ఉన్నమాట

మేపేదీ మనమే... రాళ్ళ దెబ్బలూ మనకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేర్పాటు వాదులతో మాటల ముచ్చటే లేదు. గుర్తింపు పొందిన జమ్మూకాశ్మీర్ రాజకీయ పక్షాలతో చర్చలకు అభ్యంతరం లేదు.
భారత ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ నిన్న సుప్రీంకోర్టుకు చెప్పిన ఈ మాట బాగానే ఉంది. ఇంతకు ముందు లెక్కలేనన్ని మార్లు కేంద్రం నొక్కి చెప్పిన నియమబద్ధ విధానమే ఇది. సరిహద్దు రాష్ట్రాన్ని దహిస్తున్న రాళ్లు రువ్వుడు, భద్రతా దళాలపై దాడుల సమస్య సామరస్య పరిష్కారానికి కేంద్రం ముందుకు రావడం లేదంటూ జమ్మూకాశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషను చేసిన పితూరీపై భారత సర్కారు ప్రకటించిన వైఖరి వరకూ తప్పుపట్టాల్సింది ఏమీ లేదు.
కాని మనలో మాట. ఇవాళ కాశ్మీర్ లోయలో వేర్పాటువాదులకూ, ప్రధాన రాజకీయ పక్షాలకూ నడుమ తేడా ఉందా? పాకిస్తాన్ వత్తాసుతో నిరవధికంగా చెలరేగుతున్న అరాచక హింసను అంతమొందించాలన్న కోరికగాని, దానికి తమవంతు సహకారం అందించాలన్న చిత్తశుద్ధిగాని మెయిన్‌స్ట్రీమ్ రాజకీయ పార్టీలనబడే వాటిలో ఒక్కదానికైనా ఉన్నాయా?
జమ్మూకాశ్మీర్‌లో రాజ్యమేలుతున్నది పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పి.డి.పి.)! ఆదీ నుంచీ దాని మొగ్గు జాతి విద్రోహక విచ్ఛిన్న శక్తులవైపే, కిందటి అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంకోసం భాజపా భుజాల మీదికి ఎక్కిన తరవాతైనా దాని బుద్ధి మారింది లేదు. జాతి వ్యతిరేకుల పీచమణచడానికి చిటికెన వేలును కదిలించింది లేదు. ఆ మధ్య తండ్రి గతించాక, ఆయన స్థానంలో ముఖ్యమంత్రి గద్దెను అధిష్ఠించి తమను తరింప చేయవలసిందని ‘కమల’నాధులు బతిమిలాడగా ఆడగా నెలల తరబడి బెట్టుచేసి ఎట్టకేలకు దయతలిచి వారిని కృతార్థులను చేసిన బేగం మెహబూబాకు జిహాదీగ్యాంగుల విద్రోహాన్ని అణచాలన్న ఆరాటం ఏకోశానా లేదు. కొద్దిరోజుల కింద ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడూ ఆమె ఆసక్తి చూపింది రాష్ట్రంలో సంక్షోభాగ్ని గుండాన్ని కేంద్ర సహాయంతో ఎలా చల్లార్చగలమా అన్న దానిమీద కాదు.... పాక్ పెంపుడు చిలకలైన హురియత్‌లూ, హిజ్‌బుల్‌లను చర్చల ప్రక్రియలోకి ఎలా లాగాలా అని! ఉన్న పరువు పోగొట్టిన అవకాశవాదబంధం నుంచి బయటపడటం ఉత్తమమన్న వివేకం ‘కమలా’నికి కలిగినా... జాతి భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు దాపురించిన పెనువిపత్తును ఎదుర్కోవడానికి విధిలేని పరిస్థితుల్లో మెహబూబా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయక కేంద్రానికి తప్పకపోయినా పిడిపి మళ్లీ పాతపుంతకే మళ్లి వేర్పాటువాదానికి చందా రెన్యూ చేయక మానదు.
పాలకపక్షం ఇంత లక్షణంగా ఏడ్చితే ఇక ప్రధాన ప్రతిపక్షమైన నేషనల్ కాన్ఫరెన్సు సంగతి! ఇండియన్ యూనియన్‌లో జమ్మూకాశ్మీర్ సంస్థానం విలీనంవల్ల అత్యధికంగా లాభపడ్డదీ, కేంద్రం కళ్లు మూసుకుని అందించిన వేలూ, లక్షల కోట్ల అమాంబాపతు నిధులను ఎడాపెడా కొల్లగొట్టి తెగ బలిసిందీ ఆ పార్టీ నేతలు! సరిహద్దు రాష్ట్రాన్ని మూడు తరాలు తేరగా ఏలిందీ, ఎన్డీఏ హయాంలోనూ, యు.పి.ఎ. జమానాలోనూ కేంద్రాన మంత్రి భోగాలను అప్పనంగా అనుభవించి అన్ని విధాల బాగుపడిందీ ఆ అబ్బాకొడుకులే. అయినా వారికి వీసమెత్తు విశ్వాసం లేదు. భారత రాజ్యాంగమన్నా, జాతీయ ప్రయోజనాలన్నా ఇసుమంత గౌరవం లేదు.
భారత సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన సందేహ లాభాలు అన్నీ ఇచ్చి, ఎవరూ వంకపెట్ట లేనంత అతి జాగ్రత్తగా విచారణ చేసి, పాకిస్తానీ విద్రోహి అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధిస్తే... అది చాలా తప్పు అని గుండెలు బాదుకుని, భారత న్యాయవ్యవస్థ నిష్పాక్షికతనే సవాలు చేసిన ఘనులు నేషనల్ కాన్ఫరెన్సు నేతలు. ఈ మధ్య పాకిస్తాన్‌లో మిలిటరీ కోర్టు న్యాయనియమాలన్నిటినీ తుంగలో తొక్కి, కులభూషణ్ జాధవ్ అనే భారతీయుడికి అడ్డగోలుగా గూఢచారి ముద్ర వేసి, అక్రమంగా ఉరిశిక్ష విధిస్తే... అది చాలా కరెక్టు; పాక్ న్యాయ విధానాన్ని తప్పుబట్టటం చాలా తప్పు - అని వెనకేసుకు వచ్చింది కూడా అబ్దుల్లాల పార్టీయే!
భారతదేశంలో భాగం అని భారత పార్లమెంటు రెండు దశాబ్దాల కింద ఏకగ్రీవంగా చాటిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ‘‘తుమ్హారే బాప్ కా హై’’ (మీ అయ్యదా?) అని యద్దేవా చేసి, భారత ప్రభుత్వంపై నోరుపారేసుకున్న దేశభక్తుడు ఫరూక్ అబ్దుల్లా. పాక్ గూటి చిలుకలైన హురియత్ శాల్తీలను కాశ్మీరీ స్వాతంత్య్ర మహావీరులుగా... భద్రతా బలగాల మీద విడవకుండా రాళ్లు రువ్వుతున్న కిరాయి అల్లరమూకలను కాశ్మీర్ విముక్తికి పోరాడుతున్న జాతీయ వాదులుగా కీర్తించిన నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కలిసి వస్తుందన్న భరోసా ఎంతటి ఆశావాదికైనా ఉందా? పోనీ దేశంలోని పార్టీల్లోకెల్లా ముసలిదీ, కాశ్మీర్ చిచ్చును చేతులారా అంటించి, రావణకాష్ఠంలా మార్చిందీ అయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ లేవలేకుండా మూలపడ్డ తరవాతైనా జాతిహితానికి చెరుపు చేయకూడదన్న బుద్ధి వచ్చిందా? పాకిస్తాన్ ఐఎస్‌ఐ వెయ్యి కోట్ల రూపాయల బడ్జెటు కేటాయించి, మనిషికి 1000 రూపాయల చొప్పున కూలీ ఇచ్చి భారత భద్రతాదళాలపై తెరపి లేకుండా కురిపిస్తున్న రాళ్ల వర్షాన్ని దేశం మీద జరుగుతున్న అప్రకటిత యుద్ధంగా చూడాలన్న ఇంగితజ్ఞానం కాశ్మీర్ లోయలో బోర విరుచుకు తిరుగుతున్న ఏ ఒక్క రాజకీయ గుంపుకైనా ఉందా? ఇండియా తిండి తింటూ, ఇండియా నుంచి ఏటా ఎన్నో వేల కోట్ల రూపాయల ఉపకారాలు పొందుతూ... అనుక్షణం ఇండియాకే కీడు కోరుతూ, పాకిస్తాన్‌కి పంచమాంగ దళంగా వ్యవహరించే ఇలాంటి దుష్ట రాజకీయ శక్తులతో అర్థవంతమైన సంభాషణలు ఏనాటికైనా సాధ్యమా?
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో కనుక్కోవడానికి ఒళ్లు తెలియకుండా వెర్రెత్తిపోతున్న జనాలకు ఎక్కడో కాశ్మీర్ లోయలో కుర్రాళ్లను ముందుపెట్టి రాళ్లు కొట్టిస్తున్న వారు ఎవరన్నది పట్టించుకునే తీరిక ఉండకపోవచ్చు. అలజడికి, అశాంతికి ఆ లోయ ఆటపట్టయి చాలా ఏళ్లయింది కాబట్టి దానికి సంబంధించి కొత్తగా పట్టించుకోవలసింది ఏముందనీ మొద్దుబారిన మేధావుల మెదళ్లకు అనిపించవచ్చు.
నిజానికి కాశ్మీర్‌లో మునుపు జరిగింది ఒక ఎత్తయితే... కొన్ని నెలలుగా కట్టలు తెంచుకున్న విద్రోహం ఇంకో ఎత్తు. ‘కాశ్మీరియత్’, ‘ఇన్‌సానియత్’ అన్న మేలిముసుగుల్లో కాశ్మీర్ సెంటిమెంటు మీద ఇంతకు ముందు ధిక్కారపు కథ నడిచింది. ఇరవైఏళ్ల కింద కాశ్మీర్ పండిట్లను వెంటపడి, వేటాడి, రాక్షసంగా లోయనుంచి వెళ్లగొట్టినది మొదలుకుని నిరాఘటంగా సాగుతున్న ఇస్లామిక్ టెర్రరిజానికి పతాక సన్నివేశంగా ఇప్పుడు భీకర యుద్ధం మొదలైంది. దేశ విభజన అయిన కొత్తలో గిరిజన ‘రైడర్లు’ అన్న పేరుతో పాకిస్తానీ మిలిటరీని పంపించి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మూడోవంతు భూమిని కబళించినట్టే, ఇప్పుడు కుర్రకారును ముందుకు నెట్టి, సకల శక్తులనూ సమీకరించి పాకిస్తాన్ ఇండియా మీద రాళ్ల యుద్ధానికి దిగింది.
ఇంతదాకా ఆకతాయి అబ్బాయిలే మిలిటరీ మీద రాళ్లు కొడుతున్నారు. కొత్తగా టీనేజి అమ్మాయిలూ రెండుచేతులా రాళ్లు పట్టి భద్రతాదళాల పనిపడుతున్నారు. దేశంకోసం ప్రాణాలొడ్డి విధినిర్వహణ చేస్తున్న వీరజవాన్లను వారు ఎడాపెడా వేధించవచ్చు. భద్రతా వాహనాల అద్దాలను, వాటి వెనుక ఉన్నవారి ముఖాలను ఎంతైనా బద్దలు కొట్టవచ్చు. ఎందుకు చేస్తున్నారో తెలియకుండా, ఎవరికి ఉపయోగపడుతున్నామన్న స్పృహే లేకుండా అర్థంపర్థంలేని ఉన్మాదంతో ఎలాగైనా రెచ్చిపోవచ్చు. కాని ఆందోళనకారుల బారి నుంచి తప్పించుకోవడానికి, ఆత్మరక్షణార్థం భద్రతాదళాలు వారి మీద ఏ మాత్రం చేయి వేసినా - మానవహక్కులు మంట కలిశాయని, మహిళలకు రక్షణ కరువైందని, రాజ్యాంగం ప్రసాదించిన పౌర స్వేచ్ఛకు పుట్టి మునిగిందని గగ్గోలు పెట్టటానికి దేశంలో అడుగడుగునా ఉన్న మేధావులు, హక్కులరాయుళ్లు, మీడియా వ్యాఖ్యాతలు, టీవీ యాంకర్లు ఎవ్వర్ రెడీనే. బస్తర్ జిల్లాలో పాతికమంది సిఆర్‌పి జవాన్లను పైశాచికంగా పొట్టన పెట్టుకున్న మావోయిస్టు టెర్రరిస్టులు సామాన్య పౌరులను కవచాలుగా అడ్డం పెట్టుకుంటే చీమకుట్టినంతైనా చలించని మన బుద్ధిలేని బుద్ధి జీవులకు కాశ్మీర్‌లో పోలింగు జరగకుండా రాళ్లు కొడుతున్న అసాంఘిక జాతి వ్యతిరేకుల మూకలో ఒకడిని సైనికులు పట్టి, తమ జీపు ముందు భాగాన కట్టేయటం మాత్రం గావుకేకలు పెట్టాల్సిన అమానుష ఘాతుకంగా పొడగట్టటం మన దౌర్భాగ్యం. విధి నిర్వహణలోని పోలీసుల ఇళ్ల మీద జాతి వ్యతిరేకులు పడి, మీ వాడి చేత కొలువుకు రాజీనామా చేయించకపోతే మీ ప్రాణాలు దక్కవని కుటుంబ సభ్యులను భయానకంగా బెదిరించగలగడం కాశ్మీర్ లోయలో విద్రోహుల వీరంగానికి మచ్చుతునక.
డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్టు వేర్పాటువాదుల, పాకిస్తానీ తైనాతీల సెక్యూరిటీకి, హైక్లాస్ వైభోగాలకు, కాశ్మీరీల మెహర్బానీకి ఏటా ఎన్నో వేలకోట్లు తన ఖజానా నుంచి ఖర్చుపెడుతూ భారత ప్రభుత్వం మళ్లీ వాళ్లచేతే అస్తమానం అడ్డమైన మాటలు పడుతున్నది. ఆరేడు దశాబ్దాలుగా రాజ్యమేలిన ప్రభుత్వాల అసమర్థ, అవివేక విధానాల పర్యవసానంగా కాశ్మీర్ లోయ మానసికంగా మనది కాకుండా పరాయిదైపోయింది. ఇవాళ రిఫరెండం లాంటిది జరిపితే అక్కడ నూటికి 80 మంది ఇండియాపట్ల వ్యతిరేకత చూపుతారన్నది చేదు నిజం. అంతమాత్రాన ఆ లోయ జాతి శత్రువుల ఇష్టారాజ్యం కావడానికి ఒప్పుకోవలసిందేనా? ప్రజాభిప్రాయాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయమే చేయవలసి వస్తే దాన్ని కాశ్మీర్ లోయకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి? కాశ్మీర్ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా, అంతర్జాతీయ న్యాయబద్ధంగా అవిభాజ్య భాగమైనప్పుడు దానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయమైనా జాతీయ ప్రజాభిమతాన్ని బట్టి కదా జరగవలసింది? మనదైన కాశ్మీర్‌ను వదులుకోవటానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధం లేనప్పుడు, దానికి పట్టిన విదేశీ విద్రోహపు దయ్యాన్ని వదిలించి, తిరిగి మన మధ్యకు ఎలా తీసుకురావాలన్నదే కదా ఇప్పుడు ఆలోచించవలసింది? సర్వానర్థాలకు మూలమైన కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి కారణమైన కాలం చెల్లిన 370 అధికరణాన్ని ఎంత త్వరగా ఎత్తేయాలా అన్నది కాదా జాతి దృష్టి సారించవలసిన తక్షణ సమస్య?

ఎం.వి.ఆర్.శాస్ర్తీ