విజయనగరం

ఇరకాటంలో సహకార బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 21: కేంద్రం రద్దు చేసిన కరెన్సీ నోట్లతో సహకార బ్యాంకులు ఇరకాటంలో పడ్డాయి. రద్దయిన నోట్లను ఇతర బ్యాంకులలో స్వీకరించేందుకు ఆర్‌బిఐ గడువు విధించినప్పటికీ, సహకార బ్యాంకులలో ఆ నోట్లు చెల్లుబడికావని స్పష్టం చేయడంతో ఇటు రైతులు, అటు సహకార బ్యాంకు సిబ్బంది విలవిలలాడుతున్నారు. జిల్లాలో 34 మండలాల పరిధిలో 94 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారానే రైతులకు రుణాల పంపిణీ, ఎరువులు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో రూ.264 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.184 కోట్లు రుణాలు పంపిణీ చేయగలిగారు. అలాగే రబీలో రూ.79 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సహకార బ్యాంకులకు పాతనోట్లు డిపాజిట్లుగా స్వీకరించేందుకు అభ్యంతరాలు ఉండటంతో బ్యాంకులు ఢీలా పడ్డాయి. వాణిజ్య బ్యాంకులకు రద్దయిన నోట్లు చెల్లుబాటు అవుతున్నప్పుడు అదే సౌకర్యం తమకు కల్పించాలని సహకార బ్యాంకులు పట్టుబడుతున్నాయి. దీనిపై ఈ నెల 25న దేశ వ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉండగా రైతులకు రుణాలు, ఇతర అవసరాల నిమిత్తం రూపే కార్డులు అందుబాటులో ఉన్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి 20 శాతం మంది రైతులకు కూడా ఎటిఎంలు లేదా రూపే కార్డులు అందుబాటులో లేవు. వారంతా ఎక్కువగా పోస్ట్ఫాసులు, సహకార బ్యాంకులపై ఆధారపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సదుపాయాలు లేకపోవడం ఇతర కారణాల వల్ల సహకార సంఘాలపై ఆధారపడే వారి సంఖ్య అధికంగా ఉంది. వాణిజ్య బ్యాంకులలో రుణాలు పొందాలన్న ఆంక్షలు అధికంగా ఉండటం, ఇతర కారణాల వల్ల రైతులు ఎక్కువగా సహకార బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ఒకవేళ వాణిజ్య బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్నా, బంగారు ఆభరణాలపై రుణాలు పొందిన వాటిని పంట రుణాల్లో చూపకపోవడం వల్ల గతంలో రైతులు పంట నష్టపరిహారం పొందడానికి వీలుండేది కాదు. అందువల్ల అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు రైతుల్లో ఎక్కువ మంది సహకార బ్యాంకులపై ఆధారపడుతున్నారు.
రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తుండగా, సహకార బ్యాంకులలో డిపాజిట్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్‌బిఐ ఆంక్షలు సడలించి తమకు పాత నోట్లతో డిపాజిట్లు స్వీకరించే వెసులుబాటు కల్పించాలని సహకార బ్యాంకులు కోరుతున్నాయి. దీనిపై 25న దేశ వ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నట్టు పిఎసిఎస్ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు పేర్కొన్నారు.