విజయనగరం

ప్రభుత్వ ప్రాధాన్యతలతోపాటు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 29: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతోపాటు విద్య, వైద్య శాఖలపై ప్రత్యేకదృష్టి పెడతామని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సరైన అవగాహన లేక వాటిని వినియోగించుకోలేక పోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అక్షరాస్యత కేవలం 60శాతం మాత్రమే ఉండటాన్ని ప్రస్తావిస్తూ, అక్షరాస్యత పెంచటం ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పిచటంతోపాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వవల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ తరగతుల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూ జిల్లాలో ఇప్పుడిప్పుడే డిజిటల్ తరగతుల ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు.
మాతా, శిశు మరణాల తగ్గింపునకు
వైద్య సేవలు విస్తృతం
అదేవిధంగా జిల్లాలో వైద్యసదుపాయాలు మెరుగు పరిచేందుకు చర్యలు విస్తృతం చేయవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలోని చాలా కుగ్రామాలకు వైద్యసదుపాయం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులు జబ్బుపడటం, మరణించటం సంఘటనలపై మాట్లాడుతూ ఏజెన్సీలోని ప్రభుత్వ హాస్టళ్లకు ప్రతి గురువారం ఆయా పరిధులలోని ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణలో భాగంగా తల్లిబిడ్డలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగితే మాతా, శిశుమరణాలను తగ్గించవచ్చనని చెబుతూ, కొన్నిచోట్ల ప్రైవేటు మంత్రసానుల సహాయం తీసుకోవటం ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు.
‘్భగాపురం’ భూసేకరణ వేగవంతం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం భూసేకరణ పెద్దఎత్తున జరుగుతోందని కలెక్టర్ చెప్పారు. గతంలో కొన్ని సమస్యల కారణంగా భూసేకరణలో జాప్యం ఏర్పడిందని చెబుతూ ఇప్పుడు ఆ సమస్యలను అధిగమించామని కలెక్టర్ వివేక్ అన్నారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల నుంచి 1352ఎకరాల భూమిని సేకరించేందుకు డిక్లరేషన్ ఇచ్చామని తెలిపారు. విమానాశ్రయ నిర్మాణంలో ఆస్తులు కోల్పోయే కుటుంబాలకు ఐదు ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ ఇక్కడ పునరావాసం కోసం అవసరమైన వౌళిక సదుపాయలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధితులు ఇష్టం వచ్చిన చోట పునరావాసం ఏర్పాటు చేసుకోవచ్చనని అన్నారు. భూములు, ఆస్తులు కోల్పోయిన కుటుంబాలలోని 18సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు వారికి వివిధ ట్రేడ్‌లలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గాంధీ జయంతి నాటికి
50 ఓడిఎఫ్ గ్రామాలు
జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి 50 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఈనెల 31వతేదీన ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఉపాధిహామీ పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు వస్తే సోషల్ ఆడిట్ నిర్వహించి అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేయటంతోపాటు డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో పలు ఇబ్బందులు ఏర్పడినట్లు తన దృష్టికి వచ్చిందని, మీ ఇంటికి మీభూమిలో భాగంగా ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు రేషన్ సరుకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, ఖాళీగా ఉన్న రేషన్‌షాపుల డీలర్ల నియామకంతోపాటు ఇ-పాస్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
వర్షాభావ పరిస్థితుల్లో
ప్రత్యామ్నాయ పంటలపై చర్యలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని కొన్ని వర్షాధార ప్రాంతాల్లో రైతులు ఇప్పటికీ పంటలు వేయలేదని చెబుతూ సెప్టెంబర్ రెండవ వారం వరకు చూసి ప్రత్యామ్నాయ పంటలపై ప్రయత్నాలు చేపడతామని అన్నారు. ఇప్పటికే పంటలు వేసి వర్షాలు లేక ఎండిపోతున్న ప్రాంతాల్లో పంటలను కాపాడేందుకు 98 రెయిన్‌గన్లను ఇప్పటికే తెప్పించామని, సోమవారం నుంచే వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు ప్రారంభించారని చెప్పారు. నీటివనరులు అందుబాటులో ఉన్నచోట ఆయిల్ ఇంజన్లు ఏర్పాటుచేసి ఆ ప్రాంతాల్లోని భూములలో వేసిన పంటకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, జిల్లా ముఖ్యప్రణాళికాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాల్లో
పోలీసుల సేవలు ప్రశంసనీయం
నెల్లిమర్ల, ఆగస్టు 29: కృష్ణా పుష్కరాల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయమని విజయనగరం డిఎస్పీ ఎ.వి.రమణ అన్నారు. నెల్లిమర్లలో నిర్వహించిన పోలీసుల అభినందన సభలో డిఎస్పీ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల్లో పోలీసుల సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిజిపి ప్రశంసించారని కొనియాడారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకు చెందిన పోలీసులు పుష్కర ఘాట్లవద్ద బందోబస్తు నిర్వహించారని వెల్లడించారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానాలు ఆచరించేందుకు పోలీసులు సహాయ సహకారాలు అందించారన్నారు. ముఖ్యంగా వృద్ధులను, దివ్యాంగులను నేరుగా పుష్కర ఘాట్ల వద్దకు పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. కృష్ణాపుష్కరాలతో పోలీసులకు మంచిపేరు వచ్చిందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి సేవలు అందించినందుకు పలువురు నుంచి ప్రశంసలు పొందినట్లు చెప్పారు. ఇంతకు ముందు పోలీసులు అంటే ప్రజల్లో భయం ఉండేదని, పుష్కర సేవలతో ఆ భావం తొలగిపోయిందన్నారు. పుష్కరాల్లో ఫ్రెండ్లీ పోలీసు అనే పదానికి సార్థకత చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సిఐ రవికుమార్, నెల్లిమర్ల, గుర్ల, విజయనగరం రూరల్, గంట్యాడ ఎస్సైలు ఉపేంద్రరావు, నారాయణరావు, శ్రీనివాసరావు, వాసుదేవరావు పాల్గొన్నారు.