ఉన్నమాట

జాతీయగీతం... అసలు లొసుగు చట్టంలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయప్రవీణులు నిప్పులు కక్కుతున్నారు. ట్విట్టర్ మాలోకం మండిపడుతున్నది. ఎకసెక్కాలు ఆడీ ఆడీ సోషల్ మీడియాకు శోష వచ్చేస్తున్నది. పత్రికలు చదివే, చానెళ్లు చూసే, ట్వీటే, బ్లాగే ప్రతివాడి దృష్టిలో ఇవాళ జస్టిస్ దీపక్ మిశ్రా పాపాల భైరవుడు.
ఇంతకీ ఆయన చేసిన మహాపరాధమేమిటి? దేశంలోని సినిమా హాళ్లలో ప్రతి షో మొదలెట్టే ముందూ జాతీయ పతాకం చూపించి, జాతీయగీతం వినిపించమన్నాడు. ఆ సమయంలో అక్కడ వున్న వాళ్లందరూ గౌరవ సూచకంగా నిలబడాలన్నాడు. డిస్టర్బెన్సు లేకుండా ఆ కాసేపూ తలుపులు మూసి పెట్టాలన్నాడు.
ఇందులో పెంకులెగిరేట్టు రంకెలేయాల్సిందీ, ప్రాథమిక హక్కులకూ పౌర స్వేచ్ఛలకూ పుట్టి మునిగినట్టు గగ్గోలు పెట్టాల్సిందీ ఏమి కనపడదు. భారతదేశంలో భారత పౌరులు భారత రిపబ్లిక్ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నిమిషం పాటు గౌరవ సూచకంగా నిలబడాలనటం ఏరకంగా చూసినా నిష్కృతి లేని నేరం కాదు.
కాని ఈ దేశంలో మేధావులుగా, మహా జ్ఞానులుగా చలామణి అవుతున్నవారిలో చాలామంది అలా అనుకోవటం లేదు. దేశభక్తి మనసులో ఉంటే చాలదా? జనగణమన పాడేటప్పుడు నిలబడితేనే దేశభక్తి ఉన్నట్టా? సరదాగా కాలక్షేపం కోసం సినిమాకు వెళ్లినప్పుడు కూడా జాతి విధేయతను చాటుకోవాలా? సినిమా హాల్లో ప్రతివాడూ అది పాడేటప్పుడు నిలబడి తీరాలని నిర్బంధించటంలోని ఔచిత్యమేమిటి? అది రాజ్యాంగం పౌర ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధం కాదా? పౌరుడికి ఉన్న స్వేచ్ఛను హరించి, కట్టడి చేయటానికి జస్టిస్ మిశ్రాకు అధికారం ఎవరిచ్చారు? ఏ చట్టం కింద, ఆయన ఫర్మానా ఇచ్చాడు? నిలబడటానికి నిరాకరించేవారిని ఆయన ఏమి చేయగలడు? అదీగాక జాతీయ గీతం పాడేటప్పుడు తలుపులు మూసి పెట్టాలనటమేమిటి? వందలమంది ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నచోట ఆ సమయాన ఏ అగ్ని ప్రమాదమో సంభవిస్తే, ఏ బాంబో పేలితే ఏమవుతుంది? దేశభక్తి ప్రాణాన్ని కాపాడుతుందా? ఢిల్లీ ‘ఉపహార్’ సినిమా హాల్లో అగ్ని ప్రమాదంవల్ల తొక్కిసలాటలో 57మంది మరణించిన దరిమిలా- ఇకపై దేశంలో ఎక్కడా షో సమయాల్లో సినిమా హాళ్ల తలుపులకు ఎట్టిపరిస్థితుల్లోనూ గడియ పెట్టరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి తాజా రూలింగు వ్యతిరేకంకాదా? సినిమాకు వెళ్లిన ప్రతివాడూ జాతీయ గీతాన్ని గౌరవించాలని కట్టడి చేసేటప్పుడు ఆ సంస్కరణను సినిమాలకు మాత్రమే పరిమితం చేయడమెందుకు? షాపింగు మాల్స్‌లో, బార్ అండ్ రెస్టారెంట్లలో, బ్యాంకు ఎటిఎంల్లో కూడా జాతీయ గీతాలాపనను ఎందుకు నిర్బంధం చేయకూడదు?
ఇలా తలా ఒకరకంగా జాతీయ గీతంపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచి రూలింగును ఖండఖండాలుగా ఖండిస్తున్నారు. వింత వింత వాదాలను వినిపిస్తున్నారు. విన్నవారికి ‘సుప్రీంకోర్టు’ జడ్జిలకు ఈ మాత్రం తెలియదా? వెనకాముందూ చూడకుండా రూలింగు ఇచ్చారేమిటి’ అని బహుశా ఆశ్చర్యం వేస్తుంది.
కాని- నాణేనికి రెండోవైపూ ఉంటుంది.
సినిమా హాళ్లలో జాతీయ గీతం విధిగా వినిపింపచేయాలన్నది ఇప్పుడు జస్టిస్ మిశ్రాకు కొత్తగా తట్టిన ఐడియా కాదు. ఆ ఆనవాయితీ దేశంలో అర్ధ శతాబ్దం కిందటే ఉంది. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం తరువాత నుంచీ ప్రతి థియేటర్లో సినిమా చివరిలో జాతీయ పతాకం చూపించి జనగణమన వినిపించేవారు. అదీ భారత ప్రభుత్వ ఆదేశం ప్రకారం. మొదట్లో జనం కదలకుండా నిలబడేవారు. క్రమేణా ఒకరిని చూసి ఒకరు జాతీయ గీతం నడుస్తూండగానే జారుకునేవారు. అడిగేవారు లేకపోవడంతో కొన్నాళ్లకు థియేటర్ల వాళ్లూ మెల్లిగా మానేశారు. ఇందిరాగాంధీ హయాంలో కాబోలు దేశవ్యాప్తంగా ఈ పద్ధతి ప్రవేశపెట్టినప్పుడు- సినిమాల్లోనే ఎందుకు, బార్లలో, క్లబ్బుల్లో కూడా జనగణమన వినిపించరాదా అని దేశంలో ఏ మేధావీ మేలమాడలేదు. జాతీయ గీతాన్ని పాడితే, పాడేటప్పుడు నిలబడితే తమ ఒళ్లు, కాళ్లు అలసిపోతాయి, తమ రాజ్యాంగ హక్కులు, స్వాతంత్య్రాలూ కొల్లబోతాయి అన్న వికృత పైత్యం ఆ కాలంలో లేదు. 2003లో మహారాష్ట్ర ప్రభుత్వం సైతం సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని కంపల్సరీ చేసింది. చెప్పొచ్చిందేమిటంటే- అమలు సంగతి ఎలా వున్నా సినిమా హాళ్లలో ‘జనగణమన’ దేశానికి కొత్త కాదు. జస్టిస్ దీపక్ మిశ్రా పుర్రెకు పుట్టిన పిదప బుద్ధీకాదు.
సినిమా అయిపోయాక జాతీయ గీతం వేస్తే జనం వెళ్లిపోయే తొందరలో ఉంటారు కాబట్టి అదేదో మొదట్లోనే కానివ్వటం మంచిదని సుప్రీంకోర్టు డివిజన్ బెంచి భావించి వుంటే అందులో తప్పులేదు. హాలులోకి వస్తూ, తిరుగుతూ ఉండేవారివల్ల డిస్టర్బెన్సు లేకుండా అందరూ లేచి నిలబడ్డ నిమిషం సేపు తలుపులు మూయడంవల్ల కొంపలేమీ మునిగిపోవు. హాలు తలుపులను బయటినుంచి గడియ పెట్టటాన్ని, తాళం వేయటాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెనకటి తీర్పు నిషేధించింది. జాతీయ గీతం కోసం కేవలం ఒక నిమిషం పాటు తలుపులు మూసి ఉంచితే ఆ తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుందని లా పాయింటు తీయటం అతితెలివి రంధ్రానే్వషణ.
దేశభక్తి మనసులో ఉంటే చాలదు. దాన్ని బయటికి కనపరచడానికీ ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో నివసిస్తూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం ఇచ్చిన సౌకర్యాలనూ, దాని రాజ్యాంగం సమకూర్చిన హక్కులనూ, సదుపాయాలనూ యథేచ్ఛగా అనుభవించేవాడికి ఈ దేశంపట్ల బాధ్యత కూడా ఉంటుంది. జాతీయతకు, జాతి సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జాతీయ గీతం చెవినపడితేనే ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికీ ఉద్వేగం ఉప్పొంగాలి. వేరెవరో కర్ర పట్టుకుని అదిలించాల్సిన అవసరం లేకుండానే స్వచ్ఛందంగా లేచి నిలబడాలి. గుండెనిండా జాతి గర్వంతో రొమ్ము విరుచుకుని గొంతు కలపాలి. సినిమా హాల్లో జాతీయ గీతం వేసేటప్పుడు, లేచి నిలబడాలని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం చెబితే, దేశభక్తి కల పౌరుడు ‘నిలబడితే ఏమి పోయింది? దానికి అభ్యంతరం ఎందుకు’ అనే అనుకోవాలి. ‘ఎందుకు నిలబడాలి? నిలబడితేనే దేశభక్తి ఉన్నట్టా? నిలబడకపోతే ఏమవుతుంది? ఎవరు పట్టుకుంటారు?’ అని చచ్చుపుచ్చు వాదాలకు దిగకూడదు. జాతీయ భావం పెంపొందాలన్న తపనతో డివిజన్ బెంచి ఇచ్చిన రూలింగును బిజెపి ఎజెండా అమలు చేయడంగా, ఆరెస్సెస్ కల్చరల్ పోలీసులను ఉసికొలపడంగా చిత్రించటం బుద్ధిజీవులకు ఎంతమాత్రమూ తగని బుద్ధి తక్కువ అభాండం.
జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితావ్ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది తీర్పు కాదు. జాతీయ చిహ్నాలకు అపచారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంలో ఇచ్చిన ఒక రూలింగు మాత్రమే అది. దానికి చట్ట ప్రతిపత్తిలేదు. చట్టబద్ధతా లేదు. ‘దేశమంతటా సినిమాహాళ్లలో జాతీయగీతం వినిపించాలి. అప్పుడు ప్రేక్షకులందరూ నిలబడాలి, తలుపులు మూయించాలి’ అన్న ఆదేశాన్ని ఎవరైనా ఖాతరు చేయకపోతే న్యాయమూర్తులు చేయగలిగింది లేదు. నిలబడి తీరాలని ఏ చట్టమూ చెప్పలేదు కాబట్టి నిలబడము పొమ్మనేవారిని శిక్షించే అధికారం న్యాయస్థానానికి లేదు. కాబట్టి కోర్టు రూలింగువల్ల తమకున్న విచ్చలవిడి స్వేచ్ఛకు మోసం వస్తుందని- జాతి విధేయతను తిట్టుపదంగా తలిచే ఏ విశృంఖల స్వేచ్ఛా జీవీ తల్లడిల్లాల్సిన పని లేదు. దేశభక్తిని బలవంతంగా రుద్దేస్తున్నారని ఇంతలా గోల పెట్టాల్సిన అవసరమూ లేదు. చిల్లులమయమైన మన చట్టాలు, తలా తోకాలేని మన కట్టుబాట్లు చల్లగా ఉన్నంత కాలం ఈ పుణ్యభూమిలో దేశభక్తికి విలువాలేదు; అది లేనివాడికి దిగులూ లేదు.
'Whoever intentionally prevents the singing of the Indian National Anthem or causes disturbance to any assembly engaged in such singing shall be punished with imprisonment for a term which may extend to three years...' (్భరత జాతీయగీతాన్ని పాడనీయకుండా బుద్ధిపూర్వకంగా నిరోధించేవారికి, అది పాడుతున్నచోట డిస్టర్బెన్సు కలగజేసేవారికి మూడేళ్లవరకు జైలు శిక్ష) అని మాత్రమే దళ The prevention of insults to National Honour Act చెబుతుంది.
పాడకుండా అడ్డుపడితే జైల్లో వేస్తారు. బాగానే ఉంది. కాని ఎవరికీ అడ్డుపడకుండా, పాడేవారికి ఏ డిస్టర్బెన్సూ కలగజేయకుండా ఉండి జాతీయ గీతం పాడటానికి మాత్రం నిరాకరించే వారి సంగతేమిటి? దాన్ని నేను పాడను పొమ్మనే వాడు జాతీయ గీతాన్ని, జాతీయ చిహ్నాన్ని అవమానించినట్టా కాదా? చట్ట ప్రకారం వాడికి శిక్ష వేయాలా వద్దా?
ఆ సంగతి చట్టంలో స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి అలాంటి వాడిది నేరంగా పరిగణించనక్కర్లేదు; శిక్షించాల్సిన అవసరమూ లేదు - అని సాక్షాత్తూ సుప్రీంకోర్టే 1986లో ప్రశస్తమైన ధర్మ నిర్ణయం చేసింది!
మూడు దశాబ్దాల కింద కేరళలో స్కూల్ అసెంబ్లీలో జాతీయ గీతం పాడటానికి ముగ్గురు పిల్లలు నిరాకరించారు. వారు Jehovah's Witness Sect కి చెందినవారు. దేవుడైన యెహోవాను ప్రార్థించేవి మినహా మరే కర్మాచరణనూ తమ మతం అనుమతించదు కాబట్టి జాతీయ గీతంలో గొంతు కలిపేది లేదని వారు మొండికేశారు. స్కూలు అధికారులు వారిని గెంటేశారు. ఆ వ్యవహారం కోర్టుకెక్కింది. Bijoe Emanuel కేసుగా ప్రసిద్ధి చెందిన ఆ వ్యాజ్యంలో జస్టిస్ చిన్నప్పరెడ్డి, చిన్నప్పలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం-
‘‘జాతీయ గీతాన్ని ఎవరైనా పాడే తీరాలన్న నిబంధన చట్టంలో ఎక్కడా లేదు. దాన్ని పాడేటప్పుడు గౌరవ సూచకంగా నిలబడి, తాను మాత్రం పాడటానికి నిరాకరించిన వ్యక్తి జాతీయ గీతాన్ని అగౌరవపరిచినట్టుగా పరిగణించరాదు... గీతం పాడేటప్పుడు గౌరవ సూచకంగా నిలబడి మత విశ్వాసాల కారణంగా తాము దాన్ని పాడబోమన్న ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి బహిష్కరించటం మత స్వాతంత్య్రానికి, స్వేచ్ఛాయుత మతాచరణకు వారికున్న ప్రాథమిక హక్కును భంగపరచటమే అవుతుంది’’ అని 1986 ఆగస్టు 11న చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
‘‘జాతీయగీతాన్ని పాడటాన్ని అడ్డుకుంటే, పాడే చోటును డిస్టర్బ్ చేస్తే 3 ఏళ్ల వరకు ఖైదు’ అని మాత్రమే Prevention of Insults to National Honour Act చెబుతున్నది. కేరళ బడి పిల్లలు జాతీయ గీతాన్ని అడ్డుకోలేదు. పాడే చోటును డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి చట్టరీత్యా వారు అపరాధులు కారు. పైగా గీతం పాడేటప్పుడు వారు గౌరవ సూచకంగా నిలబడ్డారు. కనుక జాతీయ గీతాన్ని వారు అగౌరవపరిచారని అనలేము’ అని సుప్రీంకోర్టు ఉవాచ.
కనీసం ఈ తీర్పు తరవాతైనా చట్టంలోని లొసుగు సర్కారువారి బుర్రకెక్కి ఉండాలి. జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించడం కూడా జాతీయ గౌరవాన్ని అవమానించటమే, శిక్షార్హమైన నేరమే అని చట్టానికి సవరణ తెచ్చి ఉండాల్సింది. మరి ఘనత వహించిన ప్రభుత్వం ఏమి చేసింది? అలాంటి సవరణకు ఉపక్రమించిన పాపాన పోలేదు సరికదా... సినిమా తెరమీద జాతీయ గీతాన్ని ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడితే వెనక ఉన్నవారికి అసౌకర్యం, హాల్లో గందరగోళం తప్పవు కాబట్టి ఎవరూ నిలబడాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం అమోఘమైన ఆదేశాలను జారీ చేసింది.
కేరళ బడిపిల్లలు జాతీయ గీతం పాడేటప్పుడు కనీసం నిలబడ్డారు కనుక జాతీయ గీతాన్ని గౌరవించినట్టేనని సుప్రీంకోర్టు తృప్తి చెందగా... అలా నిలబడాల్సిన అసరం కూడా లేదని సర్కారువారు మరింత వెసులుబాటు ఇచ్చారు. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉండగా ఇదే జస్టిస్ దీపక్‌మిశ్రా జాతీయ గీతానికి అవమానకరమైన దృశ్యాలు ఉన్న ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ చిత్ర ప్రదర్శనను పదమూడేళ్ల కింద నిషేధిస్తే- ఇదిగో ఈ ప్రభుత్వాదేశాల ఆధారంగానే సుప్రీంకోర్టు డివిజన్ బెంచి ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దాన్ని పునఃసమీక్షించి, జాతీయ గీతాన్ని గౌరవించటానికి సంబంధించి స్పష్టమైన ధర్మ నిర్ణయం చేయాలని రివ్యూ పిటిషను పెడితే ఏమయింది? ‘ఇది చాలా గహనమైన విషయం. సరైన సందర్భంలో దీనిపై నిర్ణయం చేయబడును’ అని 2006 నవంబర్ 15న ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచి కప్పదాటు వేసింది. తరువాత పది సంవత్సరాలు తిరిగినా, కీలక న్యాయనిర్ణయం చేయటానికి సుప్రీంకోర్టు వారి దృష్టిలో తగిన సమయం రాలేదు.
జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించటం జాతి గౌరవాన్ని కించపరచినట్టు అవుతుందా కాదా? జనగణమన పాడేటప్పుడు గౌరవ సూచకంగా అందరూ నిలబడితీరాలన్న కట్టడి ఉండాలా వద్దా? అదే ఇప్పుడు శేష ప్రశ్న. చట్టంలోని అస్పష్టతవల్ల, కోర్టు తీర్పుల సందిగ్ధతవల్ల చిరకాలంగా అలుముకున్న అయోమయాన్ని తొలగించటానికి జస్టిస్ దీపక్‌మిశ్రా చొరవ తీసుకుని ఇచ్చిన రూలింగు ఉపకరిస్తుంది. సహృదయంతో దాన్ని అర్థం చేసుకుని, జాతీయ గీతం గౌరవాన్ని నిలబెట్టటానికి చట్టపరంగా గట్టి బిగింపు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం పౌరసమాజ బాధ్యత. దాన్ని విస్మరించి, జాతీయగీత దుర్వినియోగాన్ని నిరోధించాలన్న తపనతో రూలింగు ఇచ్చిన మిశ్రామీదే బుద్ధిజీవులు యావన్మందీ విరుచుకుపడటం ఈ కాలంలో జాతీయతకు, దేశభక్తికి పట్టిన దుర్గతికి సూచిక.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ