సంపాదకీయం

నిర్మల గంగ నిజమయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమామి గంగే-గంగానదీ నమస్కారం-అన్నది గంగానది ప్రక్షాళన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరు! నమస్కారం భక్తికి చిహ్నం...కానీ గంగా ప్రక్షాళన-క్లీన్ గంగా పథకం నినాదాలకు మాత్రమే పరిమితమై పోయిందన్న జాతీయ హరిత న్యాయమండలి వ్యాఖ్య ప్రభుత్వ నిర్వాహకులకు మరో అభిశంసన! గంగానదిని ప్రక్షాళన చేయాలన్న నినాదాలకు, ఆచరణకూ పొంతన కుదరడం లేదన్నది జాతీయ హరిత న్యాయ మండలి-ఎన్‌జిటి- అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ చేసిన వ్యాఖ్య! గంగానది ప్రక్షాళన ప్రగతి గురించి జనవరి 27వ తేదీ లోగా వివరాలను అందచేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసిన ట్రిబ్యునల్ గంగానది మరింతగా కాలుష్యగ్రస్తం అవుతుండడానికి కారకులెవరని ప్రశ్నించింది! వారణాసి పవిత్ర ధార్మిక క్షేత్రం వద్ద గంగానదిలో మానవ మృతదేహాలు జంతువుల కళేబరాలు తేలియాడుతున్నట్టు ప్రచారమైన దృశ్యాల ప్రాతిపదికగా న్యాయమండలి ఈ ఆందోళనను వ్యక్తపరిచిందట! గౌరవకుమార్ బన్స ల్ అనే న్యాయవాది ఈ విషయమై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు! పారిశ్రామిక కాలుష్యాలతో శౌచాలయ వ్యర్థ జలాలతో కాలుష్య గ్రస్తమైపోతున్న గంగానదిని మళ్లీ పాన యోగ్యం, స్నాన యోగ్యం చేయడానికై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నినాదాలకు మాత్రమే పరిమితం కావడం వర్తమాన ప్రగతి! పదేళ్లలో గంగా ప్రక్షాళనకు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులకు నాలుగురెట్లు ఐదేళ్లలోనే ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న ప్రచారం కూడ జరిగింది. కానీ గత పద్దెనిమిది నెలల కాలంలో గంగానది ఎక్కడ ఏ మేరకు స్వచ్ఛతను సంతరించుకుందన్నది మాత్రం స్పష్టం కాలేదు! మీ ప్రస్తుత పదవీ కాలం పూర్తయ్యేలోగా 2500 కిలోమీటర్ల పొడవునా గంగానదిని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలరా? అని గత సంవత్సరం జనవరి 14వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది! సంవత్సరం తరువాత గ్రీన్ ట్రిబ్యునల్ అదే ప్రశ్నను మళ్లీ సంధించింది! గంగా ప్రక్షాళన కార్యక్రమంతోబాటు సమానంతరంగా పారిశ్రామిక కాలుష్యాన్ని పెంచే ప్రపంచీకరణ కార్యక్రమం కూడా కొనసాగుతుండడంవల్ల దీపం పెట్టిన తరువాత దిగనేసినట్టు అవుతోంది! ప్రతిరోజూ యాబయి కోట్ల లీటర్ల పారిశ్రామిక కాలుష్య ద్రవాలు గంగానదిలోకి కలుపుతున్నవారు ఎవరు? వారిని గుర్తించి శిక్షించడానికి వీలుగా రూపొందిన చట్టం ఏమైంది? నమామి గంగే పథకానికి ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది! అప్పటికి వర్తమాన ప్రభుత్వం వారి ఐదేళ్లలో ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు మరో ఏడాది కూడ జరిగింది. ఈ నిధులలో ఎంత శాతం ఖర్చయినాయి? గంగానదిలో స్వచ్ఛత ఏ మేరకు పెరిగింది?
మోదీ గంగాహారతి కార్యక్రమాలలో పాల్గొంటుండడం వల్ల గంగా ప్రక్షాళనకు ప్రాధాన్యం పెరిగింది. గంగ పవిత్రతకు ప్రతీక, గంగ భారత జాతీయతకు ప్రతీక, ప్రవాహ నిత్యత్వం అన్న జీవన వాస్తవానికి గంగానది ప్రతిరూపం...గంగ సనాతన సాంస్కృతిక స్రోతస్వినికి పతాకం! అందువల్లనే నీటికి గంగ అన్న పేరు పర్యాయమైంది! దేశంలోని దాదాపు అన్ని నదులకూ ఆయా ప్రాంతాలలోని స్థానికులు గంగ అని పేరు పెట్టుకొనడం అనాది సంప్రదాయమైంది! ఆకాశంలోని మందాకిని శివుని జటాజాటంలోకి దూకడం భగీరథుని తప్ఫఃలం! శివ జటాజూట విముక్త అలకనంద హరిద్వారం వైపు అనంత సాగరంవైపు పరుగులు తీయడం భారతీయుని మనోరథం! స్వచ్ఛత గంగానది స్వభావం, ఆపఃపునంతు పృథివీం...నీరు నేలను పరిశుభ్రం చేయాలన్నది సనాతన సృష్టిగత వ్యవస్థ! వర్షంనీరు నదుల రూపం ధరించి భూమిని పవిత్రవతం చేసింది, పండిస్తోంది! ఈ సాధారణ సత్యానికి చిహ్నం గంగానది. ఎప్పటికీ చెడని నీరు గంగా ప్రవాహం! గంగ నీటి స్పర్శ తాకిన మేర రోగకారమైన దోమలు పుట్టవన్నది పరిశోధనలు నిగ్గుతేల్చిన సత్యం! హిమాలయ ప్రాంగణ ఔషధీ రసాలు సంగమించిన అమృత జీవన ధార గంగ! సనాతన భరత సంస్కృతి వ్యాపించిన దూర సీమలలో సైతం గంగానదీ ప్రాధాన్య పవిత్రతలకు పరిగణ లభించడం చరిత్ర. టిబెట్‌లో పుట్టి బర్మా లావోస్ థాయ్‌లాండ్ వియత్నాం దేశాలలో నాలుగు వేల కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మెకాంగ్ నదికి ఆ పేరు గంగానది వల్లనే లభించింది. ధాయ్ భాషలోని మెకాంగ్ సంస్కృత భాషలోని మాతృగంగ...ఈ చారిత్రక మహాధుని పారిశ్రామిక కాలుష్యాలతో ప్రపంచీకరణ కాలుష్యాలతో సంకరమై ఉండడం వర్తమాన వైపరీత్యం...
ఇంత పొడవైన నదీ జలాలు స్వచ్ఛతను కోల్పోయి కాలుష్య గ్రస్తం అయిపోవడానికి వందేళ్ల నిర్లక్ష్యం కావచ్చు! హరిద్వారం వరకు నిర్మలంగా ఉండిన జలాలు ఆ తరువాత పరీవాహ ప్రాతంలో కాలుష్యవంతం కావడం వందేళ్ల క్రితమే మొదలైంది. అందువల్లనే గంగను చెంబులలోను పాత్రలలోను గంగాళాలలోను నింపి తెచ్చుకునే వారు హరిద్వారం వద్ద ఆపైభాగంలో మాత్రమే జలాలను సేకరించడం ఆరంభమైంది. నలబయి ఒక్క ఉపనదులు గంగలో సంగమిస్తున్నాయి. వీటిలో సగానికి పైగా హరిద్వారం తరువాతనే గంగలో కలుస్తున్నాయి. ఈ ఉపనదుల నీరు చేరిన తరువాత గంగ నీరు హరిద్వార స్వచ్ఛతను కోల్పోతుందన్నది సంప్రదాయ విశ్వాసం. కానీ వంద ఏళ్లుగా ఈ ఉపనదులతోపాటు వందల వేల కాలుష్య ప్రవాహాలు గంగా నదిలో చేరిపోతున్నాయి! ఈ కాలుష్య ప్రవాహాలను ఎలా నిరోధిస్తారు? గంగా ప్రక్షాళన కార్యక్రమ స్వరూప స్వభావాలు ఎట్టివి? ఈ ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం వారే 2014 సెప్టెంబర్‌లో సంధించారు. వివరణాత్మక ప్రణాళిక-పవర్‌పాయింట్‌ను రూపొందించి తమకు సమర్పించవలసిందిగా కూడ సర్వోన్నత న్యాయస్థానంవారు కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు కోరారు. మరో రెండు వందల ఏళ్ల తరువాత కూడ గంగానది స్వచ్ఛతను సంతరించుకొనదేమో అన్న సందేహాన్ని కూడ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడు వ్యక్తం చేసింది! అందువల్ల ఇప్పుడు హరిత న్యాయమండలి వారు సూచించినట్టుగా గంగానదిని అనేక భౌగోళిక విభాగాలుగా ఏర్పాటు చేసి సమాంతరంగా అన్ని విభాగాలలోను ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాలి. అలా క్షాళన కార్యక్రమాన్ని అమలు జరిపినట్టయితే ఐదేళ్లలో కాకపోయినా పదిహేను ఏళ్లలోనైనా గంగానది మళ్లీ నిర్మల జల వాహనిగా మారుతుంది! ఉపనదులను యమునా నదినీ కూడ పరిశుభ్రం చేయకపోయినట్టయితే నిర్మల గంగ ఎండమావిలోని నీరు మాత్రమే కాగలదు!
ఇదంతా జరగాలంటే గంగానది యమునానది ఉపనదుల పరివాహ ప్రాంతం పొడవునా నిలిచివున్న పరిశ్రమలను నియంత్రించడం అనివార్యం! శౌచాలయాలనుంచి ఇళ్లనుండి మొదలైపోతున్న కాలుష్య ప్రవాహాలను గంగాలో కలవకుండా నిరోధించడం కూడ అనివార్యం! భయంకర కాలుష్యాలను విసర్జిస్తున్న దాదాపు ఎనిమిది వందల పరిశ్రమలు గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉన్నాయి. పనె్నండు వందల కోట్ల లీటర్ల కాలుష్య జలాలు, విష రసాయనాలు ప్రతీరోజు గంగానదిలోను ఉపనదులలోను కలిసిపోతున్నాయట! ఒక సంవత్సరంలో గంగలో చేరుతున్న కాలుష్య ద్రవ పరిమాణం ఎంతో ఊహించుకోవచ్చు! గంగానది కాలుష్యంతోను భారతీయ సంస్కార స్రవంతి భావదాస్యంలోను సంకరం కావడం సమాంతర విపరిణామాలు...