విజయనగరం

ఇ-ఆఫీసు విధానంలో ఫైళ్ల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 29: ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల నిర్వహణను ఇ-ఆఫీసు ద్వారా నిర్వహించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ- ఆఫీసు విధానంలో ఫైళ్ల నిర్వహణను చేపట్టాలని గతంలోనే ఆదేశాలు జారీ అయినా ఇప్పటివరకు కేవలం సర్వశిక్ష అభియాన్, పౌరసరఫరాల శాఖ, డిఆర్‌డిఎ, డ్వామా, వైద్య ఆరోగ్యశాఖ కొన్ని శాఖలు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయడాన్ని ప్రస్తావిస్తూ అన్ని శాఖలు ఈ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇ- ఆఫీసు విధానంతో ఫైళ్ల నిర్వహణ, సమస్యల పరిష్కారం, పెండింగ్ ఫైళ్ల సమాచారాన్ని ప్రతి వారం చివరి రోజున నివేదిక రూపేణా సంబంధిత శాఖలు అందజేయాలని ఆదేశించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులతో తయారుచేస్తున్న వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంవల్ల నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని చెబుతూ ఈ వినాయక చవితి పండగకు మట్టి విగ్రహాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా వనం-మనం కింద నాటిన మొక్కలను అధికారులు ప్రతి శనివారం పరిశీలించి నివేదికలు పంపించాలని జిల్లా అటవీశాఖ అధికారి వేణుగోపాలరావును కోరారు. మొక్కలు నాటే కార్యక్రమానికి అవసరమైన మొక్కల కోసం తమను సంప్రదిస్తే సరఫరా చేస్తామని చెప్పారు. పిల్లలకు సోకే నులిపురుగు వ్యాధిని నివారించేందుకు మంగళవారం జాతీయ డివార్మింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా డివార్మింగ్ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారద తెలిపారు.

ఉపాధి హామీని పరిశీలించిన
విదేశీ బృందం
విజయనగరం, ఆగస్టు 29: సామాజిక భద్రతకోసం దేశంలో అమలుచేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుతీరును వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రశంసించారు. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో కెన్యా, అజర్‌బైజాన్, ఘనా, మైన్‌మార్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భూటాన్ తదితర పది దేశాలకు చెందిన 13 మంది సభ్యుల బృందం జిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు వచ్చింది. బృందం సభ్యులు సోమవారం గంట్యాడ మండలం గొడియాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను, సోషల్ ఆడిట్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టరేట్‌లో కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ వివేక్ రాష్ట్రంలో, జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం పనుల తీరును వివరించారు. వర్షాలతో రైతులు విస్తృతంగా పంటలు పండించినా ప్రతి ఏడాది నాలుగు, ఐదు నెలలపాటు పనులు లేక రైతులు, రైతు కూలీలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ సమయాలలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌డిఐ సంస్థ ప్రతినిధులు డాక్టర్ రజనీకాంత్, శ్రీకాంత్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.

క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
* కలెక్టర్ వివేక్ యాదవ్

విజయనగరం, ఆగస్టు 29: విద్యార్థులు, యువతీ యువకులు చదువులతోపాటు క్రీడలపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. దేశ జనాభా వంద కోట్లు దాటిన ప్రస్తుత పరిస్థితులలో ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కించుకోవడం బాధాకరమని అన్నారు. హాకీ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఇండోర్ స్టేడియంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం పెరగడంతోపాటు మానసిక వికాసం ఏర్పడుతుందని, ఆరోగ్యవంతమైన జీవితానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలలో ప్రోత్సహించాలన్నారు. హాకీ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ స్ఫూర్తిగా తీసుకుని యువత క్రీడలలో రాణించాలని అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఎక్కువ నిధులు కేటాయించడంతోపాటు వివిధ ప్రోత్సాహకాలను ఇవ్వాలని తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్‌లను సన్మానించారు. ఈకార్యక్రమంలో అదనపు జెసి నాగేశ్వరరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆనందలక్ష్మి పాల్గొన్నారు.