విజయనగరం

కుల వృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 25: రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించి ఆయా వృత్తులు చేసుకునే వ్యక్తులకు ఆదాయం పెరిగేలా బిసి సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ మృణాళిని తెలిపారు. సోమవారం వి.టి. అగ్రహారంలోని పశుసంవర్థకశాఖ సమాచార శిక్షణ కేంద్రంలో గొర్రెలు, మేకల పెంపకందారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడంతోపాటు దీనిపై వచ్చే ఆదాయానికి అదనంగా అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని అన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు వృత్తి పరమైన మెళకువలను పెంపొందించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. గొర్రెల, మేకల పెంపకందారులకు అవసరమైన వౌళిక వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వెనుకబడిన తరగతుల వారు తమ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు. పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సింహాచలం మాట్లాడుతూ గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు ఔత్సాహిక రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంఘం సభ్యులు అప్పలనాయుడు, దేవుడు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద గొర్రెలు, మేకల కోసం షెడ్లు కేటాయించాలని, వాటి మేతకోసం పచ్చిక బయళ్లు పెంచేందుకు అవకాశం కల్పించాలని, గొర్రెలు, మేకలు పెంచే కుటుంబాలు నిరక్షరాసులైన కారణంగా వారి పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంస్థ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్, పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నరసింహులు, అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ జగన్నాథం, డాక్టర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
వివాదంగా మారిన శిక్షణ కార్యక్రమం
జెడిపై మంత్రికి ప్రజాప్రతినిధుల ఫిర్యాదు
కాగా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి ప్రజాప్రతినిధులను, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడుని ఆహ్వానించకపోవడం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమ నిర్వహణపై ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి, ఎమ్మెల్యే కెఎ నాయుడు మంత్రి మృణాళినికి ఫిర్యాదు చేసారు. జిల్లాపరిషత్ చైర్మన్‌గానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, చివరకు గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కృష్ట యాదవ్‌ను కూడా పిలవలేదని చెప్పారు. యాదవ సంఘాల ప్రతినిధులను ఈ శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం సరికాదని అన్నారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజాప్రతినిధులను అవమానపరచే విధంగా వ్యవహరించిన పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.