సంపాదకీయం

సోషల్ మీడియాలో ‘స్వచ్ఛత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదిగిదిగో ఇద్దరు చంద్రులు..’ అంటూ వాట్సాప్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తి అయోమయం నెలకొనడంతో- ‘ఇదంతా కేవలం బూటకం’ అని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ స్పష్టం చేయాల్సి వచ్చింది. ఈ నెలలో అంబరవీధిన ‘ఇద్దరు చంద్రుల’ అద్భుత దృశ్యం కనువిందు చేస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో, 2287వ సంవత్సరం వరకూ అది సాధ్యం కాదని ‘నాసా’ సశాస్ర్తియంగా వివరణ ఇచ్చింది. వాట్సాప్‌లో చలామణి అవుతున్న ‘ఇద్దరు చంద్రుల’ ఛాయాచిత్రం ‘మార్ఫింగ్ మాయాజాలమ’ని తేల్చిచెప్పింది. వాస్తవానికి ఇలాంటి బూటకపు సందేశాలు చాలా ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అవుతున్నాయి. కాంతులీనే అంగారక గ్రహం భూమికి దగ్గరగా రావడం వల్ల ‘ఇద్దరు చంద్రులు’ అన్న భ్రమ కలుగుతుంది. గత అరవై ఏళ్లలో భూమికి చేరువగా అంగారకుడు రావడం 2003 ఆగస్టులో సంభవించిందని, ఈ నెలలో ‘ఇద్దరు చంద్రులు’ కనిపిస్తారనడం అభూత కల్పన అని శాస్తవ్రేత్తలు కొట్టిపారేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు వ్యాపించడంతో ప్రజలకు తప్పుడు సమాచారం అందడమే కాదు, ఒక్కోసారి ముప్పు తెచ్చే విపరిణామాలూ తప్పడం లేదు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ప్రజ్వరిల్లిన హింసే ఇందుకు ప్రబల తార్కాణం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35(ఎ)ను రద్దు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు జోరందుకోవడంతో రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌లో బీభత్సకాండ పునరావృత్తమైంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, గుర్తింపును కల్పించే ఆర్టికల్ 35(ఎ)ను సుప్రీం కోర్టు రద్దు చేసిందన్న ప్రచారానికి సోషల్ మీడియా వేదిక అయ్యింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ప్రజలంతా సంయమనం పాటించాలని కశ్మీర్ పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆర్టికల్ 35(ఎ)పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేయగా, కొందరు ఆకతాయిలు ఘోరమైన అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఫలితంగా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో యువకులు భారీ సంఖ్యలో వీధుల్లోకి చేరుకొని దుకాణాలను బంద్ చేయించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జి చేయడమే గాక బాష్పవాయు గోళాలను, పెల్లెట్లను ప్రయోగించడం అనివార్యమైంది. సామాజిక మాధ్యమాల్లో వదంతులు అల్లర్లకు ఆజ్యం పోయడంతో కశ్మీర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పింది.
ఈ నెలలో కేరళను ఓ వైపు వరద, మరోవైపు ‘నకిలీ వార్తల’ బురద ముంచెత్తాయి. వరద బాధితులకు సకాలంలో సాయం అందించడంలో సోషల్ మీడియా ఎంతటి క్రియాశీలక పాత్ర పోషించిందో అదే స్థాయిలో ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో అసత్యాలు, పాత ఫొటోలు ‘సర్క్యులేట్’ కావడం కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వరద నీటిలో మునిగిపోతున్న ఓ వ్యక్తి కాషాయ రంగులో ఉన్న ‘లైఫ్ జాకెట్’ను ధరించేందుకు నిరాకరించడంతో ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడని విస్తృత ప్రచారం జరిగింది. హిందూత్వానికి సంబంధించిన ‘కాషాయ’ రంగులో ‘లైఫ్ జాకెట్లు’ ఉండడం వల్లే ఈ ఘోరం జరిగిందని, దీంతో ఆకుపచ్చ రంగులో ‘లైఫ్ జాకెట్ల’ను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్న వదంతులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వరద బీభత్సం వేళ మతాల కోణంలో వ్యాపించిన ఈ వదంతులు లేనిపోని గందరగోళాన్ని సృష్టించాయి. అలాగే, ముల్లపెరియార్ డ్యామ్ కాసేపట్లో కూలిపోతుందని ఎర్నాకుళం పట్టణం నీట మునిగిపోతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సహాయక చర్యల్లో సైన్యం పాల్గొనరాదంటూ కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్న తప్పుడు వార్తలు సైతం వరద బాధితులను కలవరానికి గురిచేశాయి. అయ్యప్ప స్వామి గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళను వరదలు ముంచెత్తాయన్న విష ప్రచారానికి కొందరు సోషల్ మీడియాను యథేచ్ఛగా వాడుకున్నారు. ఇలాంటి ప్రచారానికి దూరంగా కొన్ని ‘ఫేస్‌బుక్ గ్రూ పులు’ వరద బాధితులను మానవత్వంతో ఆదుకున్న ఉదంతాలు లేకపోలేదు.
సామాజిక మాధ్యమాల్లో ‘సందేశాలు’ వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేసిన సూచనలపై జాతి యావత్తూ దృష్టి సారించాల్సి ఉంది. సోషల్ మీడియాను బురద చల్లడానికి వాడుకోరాదని, సమాజాన్ని బలోపేతం చేసే సమాచారాన్ని పంచుకోవాలని ఆయన చెప్పిన హితవు అందరికీ శిరోధార్యం. అనవసర విషయాలను ప్రచారం చేయడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని, ఎక్కడో గల్లీలో రెండు కుటుంబాల మధ్య జరిగే చిన్నాచితకా గొడవలను సోషల్ మీడియాలో జాతీయస్థాయి వార్తలుగా ప్రచారం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేయడం అసమంజసమేమీ కాదు. కొందరు ‘మర్యాద’ హద్దులను దాటి తప్పుడు సమాచారంతో ‘పోస్టింగ్‌లు’ పెడుతున్నారని, దీని వల్ల సమాజానికి ఎంతటి నష్టం జరుగుతోందో వారు గ్రహించడం లేదని, సమాజ ఔన్నత్యానికి తగని పదజాలాన్ని వాడుతున్నారని, మహిళల గురించి ఏది పడితే అది రాసేస్తున్నారని ప్రధాని చెప్పిన మాటలు అక్షర సత్యాలు. సోషల్ మీడియాలో ప్రచారం అన్నది ఒక రాజకీయ పార్టీకో, సిద్ధాంతానికో సంబంధించినది కాదని, మొత్తం 125 కోట్ల భారతీయులతో అది ముడిపడి ఉందన్నారు. సామాజిక మీడియాలో ‘చెడు’ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికి వారే శిక్షణ పొందాలని, క్రమశిక్షణ పాటించాలని కూడా ఆయన సూచించారు. సాంకేతిక యుగంలో భారత్ ముఖచిత్రం ఎలా మారుతోందో తెలియజెప్పే వీడియోలను, సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలన్నారు. ‘స్వచ్ఛ అభియాన్’ కార్యక్రమం పరిసరాల పరిశుభ్రత కోసమే కాదు, మానసిక స్వచ్ఛతకు కూడా ఉద్దేశించిందని, ఇలాంటి ‘స్వచ్ఛత’కు సామాజిక మాధ్యమాల్లో స్థానం కల్పించాలనడం ‘నెటిజన్ల’కు స్ఫూర్తిదాయకం. కాగా, ఎన్నికల ప్రచారం అనంతరం పోలింగ్ ముగిసే వరకూ సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ముందు పలు రాజకీయ పార్టీలు మొరపెట్టుకోవడంతో పరిస్థితి ఎంతలా దిగజారుతోందో అవగతమవుతుంది.
సోషల్ మీడియాలో పెడధోరణులు మంచి సమాజానికి తగవన్న వాస్తవాన్ని అన్ని వర్గాల వారూ ఇకనైనా గ్రహించాలి. వదంతుల ఫలితంగా ‘మూక దాడులు’ వంటి విపరీత చేష్టలు, విధ్వంసాలు ఎలాంటి విషాదాలను మిగులుస్తాయో ఇటీవలి సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించేవారి సంఖ్య అనూహ్యంగా పెరగడంతో అదే స్థాయిలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రవేశిస్తే చాలు కొందరు ఔచిత్యం కోల్పోవడం, హద్దులు మీరడం, దూషణలు చేయడం పరిపాటిగా మారింది. నిజం కానిదేదో వింటారు లేదా చూస్తారు. విచక్షణ కోల్పోయి వాటిని ఇతరులకు ‘షేర్’ చేస్తారు. కానీ తాము సమాజానికి ఎంత చేటు చేస్తున్నామో గమనించరు. ‘చెడు’ను ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలు వేదిక కావడం నేటి నవ నాగరిక సమాజంలో దారుణ వైపరీత్యం. మన చుట్టూ జరిగే మంచిని, సమాజం బలాన్ని చాటిచెప్పే అంశాలపై స్పృహ లేకపోవడం విద్యాధికుల్లోనూ కనిపించడం విచారకరం. సామాజిక మీడియాలో ‘స్వచ్ఛత’ను పాదుకొల్పడమే ప్రస్తుత విపరిణామాలకు విరుగుడు అని ఎవరికి వారు తెలుసుకుని ఆచరించాలి.