విజయనగరం

నేడు సిరిమాను సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 22: ఉత్తరాంధ్రుల కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి సర్వం సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నాం 3 గంటలకు నిర్ధేశించిన విధంగా ఉత్సవాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, మధ్యాహ్నాం 12.30 గంటలకు సిరిమాను రధాన్ని నందిగం వీధిలోని హుకుంపేటలో నుంచి ఆలయ మర్యాదలతో వేద పండితుల మంత్ర ఘోషతో, మంగళ తూర్యనాదములతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు తోడ్కొని వస్తారు. ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారి దర్శనం అనంతరం 2.30 గంటలకు ఆలయ పూజారి సిరిమాను రధం అధిరోహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం బయలుదేరుతుంది. ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్, ఎఎస్పీ ఎం.నర్సింహరావు పరిశీలించారు. సిరిమాను రథానికి ముందర జాలారివల, అంబారీ, పాలధార ఉంటాయి. అమ్మవారు కోటకు చేరుకున్న తరువాత అక్కడ బురుజుపై ఉన్న పూసపాటి వంశీయులు, ఎంపీ అశోక్‌గజపతిరాజు కుటుంబీకులకు ఆశీస్సులు అందజేస్తుంది.
గట్టి పోలీసు బందోబస్తు
పైడితల్లిఅమ్మవారి ఉత్సవానికి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందితోపాటు కమ్యూనిటీ పోలీసులను నియమించారు. పట్టణంలోని ప్రధాన జంక్షన్లుగా ఉన్న కోట, మూడు లాంతర్లు, సత్య లాడ్జి, దాసన్నపేట, రింగురోడ్డు, బాలాజీ జంక్షన్, గూడ్స్‌షెడ్, వై జంక్షన్, ఎత్తుబ్రిడ్జి వద్ద ఎక్కువ మంది పోలీసులను నియమించారు. సిరిమానోత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మూడు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని అనుసరించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు అందించే విధంగా తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను అమ్మవారి ఆలయం ఎదుట ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా గత ఏడాది చోటుచేసుకున్న అపశ్రుతులను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న జాగ్రత్తలను కూడా పాటించడం ద్వారా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే కాలం చెల్లిన భవనాలపైకి ఎక్కి జనం ఉత్సవాన్ని వీక్షించకుండా ముందస్తుగా పాత భవనాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు శిధిలావస్థలో ఉన్న మేడలపైకి భక్తులను అనుమతించరాదని సూచించారు. సిరిమానోత్సవంలో తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ఏటా మూడు కోవెళ్ల నుంచి కోట గుమ్మం వరకు అన్ని రహదారులను మూసివేశారు. అలాగే మూడు లాంతర్ల నుంచి డిసిసిబి వరకు, డిసిసిబి నుంచి కోట గుమ్మం వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. గత ఉత్సవాలలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఘనంగా తోలేళ్ల ఉత్సవం!

విజయనగరం, అక్టోబర్ 22: ఈ ఏడాది తోలేళ్ల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నూతన పట్టుచీర, సారె, పసుపు, కుంకుమలను పల్లకిలో ఉంచి మేళతాళాలతో పులివేషధారులు, కర్రసాము విన్యాసాలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి చదురుగుడికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఇవో భానురాజా, వేదపండితుల ఆశీర్వచనాలతో పూర్ణకుంభంతో అశోక్ దంపతులకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అశోక్‌గజపతిరాజు విలేఖరులతో మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయన్నారు. గత 261 ఏళ్లుగా ఈ ఉత్సవం జరుగుతుందన్నారు. కాగా, తెల్లవారు ఝామున 5 గంటల నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఊరేగింపుగా ఘటాలతో ఆలయానికి వచ్చి ఆ చల్లని తల్లికి అంజలి ఘటించారు.
ముగిసిన విజయనగర ఉత్సవాలు

విజయనగరం, అక్టోబర్ 22: విజయనగర ఉత్సవాలు సోమవారంతో ముగిసాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో విజయనగరం వైభవాన్ని చాటిచెప్పారు. సంగీత, సాహిత్య, జానపద కళారూపాలు, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపారు. వేలాది మంది కళాకారులు తమ ప్రతిభను ఉత్సవ వేడుకలలో ప్రదర్శించారు. ఉత్సవాలు రెండోరోజు, పైడితల్లి తోలేళ్ల ఉత్సవం కలవడంతో భారీగా జనం తరలివచ్చారు. దీంతో పట్టణమంతా కళకళలాడింది. ఉత్సవ వేదికలన్ని సందర్శకులతో కిటకిటలాడాయి. ప్రదర్శనలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు తిలకించారు. ఈ ఉత్సవాల కోసం ఏడు వేదికలను ఏర్పాటు చేసి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. క్షత్రియ కల్యాణ మండపంలో పుష్ప ప్రదర్శనను ఎంపీ అశోక్‌గజపతిరాజు, మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులు సందర్శించారు.

పంట నష్టాలకు పరిహారం చెల్లించాలి
పార్వతీపురం, అక్టోబర్ 22: తిత్లీ తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం తక్షణచే చెల్లించే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపియం పార్వతీపురం ప్రాంత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపురం ఐటిడి ఎ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం,కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో సంభవించి తిత్లీ తుపాను కారణంగా జీడిమామిడి, కంది,గంటెలు,జొన్నలు వంటి పలు పంటలు దెబ్బతిన్నాయని, అందువల్ల వెంటనే వీటికి పంట నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఆరుగాలం పండించిన పంటలు దెబ్బతినడం వల్ల గిరిజనులు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ చేసి పంటలకు ఎకరాలకు రూ.10వేలు వంతున చెల్లించాలని కోరారు.తక్షణమే తగు చర్యలు తీసుకోకుంటే గిరిజనులు ఆర్థికంగా కుటుంబ పోషణ కూడా కష్టతరంగా ఉంటుందన్నారు. ఈధర్నా కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి గంగునాయుడు,సి పి ఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గసభ్యులు కొల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పీవోకు వినతిపత్రం అందించారు.
ఉపాధి నిధులు సక్రమంగా అందించాలి
పార్వతీపురం, అక్టోబర్ 22: తాము చేస్తున్న పనులను సంబంధించిన ఉపాధి హామీ నిధులు తమకు సక్రమంగా అందడం లేదని సోమవారం పార్వతీపురం ఆర్డీవో బి.సుదర్శనదొర నిర్వహించిన గ్రీవెన్సులో గుమ్మలక్ష్మీపురం మండలంలోని బీరుపాడు,గొయిపాక పంచాయతీ గిరిజనులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పార్వతీపురం మండలంలోని పొట్టిగదబవలస గిరిజనులు మాట్లాడుతూ తాము సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరారు.జియ్యమ్మవలసకు చెందిన పలువురు తమకు మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయాలని కోరారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని గొయిపాక గిరిజనులు మాట్లాడుతూ తిత్లీ తుపానుకు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పార్వతీపురం మండలానికి చెందిన పలువురు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఇంకా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.