంత్రపు దళారులకు 30 శాతం, 40 శాతం కమిషను ఇచ్చి చెల్లని నోట్లను కొత్త కరెన్సీగా మార్పిడి బాగానే చేసుకుంటున్నారు. నగల వర్తకుల దగ్గర 30-40 శాతం ఎక్కువ ధరకు బ్లాక్‌లో బంగారాన్ని చెల్లని నోట్లతో చాటున కొనుక్కుంటున్నారు. జీరో డిపాజిటుతో మోదీ సర్కారు నిరుపేదలకు తెరిపించి పెట్టిన ‘జన్‌ధన్’ బ్యాంకు ఖాతాలను ‘జీరో అకౌంట్లు’గా ఉపయోగించుకుని, భారీ సంఖ్యలో సేకరించి పెట్టకున్న ఆ ఖాతాల్లోకి బ్లాక్‌మనీని వీలైనకాడికి పంప్ చేస్తున్నారు. ఆధార్ కార్డులో, ఓటరు కార్డులో ఉన్నవాళ్లను టోకున రోజుకూలీ లెక్కన నియోగించి, పాత నోట్లను బ్యాంకుల్లో మార్పించుకుంటున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. పొద్దస్తమానమూ మొరాయించిన ఎటిఎంల ముందు, దయచూపని బ్యాంకుల ముందు ప్రాణాచారాలతో శోష వస్తున్నదల్లా చట్టానికి లోబడి బతుకునీడ్చే మామూలు గృహస్థులకే. కరెన్సీ కష్టాల మూలంగా దేశంలో ఇప్పటివరకు ప్రాణాలు పోగొట్టుకున్న 47 మంది సాధారణ కుటుంబీకులే.
బ్లాక్‌మనీని నిల్వ చేసేది ప్రధానంగా వెయ్యి, ఐదొందల నోట్ల రూపంలో అయినప్పుడు, పాకిస్తాన్ నుంచి ఏకధాటిగా ఉత్పత్తి అయి విద్రోహానికి ఇంధనమయ్యే నకిలీ నోట్లు కూడా ఆ బాపతువే కాగా... ‘నల్ల’ మహమ్మారికి దిమ్మ తిరిగేట్టు చేయాలంటే ముఖ్యంగా రద్దు చేయవలసినవి ఆ పెద్ద నోట్లనే. ఆర్థికరంగ ప్రవీణులు చాలామంది ఎప్పటినుంచో చెబుతున్న మాటే అది. రద్దు చెయ్యాలి అనుకున్నప్పుడు, ఆ సంగతి ఉప్పంది, సర్దుబాట్లు చేసుకునేందుకు వ్యవధి ఇవ్వకుండా మెరపు వేగంతోనే కదిలితీరాలి. నిజమే. కాని ఆ మెరపు నిర్ణయం ప్రకటించేముందు న్యాయమైన పౌర అవసరాలకు, చట్టబద్ధ ఆర్థిక కార్యకలాపాలకు అవరోధం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లనూ తెలివిగా చేసుకోవాలి.
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు బ్లాక్‌మనీ వాళ్లకు వాటంగా ఉపయోగపడటం ఒక్కటే కాదు. సాధారణ మధ్య తరగతి కుటుంబీకుల దగ్గర ఎక్కువగా ఉండేవీ అవే. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 85 శాతం ఈ రెండు పెద్దనోట్ల రూపంలోనే ఉన్నది. వాటిని రద్దు చెయ్యటం అంటే 85 శాతం కరెన్సీని ఉపసంహరించి ఆర్థిక వ్యవస్థను 15 శాతం నగదుతో సతమతమవమని చెప్పటమే. ప్లాస్టిక్ కార్డులు, ఆన్‌లైన్ పేమెంట్లు ఆధారంగా నడిచే మోతుబరి మల్టీనేషనల్ కంపెనీలకు దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. కాని మన దేశంలో చిన్న వ్యాపారాల్లో 90 శాతం కాష్ ద్వారానే జరుగుతాయి. గ్రామసీమల్లో బ్యాంకులు, ఎటిఎంలు, కార్డుల వ్యాప్తి ఇప్పటికీ చాలా తక్కువ. కిరాణాషాపులు, పండ్లు, కూరగాయల బండ్లు, హోటళ్లు, బేకరీలు వగైరాలన్నీ ఏ రోజుకారోజు డబ్బిచ్చి సరుకు కొనుక్కొని చేసే వ్యాపారాలే. అందుబాటులోని కరెన్సీలో 85 శాతం హఠాత్తుగా చెల్లకుండా పోతే, చేతిలో డబ్బులు ఆడక అలాంటి వ్యాపారులందరూ విలవిలలాడతారు. కనీసావసరాలను సాధ్యమైనంతగా తీర్చేలా వంద, యాభై రూపాయల కరెన్సీ ముద్రణను ముందే జరిపించి అందుబాటులోకి తెచ్చి ఉంటే ఇప్పటివలె చిల్లర వ్యాపారాలు అతలాకుతలమయ్యేవి కావు. అలాగే 2000 రూపాయల నోటును వ్యూహాత్మకంగా తేదలిచినప్పుడు అది ఇమిడే విధంగా ఎ.టి.ఎం.ల రికాలిబ్రేషనును ముందే జరిపించి ఉంటే, ముద్రించి కూడా దాన్ని జనానికి అందుబాటులో పెట్టలేని దుస్థితి తప్పేది. చిల్లర దొరకనప్పుడు రెండువేల రూపాయల నోటును ఏమి చేసుకోవాలో తెలియని దురవస్థ పోయేది.
కరెన్సీకి కరవు ఏమీ లేదని ప్రభుత్వం చెబుతున్నది. అవసరాలకు సరిపడినంత కరెన్సీ బ్యాంకుల్లో ఉన్నదని రిజర్వుబ్యాంకు అంటున్నది. కాని వాస్తవంగా ఎక్కడ చూసినా బ్యాంకుల్లో కరెన్సీకి కటకటే. మొన్నటిదాకా తడవకు 4500 రూపాయలు, ఇప్పుడు 2000 రూపాయలు చొప్పున పాత కరెన్సీని మార్చుకోవడానికి గంటల తరబడి నిలబడే సామాన్యులకు వంద రూపాయల నోట్లు దొరకడం గగనమవుతున్నది. అనుమతించిన మేరకు 24వేల రూపాయల చెక్కును మార్చుకుందామనుకున్నా ‘అంత డబ్బు ఇవ్వలేము. మొత్తం సగానికో, అంతకంటే తక్కువకో తగ్గించండి’ అని బ్యాంకుల వాళ్లు చెబుతున్నారు. కాని అదే బ్యాంకుల్లో లక్షలకు లక్షల రూపాయలు చేతులు మారేవి మారుతూనే ఉన్నాయి. చాలాచోట్ల బ్యాంకుల సిబ్బంది, పై అధికారులు కమిషన్లు పుచ్చుకుని పాత కరెన్సీని భారీగా మార్పిస్తున్నారన్న ఆరోపణలు విస్తృతంగా వినవస్తున్నాయి.
‘ఇంట్లో పెళ్లి... ఖర్చులకు డబ్బుల్లేవు’ అంటూ ‘నల్ల’ కుబేరుల ఇక్కట్లను మోదీగారు రసవత్తరంగా వినిపించారు సరే! నిజానికి సమస్యలన్నీ బక్క ప్రాణాల బడుగు జీవులకే! బ్లాక్‌మనీ బకాసురులు బాగానే ఉన్నారు. ఊరంత పందిరివేసి, దిక్కులదరగొట్టేలా పెళ్లిళ్లు బాగానే చేస్తున్నారు. బ్లాక్‌మనీ పీచమణచేందుకు మోదీగారు కరెన్సీ రద్దు వజ్రాయుధాన్ని ప్రయోగించిన తరవాతే, నగదు చెల్లింపుల మీద సవాలక్ష ఆంక్షలు ఉండగానే గనుల ఘనుడు గాలి జనార్దన్‌రెడ్డి ఏకంగా 550 కోట్ల రూపాయలు చిల్లపెంకుల్లా ఖర్చుచేసి, చూసేవాళ్లకు కడుపులో దేవేంత ఆడంబరంగా కూతురి పెళ్లి చేశాడు. సాధారణ కుటుంబీకులు చేతిలో డబ్బు ఆడక, బ్యాంకులోని కష్టార్జితాన్నీ తీసుకునేందుకు వీలులేక ఉసూరుమని ఇంట్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవలసి వచ్చిన స్థితిలో గాలి వారికి మాత్రం ఏ నిబంధనా అడ్డురాకపోవటం ఎలా జరిగిందో ప్రధానమంత్రికే తెలియాలి. మోదీగారి సొంత పార్టీ పెద్దలు కూడా ఈ గాలి కళ్యాణ వైభోగంలో పాలుపంచుకుని తరించినప్పుడు ఈ దేశంలో అందరికీ ఒకటే రూలు అంటే జనం నమ్మరు.
పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లలో అధికార యంత్రాంగ వైఫల్యంవల్ల, వివిధ స్థాయిల్లో అవినీతి మూలంగా, పై స్థాయిలో నిర్వహణ దక్షత, సమన్వయం కొరవడిన కారణంగా మంచి ఉద్దేశంతో మోదీ సర్కారు తలపెట్టిన సాహసోపేత సంస్కరణ అనవసరపు చిక్కుల్లో చిక్కుకుని అభాసుపాలవుతున్నది. అట్టడుగు స్థాయిలో ఏమి జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో గ్రహించి, గట్టి చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోగలిగితే ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మా డబ్బును మేము వాడుకోవటానికి దిక్కుమాలిన ఆంక్షలు ఎన్నాళ్లు, ఘరానా గ్రంథసాంగులకు లేని బంధనాలు మాకు మాత్రమే ఎందుకు అన్న కడుపుమంట జనంలో పెరగకముందే ప్రభుత్వం జాగ్రత్తపడటం మంచిది.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ