విజయనగరం

జిల్లా అభివృద్ధికి సమష్ఠి కృషి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 4: జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు తాము కష్టపడి పనిచేయడంతోపాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేసేలా చూడాలని గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కష్టపడితేనే వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లల్లో వివిధ కార్యక్రమాల అమలులో కొన్ని సందర్భాల్లో అధికారుల కారణంగా కొన్ని తప్పులు జరిగినా సర్ధుకుపోయామని, ఇకనుంచి పథకాల అమలులో లోపాలను సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో మంత్రి మృణాళిని సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టవల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రతిపాదనలను జిల్లా అధికారులు తమ శాఖల ఉన్నతాధికారులకు నేరుగా పంపిస్తున్నారని, ఈ ప్రతిపాదనలను కలెక్టర్ దృష్టికి, తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా చూసేందుకు వీలుఉంటుందని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి నిర్థేశించిన లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీరందేలా ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణను అమలు చేయాలని తెలిపారు. తోటపల్లి కుడికాలువ ద్వారా సాగునీరు చివరన గడిగెడ్డకు చేరుకోవడం వల్ల గడిగెడ్డ రిజర్వాయర్ పరిధిలోని చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన 25 వేల ఎకరాలకు సాగునీరు లభ్యం అవుతుందని చెప్పారు. జంఝావతి ప్రాజెక్టు ఆయకట్టుదారులకు నీరు అందించేందుకు ఇచ్చిన తాజా ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి 39 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి చెబుతూ ఈ పనులను అధికారులు సకాలంలో పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని పార్వతీపురం, భీమసింగి, మానాపురంవద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో జాప్యం జరగడాన్ని ప్రస్తావిస్తూ అధికారులు వెంటనే ఈ నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. కొత్తవలస వద్ద ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని రోడ్లు, భవనాలశాఖ ఎస్‌ఇని మంత్రి ఆదేశించారు. రామభద్రాపురంలో మార్కెట్‌యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపిన సందర్భంలో సర్వశిక్ష అభియాన్ కింద నిర్మిస్తున్న పాఠశాల భవనాలను త్వరగా పూర్తిచేయాలని ప్రాజెక్టు డైరెక్టర్ లింగేశ్వరరెడ్డిని ఆదేశించారు. సంక్షేమ వసతిగృహాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఆదేశించారు. వసతిగృహాల విద్యార్థులకు ప్రతినెల వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారి తెలిపారు.
వర్షాల కారణంగా సెప్టెంబర్ వరకు అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలలో చెత్తాచెదారం తొలగించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లాపరిషత్ సిఇఓను, జిల్లా పంచాయతీ అధికారిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, అదనపుజెసి నాగేశ్వరరావు, డిఆర్‌ఓ జితేంద్ర పాల్గొన్నారు.