Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళిపెద్దలం
-షణ్ముఖశ్రీ-
*
దృశ్యం -1
(సంతోషరావు వేపచెట్టు దగ్గర కఱ్ఱతో వేప పువ్వును కోస్తుంటాడు)
సంతానలక్ష్మి: (లోపల్నుంచి) నా స్నానం అయిపోయింది. వేపపువ్వుకోసం ఇంకా కఱ్ఱతో కొడుతూనే ఉన్నారా? త్వరగా తెమలండి. ప్రసాదం చెయ్యాలి కదా!
సంతోషరావు: ఆ! ఆ! వస్తున్నా అయిపోయింది. కంట్లో చీమ పడితే తీసుకుంటున్నా. మామిడికాయలు, మామిడాకులు కోశాలే!
సంతానలక్ష్మి: (తనలో) కొత్త సంవత్సరం రోజున ఏది జరిగితే సంవత్సరమంతా అదే జరుగుతుందని చెబుతుంటారు. ఈ సంవత్సరమంతా ఈయనకు కంట్లో చీమలు పడుతూనే వుంటాయి కాబోలు. ఎలాగో ఏమో!
సంతోషరావు: ఆ వచ్చాలే! తెచ్చాలే! ఇక చెయ్యి ఆ ప్రసాదం!
సంతానలక్ష్మి: ఇదుగో క్షణంలో చేస్తా! ఈలోగా మీ స్నానం కూడా కానివ్వండి.
దృశ్యం-2
సంతోషరావు: ఉగాది ఉగాది అంటూ ఎదురు చూస్తుండగానే వికారినంటూ వచ్చింది. తలంట్లయినయ్. షడ్రచుల ప్రసాదం కూడా తిన్నాం. ఇక మిగిలిందల్లా షడ్రశోపేతమైన భోజనమే
సంతానలక్ష్మి: ఆ! షడ్రశోపేతమైన భోజనమే! ఓపికలు లేనివాళ్లం కదా అని వంటావిడను పెట్టుకొంటే ఓ పట్టాన రాదు. దవడలు బాధపడకుండా, పెరుగావడలయితే మెత్తగా బాగుంటాయని చెయ్యమందా మనుకుంటున్నాను. అదుగో! ఇపుడే వచ్చి వంట గదిలోకి వెళ్తోంది. నేవెళ్లి ఏమేం చేయాలో చెప్తాను. ఎంత వంట అయినా చెయ్యనని మాత్రం అనదు. ఓ గంటలోనే పూర్తిచేసి ఎగిరి గంతేసి వెళ్తుంది.
సంతోషరావు: ఏం చేస్తుంది మరి. నాలుగిళ్లలో చేయాల్సి వుండె. ఉడికినా ఉడక్కపోయినా, చూసీ చూడనట్టు, తినీ తిననట్లు సరిపెట్టుకోవాల్సిందే. ఏం చేస్తాం! తప్పదు.
సంతానలక్ష్మి: మీ మగాళ్ళందరికీ వున్న జబ్బే ఇది. పరాయి ఆడవాళ్ళను ఎంతయినా సమర్థిస్తారు. పెళ్ళాల్ని మటుకు పెడసరంగా విమర్శిస్తూనే వుంటారు. దీనే్న మగపైత్యం అంటారు.
లోపల్నుంచి కేక: అమ్మా! ఇవ్వాళ ఏం చేయమంటారు?
సంతానలక్ష్మి: ఆ! ఆ! వస్తున్నా!
సంతోషరావు: నన్ను దులపాల్సిందంతా దులిపి, లోపలికెళ్లింది దూకుడుగా, ఆమెనేం దులుపుతుందో ఏమో! నేను నా గదిలోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటా!
దృశ్యం-3
(సెల్ రింగయింది)
సంతోషరావు:హలో!
అటునుంచి: ఆ! హలో ఉగాది శుభకాంక్షలు. నన్ను గుర్తుపట్టారా ఆ మధ్య పార్కులో కలిశాం! దూరపుబంధువుని.
సంతోషరావు:ఆ! ఆ! గుర్తొచ్చారు, గుర్తొచ్చారు. కేశవరావుగారు. పెళ్లి సంబంధాలు చూస్తుంటామని చెప్పారు. అవునా!
క్లేశవరావు: ఆ! అవును. నేనే. మీ అబ్బాయికి పెళ్ళి సంబంధం చూడమన్నారుగా! ఓ సంబంధం వున్నది. కొత్త సంవత్సరంలో చెప్పొచ్చులే అని ఆగా! సాయంత్రం మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను.
సంతోషరావు: ఓ తప్పకుండా రండి!
క్లేశవరావు: ఓకె (సెల్ ఆఫయింది)
సంతానలక్ష్మి: (లోపల్నుంచి) వంటయింది, రండి భోజనానికి.
సంతోషరావు: ఆ! ఆ వస్తున్నా!
దృశ్యం-4
సంతోషరావు: ఏమేం చేయించావ్?
సంతానలక్ష్మి: చెయ్యల్సినవన్నీ చెప్పి మెత్తగా చెయ్యమన్నాను. అన్నింటినీ రెండు కుక్కర్లలో కుక్కి, అన్నీ మెత్తగానే వుంటాయ్. ఇహ కుక్కుకోండని, తిరిగి చూడకుండా, తిరగలిలా తిరుగుతూ జారుకుంది.
సంతోషరావు: సరేలే! వడ్డించు.
సంతానలక్ష్మి: అన్నం మాడువాసన వస్తోందని నేనే మళ్లీ వండాను. వడలు పళ్ళూడేటట్లున్నయ్. పాయసం ఫర్వాలేదు. పులిహోర పులి మాత్రమే తినగలిగేలా గట్టిగా వుంది. వంకాయ కూర మాత్రం వాలిపోయి మెత్తగా వుంది. ఎన్నింటికని వంకలు పెడతాం, మామిడి టెంకల్లా ఎండిపోయి వున్నవాళ్లం. ఎలాగోలా కుక్కుకొని పోయి పడుందాం!
సంతోషరావు:అంతేలే అంతకన్నా చేసేదేముంది. మన ఎనిమిది మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళయ్ కాపురాలు చేస్తూ మా దగ్గరొచ్చి ఉండమని ఎంత మొరపెట్టుకుంటున్నా ససేమిరా కాదంటావు. ఈ సొంతింటిని వదలి రానంటావు. ఏం చేయాలి?
సంతానలక్ష్మి:చాల్లే ఊరుకోండి. ఎవరన్నా పోయి ఆడపిల్లల దగ్గర వుంటారా? మనవాడి పెళ్లయితే కొడుకూ, కోడలు దగ్గర వుందాం! అష్టలక్ష్ముల్లాంటి ఆడపిల్లల్ని కన్నాక, వంశోద్ధారకుడు పుట్టాల్సిందే పుట్టాల్సిందే అంటూ పూజలు చెయ్యగా చెయ్యగా తొమ్మిదో సంతానంగా వీడు పుట్టాడు. పైగా ఆలస్యంగా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేకపోయి చాలా దూరంలో వున్నాడు. ఏం చేయాలి?
(ఇంకాఉంది)
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.