విజయనగరం

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, అక్టోబర్ 22: మండలంలోని కంటకాపల్లి గ్రామంలో 2006 సంవత్సరంలో ఎపిఐఐసికి భూమిని సేకరించిన అధికారులు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి ఆదేశాల మేరకు భూములు కోల్పోయిన రైతుల పేరున 144.18 సెంట్లు జిరాయితీ భూములకు 1కోటి 87 లక్షల 69,959 రూపాయలను విజయనగరం కోర్టులో డిపాజిట్ చేయడం జరిగిందని తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో మొదటి విడతగా 74మంది రైతులకు 15.67 సెంట్లుకు నష్టపరిహారం చెల్లింపు గూర్చి జాబితాను కొత్తవలస ప్రభుత్వ కార్యాలయాల్లో అతికించామని చెప్పారు. అదే విధంగా కంటకాపల్లి, కొత్తూరు గ్రామాలలో పంచాయతీ కార్యాలయాలకు జాబితాను ప్రచురించామని చెప్పారు. అభ్యంతరాలు ఉన్నవారు ఈనెల 31లోగా తహశీల్దార్ కార్యాలయానికి అభ్యర్థన తెలపాలని ఆయన చెప్పారు.

ప్రతీ ఒక్కరూ సక్రమంగా విద్యను అభ్యసించాలి
బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 22: ప్రతీ ఒక్కరూ సక్రమంగా విద్యను అభ్యసించి భవిష్యత్‌లో మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి కోరారు. ఈమేరకు గొల్లపల్లి శ్రీవేణుగోపాల పురపాలక ఉన్నత పాఠశాల పూర్వపువిద్యార్థిని కుమారి శాంతి జ్యోతి ఇటీవల ప్రతిభా అవార్డును అందుకోవడంతో పాఠశాలలో అభినందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కష్టపడి చదివి మరిన్ని అవార్డులు పొందాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారన్నారు. కుమారి శాంతి జ్యోతిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని విద్యలో రాణించాలన్నారు. నిరుపేద విద్యార్థులకు చేయూతనందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం శాంతిజ్యోతికి దుస్సాలువా కప్పి బొకేలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు రాంబార్కి శరత్, మాజీ కౌన్సిల్ సభ్యులు బొబ్బాది తవిటినాయుడు, కాకల వెంకటరావు, హెచ్‌ఎం సరోజిని రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏఐటీయుసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 22: కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తు, వారి హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఏ ఐటీయుసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణంరాజు కోరారు. ఈమేరకు సీపీ ఐ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏఐటీయుసీ 10వ జిల్లా మహాసభలను వచ్చేనెల 1,2వ తేదీలలో విజయనగరం జిల్లాలో నిర్వహించనున్నామని, వీటిని ప్రతీ ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి అశోక్, ఎం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆల్తీ మారయ్య, సీపీఐ మండల కార్యదర్శి కోట అప్పన్న, ఆర్ రాము, తదితరులు పాల్గొన్నారు.

వరి తెగుళ్లు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి
బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 22: వరిపంటలో వచ్చే తెగుళ్లు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి మజ్జి శ్యాంసుందర్ అన్నారు. మండలం పారాది గ్రామంలో సోమవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో వరిపంటలో అగ్గితెగుళ్లు, చీడపురుగులు వంటివి వస్తున్నాయని, వాటిపై రైతులు నిరంతరం దృష్టిసారించాలన్నారు. వీటి నివారణకు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు పండిస్తున్న పంటలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి వారికి తగు సూచనలు, సలహాలు అందిస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ పంటలలో సేంద్రీయ ఎరువులనే వినియోగించాలన్నారు. రసాయనిక ఎరువులను వినియోగిస్తే నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.