విజయనగరం

రోడ్ల విస్తరణ కలే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మార్చి 30: జిల్లాకేంద్రం విజయనగరం పట్టణంలో రోడ్ల విస్తరణ ఒక కలగా మిగులుతోంది. అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రోడ్లవిస్తరణ పనుల జాప్యంపై కేంద్రమంత్రి పి.అశోక్‌గజపతిరాజు తీవ్ర అసహానం వ్యక్తం చేయగా కలెక్టర్ ఎంఎం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావుపై కలెక్టర్ మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. మున్సిపల్ పాలకవర్గం కూడా రోడ్ల విస్తరణపై దృష్టి సారించకపోవడంతో గత రెండేళ్ల నుంచి విస్తరణ కోసం చేపడుతున్న చర్యలు అంగుళం కూడా ముందుకు కదలడంలేదు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ నాయక్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. పలుదఫాలు నిర్వహించిన సమావేశాలలో సంబంధిత అధికారులపై కలెక్టర్ సీరియస్ అయి నా రోడ్ల విస్తరణకు అవసరమైన చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఏయే రోడ్లను ఎంతమేరకు విస్తరించాలో ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ఆశయం నెరవేరడం లేదు. విజయనగరం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అశోక్‌గజపతిరాజు కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా పట్టణానికి విచ్చేసినప్పుడు పెద్దఎత్తున రోడ్ల విస్తరణ, అభివృద్ధిపనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు మున్సిపల్ యంత్రాంగానికి సిఫారసు చేశారు. దీనిలోభాగంగా గంటస్తంభం నుంచి పాతబస్టాండ్ వరకు, దాసన్నపేట రైతుబజారు నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు వరకు,కోట జంక్షన్ నుంచి సింహాచల మేడ వరకు, గుచీ నుంచి అయ్యకోనేరు గట్టు వరకు, మయూరి జంక్షన్ నుంచి నాయుడు ఫంక్షన్ హాలు వరకు, అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు వరకు, మయూరి జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ వర కు, నాయుడు ఫంక్షన్‌హాలు నుంచి కలెక్టరేట్ జంక్షన్ వరకు, సింహాచలం మేడనుంచి బాలాజీ జంక్షన్ వరకు రోడ్లవిస్తరణ పనులను చేపట్టాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. సెంట్రల్ లైటింగ్, పుత్‌పాట్‌ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల మార్పిడి కోసం 8.71 కోట్ల రూపాయలను మున్సిపల్ యంత్రాంగం కేటాయించింది.విద్యుత్ స్తంభాల మార్చేందుకు ఇప్పటికే 1.20కోట్ల రూపాయలను ట్రాన్స్‌కోకు మున్సిపల్ యం త్రాంగం చెల్లించింది. వుడా ఆధ్వర్యంలో నాలుగురోడ్లను, ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో మూడురోడ్లను, మున్సిపాలిటీ ఆధ్వర్యరంలో రెండు రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా సెంట్రల్ లైటింగ్, డివైజర్లు, పుట్‌పాత్‌లు, విద్యుత్ స్తంభాల కోసం మార్పు చేసేందుకు గంటస్తంభం రోడ్డు కోసం 158.65 లక్షలు, దాసన్నపేట రైతుబజారు రోడ్డు కోసం 33 లక్షలు, (మిగతా 2వ పేజీలో)

కోట నుంచి సింహాచలం మేడకు వెళ్లే రోడ్డుకోసం 2.6కోట్లు, గుచీ నుంచి అయ్యన్నకోనేరు రోడ్డుకు 1.66కోట్లు, మయూరి జంక్షన్ నుంచి నాయుడు ఫంక్షన్ హాలుకు వెళ్లే రోడ్డుకు 95.79లక్షలు, అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్లట్యాంకుకు వెళ్లే రోడ్డుకోసం 46లక్షలు, సింహాలం మేడనుంచి బాలాజీ జంక్షన్‌కు వెళ్లే రోడ్డు కోసం కోటి రూపాయలుఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రోడ్ల విస్తరణ పనుల కోసం గత ఏడాది జనవరిలో పెద్దఎత్తున ఆక్రమణలను తొలగించారు. అప్పటి నుంచి ఇంతవరకు రోడ్లవిస్తరణ పనుల గురించి సమీక్షలు నిర్వహించడమే తప్ప పనులు మాత్రం ప్రారంభించడంలేదు. ప్రధానంగా మున్సిపల్ ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం, విశాఖనగరాభివృద్ధి సంస్థ (వుడా), ఎపి ట్రాన్స్‌కో, జాతీయ రహదారుల అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల రోడ్ల విస్తరణపై జాప్యం జరుగుతోంది.మయూరి జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా నాయుడు ఫంక్షన్ హాలు వరకు ఎన్ని అడుగుల మేరకు రోడ్డు విస్తరణ చేపట్టాలలో ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు.
త్వరలో ప్రారంభిస్తాం: మున్సిపల్ కమిషనర్
పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. సెంట్రల్ లైటింగ్, డివైజర్లు, పుట్‌పాత్‌ల నిర్మాణం కోసం టెండర్లను పిలుస్తామని చెప్పారు. పట్టణంలో నిర్ధేశించిన తొమ్మిది రోడ్ల నిర్మాణ పనులను చేపడతామని అన్నారు.

కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
* కలెక్టర్ ఎంఎం నాయక్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 30: మధుమేహం వ్యాధి ద్వారా తీవ్రమైన కంటి జబ్బులు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధి నివారణకు వైద్యులు, వివిధ సంస్థలు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. వెనుకబడిన విజయనగరం జిల్లాలో ప్రజలకు ఈ వ్యాధి విషయంలో అవగాహన కల్పించడంతోపాటు అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్టు ఆర్థిక సహాయంతో పుష్పగిరి నేత్రవైద్యశాల జిల్లాలోఐదేళ్లపాటు కొనసాగే డయాబెటిక్ రెటినోపతి నివారణ ప్రాజెక్టును బుధవారం ఇక్కడ కలెక్టర్ నాయక్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని, వివిధ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంధత్వనివారణ కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు సద్వినియోగం జరిగేలా చూడవలసిన అవసరం ఉందని అన్నారు. డయాబెటిక్ రెటినోపతి బారిన పడుతున్న రోగులు దేశంలో క్రమంగా పెరుగుతూ అంతర్జాతీయ స్థాయిలో పదో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ ప్రాజెక్టు సక్రమంగా అమలు జరిగేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి లో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు కంటిచూపు ముదిరేంతవరకు వైద్యంకోసం ముందుకు రావడంలేదని అన్నారు.మధుమేహం ద్వారా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందనే విషయం చాలామందికి తెలియదని చెప్పారు. ప్రారంభదశలోనే వైద్యం చేయించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. శాఖాపరంగా 2011 నుంచి ఇప్పటివరకు కంటిచూపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 50వేల మందికి స్క్రీనిం గ్ నిర్వహించామని చెప్పారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న చర్యలవల్ల వ్యాధి బాధితుల సంఖ్య తగ్గినా జనాభా పెరుగుతు న్న కారణంగా రోగుల సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పా రు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ కె.ఎం.మూర్తి మాట్లాడుతూ అంధత్వం వల్ల వ్యక్తి చూపు కోల్పోయి కుటుంబానికి, సమాజానికి భారంగా మారుతున్నారని తెలిపారు. కంటిచూపు తగ్గుతున్న క్రమంలో ప్రజలు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. డయాబెటిక్ రెటినోపతి బారిన పడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతూ వీరి సంఖ్య ఎంత అనేది తేలడం లేదని చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ జివిఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వల్ల కంటి చూపుకోల్పోయే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. కంటిచూపు సమస్య ఎదుర్కొంటున్న వారిలో 69శాతం మంది మధుమేహం ద్వారా సమస్యలు ఎదురైనవారేనని చెప్పారు. పుష్పగిరి ఆసుపత్రుల చైర్మన్ ఆర్ గోవింద హరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.

స్థలం చూసుకో...ప్లాంట్ వేసుకో...!
* విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు * అడగంటుతున్న భూగర్భ జలాలు
గజపతినగరం, మార్చి 30: మండలంలోని పురిటిపెంట పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా శుద్ధ జల వాటర్ ప్లాంట్లు అనధికారికంగా ఏర్పాటుచేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ పరిధిలో నాలుగు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. రెండు మినీ వాటర్ ప్లాంట్లు ఉండగా ఒకటి 20 లీటర్ల వాటర్ కేన్లు విక్రయించే ప్లాంటు, వాటర్ ప్యాకెట్ల ప్లాంట్లు ఉన్నాయి. ఈ శుద్ధ జల ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పంచాయతీ తీర్మానం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ ప్లాంట్లకు అటువంటి అనుమతులు లేకుండానే ఏర్పాటు చేసారు. శుద్ధ జల ప్లాంటు పేరుతో బోరునీరును ట్యాం కులోకి ఎక్కించి క్లోరినేషన్ చేసి కేను 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.గజపతినగరం కళాశాల రోడ్డులో 40 అడుగులో రెండు వాటర్‌ప్లాంట్లను ఇటీవల ఏర్పాటు చేసారు. దీంతో పక్కనే వంద అడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ చేతిపంపునకు నీరు అం దక సక్రమంగా పనిచేయడంలేదు. దీంతో స్థానికులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనుమతులు లేవు
పంచాయతీ అనుమతు లు ఏవీ లేవని వాటిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి జనార్దనరావు తెలిపారు. తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని పరిశీలిస్తామని స్థానికులకు మంచినీటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు. బోరు బోరుకు మధ్యన 100 మీటర్ల దూరం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని నిబంధనలను వ్యతిరేకిస్తే ఆ బోరు యజమానిపై చర్యలు తీసుకోవచ్చని ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ పిఎంకె రెడ్డి చెప్పారు. వాటర్ ప్లాంట్ల పేరుతో నీటిని విక్రయిస్తున్నారని నిబంధనల ప్రకారం చూస్తే ఈ ప్లాంట్లలోని నీరు అంత స్వచ్ఛమైన నీరు కాదని తెలిపారు. అనధికార వాటర్‌ప్లాంట్లను పరిశీలించి చర్యలు నిమిత్తం పంచాయతీ అధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు.

కోటమ్మకు కోటి దండాలు
ఘనంగా సిరిమానోత్సవం
శృంగవరపుకోట, మార్చి 30: ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా కొలిచే కొట్టాం కోటమ్మ అమ్మవారి సిరిమానోత్సవాన్ని మండలంలోని కొట్టాం గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా భక్తులు ఉద యం ఆరుగంటల నుండి అమ్మవారికి పసుపుకుంకుమలు అర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పూజారి నాగభూషణం అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం సిరిమానును అధిరోహించారు. మేళతాళాలతో, మందుగుండు సామగ్రితో సిరిమానును గద్దెగుడి నుండి వనంగుడి వరకు ఊరేగించారు. ఈ ఉత్సవంలో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడి శా రాష్ట్రం నుండి అనేక మం ది భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సిరిమాను ప్రధాన వీధుల నుంచి వెడుతున్నపుడు భక్తులు సిరిమానుపై అరటిపళ్లు, పూలు విసి జయజయ నినాదాలు చేసారు. పోలీసు, ఆర్టీసీ, దేవాదాయశాఖ ఉత్స వం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేసారు. ఆర్టీసీ జాతరకు హాజరయ్యే భక్తుల కోసం జామి, ఎస్.కోట నుండి కొట్టాం గ్రామానికి 15 బస్సులను ఏర్పాటుచేసింది. శృంగవరపుకోట సిఐ లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో శృంగవరపుకోట ఎస్సై రవికుమార్, జామి ఎస్‌ఐ ఘని కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.

కేంద్రమంత్రి అశోక్‌ను
పరామర్శించిన ఎంపి కేశినేని
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 30: కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును టిడిపి ఎంపి కేశినేని నాని, టిడిపి నాయకుడు దాడి వీరభద్రరావు బుధవారం పరామర్శించారు. అశోక్‌గజపతిరాజు సోదరుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపి ఆనంద గజపతిరాజు తీవ్ర అస్వస్తతో గత శనివారం మరణించిన విషయం తెలిసిందే. విజయనగరం లో ఉన్న కేంద్రమంత్రి అశోక్‌ను ఎంపి నానీ, దాడి వీరభద్రరావు కలుసుకుని తమ సంతాపాన్ని తెలిపారు. రాష్టమ్రంత్రిగా, ఎంపిగా పార్టీకి, ప్రజలకు ఆనందగజపతిరాజు అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.
గుండె భారంగా...
* తండ్రి చనిపోయిన విషాదంతో పరీక్షకు హాజరైన విద్యార్థిని
కొమరాడ, మార్చి 30: కన్నతండ్రి చనిపోయాడన్న దుఃఖంతో పాటు మరోవైపు పరిస్థితి అంధకారంగా ఉందన్న బాధతో 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన కొమరాడ గ్రామానికి చెందిన సంకిలి శీరీష స్థానిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా తన తండ్రి బుల్లబ్బాయి ఆకస్మికంగా చనిపోయాడన్న వార్త వినగానే అక్కడికక్కడే కుప్పకూలింది. రాత్రి అంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తు పరీక్షకు ఎలా హాజరవ్వగలనని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు విద్యార్థినిని ఓదార్చి బుధవారం ఉదయం పరీక్షకు పంపారు. ఈ సంఘటన తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆమెను ఓదార్చారు. అంతే కాకుండా పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి విద్యార్థిని శీరిషకు ధైర్యం చెప్పారు.

వ్యాపారవేత్త గురాన సాధూరాం మృతి
ప్రజల సందర్శనార్థం మంగళవీధిలో పార్థివదేహం
పలువురి సంతాపం
విజయనగరం(టౌన్), మార్చి 30: పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గురానసాధూరాం(75) బుధవారం ఉదయం మృతిచెందారు. కొంతకాలం గా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆయన మృతిచెందారు. ఆయన పార్థివదేహాన్ని పట్టణంలోని మంగళవీధిలోని ఆయన స్వగృహంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. గురాన సాధూరాం విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత తండ్రి. ఆయనకు ఐదుగు రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా రు. విజయనగరం పట్టణంలో ప్రముఖ వ్యాపారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన గతంలో విజయనగరం పురపాలక సంఘ కౌన్సిలర్‌గా పనిచేసారు. కొంతకాలం ఆయన విజయనగరం నియోజకవర్గ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. టిడిపిలో, అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినపుడు ఆయన ఆ పార్టీలో చేరి చురుకైన పాత్ర వహించారు. చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్‌లోవిలీనం చేసిన తరువాత ఆయన కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రాష్టవ్రిభజన అనంతరం ఆయన తన కమార్తె మీసాల గీతతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో సాధురాం కుమార్తె గీత విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజికపరంగా కాపు సామాజిక వర్గానికి ఆయన జిల్లాలో పెద్దదిక్కుగా వ్యవహరించారు. అనేక దేవాలయాలకు, సంస్థలకు ఇతోధికంగా విరాళాలు ఇచ్చారు. పిడబ్ల్యూడి మార్కెట్‌లోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి సాధూ రాం చేసిన కృషి ఎనలేనిది. వ్యాపారవేత్తగా పట్టణానికే కాకుండా ఉత్తరాంధ్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయనకు పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన మృతిపట్ల మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథ్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయ్‌కుమార్, జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేసారు. ఆయన మృతదేహాన్ని మంగళవీధిలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. కుటుంబ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వ్యాపారస్తులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

90 శాతం బీమా రెన్యూవల్స్ పూర్తి
* బీమా జిల్లా ప్రాజెక్టు మేనేజరు రాజ్యలక్ష్మి
గజపతినగరం, మార్చి 30: జిల్లాలో ఆమ్ ఆద్మీ, అభయ హస్తం విద్యార్థుల ఉపకార వేతనాల రెన్యువల్స్ 90శాతం పూర్తి అయిందని బీమా జిల్లా ప్రాజెక్టు మేనేజరు ఎల్. రాజ్యలక్ష్మి చెప్పారు. బుధవారం సాయంత్రం స్థానిక వెలుగు కార్యాలయాన్ని డిపిఎం రాజ్యలక్ష్మి సందర్శించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 2,24,307 మంది లబ్ధిదారులకు గాను 90శాతం, ఆమ్ ఆద్మీలో 1,25,000కు గాను 85శాతం మంది లబ్ధిదారులకు రెన్యువల్స్ చేశామని చెప్పారు. పాఠశాల విద్యార్థుల ఉపకార వేతనాలకు 49వేల మంది చేయగా మరో 30 శాతం కొత్తవారికి ఉపకార వేతనాల కోసం రెన్యువల్స్ చేస్తామని చెప్పారు. గజపతినగరం మండలంలో బీమా రెన్యువల్ కార్యక్రమం వంద శాతం పూర్తి చేసినందుకు ఎపిఎం శ్రీనివాసరావును అభినందించారు. బొండపల్లి మెంటాడ మండలాల్లో తొందరగా రెన్యువల్ చేయాలని ఆదేశించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపిఎంలు శ్రీనివాసరావు, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

‚
శివారు ప్రాంతాల్లో ఉల్లి విక్రయాలు
విజయనగరం(టౌన్), మార్చి 30: పట్టణంలోని పలు శివారుప్రాంతాల వినియోగదారులకు ప్రభుత్వం తక్కువ ధరకు సరఫరా చేస్తున్న ఉల్లిగడ్డలను రైతు బజారు ఆధికార్లు విక్రయాలను నిర్వహించారు. తక్కువ ధరలకు ఉన్న రాయలసీమనుండి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వ్‌న్షన్ పథకం కింద ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బాజార్ల ద్వారా అమ్మకాలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఆర్‌అండ్‌బి రైతుబజారు ఎస్టేట్ అధికారులు బిసికాలనీ, సాలిపేట తదితర ప్రాంతాల్లో ఉల్లి పాయలను కిలో 10 రూపాయలకు అమ్మకం చేసారు. సుమారు 30 క్వింటాళ్ల ఉల్లి గడ్డలను అమ్మకం చేసామని ఎస్టేట్ అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.