సంపాదకీయం

చక్కెర సుంకం-ఓ టక్కరి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కెరపై ఇప్పుడున్న పన్నుతోపాటు కేజీకి మూడు రూపాయలు సెస్సు విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించడం దారుణం. అలా వసూలైన సొమ్ముని చెరకు రైతులకి అందిస్తామనడం ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టడమే. ఏప్రిల్‌లో జీఎస్టీ వల్ల రికార్డుస్థాయిలో లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటూ కేంద్ర విత్త మంత్రి ఆనందం వెలిబుచ్చారు. ఆ స్థాయిలో ప్రజల తాట వలుస్తున్నప్పుడు మళ్ళీ దొడ్డిదారిలో బాదడమెందుకు? జీఎస్టీని హడావుడిగా ప్రవేశపెట్టిందే పది రకాల పన్నుల స్థానంలో ఒకే పన్ను విధించడానికి. ఇప్పుడున్న శ్లాబుల్ని ఇంకా తగ్గించగలిగితే మెరుగన్న స్థితిలో, వాటిని ఉంచినట్టే ఉంచి వేరే పేర్లతో అదనపు వసూళ్లు చెయ్యడం ప్రజల్ని మోసగించడమే. జీఎస్టీ ప్రకటిత ఉద్దేశానికే అది విరుద్ధం. సెస్ అంటే ఏమి? సర్చార్జీ అంటే ఏమి? అంతిమంగా కొనుగోలుదారు జేబు చిల్లుపెట్టడానికే. సెస్ పేరుతో వసూలైన మొత్తం ప్రతిపాదిత లక్ష్యం కోసం ఖర్చుపెడతారన్న గ్యారంటీ లేదు. అందుకు ఉదాహరణ విద్యా సెస్సు. తద్వారా వచ్చిన మొత్తానికి లెక్కచెప్పిన దాఖలాలు తక్కువే. ఇక రైతుల పేరుచెప్పి, వినియోగదారుని ముక్కుపిండడం అతి తెలివి. సెస్సులు, పన్నులు, వసూళ్లతో సంబంధం లేకుండా వారిని ఆదుకోవాలి. ‘పన్ను అందనివ్వండి, మీకు దన్ను ఇస్తాను’ తరహా మొసలి కన్నీళ్లు, మోసపు హామీలు మాని, చిత్తశుద్ధి ప్రదర్శించాలి. ఇప్పటికే ప్రభుత్వం పన్నుల విధానంలో అపరచాణక్యం చూపిస్తోంది. ‘మకరందాన్ని పువ్వుకే తెలియకుండా తుమ్మెద ఎలా సేకరిస్తుందో’ అదే తరహాలో ప్రభుత్వం పన్నులు సేకరించాలి’ అంటూ చెప్పిన చాణక్యుడే విస్తుపోయే ప్రతిభ కనపరుస్తోంది. ఇప్పుడు గ్యాస్ ధర ఎన్ని రెట్లు పెరిగిందో, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఎంతో చెపితేగానీ తెలియనంతగా మారాయి. పెట్రోల్ అసలు ధరకన్నా, కొసరు వడ్డింపులే చాలా ఎక్కువ. పన్నుల రాబడి లాభాలు వినియోగదారునికి చేరడంలేదు. ప్రభుత్వం తన టక్కరి వ్యూహాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, ప్రజలకి ఊరటనిచ్చే పనులు చెయ్యాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ఉద్యమాల తీరు ఇదేనా?
ఒక మంచి పనిని సాధించడానికి ఉద్యమాలు, నిరసనలు నిర్వహిస్తాం. వాటికి ఒక విధమైన గాంభీర్యం, గౌరవం ఉంటాయి. చిత్తశుద్ధితో ఉద్యమాలు చేస్తే ప్రజలు గౌరవిస్తారు. నేడు ఉద్యమాలను హాస్యాస్పదంగా మార్చేస్తున్నారు. సముద్రంలోకి వెళ్లి అరవడం, విచిత్ర వేషధారణలు, హోమాలు, యాగాలు, ప్రముఖుల విగ్రహాలకు అర్జీలు ఇవ్వడం, ప్రత్యర్థులకు మంచి బుద్ధి ఇమ్మని దేవుళ్లను ప్రార్థించడం, తాజాగా శాస్ర్తియ నృత్యం చేస్తూ నిరసన తెలపడం ఉద్యమ స్వరూపం అయింది. వీటివల్ల ఉద్యమాలు ఒక తమాషాగామారి తేలిక భావం కలిగిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉద్యమకర్తలు గ్రహించాలి.
- శాండో ప్రచండ్, కాకినాడ

ఆస్తుల జప్తు సులువు కాదు
అవినీతి పరుల ఆస్తులు జప్తుచేసి ప్రజలకు పంచుతానని ఏపీ సీఎం చంద్రబాబు అనడం ఒక చీప్ ట్రిక్. ప్రధాని మోదీ కూడా ఇలాంటి ప్రకటన చేసి అభాసుపాలయ్యాడు. అవినీతి పరుల ఆస్తి జప్తుచేసుకోవడం అంత ఈజీ కాదు. తెలివైన లాయర్లు ఎన్నో ఆటంకాలు సృష్టిస్తారు. ఎవరి సొమ్మో తీసుకొచ్చి ప్రజలకివ్వడం అత్తసొమ్ము అల్లుడు ధారపోసినట్టే. అయినా ఎంత సొమ్ము జప్తు అవుతుంది? ఐదు కోట్ల మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? నిజంగా ఆస్తులను జప్తు చేయగలిగితే- వాటిని విక్రయించగా వచ్చే సొమ్ముని ప్రజలకు పంచేకన్నా దానితో ప్రజలకు మేలుచేసే పథకాలు అమలు చేయాలి.
- మైథిలి, సర్పవరం

పంథా మారని ప్రభుత్వ సంస్థ
అన్ని ప్రైవేటు సెల్‌ఫోన్ కంపెనీలు 4జీతో స్వాగతం పలుకుతుంటే, కేంద్ర ప్రభుత్వ నిర్వాకంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ ఇంకా తమ వినియోగదారులకు 3జీ తోనే సేవలు అందిస్తుండడం దారుణం. బిఎస్‌ఎన్‌ఎల్‌ను శాశ్వతంగా మూసేసి ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీలకు సర్వీసులను ధారాదత్తం చేద్దామని నేతలు ప్రతిజ్ఞ పూనారా? నేరుగా 5జీని ప్రవేశపెడతాం, అంతవరకు ఓపిక పట్టండని బిఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించటం విడ్డూరం. ఉట్టిని అందుకోలేని ముసలమ్మ స్వర్గానికి నిచ్చెన ఎక్కుతుందట. నష్టాల సాకుతో బిఎస్‌ఎన్‌ఎల్‌ను విక్రయించడమో, మూసివేయడమో జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లుతెరచి 4జీ, 5జీ సేవలతో ఈ సంస్థను లాభాల బాటలో నడపాలి. వినియోగదారులను ఆకట్టుకోవటంలో బిఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారుల, సిబ్బంది ఉదాసీనతకు ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోంది. యావత్ వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్ సేవలను పొందేందుకు క్యూ కట్టేలా చేసుకోవాలి. ఈ సంస్థకు ఉన్న సదుపాయాలు, వసతులు, అవకాశాలు, ఉద్యోగులు ఏ ఇతర సెల్ సంస్థలకు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, సిబ్బంది తమ నైపుణ్యాన్ని వినియోగించుకుని, ప్రజల మన్ననలను పొందాలి. ఇప్పటి వరకు సేవా లోపంతో, 4జీ నెట్‌వర్క్ లేని కారణంగా ఇతర నెట్‌వర్క్‌కి తరలిపోయిన వినియోగదారులను వెనక్కి రప్పించుకోవాలి. ఇక బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు సైతం చాలా అధ్వానంగా వుంటున్నాయి. ఇంటర్నెట్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో, ఎప్పుడు నిలిచిపోతుందో ఆ దేవుడికే ఎరుక. ఈ దుస్థితి నుండి తప్పించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి.
- చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్