విజయనగరం

నానక్‌రాంగుడా బాధితులకు ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగుడాలో ఏడంతస్తుల భవనం కూలిన సంఘటనలో జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాతపడిన విషయం విధితమే. శనివారం ఉదయం రెండు అంబులెన్స్‌లు, సాయంత్రం ఒక అంబులెన్స్‌లో మృతదేహాలను ఆయా స్వస్థలాలకు తరలించారు. మృత్యువాత పడిన వారిలో బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నేతేటి సాంబయ్య (45), పైడమ్మ (40), గౌరీశ్వరి (13) ఉన్నారు. వీరితోపాటు కోమటిపల్లి వెంకటలక్ష్మి (23), కోమటిపల్లి పోలినాయుడు (28), రెల్లి శంకరరావు (23), సుభద్రా గ్రామానికి చెందిన పిరిడి పోలినాయుడు (28), భార్య నారాయణ (రామలక్ష్మి) 22, పిరిడి మోహన్ (3) ఉన్నారు. వీరితోపాటు శ్రీకాకుళం జిల్లా రాజాంనకు చెందిన దుర్గారావు ఉన్నారు. సంఘటనా స్థలానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని, వైకాపా నేత బొత్స సత్యనారాయణలు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బలిజపేటలోని బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యే చిరంజీవులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించారు. కాగా, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం ఒక్కొ బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటించిన విషయం విధితమే. కాగా, రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు ప్రకటించాయి. కార్మిక శాఖ నుంచి రూ.20 వేలు, ప్రభుత్వం నుంచి రూ.30వేలు మొత్తాన్ని ఈ రోజు కలెక్టర్ వివేక్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, విజయనగరం ఆర్డీవో శ్రీనివాసమూర్తిలు బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను రప్పిస్తున్నామని బాధిత కుటుంబాలకు తెలిపారు.

గిరిజన ప్రాంతంలో
పెరిగిన చలితీవ్రత
కురుపాం, డిసెంబర్ 10: గిరిజన ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి చలితీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రతీ గ్రామంలోనూ శీతలగాలులతో కూడిన మంచు కురుస్తుండడంతో చలికి ప్రజలు వణుకుతున్నారు. రాత్రిపూట బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏజెన్సీలో సాయంత్రం 4గంటల నుంచే చీకట్లు అలముకుంటూ చలిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. సాయంత్రం నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. ఉదయంపూట కూడా దట్టమైన పొగమంచువల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ద్విచక్ర వాహనాలపై దాదాపు ప్రయాణాలు మానుకుంటున్నారు. చలి నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. షట్టర్లు, రగ్గులు, చలిమంటల నుంచి రక్షణపొందుతున్నారు.

ఆకర్షిస్తున్న మందారపూలు
వేపాడ, డిసెంబర్ 10: సాధారణంగా మొక్కలు పూసే పూలన్నీ మనం నిత్యం చూస్తుంటాం. కానీ మండలంలోని ఆతవ గ్రామంలో ఆతవ రాజు అనే ఇంటి పెరట్లో మందార మొక్కకు రెండు రకాల పూలు పూయడం అందర్నీ ఆకర్షింపచేస్తోంది. ఒక పువ్వు ఎరుపు రంగులో పూస్తుండగా మరో పువ్వు పసుపు, వైట్, రంగుల్లో పూస్తుండడంతో గ్రామస్థులు ఆటోనోట, ఈ నోట వినడంతో వెళ్లి చూడడం గమనార్హం.
లక్ష్యం దిశగా అడుగులు
* కలెక్టర్ వివేక్‌యాదవ్
పార్వతీపురం, డిసెంబర్ 10: చంద్రన్నబాటలో మంజూరు చేసిన సిమెంట్ రోడ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సర్పంచులను కోరారు. శనివారం పార్వతీపురంలోని గిరిమిత్ర సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన పార్వతీపురం డివిజన్ స్థాయి సర్పంచుల అవగాహన సదస్సులోఆయన మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్రంలోనే ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిసిరోడ్ల నిర్మాణాలు మొదటి స్థానంలో జిల్లా నిలవడం అభినందనీయమని ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా లక్ష్యాలు పూర్తిచేయాలని సర్పంచులను కలెక్టర్ కోరారు. అయితే రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.11.76కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని కూడా క్లియర్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు 50శాతం మెటీరియల్ కాంపొనెంట్‌గాను, 40శాతం ఎస్‌డిపి నిధులు, 10శాతం పంచాయతీ నిధులతో జిల్లాలో 427కిలోమీటర్ల పరిధిలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 137కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. మిగిలిన 290కిమీ రోడ్లనిర్మాణాలకు కూడా రూ.40.53కోట్ల నిధులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా గతంలో మిగిలిన బిఆర్‌జిఎఫ్ నిధులు 50శాతం, 50 ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.24కోట్లతో పనులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రోజుకు 3కిమీ వర్కు పూర్తిచేస్తే తప్ప 200కిమీ రోడ్లనిర్మాణం మార్చినాటికి పూర్తి చేయలేమన్నారు. పాతపనులు పూర్తిచేస్తే తప్పకొత్తపనులు మంజూరు చేయలేమని కలెక్టర్ తెలిపారు. పనులకు సిమెంట్ కూడా బ్యాగు రూ.240లకు అందించే చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు. సిమెంట్ రోడ్డుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రెయిన్ నిర్మాణం పనులు చీపురుపల్లిలో చేపట్టడం జరిగిందని ఇది రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా గుర్తింపుపొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. గ్రామపంచాయతీల్లో క్లీన్ డ్రైనేజిలు చేయడం వల్ల దోమలబెడద కూడా లేకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే నాన్ ఒడియఫ్‌లో కట్టిన మరుగుదొడ్లకు రూ 1.4కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఇంకా మరోకోటి రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని లేకుండా ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లలేని పరిస్థితి వచ్చి ప్రభుత్వానికి చెడ్డపేరువస్తుందని కలెక్టర్ సర్పంచులకు హెచ్చరించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లక్కగూడ సర్పంచ్ కళావతి మాట్లాడుతూ గిరిజన పంచాయతీ భాగం 10శాతం నిధులు కూడా లేకుండా పూర్తిస్థాయిలో ఏజెన్సీ పంచాయతీల్లో నిధులు రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా అందుకు ఆయన పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా అభివృద్ధికి మరింత బాటలు వేయాలని కోరారు.పంచాయతీరాజ్ వేణుగోపాల్ మాట్లాడుతూ 4మీటర్ల సిసి రోడ్డుకు ఎం-20గ్రావెల్ కచ్చితంగా వాడాలని కోరారు.ఈకార్యక్రమంలో పలువురు సర్పంచులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌తోపాటు సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్ ఎస్ ఇ వేణుగోపాల్, డ్వామా పిడి ప్రశాంతి, జడ్‌పి సి ఇవో జి.రాజకుమారి, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ తదితరులు సమాధానాలు చెప్పారు. ఈ సమావేశానికి 15మండలాల సర్పంచులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో...

వైకాపా అడ్రస్ గల్లంతు
* జిల్లా టిడిపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి జోస్యం
పార్వతీపురం, డిసెంబర్ 10: వచ్చే ఎన్నికల్లో వైకాపా అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు జోస్యం చెప్పారు. శనివారం పార్వతీపురంలోని టిడిపి కార్యాలయంలో ఆయన పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైకాపానేత ఇప్పటికే ఉనికి కోల్పోయారని, ప్రధాని మోడి దెబ్బకు పెద్ద నోట్ల రద్దు తరువాత 15రోజులు పాటు ఎక్కడున్నారో అడ్రస్ కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వైద్యసేవల గురించి కలెక్టరేట్‌ల ఎదుట వైకాపా నేతలు ధర్నా చేయడానికి పిలుపునివ్వడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తన తండ్రి పెట్టిన ఆరోగ్యశ్రీ కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు కోట్ల నిధులు చెల్లించడంలో అవినీతిని మరిచిన జగన్మోహన్‌రెడ్డి ఇపుడు ఎన్టీ ఆర్ వైద్యసేవలను గురించి విమర్శించే అర్హత ఎక్కడిదని ఆయన నిలదీశారు. ఎన్టీ ఆర్ వైద్యసేవలను ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను సైతం బలోపేతం చేసి పేదలందరికీ మెరుగైన సేవలందించే దిశగా సి ఎం చంద్రబాబుచేస్తున్న కృషికి గుర్తింపువస్తున్న దానిని ఓర్వలేకనే జగన్ అనవసర రాద్ధాంతం చేయాలని యోచించడం దారుణమన్నారు. తల్లిబిడ్డల ఎక్స్‌ప్రెస్, ఇ ఔషది ద్వారా పేదలకు తక్కువధరకు మందులు అమ్మకం, ఏరియా ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు, గుండెకు సంబంధించి కేథటిక్ సేవలు వంటి అనేకం సి ఎం పేదల ఆరోగ్యం కోసం చేపడుతున్నారని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ సి ఎం చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం అలవాటుగా పెట్టుకున్నారని వాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎ ఎం సి చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, పార్వతీపురం పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కోలావెంకటరావు, దొగ్గమోహనరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గొట్టాపువెంకటినాయుడు, కౌన్సిలర్లు మంచిపల్లి సత్యనారాయణ, చొక్కాపువెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాల సాధనకై ఉద్యమం
కేంద్ర ఆసుపత్రి పరిరక్షణకు పోరాటం * 18న జిల్లా సదస్సు* రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం

విజయనగరం(టౌన్), డిసెంబర్ 10: జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగించాలని, అదే సమయంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిని ప్రవేటీకరించాలనే ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. పట్టణ పౌరసంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు అధ్యక్షతన శనివారం సిపి ఎం పార్టీ కార్యాలయం ఎల్ బిజి భవన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సి ఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ, మెడికల్ రిప్రజెంటిటివ్‌ల యూనియన్ నాయకులు రవి, కె విపి ఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్, గ్రామసేవకుల సంఘం జిల్లా కార్యదర్శి జీవా, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రమణమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చింతయ్య, ఎపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు జోగినాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావాలని, అలాగే పేద విద్యా ర్ధులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడితేనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. మాన్సాస్ సంస్ధ నిధుల కొరత నేపధ్యంలో ముందుకు వచ్చే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వమే మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొన్ని రకాల సేవలను ఇప్పటికే ప్రవేటు సంస్ధలకు అప్పగించిన ప్రభుత్వం ఆసుపత్రిని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు పావులు కదుపుతుతున్నారని ఆరోపించారు. ఈచర్యలను తిప్పికొట్టేందుకు అందరిని చైతన్యం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులకు ఈ జిల్లా ప్రజల ఆరోగ్యం, పేద విద్యార్ధులకు అందుబాటులో వైద్య విద్య అందించాలనే ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో సేవలు మెరుగ్గా అందంచడానికి అవసరమైన సిబ్బందిని, టెక్నీషియన్లను నియమించాలని కోరారు. 18 న జిల్లా స్ధాయి సదస్సును నిర్వహించడం ద్వారా ఇందుకు ప్రజలను కదిలించాలని నిర్ణయించారు.

బాధితులకు రూ.30 లక్షలు చెల్లించాలి
* వైకాపా నేత బొత్స డిమాండ్

విజయనగరం, డిసెంబర్ 10: రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తాలుకాలోని నానక్‌రాం గుడాలో ఏడంతస్తుల భవనం కూలిపోయిన సంఘటనలో బాధితులకు రూ.30 లక్షలు చెల్లించాలని వైకాపా రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సంఘటనా స్ధలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు, భవన యజమాని నుంచి రూ.10 లక్షలు, మన రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. వీటిలో తెలంగాణా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించిందన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5లక్షలు, చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు చెల్లించనున్నారన్నారు. కాగా, భవన యజమాని నుంచి రూ.10 లక్షలు చెల్లించే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం పనుల పరిశీలన
పార్వతీపురం, డిసెంబర్ 10: పార్వతీపురం ఎంపిడివో కార్యాలయంలోని ఉపాధి కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం కింద చేపడుతున్న పనుల ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా శనివారం కలెక్టర్ వివేక్‌యాదవ్ పరిశీలించారు. ఉపాధి పనులకు సంబంధించిన పనులు ప్రగతితో పాటు వేతనదారులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల గురించి కూడా పరిశీలించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ, డ్వామా పిడి ప్రశాంతి, ఎంపిడివో కెల్ల కృష్ణారావు, ఎన్ ఆర్ ఇ జి ఎస్ ఎపివో నాగలక్ష్మిలుపాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసిన ఎంపిపి హరిప్రియాథాట్రాజ్ మాట్లాడుతూ పిన్నింటి రామినాయుడువలసలో ఆర్ అండ్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధిరిక సర్వే కార్యక్రమం ఈనెల 10వ తేదీనాటికి పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఏజెన్సీలో సర్వర్‌లు పనిచేయక తెలెత్తిన సమస్యలు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ఈనెల 15వరకు గడువుపెంచామని తెలిపారు.

అథ్లెటిక్స్‌లో జిల్లాకు
మంచిపేరు తేవాలి
* ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
కొత్తవలస, డిసెంబర్ 10: అథ్లెటిక్స్‌లో విజయనగరం జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం ఎస్.కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 37వ అంతర్‌జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2016ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో జిల్లాకు మంచి పేరు ఉందని దాన్ని మరింత విస్తరింపచేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలో క్రీడాభివృద్ధికి ,మంచి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మాస్టర్స్ అథ్లెటిక్స్‌ను ఎస్.కోటలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. క్రీడలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని, క్రీడల అభివృద్ధి పాఠశాల స్థాయి నుండి జరగాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు అన్నారు. ఇందుకూరి రఘురాజు, ఎంపిపి రెడ్డి వెంకన్న, టిడిపి నాయకులు, పిఇటిలు పాల్గొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
* 500 మందితో సామూహిక
గీతాపారాయణం
గంట్యాడ, డిసెంబర్ 10: హిందూ మతం ఎంతో గొప్పదని, హిందూ ధర్మ పరిరక్షణను బాధ్యతగా భావించాలని వికాస తరంగణి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ అన్నారు. గీతాజయంతిని పురస్కరించుకుని శనివారం కోటారుబిల్లి టిటిడి కల్యాణ మండపంలో శ్రీ మద్భాగవత సామూహిక పారాయణ కార్యక్రమం వికాస తరంగణి గంట్యాడ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మందికి పైబడి హిందువులు సామూహిక గీతాపారాయణం చేశారు. నారాయణత్వం ఉట్టిపడేలా భక్తులు చేసిన సామూహిక గీతాపారాయణంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ముందుగా శ్రీకృష్ణుని చిన్న విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి, సంకీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోవింద, నారాయణ నామస్మరణల నడుమ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలను పారాయణ చేశారు. ఈ సందర్భంగా వికాస తరంగణి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి ప్రవచనం చేస్తూ భగవద్గీతను ఏసమయంలోనైనా పారాయణ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో వికాస తరంగణి కేంద్ర కమిటీ మెంబర్ అరుణమ్మ, జిల్లా కార్యదర్శి రాము, ఆరోగ్యవికాస్ శకుంతల, ప్రజ్ఞ జిల్లా కన్వీనర్ ఎస్.రమాదేవి, వికాస్ తరంగణి గంట్యాడ మండల శాఖ అధ్యక్షుడు నాయుడు, కార్యదర్శి ఎ.పి. నాయుడు, సభ్యులు శ్రీనివాసరాజు, దేవానంద గురుపీఠం అధ్యక్షుడు జోగినాయుడు, తదితరులు పాల్గొన్నారు. అన్యూహరీతిలో ఐదు వేలమందికి పైబడి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ చేశారు.

బోగస్ ఎస్టీలపై విచారణ జరపాలి
సాలూరు, డిసెంబర్ 10: బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ పదవులు అనుభవిస్తున్నవారిపై సత్వర విచారణ జరపాలని ఎమ్మెల్యే పి.రాజన్నదొర డిమాండ్ చేశారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి.్భంజ్‌దేవ్‌తో సహా అనేక మంది బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందారన్నారు. నఖిలీ గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంలో గిరిజను అధికారులు చూపిస్తున్న తొందరపాటు వాటికి సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరపడంలో అధికారులు చూపడం లేదన్నారు. 2004లో అప్పటి ఎమ్మెల్యే ఆర్‌పి.్భంజ్‌దేవ్‌పై తాను హైకోర్టులో కేసు వేశానన్నారు. 2006లో రాష్ట్ర హైకోర్టు భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని ఆయనపై పోటీ చేసిన తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు కోర్టు ప్రకటించిందన్నారు. హైకోర్టు తీర్పుపై భంజ్‌దేవ్ సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. సుప్రీంకోర్టు భంజ్‌దేవ్ కులంపై విచారణ జరిపి నివేదిక పంపాలని జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీని ఆదేశించిందన్నారు. 2014లో ఎన్నికల ముందు అప్పటి సబ్ కలెక్టర్ శే్వత మహంతి భంజ్‌దేవ్ గిరిజనుడేనని ధ్రువీకరణపత్రాన్ని మంజూరు చేసిందన్నారు. దానిపై తాను 2016 జనవరిలో హైకోర్టులో కేసు వేశానన్నారు. మూడు నెలల్లోగా భంజ్‌దేవ్‌పై కుల ధ్రువీకరణపై విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశించిందన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు నివేదిక పంపించలేదన్నారు. దీనిపై తాను ఐటిడిఎ పిఒపై కోర్టు దిక్కరణ కేసు వేశానన్నారు. దీనిలో భాగంగా వచ్చే జనవరి 20న కోర్టుకు హాజరుకావాలని ఐటిడిఎ పిఒ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయన్నారు. భోగస్ గిరిజనులపై ఫిర్యాదు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకొని విచారణ జరపకుండా అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు భంజ్‌దేవ్‌తో సహా నఖిలి గిరిజనులపై విచారణ జరిపి నివేదికలు పంపాలని ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్ చేశారు.