సంపాదకీయం

మృత్యుక్రీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటలే ప్రాణాంతకమవుతున్నాయి. వినోదాన్ని అందించిన క్రీడలే మృత్యు శకటాలుగా మారుతున్నాయి. నిన్న ‘పోకోమెన్’ ప్రపంచ దేశాల్ని ఎంతగా పరుగులు పెట్టించిందో.. నేడు అంతకు మించిన స్థాయిలో మరో క్రీడ పిల్లల్ని మృత్యుకుహరాల్లోకి నెట్టేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపోర్ జిల్లాలో పదిహేనేళ్ల కుర్రాడు అంకన్ దేవ్ ముఖానికి ప్లాస్టిక్ కవరు చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నానం చేస్తానని బాత్రూంలోకి వెళ్లిన ఆ టెన్త్ విద్యార్థి ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు పగులగొట్టి చూడగా అతను విగతజీవిగా కనిపించాడు. తలకు పాలిథిన్ కవరు చుట్టుకుని, మెడకు టవల్ గట్టిగా బిగించుకోవడం వల్ల ఊపిరాడక అంకన్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. ముంబైలోని అంథేరీలో మన్‌ప్రీత్ సహాన్ అనే పధ్నాలుగేళ్ల విద్యార్థి ఓ భవనంపై నుంచి కిందకు దూకేశాడు.. షోలాపూర్‌లో మరో పధ్నాలుగేళ్ల విద్యార్థి ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి పారిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పదమూడేళ్ల విద్యార్థి సుధీర్ స్కూల్ భవనంపై నుంచి దూకేందుకు యత్నించి గాయపడ్డాడు.. ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనలు.. అయినా కారణం మాత్రం ఒకటే.. అదే- ‘బ్లూవేల్ చాలెంజ్’.. ఇది ఓ సోషల్ మీడియా గేమ్.. సరదాగా మొదలై చివరికి టీనేజర్లను ఆత్మహత్యలకు ప్రేరేపించే దారుణమైన ‘మృత్యుక్రీడ’. రష్యాలో ప్రారంభమైన ఈ ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్ దుబాయ్, బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ, చైనా, అర్జెంటీనా, బ్రెజిల్, బల్గేరియా, కొ లంబియా, అమెరికా వంటి అనేక దేశాల్లో ఇ ప్పటికే వందలాది మంది టీనేజీ పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఈ గేమ్ వెబ్‌సైట్లను చైనా పూర్తిగా నిషేధించింది. ఈ మృత్యుక్రీడ ఇప్పుడు భారత్‌లోనూ పంజా విసురుతోందనడానికి ఎందరో కుర్రాళ్ల ఆత్మహత్య ఉదంతాలు సాక్షీభూతం. ఈ ఆట కేవలం 10 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను హిప్నటైజ్ చేస్తూ మృత్యుమార్గం పట్టిస్తోంది. భారత్ సహా అనేక దేశాల్లోనూ ఈ గేమ్ మాయలో పడి మరణిస్తున్న టీనేజర్ల సంఖ్య ఆందోళనకరంగా ఉంది.
అమాయక పిల్లల్ని బలిగొనే ఈ ఆటను నిషేధించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం, దీన్ని వెంటనే నిలిపివేయాలంటూ మహారాష్ట్ర శాసనసభలోను, రాజ్యసభలోను చర్చ జరిగిందంటే ఇది ఎంత ప్రాణాంతకంగా పరిణమించిందో వేరే చెప్పనవసరం లేదు. ‘బ్లూవేల్ చాలెంజ్’తో రోజుకో ప్రాణం పోతుండడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ‘బ్లూ వేల్’ లింక్‌లను తొలగించాలని సామాజిక మీడియా దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్, యాహూలకు నోటీసులిచ్చింది. ఈ ప్రాణాంతక ఆట ‘లింక్’లను సామాజిక మాధ్యమాలు తొలగించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటి, న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ హెచ్చరించినా పరిస్థితి మారకపోవడం విడ్డూరం. మృత్యువాత పడుతున్న టీనేజర్ల సంఖ్యా తగ్గడం లేదని తాజా ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. యువతను ఆత్మహత్యలకు ప్రేరేపించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ‘బ్లూ వేల్’ ఆటను వ్యాప్తి చేసేందుకు నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను వాడుకోవడం ఆందోళనకరం. అవసరాలు తీర్చాల్సిన ‘యాప్’లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆటవిడుపుకోసం సృష్టించిన ‘ఆన్‌లైన్ గేమ్’లు అమాయక పిల్లల ఉసురు తీస్తున్నాయి. ప్రపంచ జ్ఞానం తెలియని పిల్లలు ‘డేంజర్ గేమ్’ల మాయలో పడుతూ కన్నవాళ్లకు విషాదాన్ని మిగల్చడం ఓ వైపరీత్యమని మానసిక వికాస నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీనేజీ యువతను సులువుగా ప్రభావితం చేసే ‘బ్లూవేల్ చాలెంజ్’ నిజానికి ఓ సైకోగేమ్. ఆన్‌లైన్‌లో ఈ గేమ్‌ను ఓపెన్ చేసేవారు ఏభై రోజులపాటు అది చెప్పిన పనులను తూ.చ తప్పకుండా చేయాలి. రోజూ తెల్లవారు జామున నాలుగున్నర గంటలకే నిద్రలే.. మేడపైకి వెళ్లి చీకట్లో ఏకాంతంగా కూర్చో.. పెదవిపై బ్లేడుతో గాటు పెట్టుకో.. చేతిమీద చాకుతో తిమింగలం బొమ్మ గీసుకో.. శరీరంపై సిరంజీలతో గుచ్చుకో.. ఏదైనా వంతెన అంచున నిలబడి ‘సెల్ఫీ’ తీసుకో.. నగ్నంగా ఫొటోలు తీసుకుని అందరికీ ‘షేర్’ చెయ్.. ఇలాంటి పిచ్చిపిచ్చి ‘టాస్క్’లు ఇస్తుంటే ఇదంతా ఆటలో భాగమేనని పిల్లలు భ్రమపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక ‘గేమ్’ స్థానంలో ‘మెంటార్’ ( అడ్మినిస్ట్రేటర్) రంగ ప్రవేశం చేస్తాడు. ఇక అప్పటి నుంచి అసలైన ‘మృత్యుక్రీడ’ మొదలవుతుంది. 49 రోజుల పాటు ఏవేవో టాస్క్‌లు ఇచ్చి.. చివరి రోజున ఏదైనా భవనంపై నుంచి దూకాలనో, వంతెనపై నుంచి నీళ్లలోకి పడాలనో, ముఖానికి కవరు బిగించుకుని స్నానం చేయాలనో ‘మెంటార్’ ఆదేశిస్తాడు, ఇవి పూర్తిచేస్తేనే ‘గేమ్’ పూర్తయినట్టని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. పిల్లల భావోద్వేగాలను లొంగదీసుకునే ఈ ఆటలో ఆఖరుగా- ‘ఆత్మహత్య చేసుకోవాలి.. లేకపోతే చాలెంజ్‌లో ఓడిపోయినట్టే’ అనే నిబంధన ఎందరికో మరణ శాసనాలను రా స్తోంది. ఆటను ఆటగా కాకుండా ‘గేమ్’లో చెప్పి న ‘టాస్క్’లు పూర్తిచేస్తూ టీనేజర్లు ప్రాణాల మీ దకు తెచ్చుకుంటున్నా రు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘టాస్క్’లు పంపుతారు. ‘టాస్క్’లు పూర్తి చేసినవారు ఫొటోలతో పాటు ఆ వివరాలను సోషల్ మీడియాలో అందరికీ తెలియజేస్తూ తమ ‘గొప్పతనాన్ని’ చాటుకుంటారు. ఈ వివరాలను చూశాక మిగతా పిల్లలు తాము కూడా ఎలాంటి ‘టా స్క్’లనైనా పూర్తి చేయాలన్న ఆరాటంతో ‘బ్లూవేల్’ చెరలో బందీలవుతున్నారు. తెగించి సాహసం చేయాలన్న కుతూహలం, ప్రమాదాలపై విచక్షణ లేకపోవడంతో ‘బ్లూవేల్’ వలలో పడుతున్నారు. రష్యాకు చెందిన ఫిలిప్ బుడెకిన్ అనే సైకాలజీ విద్యార్థి సృష్టించిన ‘బ్లూవేల్ చాలెంజ్ గేమ్’ 2013లో రష్యన్ సామాజిక వెబ్‌సైట్ ‘కొంటాక్టే’లో ప్రారంభం కాగా, 2015లో తొలి ఆత్మహత్య వెలుగు చూసింది. పిల్లల్లో ఆత్మహత్యలు పెరగడానికి ‘బ్లూవేల్’ కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఫిలిప్‌కు మూడేళ్ల శిక్ష పడింది. ‘బతికే హక్కులేని వారిని ఈ ప్రపంచంలో లేకుండా చేసి, సమాజాన్ని ప్రక్షాళన చేయడమే తన ధ్యేయమ’ని ఫిలిప్ కోర్టులో వాదించాడు.
‘బ్లూవేల్ చాలెంజ్’ లాంటి ప్రాణాంతక ఆటల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలు టీనేజర్లను కాపాడేందుకు ‘హెల్ప్‌లైన్ల’ను ఏర్పాటు చేయడం వాటి సామాజిక బాధ్యతకు అద్దం పట్టేదే. పిల్లల స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వినియోగంపై ఓ కనే్నసి ఉంచుతూ, వారు ‘షేర్’ చేస్తున్న అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై మరింతగా పెరిగింది. వారు ‘డేంజర్ గేమ్’ల బారిన పడకుండా ఉండాలంటే నిరంతర అప్రమత్తత ఎంతో అవసరం.