ఉన్నమాట

వామపక్షుల గూట్లో విద్రోహపు గుడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియా డౌన్‌డౌన్
పాకిస్తాన్ జిందాబాద్
కశ్మీర్‌కీ ఆజాదీ తక్ జంగ్ రహేగీ జంగ్ రహేగీ
(కశ్మీర్‌కి స్వాతంత్య్రం వచ్చేదాకా యుద్ధం జరుగుతుంది)
భారత్ కీ బర్‌బాదీ తక్ జంగ్ రహేగీ జంగ్ రహేగీ
(్భరతదేశం నాశనమయ్యేదాకా యుద్ధం జరుగుతుంది)

ఏమిటివి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోనో, మన కాశ్మీర్ లోయలోనో పాక్ తొత్తులైన టెర్రరిస్టులు రివాజుగా వదిరే ప్రేలాపనలా?
కాదు. భారత రాజధానిలో ఉన్నత విద్య ఆలయమనవలసిన జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ (జె.ఎన్.యు.)లో మంగళవారం (్ఫబ్రవరి 9) రాత్రి విద్యార్థి మూకలు, వాటి వత్తాసుదారులు తెగబడి వేసిన నినాదాల రంకెలు.
సియాచెన్‌లో అనేక దినాల మంచు సమాధి నుంచి బయటపడి మృత్యువుతో పోరాడుతున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప క్షేమంకోసం జాతి జనులు యావన్మందీ వెయ్యి దేవుళ్లను ప్రార్థిస్తున్న సమయాన - దేశంలో ప్రతిష్ఠాత్మకమనబడే సెంట్రల్ యూనివర్సిటీలో జాతి వ్యతిరేకశక్తులు విజృంభించి వేసిన విశృంఖల వీరంగమిది.
అలాగని - విద్యార్థులు బుద్ధిగా హాస్టళ్లలో చదువుకుంటున్న సమయంలో, వారికి తెలియకుండా ఏ పాకిస్తానీ గ్యాంగో చొరబడి విషం కక్కి ఉండొచ్చని అనుకోకండి! చిరంజీవులైన విద్యార్థులే యూనివర్సిటీ అధికారులకు ముందుగా చెప్పే ఈ ‘‘కల్చరల్’’ ప్రోగ్రాం పెట్టుకున్నారు.
దేనికోసం?
మూడేళ్లకింద అదే రోజున ఉరి తీయబడ్డ జాతి విద్రోహి అఫ్జల్ గురుకూ, ముప్ఫైఏళ్ల కంటే ముందెప్పుడో ఉరితీయబడ్డ ఇంకో కాశ్మీరీ టెర్రరిస్టు మఖ్‌బూల్ బట్‌కీ భక్తిపూర్వక నివాళులు అర్పించడానికి! ‘ఆక్రమించబడ్డ కాశ్మీర్’ స్వాతంత్య్రం కోసం చేస్తున్న మహాపోరాటానికి సంఘీభావం తెలపడానికి. భారతదేశం నాశనం కావాలని శాపనార్థాలు పెట్టటానికి.
కాంపస్‌లో మేమేదో సరదాగా కల్చరల్ కార్యక్రమం, ఫోటో ఎగ్జిబిషను పెట్టుకుంటాం అనుమతించవలసింది అంటూ విద్యార్థి నాయకులు అడిగారట. ఓస్ అంతేకదా, దానికేముందిలెమ్మని దయగల పైవారు ‘సరే’ అన్నారట. అంతలో ఓర్వలేని ఎ.బి.వి.పి. వాళ్లొచ్చి అఫ్జల్‌గురు ఆరాధన కార్యక్రమానికి మీరెలా ఒప్పుకున్నారని అధికారులను నిలదీశారట. ‘ఔనా, మాకు తెలియదే... అలాగైతే పర్మిషన్ కాన్సిల్’ అని వాళ్లన్నారట. అయినా ‘గురు’్భక్తులు లక్ష్యపెట్టకుండా, తాము చేయదలచుకున్నది చేసేశారు. ‘ఆ సందర్భంలో వాళ్లు చేసిన తెంపరి నినాదాలు ఇవిగో’ అని మళ్లీ విద్యార్థి పరిషత్ వాళ్లు వీడియో సాక్ష్యాలతో చూపించాక వైస్‌చాన్సలరు ఉలిక్కిపడి పర్మిషన్ లేకుండా కార్యక్రమం జరిగిందా, అందులో ‘క్రమశిక్షణా రాహిత్యం’ ఉందా; ఉంటే దానికి పాల్పడిన వారిపై ఏమి చర్య తీసుకోవచ్చు’ అన్నది విచారించి చెప్పమని యూనివర్సిటీ ప్రోక్టరును పురమాయించాడు. ‘ఔను. పూర్తి సమాచారం ఇవ్వకుండా పర్మిషన్ కోరడం క్రమశిక్షణా రాహిత్యమే అవుతుంది’ అని రిజిస్ట్రారు గంభీరంగా ప్రకటించాడు.
యూనివర్సిటీ పెద్దల తెలివి తెల్లారినట్టే ఉంది.
విషయం విద్యార్థులు, వారి క్రమశిక్షణకు సంబంధించింది కాదు. మామూలు ‘డిసిప్లినరీ యాక్షను’ తీసుకుంటే గింటే సమసి పోయేదీకాదు. ప్రజల సొమ్ముతో నడిచే ఉన్నత విశ్వవిద్యాలయం జాతి వ్యతిరేక శక్తుల అడ్డగోలు అడ్డగా ఎలా మారింది, దానికి ఇప్పుడు ఏమి చేయాలి అన్నదే అసలు సమస్య.
జె.ఎన్.యు.లో జరిగింది అప్పటికప్పుడు కూడబలుక్కుని ఆకస్మికంగా చేసిన అకృత్యం కాదు. తాము చేయబోయే ఘనకార్యం చాటుతూ కొన్ని రోజుల ముందే యూనివర్సిటీ ప్రాంగణమంతటా నిర్వాహకులు అంటించిన పోస్టరును చూడండి.

బ్రాహ్మణీకపు సమష్టి అంతరాత్మకు వ్యతిరేకంగా-
అఫ్జల్‌గురు, మఖ్‌బూల్ బట్‌లను న్యాయస్థానపరంగా చంపడాన్ని నిరసిస్తూ-
స్వయం నిర్ణయాధికార ప్రజాస్వామిక హక్కుకోసం కాశ్మీరీ ప్రజల పోరాటానికి సంఘీభావంగా-
కళాకారులు, గాయకులు, కవులు, రచయితలు, విద్యార్థులు, మేధావులు, సాంస్కృతిక కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపే ‘సాంస్కృతిక సాయంత్రం’.

- అంటూ తమ ఉద్దేశాన్ని దేశద్రోహులు బాహాటంగా ప్రకటించారు. వైస్‌చాన్సలర్‌కి, రిజిస్ట్రారుకు కళ్లు లేవా? ఉన్నా ఆ పోస్టర్లు వారి దృష్టిలో పడలేదా? పడి ఉంటే, యూనివర్సిటీలో జాతి విద్రోహకాండను ఎలా సాగనిచ్చారు?
భారత రిపబ్లిక్‌లో అత్యున్నత శాసన వ్యవస్థ అయిన పార్లమెంటుపైనే బాంబులు వేసి, అన్ని పార్టీల జాతీయ నాయకులనూ ఒకేసారి మట్టుబెట్టబోయిన టెర్రరిస్టు నికృష్టుడు ‘అమరవీరుడా?’ పదేళ్లపాటు అంచెలంచెలుగా అన్ని కోర్టులూ ఇవ్వాల్సిన సందేహలాభాలన్నీ ఇచ్చాక... సాక్ష్యాధారాలనూ, అన్నిరకాల విన్నపాలనూ అన్ని కోణాల నుంచి కూలంకషంగా పరిశీలించి, ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఈ దేశపు సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించిన ఉరిశిక్షను అమలుచేయటం ‘జుడిషియల్ కిల్లింగ్’ అవుతుందా? ‘కిత్నే అఫ్జల్ గురు మారోగే హర్ ఘర్‌మే పైదా హోగా ఏక్ అఫ్జల్’ (ఎంతమంది అఫ్జల్‌గురులను చంపుతారు? ఇంటింటా ఒక అఫ్జల్ పుడతాడు) అని ఉచ్చనీచాలు లేకుండా పేలడం, ‘ఆప్ కీ అర్మానోంకో పూరా కర్‌నాహీ హమారా మక్సద్ హై’ (తమరి అభిమతాన్ని పూర్తి చేయడమే మా లక్ష్యం) అని చచ్చినవాడిని తలచుతూ సిగ్గులేని శపథాలు చేయటం భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవాలా? భారతదేశంలో ఉంటూ... భారతదేశం నాశనమయ్యేదాకా యుద్ధం చేస్తామనేవాడు తక్షణం నాలుకకోసి చర్మం ఒలిచి పిచ్చికుక్కలా చంపదగిన దేశద్రోహి కాడా? అంబేద్కరాదులు రచించిన రాజ్యాంగం ప్రకారం అవతరించిన సర్వసత్తాక రాజ్యవ్యవస్థనే గౌరవించని వాడు, ఆ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య హక్కులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూంటే దేశం చూస్తూ ఊరుకోవాలా?
అర్ధ శతాబ్దంగా పాకిస్తాన్ కబ్జాలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి మన వశం చేసుకోవాలని భారత పార్లమెంటు అన్ని పార్టీల మద్దతుతో రెండు దశాబ్దాలకంటే ముందే ఏకగ్రీవంగా తీర్మానించింది. నాటి నుంచి నేటిదాకా ఉన్న వివిధానేక ప్రభుత్వాలకు పార్లమెంటు తీర్మానాన్ని అమలుపరచి, జాతి పౌరుషాన్ని, సార్వభౌమాధికారాన్ని నిరూపించే మగటిమి కొరవడటం వేరే సంగతి. పాకిస్తాన్ కబళించిన కాశ్మీర్‌ని విడిపించి, తిరిగి మనలో ఎలా కలుపుకోవాలా అన్న అతిముఖ్య కర్తవ్యం మరపున పడటమే జాతి దౌర్భాగ్యం. కనీసం మనకంటూ మిగిలిన కాశ్మీర్‌ను కూడా మనకు కాకుండా చేయాలన్న దుర్బుద్ధితో భారత రిపబ్లిక్‌లో భాగమైన సరిహద్దు రాష్ట్రాన్ని భారత ఆక్రమణలో ఉన్నట్టుగా చిత్రించి, దాని విముక్తికోసం పాకిస్తానీల వత్తాసుతో ఇండియాపై పోరాడతామనేవారు... విద్యార్థులైతేనేమి, అధ్యాపకులైతేనేమి, మేధావులైతేనేమి, కవులూ, కళాకారులూ, సాంస్కృతిక శాల్తీలు అయితేనేమి... అందరికందరూ దేశానికి ప్రమాదకరమైన శత్రువులే.
ఇదేదో ఒక జె.ఎన్.యు.లో యాదృచ్ఛికంగా జరిగిన దుర్మార్గం కాదు. దీని వెనక పాకిస్తాన్ ఉంది. దాని తైనాతీలు పథకం ప్రకారం పన్నిన కుట్ర ఉంది. జె.ఎన్.యు.లో మోరసాచిన జాతి విద్రోహుల కొమ్ముగాయడానికి 26/11 ముంబయి ముట్టడికి సూత్రధారి అయిన హఫీజ్ సరుూద్ ట్విట్టర్‌లో ఎంత ఉత్సాహపడ్డాడో చూడండి:
We request our Pakistani brothers to trend. # support JNU for our Pro-Pakistani JNUites brothers. # Pak stand with JNU - Hafeez Muhammad Saeed (@hafeezsaeedJUD) February 10,2016.

(పాకిస్తాన్ అనుకూలురైన మన జెఎన్‌యు సోదరులకు మద్దతు తెలిపి, పాకిస్తాన్ జెఎన్‌యు వెంట నిలబడుతుంది అని ప్రకటించవలసిందిగా పాకిస్తానీ సోదరులను మేము కోరుతున్నాము.)
ఇక పాకిస్తాన్ బాంబు నిపుణుడు డాక్టర్ ఎ.క్యు.ఖాన్ సాహెబ్ ట్వీటాడు ఇలా: "Pakistan stands shoulder to shoulder with JNU freedom fighters. Freedom is their fundamental right." (జెఎన్‌యు స్వాతంత్రయోధులతో పాకిస్తాన్ భుజం కలిపి నిలబడుతుంది. స్వాతంత్య్రం వారి ప్రాథమిక హక్కు)
అర్థమైంది కదా? జె.ఎన్.యు.లో చేరినవి ఎటువంటి విషసర్పాలో? జాతి సమైక్యతను, సమగ్రతను అవి ఎలా కాటు వేయజూస్తున్నాయో? వాటిని ఉసికొలిపిందీ, అండదండలందిస్తున్నదీ ఏ విదేశీ శక్తులో?!
మైనస్ 60 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో, 5000 మీటర్ల కంటే ఎత్తు సియాచెన్ మంచుకొండల్లో దుర్భర పరిస్థితుల్లో అనుక్షణం మృత్యుభయంతో దేశం కోసం జీవితాన్ని అర్పించే సైనికుడికి ఇచ్చే హార్డ్‌షిప్ అలవెన్సు నెలకు రూ.31,500!
భారతదేశం నాశనమయ్యేదాకా యుద్ధం చేస్తామనే కారుకూతలతో, ‘ఇండియా డౌన్‌డౌన్’ నినాదాలతో దద్దరిల్లిన జె.ఎన్.యు.లో తిష్ఠవేసిన ప్రతి విద్యార్థి మీదా ప్రభుత్వం ఖర్చుచేసే ప్రజాధనం అక్షరాలా 3 లక్షల రూపాయలు!
అక్కడ రూము రెంటు నెలకు 11 రూపాయలు. సాలుసరి ఫీజు రూ.219లు. సబ్సిడీతో తిండి. అంతకంతకూ పెరిగిపోయే హాస్టళ్లలో ఉండేవారిలో విద్యార్థులకంటే బయటివారు ఎక్కువ.
ఆది నుంచీ జె.ఎన్.యు. వామపక్షుల గూడు. 60ల దశకం చివరిలో ఇందిరాగాంధికి కొమ్ముగాసినందుకు ప్రతిఫలంగా విద్య, సాంస్కృతిక రంగాలను కమ్యూనిస్టుల పరం చేయాలని కుదిరిన లోపాయకారీ ఒప్పందంలో భాగంగా జె.ఎన్.యు. అర్ధ శతాబ్దం కింద పుట్టినది లగాయతు లైఫిస్టుల అడ్డా అయింది. దీని మీద ప్రభుత్వం పెట్టే భారీ ఖర్చుకు తగ్గట్టుగా విద్యారంగంలో ఈ యూనివర్సిటీ ఊడబొడిచింది పెద్దగా లేదు. మిగతా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ముందు అకడమిక్‌గా ఇది కొరగాదు. కాని వామపక్ష, హిందూ వ్యతిరేక, అన్యమత పక్షపాత, సూడో సెక్యులర్ మేధావుల శ్రేణిని ఉత్పత్తి చేసి గుర్రపుడెక్కల్లా దేశమంతటా వెదజల్లడంలో జె.ఎన్.యు.ది గొప్ప గురుస్థానం. జె.ఎన్.యు. భారత వ్యతిరేక స్థావరంగా మారిందని, అక్కడ జాతి వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యస్వామి ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాడు. ఆయన అభియోగం అక్షరాలా నిజమని తాజా ఘటనలు రుజువుచేశాయి.
‘షహీద్ అఫ్జల్‌గురు’కు ఘన నివాళులు, ఇండియా నాశనాన్ని కోరే నినాదాలు వామపక్షాలవారు, వారికి తోడుబోయిన వారు చేయించినవి కాకపోవచ్చు. పాక్ భక్తుల విద్రోహుల వీరంగంలో వారికి ప్రమేయం ఉన్నదని నిర్దిష్ట ఆధారాల్లేకుండా ఆరోపించడం తగదు. కాని వారికి జాతి వ్యతిరేక పరిణామాలతో ఎటువంటి సంబంధం లేకపోతే... ఇండియాలో ఉంటూ ఇండియా రాజ్యాంగ సౌఖ్యాలను అనుభవిస్తూ భారత ప్రజల ఉప్పు తింటూ భారతదేశానికే వినాశనం కోరే పాకిస్తానీ తొత్తులు వామపక్షీయుల కోట అయిన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేసిన దురాగతాన్ని నిష్కర్షగా, నిశితంగా ఖండించి ఉండాల్సింది కదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి మరణానికి కేంద్ర విద్యామంత్రి, ప్రధానమంత్రే కారకులైనట్టు నిష్కారణంగా కాకిగోల చేయటంలో చూపిన అత్యుత్సాహంలో వెయ్యోవంతైనా చూపించి జె.ఎన్.యు.లో జాతి వ్యతిరేకుల దుశ్చర్యలను కనీసం తెగనాడి ఉండవద్దా? హైదరాబాద్‌లో విద్యార్థి మరణించాడనగానే రెక్కలుగట్టుకుని గద్దల్లా వాలిన రాహుల్‌బాబా, ‘ఆప్’ సోపాల క్రేజీవాలాలకు ఇంగిత జ్ఞానం ఏపాటి ఉన్నా... తామున్న ఢిల్లీలోనే, యూనివర్సిటీలో పాకిస్తానీ తొత్తుల దేశద్రోహ కార్యకలాపాలకు చీమకుట్టినపాటి అయినా చలించాలి కదా?
ఎవరి నైజం ఏమిటో తెలిసిందే కనుక ఈ బాపతు శాల్తీల మూగనోమువల్ల దేశానికి నష్టం ఏమీ లేదు. ఇప్పుడు జాతి ముందున్న ప్రశ్నలల్లా ఇవి: హైదరాబాద్ యూనివర్సిటీలో యాకుబ్ మెమెన్‌కు, జె.ఎన్.యు.లో అఫ్జల్ గురుకు నీరాజనాలిచ్చి, ఒకడిని ఉరితీస్తే ఇంటింటా అలాంటివారు వందమంది పుట్టుకొస్తారని నోరు పారేసుకోగలిగిన దేశద్రోహులను ఏమి చేయాలి? విశ్వవిద్యాలయాలలో జాతి వ్యతిరేక శక్తుల పీడను ఎలా విరగడ చేయాలి? ‘జికా’ వైరస్‌కంటే ప్రమాదకారి అయిన పాక్ ప్రేరిత జాతి వ్యతిరేక కుట్రలను తిప్పికొట్టటం ఎలా?
ఏమైనా లష్కరేలూ, ఐఎస్‌ఐలూ, హఫీజ్ సయాద్‌లూ భారత్ మీద కక్ష తీర్చుకోవడానికి ఇకపై పెద్దగా కష్టపడనవసరం లేదు. జె.ఎన్.యు.లో ‘కాంపస్ ప్లేస్‌మెంట్లు’ జాగ్రత్తగా చేసుకుంటే చాలు.

-ఎం.వి.ఆర్. శాస్త్రి