ఉన్నమాట

చిన్నమ్మ ఎక్కాల్సింది గద్దె కాదు... బోను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా మనం చూసే కోణాన్నిబట్టి ఉంటుంది.
శశికళ గ్యాంగుకు ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టిందే సుబ్రహ్మణ్యస్వామి. అంతటివాడికి కూడా శశికళకు అధికార దండం అందించకుండా గవర్నరు జాగు చేస్తూండటం ఘోర తప్పిదంగా కనిపిస్తున్నది. ఆయన లాంటివాళ్లు దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు.
‘చిన్నమ్మ’ గుణం, ఆమె గతం ఎలాంటివైనా కావొచ్చు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగ్గ ఏ ఒక్క అర్హత ఆమెలో కాగడాతో వెదికినా కనిపించకపోవచ్చు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎడిఎంకె పార్టీకి స్థిరమైన మెజారిటీ ఉంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శశికళను నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంగతి అధికారికంగా తెలియపరిచాక, ప్రభుత్వం ఏర్పాటుకు ఆమెనే పిలవటం గవర్నర్ రాజ్యాంగవిధి. మెజారిటీ ఆమె పక్షాన నిజంగా ఉన్నదా అన్న విషయంలో అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవటానికి అనేక మార్గాలున్నాయి. కావాలనుకుంటే ఎమ్మెల్యేలను తానే పిలిచి స్వయంగా విచారించవచ్చు. బలపరీక్షకు శాసనసభే సరైన వేదిక అని సుప్రీంకోర్టు లోగడ చెప్పిన హితవును మన్నించి, నిర్ణీత వ్యవధిలోగా బలనిరూపణ చేసుకోవాలని కొత్త ముఖ్యమంత్రిని ఆదేశించవచ్చు. అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా శశికళపై నిర్ణయం వాయిదా వేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తీర్పు కారణంగా అనర్హత ఎప్పుడు ప్రాప్తిస్తే అప్పుడు ఆమెను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించవచ్చు. ఏవేవో మిషలతో గవర్నర్ ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తే అవాంఛనీయ పరిణామాలకు చేతులారా అవకాశం ఇచ్చినట్టవుతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి మంట గలుస్తుంది. గవర్నరు వ్యవస్థను రాజకీయ స్వార్థంకోసం దుర్వినియోగపరిచారన్న చెడ్డపేరును మోదీ సర్కారు మరింత మూటగట్టుకుంటుంది.
స్థూలంగా ఇదీ - ప్రస్తుత ఘట్టంలో ‘చిన్నమ్మ’ను సమర్థించే వారి వాదన. ఇందులో పస లేదని కాదు. బాగానే ఉంది. ఉన్న ముఖ్యమంత్రి తనంతట తాను రాజీనామా చేశాడు. గవర్నరు దానిని ఆమోదించి, ప్రత్యామ్నాయ ఏర్పాటు జరిగేంతవరకూ పదవిలో కొనసాగమని చెప్పాడు. పరిస్థితి అంతదాకా వచ్చాక ప్రస్తుత ముఖ్యమంత్రినే మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. తనచేత బలవంతంగా రాజీనామా చేయించారనీ, ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంటున్నాననీ పన్వీర్ సెల్వం చెబుతున్నాడు సరే! కాని - రాజీనామా ఉపసంహరణ అనేది అతడికీ, గవర్నరుకూ మధ్య ప్రైవేటు వ్యవహారం కాదు. అతడు తూనాబొడ్డు అన్నంతమాత్రాన రాజీనామాకు గవర్నరు ఆమోదం ఆటోమెటిగ్గా ఉపసంహరణ అయిపోదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి బలనిరూపణకు అవకాశం కోరే అర్హత లేదు. మళ్లీ తన వర్గం ఎమ్మెల్యేలతో ఒక సమావేశం పెట్టి వారి చేత నాయకుడిగా ఎన్నిక అయితేగాని, గవర్నరు దగ్గరికి వెళ్లి అధికారాన్ని ‘క్లెయిము’ చేసే యోగ్యత అతడికి రాదు. ఎటునుంచి ఎటు కూడినా ఏడుగురికి మించి ఎమ్మెల్యేలు తనవైపు చూపించుకోలేని ‘పన్నీరు’కు అంత సీను లేదు. రంగంలో మిగిలింది శశికళే కాబట్టి ముఖ్యమంత్రిగా ఆమెను నియమించి, బలపరీక్షకు ఆదేశించడం మినహా గవర్నరుకు గత్యంతరం లేదు.
నిజమే. మామూలు పరిస్థితుల్లోనైతే ఎవరైనా ఈ తర్కాన్ని ఒప్పుకోవలసిందే.
కాని తమిళనాడులో పరిస్థితి వేరు.
మనం మాట్లాడుతున్నది వి.కె.శశికళ అనే ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగేతర దుష్టశక్తి గురించి.
ఇవాళ మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ పక్షాన ఉన్నారు. ఆ సంగతి ఎవరూ కాదనలేరు.
ఇవాళ మెజారిటీ ప్రజలు శశికళకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ విషయమూ ఎవరూ కాదనలేరు.
అధికార పక్ష ఎమ్మెల్యేలు తనను నాయకురాలిగా ఎన్నుకున్నాక ప్రభుత్వాధినేతగా తనకు గవర్నరు అవకాశం ఇవ్వకుండా దాటవేసే అనుభవం ఒకవేళ జయలలితకే కనుక ఎదురైతే ఈపాటికి తమిళనాడు అగ్నిపర్వతంలా బద్దలయ్యేది. అభిమానకోటి ఆవేశాన్ని, పార్టీకాడర్ల ఆగ్రహాన్ని ఆపటం ఎవరితరమూ అయ్యేది కాదు. కనీసం కొన్ని డజన్ల ప్రాణాలు భావోద్వేగంవల్లో, ఆత్మాహుతుల కారణంగానో పోయేవి.
అదే కష్టం శశికళకు వస్తే ఆ రాష్ట్రంలో ఆకయినా కదలలేదు. ఏవో కొద్ది ప్రాంతాల్లో ఏడాదికొకసారి ఆడే ‘జల్లికట్టు’కు అవాంతరం వస్తేనే కొద్ది వారాల కింద రాష్టమ్రంతటా లక్షలమంది వీధుల్లోకి వచ్చారు. చెన్నై మెరీనా తీరం జనాగ్రహ సంద్రంగా మారింది. కాని- ఆస్థాన ‘పాదుక’ పన్నీర్ సెల్వానికీ, గుడ్డెద్దు శశికళకూ నడుమ నడుస్తున్న రాజకీయ జల్లికట్టును అరవ ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతో ఇంతో స్పందించిన వారందరూ చిన్నమ్మను చెడతిట్లు తిట్టేవారే. ప్రజాభిమానం మాట దేవుడెరుగు. ఆఖరికి సొంత పార్టీ క్యాడర్‌లోనూ ‘చిన్నమ్మ’ పక్షాన నిలబడాలన్న పౌరుషం పొడుచుకొచ్చిన దాఖలాలు లేవు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇవాళ తమిళనాట అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని బాపతుల మనుషులూ అత్యధికంగా అసహ్యించుకునే వ్యక్తి శశికళ. ఆమె తమ ముఖ్యమంత్రి అయ్యే ఖర్మ తమకు పట్టకూడదనే జనబాహుళ్యం కోరుకునేది.
జయలాగా ఆకుపచ్చ చీరకట్టి జయలాగా జుట్టు ముడివేసి, ఆక్రమించిన జయ ఇంటి బాల్కనీ నుంచి అనుచరగణాన్ని జయలాగా విష్ చేసినంత మాత్రాన శశికళ కాస్తా జయలలిత అయిపోదు. ఎంత అహంకరించినా, మహారాణిలా ఎంత రాజసం ఒలికించినా, ఎంతటి వారినైనా పురుగుల్లా దులపరించినా జయలలితకు చెల్లింది. ఎందుకంటే ఆమెకు ప్రజాబలం దండిగా, కొండంత అండగా
ఉండేది. ఆమె అహంకారం అందులో నుంచి మొలుచుకొచ్చింది. ఆ అండ శశికళకు లేదు. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పెద్దమ్మకు ఇమిటేషనుగా చిన్నమ్మ ఒలికించే రాజసాన్ని దురహంకారంగానే జనం ఏవగించుకుంటారు.
ఒంటి స్తంభం పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే కాబట్టి, ఎవరైనా తన బొమ్మను చూపెట్టి, తన దయాధర్మంవల్ల పైకొచ్చిన బాపతే కాబట్టి జయలలితకు కోపం వస్తే పార్టీలో ఎవరినైనా ఏమైనా చేయగలిగేది. శశికళకు పార్టీలో ఎన్నడూ ఏ బాధ్యతా లేదు. ఏ ఎన్నికలోనూ నిలబడి ఎరగదు. ఎన్నడూ జనంలోకి వెళ్లిన పాపాన పోలేదు. తనను ఇంట్లో పెట్టుకుని, వల్లమాలిన పెత్తనం ఇచ్చి, ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అందరినీ తెరచాటున శాసించే చాన్సు పెద్దమ్మ ఇచ్చింది కాబట్టి, అదంతా తన ప్రతాపమేననీ, ఎవరైనా తన కాళ్ల దగ్గర పడి ఉండవలసిన వారేననీ ఇప్పటికీ ‘చిన్నమ్మ’ భ్రమ. ఆ భ్రాంతితోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని చప్రాసీలా చూసింది. తల ఎగరేసే సరికి అతగాడి పార్టీ పదవి ఊడగొట్టింది. పార్టీ ప్రిసీడియంకు ఛైర్మన్ అంతటి ఉన్నత పదవిలో ఉన్న మధుసూదనన్‌ను నిన్న ఉన్నపళాన ఊస్టు చేసింది. పార్టీకి కేవలం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన తనకు అంతటి వాడిని తొలగించగల తాహతు లేదన్న సంగతి మరచింది.
లెజిస్లేచర్ పార్టీకి కొత్త నేత ఎన్నిక కావాలంటే కొన్ని విధి విధానాలను పాటించాలి. క్రమ పద్ధతిన వ్యవహారం నడిపించాలి. పార్టీ ఆఫీసుకు హుటాహుటిన ఎమ్మెల్యేలందరినీ పిలిపించి, కూలేసేదాకా శశికళను నాయకురాలిగా ఎన్నుకోబోతున్న సంగతి ఎమ్మెల్యేల్లోనే చాలామందికి తెలియదు. అప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న వాడు మరికాసేపట్లో తనను గెంటెయ్యబోతున్నారని ఎరుగడు. ఎన్నికే ఇంత లక్షణంగా జరిగినప్పుడు, దాన్ని లోకోత్తర ఘట్టంగా చూపించి, తనను అర్జంటుగా సింహాసనం ఎక్కిస్తే గానీ ప్రజాస్వామ్యానికి న్యాయం జరగదని చిన్నమ్మ చిందులేయటం తెంపరితనం.
పార్టీ లెజిస్లేటర్లు శశికళను నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఆమెకు మద్దతిస్తున్నట్టు గవర్నరుకు తెలిపిన పత్రం మీద అందరూ సంతకాలు చేశారని ఆమె మనుషులు చెప్పుకోవడమే తప్ప నిజమేమిటో నికరంగా తెలియదు. సమావేశంలో ఆమె పేరును ప్రతిపాదించి, ఏకగ్రీవ ఎన్నిక వైనాన్ని లోకానికి చాటిన ముఖ్యమంత్రే తనను బలవంత పెట్టారంటూ ఇప్పుడు అడ్డం తిరిగాడు. బలవంతంగా బస్సు లెక్కించి, రహస్య స్థావరాలకు తోలించి, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్లు లాగేసుకుని నిర్బంధించబడ్డ ఎమ్మెల్యేల్లో ఎంతమంది నిజంగా చిన్నమ్మకు జై కొడుతున్నారో చెప్పలేము.
తమ ఎమ్మెల్యేలను విరోధులు లోబరుచుకోకుండా పార్టీల నాయకులు క్యాంపులు నడపటం రాజకీయాల్లో మామూలే. ముప్ఫై మూడేళ్ల కింద హైదరాబాదు రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నాదెళ్ల పనుపున పోలీసు ఉన్నతాధికారులు తనిఖీకి వెళ్లినా ఏ ఒక్క ఎమ్మెల్యే బెసగలేదు. అన్ని ప్రతిపక్ష పార్టీలూ వారికి అండగా నిలబడ్డాయి. ఆ సంఘీభావం, అలాంటి నైతిక బలం ఇప్పుడు శశికళకు ఉన్నాయా?
‘శశి’ ఎంత నెచ్చెలి అయినా, ఎంత నెత్తినెక్కించుకున్నా ఆమెను తన రాజకీయ వారసురాలిని చేయాలన్న తలంపు జయలలితకు ఎన్నడూ లేదు. పార్టీలోగాని, ప్రభుత్వంలోగాని ఆమెకు ఏనాడూ ఏ బాధ్యతా ఇవ్వలేదు. ఆస్పత్రి పాలవడానికి చాలా రోజుల ముందునుంచే జయ ఆరోగ్యం పాడైంది. అది కూడా చిన్నమ్మ ఎక్కించిన స్లోపాయిజన్ ప్రభావమేనని గిట్టనివాళ్లు అంటారు. చివరిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయాన కూడా ఎక్కువసేపు నిలబడలేనంతగా పురచ్చితలైవికి నలతేదో కమ్మింది. అయినా తన అనంతరం ఉత్తరాధికారి శశికళ కావాలన్న అభిమతాన్ని ఆమె ఏనాడూ వెలిబుచ్చిన దాఖలాలు లేవు. నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహించి చిన్నమ్మనూ, ఆమె తెచ్చిపెట్టిన బంధుజనసేవక గణాన్నీ జయలలిత ఇంట్లో నుంచి గెంటేసిన దృష్టాంతాలు మాత్రం కావలసినన్ని.
అపోలో ఆస్పత్రిలో జయలలితను చేర్చడానికి ముందు ఏమైందో, ఆమె దేహస్థితి ఏమిటో ఒక మిస్టరీ. అధికారికంగా ఆమె మరణాన్ని ప్రకటించేదాకా 70 రోజులపాటు ఆస్పత్రిలో ఏమి జరిగిందో ఇంకో మిస్టరీ. కోలుకుంటున్నది, మాట్లాడుతున్నది అని ఆస్పత్రి వారు చెప్పటమే గాని వాస్తవమేమిటో బయటివారికి తెలియదు. కనీసం దగ్గరి బంధువులను కూడా రోగి దరిదాపుల్లోకి అనుమతించలేదు. ఆధికారికంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూచోబెట్టబడ్డ పన్నీర్ సెల్వానికే రోజూ వెళ్లి ఎంత ప్రాధేయపడ్డా నాయకురాలిని కళ్లారా చూసేందుకు అనుమతి దొరకలేదు. ఢిల్లీ నుంచి ఎందరు పెద్దమంత్రులు వచ్చినా తమకు చూపించింది చూసి, చెప్పమన్నది చెప్పి చక్కాబోయారే తప్ప ఏమవుతున్నది, ఎందుకిలా అయింది అని నోరు మెదిపి ఎరుగరు. గుండెపోటుతో మరణించినట్టు ఆస్పత్రి వర్గాల చేత ప్రకటింపజేయటానికి చాలా రోజుల ముందే ప్రాణంపోయి, శవాన్ని భద్రపరిచే రసాయనిక ప్రక్రియ జరిగిన దాఖలాలు కనపడ్డాయి. ఇప్పటికి బయటపడ్డ వివరాలను బట్టే మొత్తానికి పెద్ద కుట్ర ఏదో జరిగిందని స్పష్టం. ప్రజలు నెత్తిన పెట్టుకున్న ప్రియతమ ముఖ్యమంత్రికే అంతటి దుర్గతి పట్టించిన కుట్రదారులెవరు, దానికి సూత్రధారి ఎవరు అన్నదే ఇప్పుడు తేలాలి. నిజంగా పెద్ద నేరం జరిగి ఉంటే నేరస్థులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి.
తాత్కాలిక ముఖ్యమంత్రికి గాని, పార్టీ, ప్రభుత్వ ప్రముఖులెవరికి గాని, జయలలిత దగ్గరి బంధువులకు గాని ప్రమేయం లేనట్టు కనపడుతున్నది కాబట్టి అనుమానపు ముల్లు సహజంగా తిరిగేది ఆమెను కడదాకా నీడలా వెంటాడిన శశికళ వైపే. చిన్నమ్మ ఆరాటపడాల్సింది ముఖ్యమంత్రి పీఠాన్ని తేరగా ఎంత వేగిరం తన్నుకుపోవాలా అని కాదు. ప్రజా న్యాయస్థానంలో చేతనైతే మొట్టమొదట నిరూపించుకోవలసింది తన నిర్దోషిత్వాన్ని. ఆమె ఎక్సాల్సింది గద్దె కాదు - బోను!.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ