విజయనగరం

ప్రశాంతంగా ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 29 : ఎంసెట్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు జెన్ టియు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐదు పరీక్షా కేంద్రాలతో పాటు భోగాపురం మండలం రావాడలోని అవంతి కాలేజి కేంద్రంలో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాశారు. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలకు దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, ఎస్ కోట, గరివిడి, చీపురుపల్లి తదితర ముఖ్య ప్రాతాలనుండి వచ్చిన విద్యార్థులకు గమ్యానికి చేరుకునేందుకు ఆర్టీసీ ఉచిత బస్సులు నడపడంతో విద్యార్ధులు నిర్ణీత సమయానికి చేరుకున్నారు. అలాగే పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ప్రత్యేక బస్సులు ఎంసెట్ రాసే విద్యార్థులకోసం పరీక్షా కేంద్రాల వరకు నడిపి సహకరించాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎండల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. ఎంసెట్ పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగాయి.

చిరుజల్లులతో పులకింత!
బొబ్బిలి, ఏప్రిల్ 29: బొబ్బిలి పట్టణంలో శుక్రవారం చిరు జల్లులు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీక్షణమైన ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రం చిరు జల్లులతో కొంత ఉపశమనం లభించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు సైతం పడడంతో చిన్నారులు, పెద్దలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. గత రెండు రోజులుగా సాయంత్రం సమయాల్లో చిరు జల్లులు పడుతుండడంతో ప్రజలకు కొంత ఉపశమనం చేకూరుతోంది. ఈ వర్షాలు వాణిజ్యపంటలకు కొంత ప్రయోజనం చేకూరుస్తున్నప్పటికీ వడగళ్ల్ల కారణంగా మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఏదిఏమైనా చిరు జల్లులతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

బొబ్బిలి బావురుమంటోంది!
బొబ్బిలి, ఏప్రిల్ 29: భానుడి ప్రతా పానికి జనం అల్లాడిపోవడమే కాకుండా దాహార్తికి అలమటిస్తున్నారు. దీంతో తాగేనీరు లభించక అవస్థలు పడుతు న్నారు. పట్టణంలో మూడు రోజులకోసారి వస్తున్న నీటి కోసం మండుటెండలో గంటల తరబడి మహిళలు పడిగాపులు కాస్తున్నారు. అస్తవ్యస్తంగా నీటి సరఫరా ఉండడంతో పట్టణ ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. పురపాలకసంఘంలో తాగునీటి కోసం మహిళలు పడుతున్న అవస్థలు అంతాఇంతా కాదు. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు అధికారులు చేపడుతున్నా ప్రయోజనం చేకూరడం లేదు. భోజరాజపురం వాటర్ వర్క్స్‌లో నీటిని రప్పించేందుకు మున్సిపాలిటీ అధికారులు భగీరథ ప్రయత్నం చేశారు. చివరకు సాలూరు మండలం పెద్దగెడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని రప్పించారు. అయినప్పటికీ భోజరాజపురంలో ఉన్న రిజర్వాయర్ నుంచి పట్టణానికి సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న మోటార్లు పనిచేయకపోవడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. తరచుగా విద్యుత్‌కోతల కారణంగా మోటార్లు పనిచేయకపోవడంతో నీటిని పట్టణ ప్రాంతాలకు రప్పించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనికితోడు ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ఏటిలో ఉన్న కాస్తనీరు కూడా ఇంకిపోతుండడంతో పట్టణంలో పలు ప్రాంతాలకు మూడురోజులకోసారి, మరికొన్ని ప్రాంతాలకు అయిదురోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. దీంతో మం చినీటి కోసం మహిళలు మండుటెండలో సైతం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నీరు రాక నిరాశతోపాటు ఖాళి బిందెలతో వెనుదిరుగుతున్నారు. అలాగే మెట్టవలస సమీపంలో ఉన్న పైపులీకుల ద్వారా నీటిని పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు. వర్షపు జల్లులు పడని పక్షంలో భవిష్యత్తులో మంచినీటి మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శంకరరావు మాట్లాడుతూ సాధ్యమైనంతవరకు మంచినీటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతోపాటు భూగర్భ జలాలు కూడా నానాటికి ఇంకిపోతున్నాయని, దీంతో మంచినీటి సరఫరాలో కొన్ని ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయి.

నీరు-చెట్టుతో భూగర్భ జలాల పెంపు
*ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు
నెల్లిమర్ల, ఏప్రిల్ 29:నీరు-చెట్టు ద్వారా భూగర్భ జలాలు పెంపొందుతాయని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు.శుక్రవారం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గరికిపేట సామిత చెరువు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమమని చెప్పారు. చెరువులలోపూడిక తీయడంవలన ఆయకట్టు భూమి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు నీరు-చెట్టు కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నదని చెప్పారు. నీటి పారుదల శాఖ జె ఇ పిన్నింటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో సాగునీటి సంఘాలకు తొలివిడతగా రూ.1.11కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. అదేవిధంగా టెండరింగ్ పనుల ద్వారా రూ.60 లక్షల నిధులు, గరికిపేట సామిత చెరువు అభివృద్ధికి ఏడు లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి సువ్వాడ వనజాక్షి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, మండల అధ్యక్షులు గేదెల రాజారావు, సర్పంచ్ చింతపల్లి సత్యనారాయణ, చంద్రమ్మపేట ఎంపిటిసి మొయిద సత్యారావు, సర్పంచ్ కంది సత్యనారాయణ పాల్గొన్నారు.

అభివృద్ధికి నిధులు ఉన్నా..కమిటీలు లేవు
* డిడిఎం అండ్ హెచ్‌ఓ త్రినాథరావు
కొత్తవలస, ఏప్రిల్ 29: జిల్లాలో ఆసుపత్రుల అభివృద్ధికి తగినన్ని నిధులు ఉన్నా, కమిటీలు లేక అభివృద్ధి పనులు జరగలేదని డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ త్రినాథరావుతెలిపారు. శుక్రవారం ఆయన కొత్తవలస పిహెచ్‌సిని సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్‌సిలకు కమిటీలు లేక పలు అభివృద్ధిపనులు జరగలేదన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో కమిటీలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. అదేవిధంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పిహెచ్‌సిలో ఎండలో వచ్చిన రోగులకు ఓ ఆర్ ఎస్‌తో కూడిన ద్రావకాన్ని ఇస్తామని చెప్పారు. చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు, గర్భిణీలు ఎండలో తిరగొద్దని తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్య వడదెబ్బతో చనిపోయినవారు త్రీమెన్ కమిటీ(వైద్యులు, తహశీల్దార్, పోలీసులు)కి తెలపాలని చెప్పారు. ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామని అన్నారు. పోలియో నివారణకు చుక్కలకు బదులు ఇంజక్షన్ వచ్చిందని, 6,10,14 వారాలలో దీనిని ఇవ్వాలని చెప్పారు. . వేసవిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ఆపాలని చెప్పారు. రోటా వైరెస్ వల్ల దేశంలో సుమారు మూడు నుండి నాలుగు లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారని తెలిపారు. ఈ టీకాలకు ముందుగా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఉత్తరాదిలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఎంపికచేసామని అన్నారు.

ఆలయ కమిటీలు బాధ్యతతో పనిచేయాలి
* జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి
శృంగవరపుకోట, ఏప్రిల్ 29: ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యతతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శివాలయానికి నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే లలితకుమారి కమిటీని ఎంపిక చేశారని, నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం నీటి నిల్వలకు ప్రతి ప్రాంతంలో తీస్తున్న విధంగా ఆలయ ప్రాంతంలోను ఇంకుడుగుంతలు తీయాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లాల వారీగా ఇచ్చిన ఇంకుడుగొతుల లక్ష్యాలు పూర్తిచేయాలని కోరారు. కమిటీ అధ్యక్షునిగా శ్రీనాధుల పరదేశి, సభ్యులుగా ఆడారి అప్పారావు, రాకోటి దారప్ప, ఇంటికోటి బాబులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంపిపి రెడ్డి వెంకన్న, జడ్పీటిసి రామలక్ష్మి, ఎల్. కోట జడ్పీటిసి కె ఈశ్వరరావు, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత వ్యవధిలో తారకరామ పనులు పూర్తి
* అధికారులకు మంత్రుల ఆదేశం
విజయనగరం (టౌన్), ఏప్రిల్ 29 : సకాలంలో తారకరామ తీర్ధసాగర్ పనులు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మంత్రులు పల్లె రఘనాధరెడ్డి, కిమిడి మృణాళిని జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి రామతీర్ధసాగర్ పనులు పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలు, నష్టపరిహారం అంశాలపై చర్చించారు.170 కోట్ల రూపాయలతో జరుగుతున్న బండ కట్ట నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. ప్రాజెక్టుప్లాన్, మట్టికట్ట పనులు చూసారు. రైల్వే టనె్నల్ పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. నిర్ణాత వ్యవధిలోగా తారకరామ తీర్ధ సాగర్ పనులు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేసారు. మంత్రుల వెంట కలెక్టర్ ఎం ఎం నాయక్ , నెల్లి మర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయడు, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు కె ఎనాయుడు చిరంజీవులు, ప్రాజెక్టు ఎస్ ఇ తిరుమలరావుతదితరులు పాల్గొన్నారు.

3వేల కోట్ల వార్షిక రుణప్రణాళిక విడుదల
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 29: మూడువేల కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక రుణప్రణాళిను కలెక్టర్ ఎం ఎం నాయక్ విడుదల చేశారు.శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఈమేరకు రుణప్రణాళికకు జిల్లా బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. ఈసందర్భంగా కలెక్టర్ ఎం ఎం నాయక్ మాట్లాడుతూ ప్రాధాన్యతారంగాలను ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు, పాడిపరిశ్రమ, ఉద్యానవనాల అభివృద్దిని విరివిగా ప్రోత్సహించాలని ఆదేశించారు. బ్యాంకులు బ్రాంచీల వారీగా లక్ష్యాలను అమలు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ముద్రరుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈకార్యక్రమంలో లీడ్ జిల్లా మేనేజరు గురవయ్య, నాబార్డు ఎజి ఎం శ్రీనివాసరావు జిల్లా అధికారులు , బ్యాంకర్లుపాల్గొన్నారు.