తెలంగాణ

జాతీయ సంఘాల కుట్రల వల్లే వారసత్వ హక్కు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 20: గతంలో సింగరేణి గుర్తింపు సంఘాలుగా గెలిచిన ఎఐటియుసి, ఐఎన్‌టియుసి జాతీయ సంఘాలు గోల్డెన్ షేక్‌హ్యాండ్ స్కీం పేరుతో అనేకమంది సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టి... వారిని ఇంటి ముఖం పట్టించి... వారి కుటుంబాల్లో చీకట్లు నింపాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, టిబిజికెఎస్ ఆర్జీ-1 ఎన్నికల ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ అన్నారు. బుధవారం సింగరేణి ఆర్జీ-1 జిడికె-1వ గని ఆవరణలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ముం దుగా వారు గని ఆవరణలో గల మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు కార్మికులను కలుసుకున్నారు. అనంతరం జరిగిన గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సింగరేణి కార్మికుల శేయస్సుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే దసరా కానుకగా కెసిఆర్ వారసత్వ ఉద్యోగాలు ప్రకటించారని చెప్పారు. అవి అమలైతే పుట్టగతులుండవని జాతీయ కుట్రలు పన్ని రద్దయ్యేలా చేశారని ఆరోపించారు. అయినప్పటికీ వారసత్వ ఉద్యోగాలను ఇచ్చేందుకు కెసిఆర్ అన్ని విధాల ప్రయ త్నిస్తున్నారని తెలిపారు. వారసత్వ ఉద్యోగాలపై టిఆర్‌ఎస్, టిబిజికెఎస్‌పై విమర్శలు చేస్తున్న జాతీయ సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సింగరేణి వారసత్వం పోయింది జాతీయ సంఘాల వల్ల కాదా అని ప్రశ్నించారు. గతంలో గుర్తింపు సంఘాలుగా ఉన్న ఎఐటియుసి, ఐఎన్‌టియుసి జాతీయ సంఘాలు పోగొట్టిన ఎన్నో హక్కులను టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక టిబిజికెఎస్ సాధించిందని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా ఇంక్రిమెంట్, లాభాల వాటా ఇచ్చామని తెలిపారు. సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలని, డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగం కల్పించామని, నూతన ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు. గని కార్మికుల ఇన్‌కంట్యాక్స్ రద్దుకై, నూతన గనులకై కృషి చేస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన టిబిజికెఎస్‌తోనే సాధ్యమవుతుందని, ఈ సారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్‌ను మరోసారి గెలిపించాలని కార్మికులకు వారు కోరారు. అనంతరం జిడికె-1వ గని నుంచి 11వ గని వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. జాతీయ కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిబిజికెఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్, టిబిజికెఎస్ నాయకులు కోరుకంటి చందర్, కనకం శ్యాంసన్, నూనె కొమురయ్య, మాదాసు రాంమూర్తి, ఆరెల్లి పోచం, గండ్ర దామోదర్ రావు, గుడి రమేష్, నాయిని మల్లేష్, మారుతి, పిటి.స్వామి, పెద్దంపేట శంకర్, అభిషేక్ రావు, చుక్కల శ్రీనివాస్ తదితరులున్నారు.

సింగూరుకు పెరుగుతున్న వరద

నిజాంసాగర్, సెప్టెంబర్ 20: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలోగల సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కర్నాటక, మహారాష్టల్రలో కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, 522.850 మీటర్ల నీరు నిల్వఉందని, నిజాంసాగర్ ప్రాజెక్ట్ డిఈఈ దత్తాత్రి తెలిపారు. 29.910 టిఎంసిలకు గాను 25.819 టిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు.
ప్రాజెక్ట్ జలాశయంలోకి 5,011 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం భారీగా పెరుగుతోందన్నారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షానికి జలాశయంలో స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా, 1388.00 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. 17.802 టిఎంసిలకు గాను 3.293 టిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు. ఇదిలావుండగా, సింగూరు ప్రాజెక్టు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరడంతో, ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్ట్ జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయిలో నిండితే నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి నీటిని విడుదల చేస్తారని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే, సింగూరు నిండే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయాన్ని శాపంగా మార్చేశారు

*మూడున్నరేళ్లలో 3,500మంది రైతుల ఆత్మహత్య
*కాళేశ్వరం మృతుల పాపం ప్రభుత్వానిదే
*ఇందిరమ్మ రైతుబాట అవగాహన సదస్సులో పిసిసి చీఫ్ ఉత్తమ్

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: కెసిఆర్ పరిపాలనలో వ్యవసాయాన్ని శాపంగా మార్చారని, మూడున్నర ఏళ్లలో 3500 మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడు కెసిఆరేనని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెజెఆర్ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ రైతుబాట అవగాహన సదస్సుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రాంచంద్రా కుంతియా, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన పెట్టుబడికి రూ.4వేలు కేవలం పట్టాదారుడికి మాత్రమే ఇస్తామని చెప్పడం సరైంది కాదని, కౌలు రైతులతో పాటు, గత ప్రభుత్వాలు భూపంపిణీ చేసిన వివిధ చట్టాల ద్వారా కాస్తులో ఉండి పంటసాగు చేసే ప్రతి ఒక్క రైతుకు రూ.4వేలు అందించాల్సిందేనని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా కెసిఆర్‌కు 6 శాతం కమీషన్ ముడుతోందని, దీంతో ఆయన ఫాంహౌస్‌కు కోట్ల రూపాయల లంచాలు పోతున్నాయని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఓ కరదీపిక విడుదల చేసి ప్రజల చార్జిషీట్ పేరిట జనం ముందుకు వెళ్తామన్నారు. డబుల్‌బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమిపై ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండా పండుగను నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు భారీ బహిరంగసభను ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలోనే ఏ జిల్లాలో అనే విషయాన్ని కూడా ప్రకటిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టనె్నల్ కూలి మృతి చెందిన కూలీలకు కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలుపుతుందని, అయితే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాణ్యతలేని పనులు చేపట్టినందుకే ఏడుగురు చనిపోయారని, వీరి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, ఎంపి నంది ఎల్లయ్య, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఉబెదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.

సురక్షిత సమాజమే బాలలకు శ్రీరామరక్ష

*లైంగిక దాడులు, అక్రమ రవాణాను అరికడతాం
*సమష్టిగా కృషి చేస్తే భావి పౌరుల భవిత భద్రం
*నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి

గద్వాల, సెప్టెంబర్ 20: బాలలపై లైంగిక దాడులను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించడంలోనూ చట్ట పరిధిలో కఠినంగా వ్యవహరించినరోజే సమాజాభివృద్ధితో పాటు దేశాభివృద్ధి జరుగుతుందని నోబెల్ శాంతి బహమతి గ్రహీత కైలాష్ సత్యార్థి స్పష్టం చేశారు. సురక్షిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాలల లైంగిక దాడులు, అక్రమ రవాణా నిరోధించే లక్ష్యంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్‌యాత్రలో భాగంగా బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అలంపూర్ వద్ద స్వాగతం అందుకున్న సత్యార్థికి గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే డికె అరుణ, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌లు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన సత్యార్థి శాంతి చిహ్నంతో కూడిన బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీ నిర్వహించారు. ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ‘ప్రియమైన బాలబాలికలారా... ఇక్కడకు వచ్చిన అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలలపై లైంగిక దాడులు భారతదేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని, బాలలపై శ్రద్ధ చూపకపోవడంతో పిల్లలను సురక్షితంగా కాపాడుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. దేశంలో బాల్య వివాహాలు, బాలకార్మికుల వ్యవస్థ నేటికీ కొనసాగడానికి నిరక్షరాస్యతే కారణమన్నారు.
బాలలను కార్మికులుగా మారిస్తే దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని అన్నారు. దేశంలో బాలలపై లైంగిక దాడులకు పాల్ప డేది ఎక్కువగా వారి బంధువులేనని, తల్లిదండ్రులు వారి పేరు బయట పెట్టకపోవడంతో లైంగిక దాడులకు గురెన బాలలు ఆవేదనకు గురై, తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారని అన్నారు. మన పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు అలవ డుతుందని, అలాంటి శక్తివంతమెన దేశంలో పిల్లలే నిజమైన సంపదని అన్నారు. బాలల సంరక్షణకు, లైంగిక దాడులు అరికట్టడానికి విద్యార్థులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత ఏకమై రోడ్డుపైకి వచ్చి దేశచరిత్రలో నిలిచిపోయేలా యుద్ధాన్ని ప్రకటించాలని పిలుపునిచ్చారు.
అంతకముందు జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి భారత్ యాత్రలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో అడుగుపెట్టిన రోజే రుగ్మతలు లేని జిల్లాగా తీర్చిదిద్దుకోవాల ని పిలుపునిచ్చారు. దేశంలో బాల్యవివాహాలు, లైంగిక దాడులు, బాలకార్మిక వ్యవస్థను అరికట్టిన రోజే భారతదేశం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ ప్రపంచంలోబాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇక్కడకు రావడం గద్వాల జిల్లాకు చిరస్మరణీయమని అభివర్ణించారు. నడిగడ్డ పత్తి పంటకు పుట్టినిల్లు అనీ, ఇక్కడే ఎక్కువమంది బాలకార్మికులుగా మారుతున్నారని, అక్షరాస్యతతో పాటు నడిగడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి అధికారులతో కలిసి పనిచేస్తామని ఆమె తెలిపారు. కైలాష్ సత్యార్థి బాలల భద్రత, బాలల పరిరక్షణ కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. నాగర్‌కర్నూల్ ఎంపి నంది ఎల్లయ్య, గద్వాల కోర్టు న్యాయమూర్తి ఉషాక్రాంతి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత రాధాకృష్ణన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, వైఎస్ చైర్మన్ శంకర్, మాజీ ఎంపి మంద జగన్నాథం, ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పాఠశాల, విద్యార్థులు పాల్గొన్నారు.

నల్లగొండలో రచ్చకెక్కిన వర్గపోరు

బతుకమ్మ చీరల పంపిణీలో జడ్పీ చైర్మన్‌వర్సెస్ ఎమ్మెల్యే * బాలునాయక్, రవీంద్రకుమార్ వర్గాల రగడ

నల్లగొండ, సెప్టెంబర్ 20: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, స్థానిక ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ మధ్య వర్గపోరు మరోసారి బతుకమ్మ చీరల పంపిణీ వేదికగా రచ్చకెక్కింది. నియోజకవర్గంలోని పిఏపల్లి మండలం అంగడిపేట గ్రామ పంచాయతీలో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టాలంటూ ఎంపిడివో పూలమ్మ బాలునాయక్ వర్గానికి చెందిన స్థానిక సర్పంచ్ రామోతు సరస్వతికి, ఎంపిటిటిసి నెర్మట్టె నరసమ్మకు, ఎంపిపి మేడారం రాజమ్మకు సమాచారం అందించారు. ఉ. 8గంటలకు గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని అందులో నిల్వచేసిన బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు గ్రామ మహిళలను పిలిపించారు. అదే సమయంలో ఎంపిడివో వారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వస్తున్నారని, చీరల పంపిణీ ఆయనే ప్రారంభిస్తారని చెప్పగా తమ గ్రామంలో చీరల పంపిణీని తామే చేపడుతామంటూ ఆ ముగ్గురు స్థాని క మహిళా ప్రజాప్రతినిధులు సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే వచ్చేదాకా చీరల పంపిణీ జరపకుండా పంచాయతీ కార్యాలయానికి తన సిబ్బందిని పురమాయించి ఎంపిడివో తాళం వేయించారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపిలు పంచాయతీ కార్యాలయానికి మరో తాళం వేసి సాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి స్థానిక మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యే వైఖరి అవమానకరంగా ఉందని నిరసన తెలిపారు. సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ రాఘవేంద్రరెడ్డి జోక్యం చేసుకుని రాస్తారోకోతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నందున మీ పంచాయతీ వద్దనే నిరసన చేసుకోవాలంటూ వారిని పంపించారు. ఇంత లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పోలీసుల సహాయంతో తాళం తెరిపించారు. సర్పంచ్, ఎంపిటిసిలు వేసిన మరో తాళాన్ని పగులగొట్టి బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులైన తమను కాదని ఎమ్మెల్యే చీరల పంపిణీ చేయడాన్ని ప్రశ్నిస్తూ తాళాలు తెరవకుండా బాలునాయక్ వర్గానికి చెందిన సర్పంచ్, ఎంపిటిసిలు, వారి అనుచరులు అడ్డుపడ్డారు. సిఐ, ఎస్‌ఐ తమ సిబ్బందితో కలిసి వారందరిని స్వల్ప లాఠీచార్జితో చెదరగొట్టి పక్కకు లాగేసి పోలీస్ వాహనంలో గుడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చీరల పంపిణీ పిదప వారిని వదిలివేయగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా వారి వైఖరిని నిరసిస్తూ స్థానిక గిరిజన మహిళా సర్పంచ్ సరస్వతి, ఎంపిటిసి నరసమ్మ, ఎంపిపి రాజమ్మలు తమ వర్గీయులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పార్టీలో తమకంటే వెనుక చేరి తమపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఎమ్మెల్యే వర్గీయుల ఆగడాలు సాగనివ్వబోమంటూ నినాదాలు చేశారు. ఈ వివాదంతో మరోసారి నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే వర్గాల మధ్య వర్గపోరు వీధిన పడడం అధికార పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఇటీవల రైతు సమితుల సభ్యులను సైతం ఎమ్మెల్యే తన వర్గీయుల ఎంపికతో ఏకపక్షంగా జరిపించారంటూ జడ్పీ చైర్మన్ వర్గీయులు నిరసనకు దిగారు. బాలునాయక్‌కు, రవీంద్రకుమార్‌కు మధ్య రాజకీయ ఆధిపత్య పోరు వారిద్దరు కాంగ్రెస్, సిపిఐల్లో ఉన్నప్పటి నుండే సాగుతోంది. నియోజకవర్గంలో రోజురోజుకు బాలునాయక్, రవీంద్రకుమార్ వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరు నల్లగొండ పార్లమెంటు స్థానంలో పార్టీ ఉప ఎన్నికలకు వెళితే సమస్యగా మారవచ్చంటూ గులాబీ నాయకత్వం ఆందోళన చెందుతోంది.

ఈత రాక...
లోతు తెలియక...

ఉట్నూరు, సెప్టెంబర్ 20: సరదా కోసం కాలువలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటుచేసుకుం ది. బుధవారం స్థానిక సాలెవాడకె గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి అభిషేక్, తొమ్మిదవ తరగతి విద్యార్థి దత్త ఇద్దరూ కలిసి గ్రామ సమీపంలోని కాలువ వద్దకు స్నానానికి వెళ్ళారు. స్నానం చేయడానికి కాలువలో దూకగా లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందారు. వీరిద్దరూ సాలెవాడకెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. బుధవారం నుండి దసరా సెలవులు కావడంతో బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది సమీప కాలువలో వెతకగా మృతదేహాలు లభ్యమయ్యా యి. విషయం తెలిసిన వెంటనే ఉట్నూరు సిఐ గణపతిరావు, ఎస్సై మంగిలాల్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వేళల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

పోరాడారు.. సాధించుకున్నారు!
*బ్రాహ్మణపల్లి పాఠశాల యథాత థం
*దిగివచ్చిన విద్యా శాఖ.. ఉత్తర్వులు జారీ
*విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వెల్లివిరిసిన ఆనందం

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 20: పాఠశాల మూసివేతకు నిరసనగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి కమిటీ, విద్యార్థి సంఘాలు చేసిన ఉద్యమాలు ఫలించాయి. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల మూసివేతపై సాగిన ఆందోళనకు విద్యా శాఖ ఎట్టకేలకు దిగివచ్చింది. బ్రాహ్మణపల్లి పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాల పునఃప్రారంభం కాగా, ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యా శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యా శాఖ ఉత్తర్వుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల్లో ఆనందం వెల్లివిరిసింది. బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో 29 మంది విద్యార్థులు ఉండగా, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనే సాకుతో గతంలో ఇక్కడి ఉపాధ్యాయులను వేరే చోటకు సర్దుబాటు చేశారు. విద్యార్థులను కూడా పక్కనే గల రాగినేడు, అప్పన్నపేట పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. అయితే విద్యార్థులు వేరే చోటకు వెళ్లకుండా ఉపాధ్యాయులు లేకపోయినా, అక్కడే చదువకుంటూ తమ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఇదే పాఠశాలలో పెద్దపల్లికి మంజూరైన అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని భావించిన ఉన్నతాధికారులు పాఠశాల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. అయితే గ్రామస్థులు వ్యూహాత్మకంగా పోరాడి తమ పాఠశాలను సాధించుకున్నారు. ఆంగ్ల విద్యా బోధన సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి యేటా తగ్గుతూ వస్తోంది. ఇక్కడి పాఠశాలలో ఆంగ్ల బోధన సౌకర్యం కల్పించాలని పలుమార్లు విద్యా శాఖ అధికారులకు వేడుకున్నా, స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో ఉన్న పాఠశాలను మూసివేసి, అదేచోట తాత్కాలికంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విద్యార్థులు లేఖలు రాశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ విషయమై కోర్టును ఆశ్రయించిగా, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా శాఖ డైరెక్టర్‌కు తమ పాఠశాల సమస్యను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణపల్లి పాఠశాల మూసివేతపై గతంలో పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి పట్ట్భారామారావు, డిఇవో వెంకటేశ్వర్‌రావుతో కలసి విచారణ జరిపారు. ఈ సందర్భంగా డిఇవోను గ్రామస్తులు చట్టుముట్టి అడ్డుకుని, ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత పాఠశాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని డిఇవో హామీ ఇచ్చారు. ఆగస్టు 21న ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాల పునఃప్రారంభం కాగా, మిగతా ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలను యధావిధిగా కొనసాగించడంతో పాటు పాత ఉపాధ్యాయులను వెంటనే యధా స్థానానికి కేటాయించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.