విజయనగరం

ఉద్యోగుల్లో బదిలీ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 23:జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెలాఖరులోగా బదిలీలు పూర్తవుతాయనే అభిప్రాయంతో గడచిన రెండు నెలలుగా కింది స్థాయి అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు మంచి ప్రాంతాలకు బదిలీలకోసం ప్రయత్నాలు జరిపారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో ఈ ఏడాది బదిలీలు ఉండకపోవచ్చని భావించారు. కానీ రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను కలిసిన ఉద్యోగుల సంఘాల నాయకులతో జూన్ 15లోగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తామని స్పష్టంచేయడంతో ఉద్యోగుల్లో మళ్లీ కలకలం మొదలైంది. మండల స్థాయిలో పలువురు తహశీల్దార్‌లు, ఎంపిడిఓలకు బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరిలో కొందరికి ఒకేచోట రెండేళ్లుపూర్తిచేసిన కారణంగా బదిలీలు అవుతుండగా మరికొందరికి రాజకీయ కారణాలతో బదిలీలు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. కొందరు అధికారులు అయితే ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకుల ఒత్తిళ్ళు తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు, లూప్‌లైన్ పోస్టులకు మారేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే రకమైన తంతు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. పోలీసు శాఖలోకూడా భారీ ప్రక్షాళన జరగవచ్చని ఆశాఖ కిందిస్థాయి అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్లలో అటాచ్‌డ్ డ్యూటీలతో ఎస్సైలు పనిచేస్తున్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా లేళ్ల కాళిదాసు పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సాధారణ బదిలీలలోభాగంగా తనదైన మార్కు బదిలీలు జరుపుతారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా మండల స్థాయిలో తమకు అనుకూలమైన అధికారులను పోస్టింగులకోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వివిధ సందర్భాలలో మండల స్థాయిలో కొందరు అధికారులు తమ మాట వినడంలేదని జడ్పీటీసీలు, ఎంపిపిలు తమతమ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో మాటవినే అధికారుల కోసం ఈ సారి భారీగా సిఫార్సులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా అధికారులకూ స్థాన చలనం..
కాగా జిల్లాలో పనిచేస్తున్న కొన్ని శాఖల జిల్లా అధికారులకు కూడా స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. ఇటీవలే గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రెగ్యులర్ ఎస్ ఇని నియమించగా తాజాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేసి కొత్త అధికారిని నియమించారు. జిల్లా పరిషత్ సమావేశాలలో వివిధ శాఖల సమీక్షా సమావేశాలలో కొందరు అధికారులపై ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తిన నేపథ్యంలో జూన్ నెల రెండవ వారంలోజరిగే సాధారణ బదిలీలు సందర్భంగా కొన్ని శాఖల జిల్లా అధికారులను ఇక్కడ నుంచి తప్పించి ఇతర జిల్లాలో పనిచేస్తున్న తమ అనుకూలురను రప్పించుకునే ప్రయత్నాలు అధికార పార్టీ నేతలు ప్రారంభించినట్లు సమాచారం.

ఎన్‌ఎడికి వ్యతిరేకంగా ఉద్ధృతమవుతున్న పోరాటం
దత్తిరాజేరు, మే 23: మండలంలోని ఎనిమిది గ్రామాల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌ఎడి ఏర్పాటుకు ప్రయత్నాలు విరమించుకోకపోతే వ్యతిరేకంగా ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులతోపాటు అన్ని పార్టీలకు చెందిన మండల నాయకులతో పార్టీలకు అతీతంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, పి. కామేశ్వరరావు, ఆల్తి అప్పలనాయుడు అన్నారు. సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట మరడాం, పాచిలవలస, వి.కృష్ణాపురం, ఎస్. చింతలవలస, వింద్యవాసి, భోజరాజపురం, కోమటిపల్లి గ్రామాలకు చెందిన రైతులతోపాటు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వై ఎస్సార్ సిపి నాయకులు కలసి సిపిఎం, సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఎనిమిది గ్రామాలకు రైతులకు ఎకరా నుండి రెండు ఎకరాలకు మించి భూములు లేవని, ఈ భూములు ద్వారా వివిధ రకాల కాయగూరలు పండించుకుని ఇతర ప్రాంతాలకు తరలించి జీవనోపాధి పొందుతున్నారని, ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎన్ ఎడి ఏర్పాటుచేస్తే రైతులు ఉపాధి కోల్పోతారని అన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ పి. జనార్థనరావుకు ఎనిమిది గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, రైతులు కలసి వినతి పత్రం అందజేసారు. ఈ ధర్నా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజపతినగరం, పెదమానాపురం, బొండపల్లి, ఎస్.్భర్జివలస ఎస్సీలు వరప్రసాద్, యు. మహేష్, తారకేశ్వరరావు, బాబూరావులతోపాటు నాలుగు స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం డివిజన్ సిపిఎం నాయకులు పురం అప్పారావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తహశీల్దార్ పి.జనార్థనరావు వినతి పత్రం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ఎన్‌ఎడి ఏర్పాటుకు సంబంధించి ఎనిమిది గ్రామాలకు చెందిన రైతుల భూములు సేకరించే ప్రయత్నం ఇంతవరకు తాము చేయలేదని తహశీల్దార్ తెలిపారు. ఒక వేళ ప్రభుత్వం నుంచి భూములను సేకరించమని ఉత్తర్వులు వస్తే ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల స్థాయి వివిధ పార్టీల నాయకులు సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తెలుసుకుని జిల్లా అధికారులకు తెలియజేస్తామని అన్నారు. ఈ విషయమై రైతులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందవద్దని కోరారు.