విజయనగరం

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం అమలుచేస్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. శనివారం ప్రపంచదివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో వికలాంగ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మృణాళిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ పథకంలో మూడు శాతం ఇళ్లను దివ్యాంగులకు కేటాయించడానికి చర్యలు తీసుకుని శాఖ ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందించడానికి ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చామని చెప్పారు. జిల్లాలో నియోజకవర్గానికి 37 వరకు ఇళ్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికీ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగులకు పింఛన్ 500 ఉండేదని దానిని 1500 పెంచి వారికి ఆత్మ విశ్వాసం కలిగించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కిందని చెప్పారు. విద్యకు వారి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తే వారు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకునేందుకు తగు అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి ముందుకు రావాలని హితవుపలికారు. కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ దివ్యాంగులు సాధారణ మనుషులకన్నా ఎందులోనూ తక్కువ కాదని అన్నారు. తనతో పాటు ఐఎఎస్‌కు గోపాలకృష్ణ అనే దృష్టిలోపం కలిగిన వ్యక్తి ప్రిపేర్ అయి సహాయకుని సాయంతో ఎకనామిక్స్‌లో పరీక్ష రాసి ఇండియాలో 80వ ర్యాంకు సాధించి తొలి ఐఎఎస్‌గా చరిత్ర సృష్టించారని ఇపుడు ఆయన మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లాకు కలెక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా కర్నాటకకు చెందిన అంగవైకల్యం కలిగిన జిల్లా మేజిస్ట్రేట్ పారా ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ దేశానికి సాధించగలిగారని అటువంటివారిని స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంగా సాగాలని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ దివ్యాంగులకు 10వ తరతగతి వరకు చదువుకునేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ప్రత్యేకంగా ఉన్నాయని అంటూ వారికోసం ఇంటర్, డిగ్రీ వరకు ప్రత్యేక కళాశాల ఏర్పాటుచేస్తే ప్రభుత్వ, ఇతర రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం వారికి లభిస్తుందని సూచించారు. ఈసందర్భంగా ఈనెల 19న జిల్లా స్ధాయి క్రీడల్లో రాణించి విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. గురుదేవా చారిటబుల్ ట్రస్ట్, వికలాంగ శాఖ ద్వారా పలువురు వికలాంగులకు మూడు చక్రాల
సైకిళ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు అధికారి లక్ష్మణరావు, బిసి కార్పొరేషన్ ఇడి నాగరాణి, వికలాంగ శాఖ ఎడి మూర్తి, బిజెపి రాష్ట్ర నాయకులు శివప్రసాదరెడ్డి పలువురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

అవినీతిని అరికట్టండి
* 3-9 వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
* ఎసిబి డిఎస్పీ లక్ష్మిపతి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 3: అవినీతిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ఎసిబి డిఎస్పీ సిహెచ్.లక్ష్మిపతి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు కరపత్రాలు పంపిణీ, 4, 5 తేదీల్లో బహిరంగ సమావేశాలు, 6న పిటిసిలో శిక్షణ పొందుతున్న ఉద్యోగులకు అవగాహన, 7న పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన, 8న వ్యాసరచన పోటీలు, 9న బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ముగింపు కార్యక్రమాన్ని స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా, అవినీతి రహిత సమాజం నెలకోల్పేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు లక్ష్మోజీ, రమేష్ పాల్గొన్నారు.

జీతాలు, పింఛన్ల కోసం కష్టాలు!
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 3: ఉద్యోగులు, పింఛనుదారులు బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకునేందుకు నానా యాతనలు పడ్డారు. శనివారం బ్యాంకులు తెరచి ఉంచినప్పటికీ ఖాతాదారులు గంటల కొద్దీ క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. తీరా క్యూలో వేచి ఉండి కౌంటర్ దగ్గరకు వెళ్లేసరికి వృద్ధులలో చాలా మందికి రూ.వెయ్యి పింఛను సొమ్ము జమకాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఈసురోమంటూ వెనుదిరిగారు. మరి కొంతమంది ఖాతాదారులు ఆయా బ్యాంకులకు పాస్ పుస్తకాలతో వెళ్లి వోచర్ ద్వారా సొమ్ము డ్రా చేసుకున్నారు. బ్యాంకులలో వోచర్ ద్వారా రూ.24వేల వరకు సొమ్ము తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఖాతాదారులకు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా బ్యాంకులకు వెళ్లలేని వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఖాతాదారులు ఎటిఎంల కోసం పరుగులు తీసినప్పటికీ జిల్లా కేంద్రంలో ఐదు ఎటిఎంలు మినహా మిగిలిన ఎటిఎంలు మూతపడి ఉండటం కన్పించింది. మరికొన్ని చోట్ల ఎటిఎంలు తెరచి ఉంచినప్పటికీ కేవలం రెండు గంటలల్లోనే ఎటిఎంలలో క్యాష్ ఖాళీ కావడంతో ‘నో క్యాష్’ అంటూ బోర్డులు తగిలించారు. ఇక ఎటిఎంలలో గంటల కొద్దీ క్యూలో ఉంటే చివరకు చేతికి రూ.2వేలు సొమ్ము దక్కడంతో దాంతోనే ఖాతాదారులు సరిపెట్టుకున్నారు. సాధారణంగా ఎక్కువ మంది ఖాతాదారులు ఎటిఎంలకు అలవాటుపడటంతో బ్యాంకులకు వెళ్లడానికి ఇష్టం లేక గంటల కొద్దీ లైన్లలో ఎవరు వేచి ఉంటారులేనన్న దృక్పథంతో ఎటిఎంల కోసం పరుగులు తీశారు. ఏ ఎటిఎంలలో చూసిన ఇదే పరిస్థితి కన్పించింది.
స్వైపింగ్ యంత్రాలు పనిచేస్తే ఒట్టు!
ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు జరపాలని ఖాతాదారులను కోరుతున్నప్పటికీ పట్టణంలో చాలా చోట్ల స్వైపింగ్ యంత్రాలు మొరాయించాయి. పెట్రోల్ బంకులు, ఎస్‌బిఐ బ్యాంకులలో కూడా ఈ యంత్రాలు పనిచేయలేదు. బ్యాంకులలో కూడా అదనంగా స్వైపింగ్ యంత్రాలు లేకపోవడంతో వారు చేతులెత్తేశారు. ఈ విధంగా ఖాతాదారులు నానా ఇబ్బందులకు గురయ్యారు.

2.50 లక్షల పెన్షనర్ల సొమ్ము బ్యాంకుల్లో జమ
* డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావ
గజపతినగరం, డిసెంబర్ 3: జిల్లాలోని 2.50లక్షల మంది పింఛన్‌దారులకు సంబంధించిన పింఛన్లు వారి బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వృద్ధాప్య, వికలాంగ, వితంతు సామాజిక పింఛన్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసామని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఒక్కొక్కరికి మూడు వేలు వంతున వారి గ్రూపు ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 20వేల మంది స్వయం సహాయక సభ్యులు ఉండగా వారి గ్రూపు ఖాతాల్లో నగదు జమ చేశామని చెప్పారు. సభ్యులు అవసరమనుకుంటే ఆ నగదును డ్రా చేసుకుని వ్యక్తిగత ఖాతాకుగాని అప్పుకు మళ్లించడం గానీ చేసుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా వెలుగు ఆధ్వర్యంలో 98 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇంత వరకు 64 కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించామని ఇంకా 35 కేంద్రాలను గుర్తించి అనుమతులు ఇవ్వాల్సి ఉందన్నారు. సీతానగరం, బలిజిపేట మండలాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. 2.50లక్షల పింఛన్లకు గాను 50వేల పింఛన్‌దారులు పింఛన్లు కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ చేశామని అన్నారు. ప్రస్తుతం వేరే బ్యాంకు ఖాతాలు పింఛన్‌దార్లు ఉన్నందున బ్యాంకు అధికారులతో సంప్రదించి నగదు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసేందుకుగాను పంచాయతీల వారీగా ఆ వివరాలు సేకరించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణవేణమ్మ పాల్గొన్నారు.

సామాన్యుడి గతి ఇంతేనా?
* లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు జరపాలని కోరుతున్నప్పటికీ సామాన్యులకు వాటిపై అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపేకార్డులు తదితర వాటిపై ప్రభుత్వ ఉద్యోగులకు సరైన అవగాహన ఏర్పడలేదని, ఇలాంటి పరిస్థితిలో సామాన్య మానవుడు ఎలా అర్థం చేసుకోగలడని ప్రశ్నించారు. చదువు, సంధ్యలు లేని వారు ఎందరో ఉన్నారని వారు నగదు రహిత లావాదేవీలు ఎలా నిర్వహించగలరని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా జిల్లాలో 49,700 మంది జన్‌దన్ ఖాతాదారులకు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల వారు లావాదేవీలు ఎలా జరపగలరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్‌దారులకు 28 వేల మందికి నేటికి ఖాతాలు లేవని, డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలకు 37450 ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాలేదని అలాంటి పరిస్థితిలో రూపేకార్డులు ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మహిళాసత్తా నేత అనంతలక్ష్మి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకుంటే దాని పరిస్థితి అర్ధమవుతుందన్నారు. పార్టీ నేతలు ఎం.చిన్నారావు, తిప్పాన కోటేశ్వరరావు, సిమ్మ శ్రీను, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై చైతన్యవంతులు కావాలి
పాచిపెంట, డిసెంబర్ 3: నగదు రహిత లావాదేవీలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఎమ్మెల్సీ జి.సంధ్యారాణి కోరారు. నగదు రహిత లావాదేవీలపై శనివారం మండలంలో గురివినాయుడుపేటలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతిని అంతం చేసేందుకు కేంద్రరాష్ట్రం సమాలోచన చేస్తున్నాయని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో నల్లకుభేరుల గుండేల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, పెద్దనోట్ల రద్దును ప్రజలు హర్షిస్తున్నారన్నారు. 9రోజుల పాటు ఇబ్బందులున్నప్పటికీ మున్నుందు వీటి ఫలితాలు కనిపిస్తాయని తెలిపారు. రూపే కార్డుల వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈకార్డులపై గిరిజనులు, మహిళా సంఘ సభ్యులు, ఉపాధి కూలీలను చైతన్యపర్చవల్సిన బాధ్యత సంబంధిత సిబ్బందిపై ఉందన్నారు. గురివినాయుడు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సురేష్, సర్పంచ్, ఎం.పి.డి.ఓ. అరుంధతీదేవి, వెలుగు ఏ.పి. ఎం. వెంకటరమణలు పాల్గొన్నారు.
వేధింపులు ఆపాలి
* కాంప్లెక్స్ రోడ్డులో ఆటో కార్మికుల ర్యాలీ
విజయనగరం(టౌన్), డిసెంబర్ 3: ప్రత్యేకడ్రైవ్ పేరుతో ఆర్టీసీ, పోలీసు అధికారులు సంయుక్తంగా ఆటోకార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్‌చేస్తూ ఎ ఎఫ్‌టియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆటో కార్మికులను ఉద్ధేశించి యూనియన్ నాయకులు రెడ్డినారాయణరావు, అప్పలరాజు రెడ్డిలు మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు, పోలీసు, రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రత్యేకడ్రైవ్ పేరుతో కాంప్లెక్స్ వద్ద ఆటోకార్మికులపై కక్షసాధింపు ధోరణిలో వ్యవరించడం తగదని పేర్కొన్నారు. వారంరోజులుగా అధికారులు కాంప్లెక్స్‌వద్ద ఆటోకార్మికులపై వేధింపులకు గురిచేయడం వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పక్షపాత ధోరణిలో కేవలం ఓవర్ లోడ్ పేరుతో ఆటో కార్మికులపై కేసులు రాసి వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ రహదారిలో ఖాళీగా వెళ్లే ఆటోలను కూడా వదలకుండా ఏదో ఒక నెపంతో కేసులు రాయడం దారణమని ఆరోపించారు. ఆటోను నమ్ముకుని జీవనం సాగించే కార్మికులపై ఇటువంటి విధానాలు మంచిదికాదని అన్నారు. కేసులు రాయడం మానుకోక పోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా కాంపెక్స్ ఎదటు నిరసన వ్యక్తం చేశారు. పలు ఆటో స్టాండ్ కార్మికులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలకై ఉద్యమం * 10న రౌండ్‌టేబుల్ సమావేశం
విజయనగరం(టౌన్), డిసెంబర్ 3: వెనుకబడిన విజయనగరం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి హామీ ఇచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసే వరకు పోరాటం చేస్తామని పట్టణపౌరుల సంక్షేమ సంఘం డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకరరావు తెలిపారు. శనివారం పట్టణంలోని సిపిఎం కార్యాలయం ఎల్‌బిజి భవనంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ఏ చిన్న రోగమొచ్చినా పేదలకు సరైన వైద్యం అందే సదుపాయాలు పూర్తి స్థ్ధాయిలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో లేవని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరుకే పెద్దాసుపత్రని పైన రంగులు వేసి సరైన వైద్య సదుపాయాలు కల్పించడం మరిచారని విమర్శించారు. వెంటిలేటర్లు ఇక్కడ, ఘోషా ఆసుపత్రిలో ఉన్నా సిబ్బందిలేక వినియోగించలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. దీనికి తోడు జిల్లా కేంద్ర ఆసుపత్రిని ప్రైవేటు పరం చేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నదని ఆరోపించారు. ఇప్పటికే కొన్నిరకాల వైద్య పరీక్షలు మెడాల్ వంటి సంస్ధలకు అప్పగించారని భవిష్యత్తులో ప్రైవేటుకు ఇవ్వడానికి నిర్ణయాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ముందు వైద్య కళాశాలను ప్రభుత్వ పరంగా నెలకొల్పుతామని చెప్పారని అయితే నిధులు కొరత సాకుగా చూపి మాన్సాస్ సంస్థ్ధకు ఇవ్వడానికి అనుమతులు ఇచ్చారని తీరా మాన్సాస్ సంస్థ కూడా తర్జన బర్జన తరువాత వారికి అంత స్తోమత లేదని అనడంతో కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వమే చేపట్టాలని సూచించారు. 10 ఏళ్లు అనుభవం, 350 పడకల ఆసుపత్రి నిర్వహణ ఈ జిల్లాలో ఎవరికి లేదని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10న పార్టీ కార్యాలయం ఎల్‌బిజి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి రమణమ్మ, కులవివక్ష పోరాట సమితి జిల్లా కన్వీనర్ రాకోటి ఆనంద్ పాల్గొన్నారు.

బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా
పాచిపెంట, డిసెంబర్ 3: స్థానిక ఏ.పి.జి.వి.జి బ్యాంకు ఎదుట ఖాతాదారులు శనివారం ధర్నా నిర్వహించారు. సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకు ద్వారా నగదు సక్రమంగా ఇవ్వకపోవడంతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఈ రోజు బ్యాంకులో నగదు లేదని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు. ఈసందర్భంగా సి.ఐ.టి.యు. నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకులకు కొత్తనోట్లు అంతంతమాత్రమే వస్తే ఖాతాదారుల ఆర్థిక అవసరాలు ఎలా తీరుతాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా పెద్దనోట్లును రద్దుచేయడంతో సామాన్యప్రజానికానికి గుదిబండగా మారిందన్నారు. పెద్ద నోట్ల రద్దును వెనక్కి తీసుకోవాలని, బ్యాంకులకు సరిపడు కొత్తనోట్లును సకాలంలో వేయాలని డిమాండ్ చేశారు. సి.ఐ.టి.యు. నాయుడు త్యాడ ప్రభావతి, చింతగడ రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సులు నిర్వహించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 3: నగదు రహిత లావాదేవీలపై అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ బిజెపి కార్యాలయంలో ఆయన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మదు మాట్లాడుతూ బంగారంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. దీనిపై మహిళలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 6న అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో గంటా అప్పలనాయుడు, ఎస్.లక్ష్మి నరసింహం, రామచంద్రరావు, రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

బ్యాంక్‌ల వద్ద పింఛన్‌దారుల పడిగాపులు
మెరకముడిదాం, డిసెంబర్ 3: మండలంలో గల గర్భాం, మెరకముడిదాం, ఉత్తరావల్లి తదితర బ్యాంకుల వద్ద పింఛనుల కొరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు బారులు తీరారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం నగదు రహిత లావేదీవీల్లో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు సైతం బ్యాంక్ ఖాతాల్లో జమ చేసారు. దీంతో గర్భాం గ్రామీణ విశాఖ బ్యాంక్ వద్ద ఉదయం 8 గంటల నుండి క్యూలో పించనదారులు వేచి ఉన్నారు. అయినప్పటికీ వీరిలో కొంత మందికి మాత్రమే 1000 రూపాయలు చెప్పున చెల్లించి 12 గంటలకే నోక్యాష్ అని బోర్డు పెట్టారు, దీంతో ఈ పింఛన్‌పై ఆదారపడి నెల గడుపుతున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరాశతో ఎదురుతిరిగారు.