ఉన్నమాట

హిందువులంటే ఇందుకే అలుసు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులంటే అడ్డమైన వాళ్లకీ ఎందుకు అలుసు?
ఇతర మతాల ఒక మోస్తరు గురువుల విషయంలో కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని మర్యాదగా మెలిగే రాజకీయ జీవులు, అమాంబాపతు మేధావులు హిందువులు భక్తితో కొలిచే అత్యున్నత జగద్గురు శంకరపీఠాలను సైతం చిత్తానుసారం ఈసడించగలుతున్నారు - ఎందువల్ల?
తమ మతపెద్దలను, తమ మతవిశ్వాసాలను, సెంటిమెంట్లను అవమానిస్తే సహించేది లేదని ఇతర మతాల వారికి ఉన్న తెగువ, మతావేశం హిందూ మతానికి పెద్ద దిక్కులనుకునే వారిలో అంతంత మాత్రం కనుక! సామాన్య హిందువులకు తీవ్ర మనస్తాపం కలిగి, ఆగ్రహంతో రగిలిన సందర్భాల్లోనూ గట్టి ప్రతిక్రియకు పూనుకోకుండా వెనక్కిలాగే అతిమంచి అసమర్థతలో వారి పెద్ద తలకాయలది పెట్టింది పేరు కాబట్టి!!
కేరళలో తాజా దురాగతానే్న గమనించండి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో అతి పవిత్రమైన అనంత పద్మనాభస్వామి ఆలయ ఆవరణలోని పుష్కరిణి పునరుద్ధరణ అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పునరావిష్కరణ వేడుక జరిగింది. దానికి విచ్చేసి ఆశీస్సులందించవలసినదని ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న శృంగేరి శంకర పీఠాధీశ్వరులు భారతీతీర్థ మహాస్వామిని, ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామిని ఆలయ ప్రముఖులు ఆహ్వానించారు. వారు ఆశీనులవటానికి వేదికమీద వారి స్థాయికి తగ్గట్టు ఉచితాసనాన్ని ఏర్పాటుచేశారు.
అందులో ఎవరు ఆక్షేపించవలసిందీ ఏమీ లేదు. ఋషులను, తపస్వులను, ధర్మాచార్యులను యధోచితంగా గౌరవించి, భక్తితో ప్రణమిల్లడం ఈ దేశంలో అనాదిగా పాలకులు పాటిస్తున్న మంచి సంప్రదాయం. భారత రాష్టప్రతి, ప్రధానమంత్రి అంతటి వారు కూడా ఉన్నతాసనాన్ని పూజ్య ధర్మాచార్యుడికి వదిలి, మామూలు కుర్చీలో తాము కూచోవడంవల్ల తాము అధిష్ఠించిన పదవుల ఔన్నత్యం చిన్నబోయిందని ఎప్పుడూ అనుకోరు. అదే ఆనవాయితీ ప్రకారం పద్మనాభస్వామి ఆలయ ప్రాంగణంలో వేదిక మీద సాంప్రదాయక ‘సింహాసనా’న్ని దక్షిణామ్నాయ జగద్గురు శంకర పీఠాధిపతులకు ఏర్పాటుచేశారు.
పేరుకు సింహాసనమే అయినా, అదేమీ నవరత్న ఖచిత విక్రమార్క సింహాసన మేమీ కాదు. ఇద్దరు మనుషులు సుఖంగా కూచోగలిగిన సోఫా. వేదిక మీద అటూ ఇటూ కుర్చీల నడుమ ఆ సోఫాను చూడగానే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వంలో దేవస్థానాల శాఖను వెలిగిస్తున్న మంత్రివర్యుడు కడకంపల్లి సురేంద్రన్ కళ్లు చిరచిర మండాయి. ఆ తరవాత ఏమి జరిగిందో అతడి మాటల్లోనే వినండి:
‘‘సింహాసనాన్ని చూడగానే అదెందుకని నేను అడిగాను. శృంగేరిమఠం అధిపతి వస్తే కూర్చోవడానికి దాన్ని వేశామని ఆర్గనైజర్లు చెప్పారు. శృంగేరి మఠాధిపతి శ్రీ భారతీతీర్థ స్వామి ఒక్కడినే గెస్టుగా పిలిచినట్టు ప్రోగ్రాం నోటీసులో ఉంది. ఇద్దరు ముగ్గురికి సరిపడే సింహాసనాన్ని ఒక్కడికోసం అఫీషియల్ కార్యక్రమంలో వేయడం అనుచితం! గవర్నమెంటు ప్రోగ్రాంల్లో అలాంటి సింహసనాన్ని మంత్రికీ వేయకూడదు; మఠాధిపతికీ వేయకూడదు - అని చెప్పి ఎమ్మెల్యే శివకుమార్ సాయంతో నేనే దాన్ని అక్కడి నుంచి లేపేశాను. తరవాత వార్తల్లో చూశాను. శృంగేరి మఠాధిపతికి బదులుగా ఇంకో స్వామి వచ్చాడట. సింహాసనం కనపడక పోయేసరికి అతడు వేదికమీదికి రాలేదట.’’
వచ్చినవాడు ఎవరో కాదు. శృంగేరి జగద్గురు మహాసంస్థాన ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి. మొత్తం దక్షిణ భారతానికి గురుస్థానంగా ఆది శంకరులు నెలకొల్పిన ఆమ్నాయ పీఠానికి ప్రతినిధిగా వచ్చినవాడు. ఆశ్రమ ధర్మాన్ని, ఆచారాన్ని నిష్టగా పాటించేవాడు. నాస్తికులూ, గోమాంస భక్షకులతో భుజాలు రాచుకుంటూ ప్లాస్టిక్ కుర్చీలో కూచోవటం ఇష్టం లేక, వేదిక దగ్గర వరకూ వచ్చి, అటు నుంచి అటే పుష్కరిణికి సంప్రోక్షణ చేసి, వెనక్కి మరలాడు.
ఆది శంకరులు పుట్టిన గడ్డ మీద దక్షిణామ్నాయ శంకర పీఠానికి జరిగిన ఈ అవమానం సనాతన ధర్మానికి, మొత్తం హైందవ సమాజానికి, భారతీయ సంప్రదాయానికి అపచారం కాదా?
ఇక నాస్తికులూ, గోమాంస భక్షకులూ ఎవరంటారా? ఇంకెవరు? కిరాయి కూలీల్లా సోఫాను అమాంతం ఎత్తి వెనక పెట్టి, దాని స్థానంలో ప్లాస్టిక్ కుర్చీలు వేసి బైఠాయించిన మంత్రి పుంగవులే! కామ్రేడ్ సురేంద్రన్ మంత్రి కావడానికి ముందు సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి పదవిని వెలగబెట్టాడు. నెలరోజుల కింద వీర కమ్యూనిస్టులూ, ముస్లిం ఫండమెంటలిస్టులూ నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌లో గోమాంసాన్ని ఆరగించి, హిందువుల సెంటిమెంటును కుళ్లబొడిచాడు. మళ్లీ ఈ పుణ్యపురుషుడే కేరళలో పవిత్రహిందూ దేవస్థానాలను అజమాయిషీ చేసే అమాత్యుడు. అదీ ‘దేవుడి సొంత భూమి’ మీద హైందవ ధర్మానికి పట్టిన ఖర్మ!
ఉచితాసనాన్ని తొలగించిన సమయంలో శృంగేరి జగద్గురువులు లేరు కనుక, పూజ్య పీఠాధిపతి అసలు కార్యక్రమానికే హాజరు కాలేదు కనుక, రాజకీయ నాస్తికులు సహజశైలిలో చూపిన ప్రతాపాన్ని శృంగేరి పీఠంగాని, హిందూ సమాజంగాని పట్టించుకోనవసరం లేదా? ‘దేవొస్వాం’ శాఖ ప్రస్తుత మంత్రి, కాంగ్రెసు కులదీపకుడైన మాజీమంత్రి చెరో చెయ్యి వేసి సింహాసనాన్ని ఎత్తిపారేసి, తమ సంస్కారానికి తగ్గట్టు ‘గవర్నమెంటు ప్రోగ్రాం’ను నడిపించి గమ్మునుంటే బహుశా వారి నిర్వాకం బాహ్య ప్రపంచానికి తెలియకపోయేది. హద్దుమీరిన మంత్రి తన ఘనకార్యాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టి లోకానికి చాటింపు వేశాడు. మంచి పని చేశావని అతడికి తోడుబోయిన వాళ్లు సోషల్ మీడియాలో తెగ మెచ్చుకున్నారు. దేశమంతటా లొల్లి అయ్యాకయినా అవమానానికి గురి అయిన వారిలో చలనం ఉండాలి కదా?
పూర్వపు తిరువాన్కూరు ప్రభువులు తమ సమస్త సంపదలనూ పద్మనాభస్వామి పరం చేసి, కేవలం ఆయన ప్రతినిధులైన ధర్మకర్తలుగా వ్యవహరించి, ఆఖరికి గుడిలోని ధూళినికూడా తమ వెంట తీసుకుపోకుండా అతి జాగ్రత్త పడేవారు. ఇప్పటి సెక్యులర్ ప్రభువులేమో దేవాలయాల సొమ్మును జబర్దస్తీగా దోచుకుంటున్నారు. అనంత పద్మనాభస్వామికి భక్తులు సమర్పించే వందలకోట్లను తేరగా కైంకర్యం చేసుకునే సర్కారువారు గుడి కొలను పునరుద్ధరణకు కోటిన్నర ఖర్చు పెట్టటం గొప్పా? సొమ్ము ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన దేవాలయంలో పూజ్యధర్మాచార్యుల సమక్షంలో ఏర్పాటయన ధార్మిక కార్యక్రమం గవర్నమెంటు ప్రోగ్రాం అయిపోతుందా? సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు నిర్వహించే వేడుకల్లోనూ మహామంత్రులూ, పార్టీ బాసులూ పెద్ద సింహాసనాల్లో కూచోగా తక్కినవారు మామూలు కుర్చీల్లో సర్దుకోవడం మామూలే కాదా? తిరువాన్కూరు సంస్థానం నెత్తిన పెట్టుకుని కొలిచిన శృంగేరి పీఠం అధిపతి రాజకీయ నాయకుల పాటి చేయడా? ఇప్పటి కమ్యూనిస్టు నాస్తిక ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం ఆ పీఠాధిపతులను స్టేట్ గెస్టులుగా పరిగణించి, ప్రస్తుత పర్యటనలో అన్ని గౌరవ లాంఛనాలనూ సమకూర్చుతున్న వైనం దేవస్థానాల శాఖను వెలగబెట్టే మంత్రి మహోదయుడికి తెలియదా? తెలిసి కూడా కార్యక్రమానికి విచ్చేసిన శృంగేరి ఉత్తరాధికారిని అలా ఎలా అవమానించాడు? హైందవ పీఠాధిపతి కోసం కాకుండా ఏ క్రైస్తవ బిషప్పు కోసమో, ముస్లిం వౌలానా కోసమో వేదికపై అలాంటి సింహాసనం వేసి ఉన్నట్టయితే ఈ మంత్రి ఇలాగే దాన్ని ఎత్తిపారవేయగలడా? గవర్నమెంటు ప్రోగ్రాంలో సింహాసనాలు ఎవరికీ ఉండరాదు అన్న నీతిపాఠం అప్పుడు అతడికి గుర్తొచ్చేదా?
తెంపరి గొడవ అంతా అయ్యాక, ఇద్దరు కేరళ ప్రభుత్వ మంత్రులు భారతీతీర్థ మహాస్వామిని పద్ధతి ప్రకారం దర్శించి, శాలువ సత్కారాన్నీ అందుకున్నారు. పూజ్య పీఠాధిపతి వారికి చెరో పండునూ ముఖ్యమంత్రికి ఇమ్మని మరో ఆపిల్‌నూ ఇప్పించారు. బాగానే ఉంది. కాని వారు వెళ్లి దర్శనం చేసుకున్నంత మాత్రాన వారి సాటి మంత్రి చేసిన అపచారం చెల్లు అయిపోతుందా? స్వామి తన పీఠపు ఔన్నత్యానికి తగ్గట్టు సన్నిధి చేరిన మంత్రులపై వాత్సల్యం చూపినంత మాత్రాన హిందూ సమాజానికి కలిగిన మనస్తాపం సమసిపోతుందా?
లోగడ జయలలిత అనే పాతకి పగబట్టి, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిమీద హత్య కేసు బనాయించి, రెక్కపుచ్చుకు లాక్కెళ్లి ఖైదులో వేసి, చిప్పకూడు తినిపించి నానా తిప్పలు పెట్టినప్పుడూ మన హిందూ సమాజం పెద్దల్లో పౌరుషం లేదు; గట్టి ప్రతిక్రియా లేదు. అదేదో ఆ స్వాములారు లాయర్లను పెట్టుకుని, కోర్టుల చుట్టూ తిరిగి, చేతనైతే బయటపడవలసిన వ్యక్తిగత సమస్యగానే పెద్దపెద్ద వాళ్లు చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చచ్చుకబుర్లు చెప్పారు. ఇప్పుడు శృంగేరి పీఠానికి కేరళలో జరిగిన అవమానానికీ విశ్వహిందూ పరిషత్తులాంటి పేరు గొప్ప సంస్థలు చీమకుట్టిన పాటి చలించిన దాఖలాల్లేవు.
కర్నాటకలో భాజపా నాయకుడు యెడ్యూరప్ప కనీసం స్వామికి జరిగిన అవమానాన్ని బహిరంగంగా ఖండించి బరి తెగించిన మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. అసలైన కేరళలోని కమలనాధుల్లో ఆపాటి స్పందనా లేదు. మంత్రి తెగబడి పూజ్య పీఠాధిపతికి ఉద్దేశించిన ఆసనాన్ని లాగివేసిన సమయాన భాజపా రాష్ట్ర అధ్యక్షుడూ, ఆ పార్టీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. మంత్రి చేసిన పనిని వారు తెగనాడిన పాపాన పోలేదు. ఇంతకీ మీరేమంటారయ్యా అని అడిగితే ఘనత వహించిన భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్ చెప్పిందిది:
‘‘శృంగేరి మఠం జూనియర్ స్వామి ఒకరు దీవించటానికి వచ్చిన మాట నిజం. ఆయన వచ్చారు... ప్రారంభ సూచకంగా నీళ్లు చల్లారు... వెళ్లారు. ఆ స్వామి పేరును నోటీసులో గెస్టుగా పేర్కొనలేదు. ఈ సోఫాలాంటి కుర్చీ ఏదైతే ఉన్నదో అది ఎక్కువ స్థలం తీసుకుంది. మంత్రి చొరవ తీసుకుని దాన్ని తొలగించటం నేను చూశాను.’’
జరిగింది అంతేనట!
పైగా - సింహాసనం వేసింది అసలు శృంగేరి స్వామి కోసమే కానట్టూ, పుష్పాంజలి స్వామి అనే లోకల్ స్వామి కోసం దాన్ని వేస్తే ఆయన మెట్లు ఎక్కలేక వేదిక కిందనే కూచున్నాడనీ, మంత్రి చేసినదాన్ని మరచిపోవడమే మేలనీ శృంగేరి మఠం వర్గాలు జనాంతికంగా పలుకుతున్నాయ. ఔనౌను. మనవంటి మర్యాదస్తులూ, సజ్జనులూ అటువంటి చిల్లరపనులను పట్టించుకోరాదని హిందూ సమాజం జంటిల్మెన్లు సోషల్ మీడియాలో జనం ఆగ్రహం మీద చన్నీళ్లు చల్లుతున్నారు.
ఎంత సిగ్గుచేటు?!

చిత్రాలు.. సోఫా తొలగింపు కార్యక్రమం... కుడివైపున ఉన్నది కేరళ దేవస్థానాల మంత్రి సురేంద్రన్ -
* వెనుదిరిగిన విధుశేఖర భారతి సా వమి

ఎం.వి.ఆర్.శాస్ర్తీ