ఉన్నమాట

పాపాల పాకిస్తాన్‌కు కావలసిందీ యుద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధాన్ని ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. మన దేశంలో మాత్రం న్యూస్ చానెళ్లు ప్రకటిస్తాయి.
అధీనరేఖ సమీపాన ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ ఏజంట్లు ఈ సెప్టెంబర్ 18 ఉదయం దొంగదాడి చేసి 18 మంది సైనికులను బలిగొన్న కిరాతక ఘాతుకానికి యావద్దేశం మండిపడింది. హిందుస్తాన్‌ను వెయ్యిపోట్లు పొడవటమే పాలసీగా పెట్టుకుని, పెంపుడు టెర్రరిస్టులను ప్రయోగించి ఉచ్చనీచాలు లేకుండా పేట్రేగుతున్న ఇస్లామాబాద్‌ది ఇది నూరో తప్పుగా పరిగణించి, దాని పీచమణచేందుకు సుదర్శన చక్రం పట్టాల్సిందేనన్న ధర్మాగ్రహం దేశమంతటా పెల్లుబికింది. దురాగతానికి పాల్పడిన వారిని శిక్షించకుండా వదిలేదు లేదు అని దేశ ప్రధాని గర్జించాడు. అది వట్టిమాట కాదు; చేసి చూపిస్తాం; ఎలా చేయాలన్నది సీరియస్‌గా ఆలోచిస్తున్నాం - అని రక్షణమంత్రి చెప్పాడు. తదుపరి కార్యాచరణ గురించి ఉన్నతస్థాయిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
దుర్మార్గపు దాడి జరిగి ఇంకా వారం తిరగలేదు. ప్రభు త్వం మనసులో ఏముందో తెలియదు. ‘ఇలా అనుకుంటున్నాం, అలా చేయబోతున్నాం’ అని ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం చెప్పదు. చెప్పాలనీ మనం ఆశించకూడదు. తలపెట్టింది అమలుపరిచేందుకు సర్కారుకు తగినంత సమయం ఇవ్వాలి. ఏమి జరిగేదీ వేచి చూసి, ఆ తరవాతే మంచిచెడ్డల నిగ్గు తేల్చాలి. దేశానే్నలే వారికి బుర్రలేదు, చేవలేదు అని కార్యరంగంలో తేలితేనే ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మనం వారికి క్లాసు తీసుకోవాలి.
ఒక బాపతు మన మీడియా సర్వజ్ఞులకు అంత ఓపిక లేదు. వేచి చూసేంత టైమూ లేదు. రాక్షస చర్య జరిగీ జరగగానే వారు రంగంలోకి దూకారు. ప్రతిక్రియ ఏ మోతాదులో, ఏ విధంగా ఉండాలో యమర్జంటుగా నిర్ణయించారు. ప్రభుత్వానికీ, మిలిటరీకి శ్రమ ఇవ్వడం ఎందుకని పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఆగమేఘాల మీద తామే ప్రకటించారు. 24 గంటల న్యూస్ చానెళ్లలో వీక్షకుల దిమ్మతిరిగి, బ్లడ్‌ప్రెషరు పెరిగేలా తెరపి లేకుండా చండప్రచండంగా మాటల యుద్ధం సాగిస్తూ తాము ఎంచక్కా తోవ చూపినా, ఇంకా అసలు యుద్ధం ప్రకటించనే లేదేమిటని వీరశూర సైనిక మాజీలూ, అమాంబాపతు మేధావులూ మోదీ సర్కారు మీద నిప్పులు కక్కుతున్నారు. ఇలా వెనకబడి తాత్సారం చేస్తే జాతి సహించదు; చరిత్ర క్షమించదు అని బోలెడు భయపెడుతున్నారు.
జాగు చేయకుండా సైనిక దళాలను సరిహద్దు దాటించాలి. ఆ మధ్య మ్యాన్‌మార్‌లోకి చొరబడి టెర్రరిస్టులను వేటాడినట్టుగానే అధీనరేఖకు ఆవల పాక్ తైనాతీ ఉగ్రవాదులను శిబిరాలతో సహా తుదముట్టించాలి. ఆక్రమిత కాశ్మీర్‌ను విముక్తిచేసి, అదే ఊపులో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి, లష్కరే, జైషే వగైరా టెర్రరిస్టు పుట్టలను పెకలించాలి. అడ్డమొచ్చిన శత్రుసేనను చిత్తుగా ఓడించి, నవాజ్ షరీఫ్, మిలిటరీ షరీఫ్‌ల చేత లొంగుబాటు పత్రం మీద సంతకం చేయించి, ఈలవేస్తూ తిరిగి రావాలి. స్థూలంగా ఇదీ - వీరజాతీయవాద మాటల మల్లుల వీరవాక్కు. పిరికితనం ఇంకెంత కాలం, ఇప్పుడు కాకపోతే దెబ్బకు దెబ్బ ఇంకెప్పుడు అని వారి పౌరుషాల, రోషాల బుసబుస.
ఆలోచనలో తప్పులేదు. నిజంగా అలా చేయగలిగితే అంతకంటే కావలసింది మరొకటి లేదు. 1965లో ఇలాగే దొంగదాడులకు దిగిన పాకిస్తాన్ భరతం పట్టి, దాని సైనిక దురాక్రమణను వీరోచితంగా తిప్పికొట్టినట్టే... 1971లో నేరుగా పాకిస్తాన్ మీదికి దండెత్తి, దానిని రెండు ముక్కలు చేసి విజయ ఢంకా మోగించినట్టే తలచుకుంటే ఇప్పుడు కూడా పాపిష్టి శత్రువును తుత్తు నియలు చేయగిలగిన సైనిక శక్తి భారతదేశానికి ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాల తరువాత ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మిలిటరీ ఉన్న మనకు ఆఫ్టరాల్ ఒక పాకిస్తాన్ కొమ్ములు విరచడం పెద్ద కష్టం కాదు. దాని దగ్గర అణ్వాయుధాలు ఉంటే అవి మనకూ ఉన్నాయి. న్యూక్లియర్ బాంబును మొదట అది ప్రయోగిస్తే మనకు భయానక నష్టమే. కోలుకోలేని విధ్వంసమే. కాని అదే పద్ధతిలో మనం ఎదురుదాడి చేశాక పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా నాశనమవుతుంది. ఆ సంగతి దానికీ తెలుసు. కాబట్టి బతుకు మీద ఏమాత్రం ఆశ ఉన్నా న్యూక్లియర్ యుద్ధానికి సాహసించలేదు. ఒకవేళ ఆత్మహత్యాసదృశ ఉన్మాదానికి అది పాల్పడుతుందనుకున్నా మన కాళ్లు చల్లబడాల్సిన అగత్యం లేదు. యుద్ధం అనివార్యం అయినప్పుడు, పర్యవసానాలకు బెదరకుండా, అన్నిటికీ సిద్ధపడి శత్రుసంహారం చేయటమే క్షాత్రధర్మం.
అలాంటి యుద్ధం ఇప్పుడు అత్యవసరమా?
దెబ్బకు దెబ్బ తీయలనుకోవటం మానవ సహజం. కాని - దేశాల మధ్య వ్యవహారం అయినప్పుడు ఆవేశంతోబాటు ఆలోచన కూడా కావాలి. మన చేత ఎదురుదాడి చేయించటం కోసమే విరోధులు నిష్కారణంగా దాడికి దిగారా అన్న వివేచన ఉండాలి. ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసింది పాకిస్తానీ టెర్రిరిస్టులైనా వారిని అందుకు పురమాయించింది ఇస్లామాబాద్ పాలకులు. ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని ఘాతుకాలకు పాల్పడ్డా కదలక మెదలక చేతులు ముడుచుకుని కూచున్న మునుపటి ప్రభుత్వాల వలె కాకుండా మోదీ ప్రభుత్వం అవసరమైనప్పుడు కర్కశంగా వ్యవహరించగలదని వారికి తెలుసు.
తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్ ప్రధానిని పిలువనంపటం, మనవరాలి పెళ్లిమిషతో అనుకోని అతిథిలా లాహోర్‌లో వాలటం వంటి విచిత్ర స్నేహ విన్యాసాలవల్ల పాకిస్తాన్ బుద్ధి మారదని అనుభవ పూర్వకంగా గ్రహించాక మోదీ వైఖరి కరకు బారింది. కిందటి జనవరిలో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరం మీద ఇలాగే దాడి చేయించి అనేక ప్రాణాలు బలిగొన్న దురంతానికి బాధ్యులైన ఐ.ఎస్.ఐ. వారినే దర్యాప్తు చేయరండంటూ ఘటనా స్థలానికి స్వాగతించటం వంటి పిచ్చి పనులు కొన్ని చేసి తల బొప్పి కట్టాక న్యూఢిల్లీ ధోరణి మారింది. ఆగస్టు 15 ప్రసంగంలో ఆక్రమిత కాశ్మీర్, బెలూచిస్తాన్‌లను నరేంద్రమోది ప్రత్యేకంగా ప్రస్తావించాక, అనేక అంతర్జాతీయ వేదికల మీద పాక్ దుర్నీతిని నిష్కర్షగా ఎండగడుతున్న తీరు గమనించాక ఆయన దగ్గర తమ పప్పులు ఉడకవన్న సంగతి ఇస్లామాబాద్‌కి అర్థమైంది. సుహృద్భావ చర్యలు, స్నేహపూర్వక సంభాషణలు, దౌత్య మర్యాదలు ఒకవైపు సిన్సియర్‌గా సాగిస్తూనే... అధీనరేఖను పాక్ సైనికులు అతిక్రమించిన ప్రతిసారీ వారికి దిమ్మతిరిగే భాషలో మన సైనికుల చేత బుద్ధి చెప్పించిన అనేక సందర్భాలు మన మీడియాకు ఎక్కకపోయినా, అవతలివాళ్లు మరచిపోలేరు.
సవాలును ధైర్యంగా స్వీకరించాలన్న పౌరుషం ఒకటే కాదు. పాకిస్తాన్ సైనిక సవాలుకు గట్టి జవాబు చెప్పటం నరేంద్ర మోదికి, ఆయన ప్రభుత్వానికి రాజకీయ అత్యవసరం. 2008లో ముంబయిని ముట్టడించి, 164 మంది ప్రాణాలు పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ఘోర దురాగతానికి ఏమీ చేయలేక చేవచచ్చి చేతులు ముడుచుకు కూర్చున్నాడని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను ఎన్నికల్లో దూదేకినట్టు ఏకి, తాను పాక్‌ల కొమ్ములు విరచగల ‘56 అంగుళా ఛాతీ’ మొనగాడినని చెప్పుకుని అధికారం అందుకున్న మోదీకి వెనకటి ప్రధానమంత్రులవలె అసమర్ధ సజ్జనత్వానికి పోతే రాజకీయంగా పుట్టగతులుండవు. మరికొద్ది నెలల్లో రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణరంగంలో ఈ భంగపాటుకు ఆయన పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి రాజకీయ స్వార్థం కోసమైనా పాక్ విషయంలో కరకుతనం చూపి తీరాలి.
అది తెలిసే, ఇండియాను కవ్వించి, ముగ్గులోకి లాగటం కోసమే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ భారత్‌పై ధ్వజమెత్తనున్న అదనులో ఇస్లామాబాద్ పంజా విసిరింది. టెర్రరిస్టు ముసుగు వేసి తన తైనాతీలను ప్రయోగించి, తన సైన్యం చేత వారికి సర్వవిధాల తోడ్పాటు నందించి, ఉరీ సైనిక స్థావరం మీద తీరికూర్చుని దాడి చేయించింది. తమ సైనికులను క్రూరంగా హతమార్చిన ఘాతుకంతో జాతి భగ్గుమని... ప్రతీకారంకోరే ప్రజాభిప్రాయానికి, మీడియా ఒత్తిడికి తట్టుకోలేక న్యూఢిల్లీ సైనిక చర్యకు దిగితే అవిగో దురాక్రమణ. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించినందుకే ఈ కక్ష; ఇండియా రాక్షసత్వానికి ఇదే ప్రతీక’ అంటూ అంతర్జాతీయ వేదికపై యాగీ చేయాలని ఇస్లామాబాద్ దురాలోచన.
దుర్మార్గంగా తమ జోలికి వచ్చిన వారికి తగురీతిలో శాస్తి చేయటం మనుషులకే కాదు - దేశాలకూ అవశ్య కర్తవ్యమే. పరాయ దేశం తమను దొంగదెబ్బ తీసి, తమ సార్వభౌమాధికారానే్న సవాలు చేసినప్పుడు, కష్టనష్టాలను లెక్క చేయకుండా, సైనికదాడి చేసి శత్రువుకు మరవలేని గుణపాఠం నేర్పటం ప్రభుత్వాల హక్కు. దానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. మరో దేశాలకో ఇంకో వ్యవస్థకో ఫిర్యాదు చేసి న్యాయం కోసం దేబిరించాల్సిన పనిలేదు. సమయానికి వాడుకోలేనప్పుడు సైనిక శక్తి ఉండీ దండుగ. సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోలేనప్పుడు సార్వభౌమాధికారం ఉండీ వృధా. అలా కరాఖండిగా నిలబడి, పాపిష్టి పాకిస్తాన్‌ను పరాక్రమంతో శిక్షించవలసిన సమయం ఇటీవలి దశాబ్దాల్లో మొట్టమొదట 2001లో వచ్చింది. ఏకంగా భారత పార్లమెంటు పైనే పాకిస్తానీ ఏజంట్లు విరుచుకు పడి అన్ని పార్టీల జాతీయ ప్రముఖులను మట్టు పెట్టేందుకో, చెరబట్టేందుకో బరి తెగించిన దురంతమది.
అలుగుటయే ఎరుగని అపరధర్మరాజు వాజపేయ అప్పటి ప్రధాని. అంతటి వాడికే ఆగ్రహం వచ్చి పాకిస్తాన్ మీద ‘తప్పదు యుద్ధము’ అని నిశ్చయానికైతే వచ్చాడు. కాని మల్లగుల్లాలు పడి సైనిక దళాలను సరిహద్దులకు తరలించడానికే మూడు వారాలకు పైగా తీసుకున్నారు. ఈ లోపు పాకిస్తాన్ కూడా త్వరపడి తన సైన్యాన్నీ పొలిమేరల్లో నిలిపింది. పరులకు నీతులు చెప్పటంలో నోరు పెద్దదైన అమెరికా కలగజేసుకుని, తనదైన పద్ధతిలో చక్రం అడ్డువేసి భారత ప్రభుత్వం కాళ్లు చేతులు కట్టేసింది. నెలల తరబడి సరిహద్దుల్లో పడిగాపులు పడి, మన వీరసైనిక దళాలు మొగాలు వేలాడేసుకుని వెనక్కి వచ్చాయ.
ఆ సిగ్గుచేటు భంగపాటు తరవాత సైనిక రంగంలో అంతేరిన మన హేమాహేమీలు కలిసి మళ్లీ అటువంటి అవసరం వస్తే ఏమి చేయాలి? అవసరమైన సైనిక బలగాలను చప్పున ఎలా సమీకరించాలి? అధీనరేఖ ఆవలికి మెరపు వేగంతో చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను, సైనిక స్థావరాలను ఎలా ధ్వంసం చేయాలి? ఆక్రమిత కాశ్మీర్‌ను అధాటున తిరిగి ఎలా వశపరచుకోవాలి? పాకిస్తాన్ వెన్ను ఎలా విరచాలి? - వగైరా అంశాల మీద వ్యూహరచన చేసి యాక్షన్ ప్లానును తయారు చేశారు. దానికి ‘కోల్డ్‌స్టార్ట్’ అని గుప్తనామం పెట్టారు. ఆ సంగతి పాకిస్తాన్‌కి తెలుసు. అది అనుకున్న ప్రకారం అమలైతే తన పని ఖాళీ అనీ ఇస్లామాబాద్ ఎరుగును. అనేక సందర్భాల్లో ఆ ఆక్రోశాన్ని బహిరంగంగా వెళ్ల గక్కింది కూడా.
మన ప్రభుత్వం తలచుకుంటే ఉరీ ఉత్పాతం వెను వెంటనే ‘కోల్డ్‌స్టార్ట్’ ఆపరేషనుకు సిగ్నలు ఇవ్వగలిగేది. కాని ఇవ్వలేదు. ఎందుకంటే - అది శత్రువు ఆదమరచి ఉండగా మెరపు వేగంతో జరగాల్సిన ఆపరేషను. ఉరీలో పైశాచిక దాడికి దిగేటప్పుడే ఇండియా నుంచి అలాంటి ప్రతిక్రియను ఇస్లామాబాద్ ఊహించింది. దానిని ఎదుర్కొవడానికి సరిహద్దుల వెంబడి తన బలగాలను సన్నద్ధం చేసింది. మన వైపు నుంచి ఏ కాస్త దూకుడు కనిపించినా, ఘోరం... దారుణం అని గగ్గోలు పెట్టటానికి కాచుకుని ఉంది.
ఏతావతా - మెరపు దాడికి అప్పుడు అవకాశం లేదు మయన్మార్‌లోకి చొచ్చుకు వెళ్లి టెర్రరిస్టులను వేటాడినట్టు ఆక్రమిత కాశ్మీర్‌లోకి మనవాళ్లు అవలీలగా దూసుకు పోలేరు. ఎందుకంటే - మయన్మార్ ప్రభుత్వం అక్కడి సైనిక చర్యకు పరోక్షంగా తోడ్పడింది. అటువంటి పరిస్థితి ఆక్రమిత కాశ్మీర్‌లో లేదు. సాధారణ సైనిక శక్తితో పాకిస్తాన్ మనముందు బలాదూరే. కాని దానికి చైనా డ్రాగన్ అండ ఎల్లవేళలా ఉంది. తన పాకిస్తాన్‌ను పాలుపోసి పెంచి, కడుపులో పెట్టుకుని కాపాడే అమెరికా దన్ను సరేసరి. 1971లో ఇందిరాగాంధి పాకిస్తాన్‌ను పాదాక్రాంతం చేసుకోగలిగిందంటే నాటి పరిస్థితి వేరు. ప్రపంచంలో అప్పుడు అమెరికా, సోవియట్ సూపర్ పవర్ల ప్రాభవం దుర్నిరీక్ష్యంగా ఉండేది. సోవియట్ల అండ ఇండియాకు పరిపూర్ణంగా ఉన్నందువల్ల అమెరికా కూహకాలు పనిచేయలేదు. సోవియట్ సామ్రాజ్యం కాలగర్భంలో కలిశాక, దొంగదారిలో పాకిస్తాన్ అణ్వస్త్ర పాటవాన్నీ సమకూర్చుకున్నాక ఉపఖండంలో పరిస్థితి వౌలికంగా మారింది. పాకిస్తాన్ మీద బాహాటంగా యుద్ధ్భేరి మోగించే ముందు ఈ అంశాలన్నీ గుర్తుంచుకోవాలి.
కయ్యాన్ని కోరే పాకిస్తాన్ మీద ప్రత్యక్ష యుద్ధం ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నంత తేలిక కాదు. అలాగని మనం నిస్సహాయంగా చేతులెత్తెయ్యాలా? అంతర్జాతీయ సంస్థల ముందు విన్నపాలూ, ఫిర్యాదులతోనే సరిపుచ్చుకోవాలా? శత్రువు విసిరిన సవాలును తిప్పికొట్టడానికి ప్రత్యక్ష సమరం ఒకటే మార్గమా? మళ్లీ లేవకుండా విరోధిని దెబ్బతీయటానికి దానికంటే మేలైన ఉపాయాలు ఉన్నాయా?
వచ్చేవారం చూద్దాం.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ