విజయనగరం

కలెక్టర్ వ్యవహారశైలితో జిల్లా యంత్రాంగంలో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 5: జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టడంతోనే పరిపాలనా విషయాల్లో తనదైన విధానాన్ని ప్రదర్శిస్తుండటంతో జిల్లా అధికారుల్లో కలకలం, కదలిక మొదలైంది. కార్యాలయ సందర్శనలు, ఆకస్మిక తనిఖీలు, తప్పుచేసిన సిబ్బందిపై కొరడా ఝుళిపించటం తదితర చర్యలతో అధికారులను పరుగులెత్తిస్తున్నారు. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వివేక్‌యాదవ్‌ను ప్రమోషన్‌పై విజయనగరం కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసిన రెండు రోజులకే జిల్లా కలెక్టర్‌గా కొత్త విధుల్లో చేరిపోయారు. తరువాత రెండు రోజులకే ‘డయల్ యువర్ కలెక్టర్’ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన అర్జీదారులు తమ సమస్యలు నేరుగా కలెక్టర్‌కు తెలిపి పరిష్కారం కోరే ఈ కొత్త కార్యక్రమానికి మొదటిరోజే ప్రజల్లో స్పందన, అధికారుల్లో అలజడి కలిగించింది. మరణ ధ్రువీకరణ పత్రం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శులు డబ్బు అడిగారని బాడంగి మండలానికి చెందిన ఒక బాధితుడు కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేయగా, ఈ విషయంలో సీరియసై ఆ శాఖ జిల్లా అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించటం, జిల్లా అధికారి 24గంటల్లో నివేదిక ఇవ్వటం, డబ్బు అడిగిన ఇద్దరు గ్రామ కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేయటం వెంటవెంటనే జరిగిపోయింది. దీంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది గుండెల్లో రైలు పరుగెత్తించినట్లయింది. డయల్ యువర్ కలెక్టర్ జరిగిన సందర్భంలోనే జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి ప్రతి సోమవారం ఉదయం 9.30కు ఖచ్చితంగా కలెక్టరేట్‌కు చేరుకోవాలని, మండలస్థాయి అధికారులు 10గంటలకల్లా విధులకు హాజరుకావాలని కలెక్టర్ ఫర్మానా జారీ చేశారు. చాలాకాలంగా విశాఖ, శ్రీకాకుళం నుంచి అప్ అండ్ డౌన్ విధానంలో పనిచేస్తున్న కొన్ని శాఖల జిల్లా అధికారులు ఆదివారం సెలవుపై వెళ్లి సోమవారం ఏ మధ్యాహ్నానికో చేరుకోవటం అలవాటుగా మార్చుకున్నారు. గత కలెక్టర్ నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఏదో మిషతో కొన్ని శాఖల అధికారులు డుమ్మా కొట్టిన సంఘటనలు కోకొల్లలు. కానీ కొత్త కలెక్టర్ వివేక్‌యాదవ్ చర్యలతో ఇకనుంచి ప్రతి సోమవారం ఉదయం 9.30గంటలకే అన్ని శాఖల అధికారులు కలెక్టరేట్‌లో హాజరు వేసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. ‘డయల్ యువర్ కలెక్టర్’ జరిగిన మరుసటి రోజే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటనలు జరిపి అధికారులను పరుగులెత్తించారు. ఆసుపత్రుల తనిఖీ సందర్భంగా కలెక్టర్ వ్యవహారశైలి అధికారులకు చెమటలు పట్టించింది. గతంలో చాలామంది కలెక్టర్లు ప్రశ్నలు వేయటం, తోచిన సమాధానాన్ని అధికారుల చెప్పటం, అదే నిజమని కలెక్టర్లు భావించటం చాలా సందర్భాల్లో కొనసాగింది. కానీ ఆసుపత్రుల తనిఖీలో భాగంగా మంగళవారం దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అటెండెన్స్ నమోదు కోసం బయోమెట్రిక్ విధానాన్ని పాటించని విషయాన్ని గమనించిన కలెక్టర్ ఆసుపత్రి ఇన్‌చార్జిని ప్రశ్నించగా సిగ్నల్స్ అందటం లేదని చెప్పారు. మామూలుగా అయితే ఇతర అధికారులు నిజమేనేమోనని భావించేవారు. కానీ డాక్టర్ల సమాధానం విన్న కలెక్టర్ వివేక్‌యాదవ్ వెంటనే తన సెల్‌లో నెట్ సిగ్నల్స్ అందుబాటులో ఉండటాన్ని గమనించి డాక్టర్లను ప్రశ్నించటంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. వెంటనే సిగ్నల్స్ అందుబాటులో ఉన్న చోట బయోమెట్రిక్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలుప్రాంతాల్లో రేషన్ పంపిణీలో ఇ-పాస్ విధానం అమలు చేయకపోవటం, ఐరిష్ సమస్య పేరిట పింఛన్ల పంపిణీలో జాప్యం చేయటాన్ని గమనించిన కలెక్టర్ అధికారులకు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజుల కిందట జాయింట్ కలెక్టర్, అదనపు జెసి, డిఆర్వోతో కలసి కలెక్టర్ వివేక్‌యాదవ్ కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాలయాలను తనిఖీ చేశారు. కలెక్టర్ కార్యాలయాల తనిఖీకి వస్తున్నారనే సమాచారంతో ఆయా శాఖల జిల్లా అధికారులు అలర్ట్ అయి తమ కార్యాలయాలు, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అంతకుముందు కొన్ని శాఖల కార్యాలయాలు మినహా మిగతా అన్ని కార్యాలయాలు అపరిశుభ్రంగా, బూజులు, చెత్తతో అధ్వాన్నంగా కనిపించగా, కలెక్టర్ తనిఖీలతో హడావుడిగా స్వచ్ఛ్భారత్ చేపట్టి కలెక్టర్‌తో చివాట్లు తినకుండా తప్పించుకున్నారు. ఒకపక్క పర్యటనలు, మరోపక్క తనిఖీలతో క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందికి చెమటలు పట్టిస్తున్న కలెక్టర్ ప్రారంభం నుంచే వివిధ శాఖలపై సమీక్షలు జరపటం ద్వారా వివిధ పథకాల అమలుతీరును పరిశీలిస్తూ సక్రమంగా పనిచేయని అధికారులకు అక్షింతలు వేస్తున్నారు. గతంలో మాదిరి పనిచేస్తే ఇక కష్టమే అనే భయాన్ని సక్రమంగా పనిచేయని జిల్లా అధికారుల్లో కలెక్టర్ వివేక్‌యాదవ్ కల్పించారు.