విజయనగరం

భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 15: జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని తెలిపారు. 602కోట్ల రూపాయల పెట్టుబడితో జిల్లాలో ఆరు భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. 29వేల మందికి ఉపాధి కల్పించేలా 1,271కోట్ల రూపాయల పెట్టుబడితో 2961 చిన్న,మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి మృణాళిని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి పథకం కింద కేంద్రం నిధులు కేటాయిస్తోందని, ఈ పథకంలో ఎంపికైన విజయనగరం జిల్లాకు ఇప్పటికే వంద కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని చెప్పారు. దీపం పథకం కింద జిల్లాలో 38920 మందికి కొత్త గ్యాస్ కనెక్షన్లు అందజేశామని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద 48600 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందజేశామన్నారు.జన్మభూమిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 34300 కుటుంబాలకు కొత్తరేషన్ కార్డులు అందజేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 253837 మందికి వృద్ధాప్య, వితంతు విభిన్న ప్రతిభావంతుల, చేనేత, కల్లుగీత కార్మికులకు, వృద్ధ కళాకారులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 3461 మహిళా స్వయం సహాయక సంఘాలకు 98కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీగా మంజూరు చేశామన్నారు. వడ్డీలేని రుణాలకింద 16.17కోట్ల రూపాయలు 17785సంఘాల ఖాతాలకు జమచేశామన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విద్యా సంవత్సర ప్రారంభంలో 567మంది బడిబయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలు, వసతి గృహాలలో చేర్పించామన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, ఏకరూప దుస్తుల పంపిణీ, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, తరగతుల నిర్వహణకు అవసరమైన అదనపు గదుల నిర్మాణం ద్వారా పిల్లలను చదువుల పట్ల ఆకర్షింపబడేలా చూస్తున్నామని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కనీస సౌకర్యాల కింద 35.39కోట్ల రూపాయల ఖర్చుతో 73 భవనాలు నిర్మించారని, మూడు కోట్ల రూపాయలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు బంకర్ బెడ్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రత్యేక అభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులలో రూ.4.50కోట్ల ఖర్చుతో 90 గిరిజన గ్రామాలలో మంచినీటి పథకాలు, మరో 2.50కోట్ల రూపాయల ఖర్చుతో మారుమూల గ్రామాలకు 27 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1250 ఇళ్లు చొప్పున మంజూరు చేశారన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ నిర్మాణంలో మొదటి విడత విజయనగరం మున్సిపాలిటీ, మూడవ విడతలో పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీలు ఎంపికయ్యాయని, ఇప్పటివరకు ఈ మున్సిపాలిటీలకు 11353 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. దీన్‌దయాల్ గ్రామజ్యోతి యోజన కింద కరెంట్ సౌకర్యంలేని 30269 ఇళ్లను, 25 ఆవాస ప్రాంతాలను విద్యుద్ధీకరించారని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి కింద రైతులకు సోలార్ విద్యుత్ పంపుసెట్టు మంజూరు చేస్తున్నామన్నారు. విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీలలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుతో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గాయని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 75 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 18653 మందికి ఉచిత వైద్య చికిత్సలు జరిపించామన్నారు. అన్ని రంగాలలో ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఉత్తమ అవార్డు లభించిందన్నారు.
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద 227.68కోట్ల రూపాయలతో 1.51లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారని, ఇప్పటివరకు 39కోట్ల రూపాయలు ఖర్చుచేసి 23వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశారన్నారు. ఇప్పటి వరకు 15 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించగా గాంధీ జయంతి నాటికి వంద గ్రామాలను లక్ష్యంగా తీసుకున్నామన్నారు. గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 300 కోట్ల రూపాయలు ఖర్చుచేశామని, ఇందులో 208 కోట్లు వేతనాలుగా చెల్లించామని చెప్పారు. ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాకు రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానం లభించిందన్నారు. పట్టణపేదరిక నిర్మూలన ద్వారా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో 281 స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం పది కోట్ల రూపాయలు రుణాలుగా బ్యాంకులు మంజూరు చేశాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని భోగాపురం వద్ద తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీని ప్రకటించిన కారణంగా ఇప్పటికే 50శాతం మంది రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారని చెప్పారు. భూసేకరణతో నిర్వాసితులైన 425 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. కొత్తవలస మండల రెల్లి గ్రామ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించడంతోపాటు తాత్కాలికంగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి జెఎన్‌టియు ప్రాంగణంలో గిరిజన విశ్వవిద్యాలయ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని చెబుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ఆమేరకు కార్యక్రమాలు అమలు జరిగేలా సహకరించాలని కోరారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల జిల్లా అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి మృణాళిని ప్రారంభించారు.