సంపాదకీయం

వికేంద్రీకరించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ‘సచివాలయాన్ని’ మరోచోటికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. స్వచ్ఛ ‘ భాగ్యనగరం’ మళ్లీ అవతరించడానికి కొత్తగా మరోచోట సచివాలయాన్ని నిర్మించడం దోహదం చేయగలదు. అలా దోహదం చేయగల రీతిలో నూతన సచివాలయం ప్రాంగణాన్ని ఎంపిక చేసుకొనడానికి పర్యావరణ పరిరక్షణ ప్రాతిపదిక కావాలి! కాలుష్య దుర్గంధాన్ని వెదజల్లుతున్న హుస్సేన్ సాగర్ లేదా ‘వినాయక్ సాగర్’ జలాల ప్రక్షాళనకు సైతం సచివాలయం తరలింపు ఉపకరించగలదు. కొన్ని వేల మంది ఉద్యోగులు మాత్రమేకాక అనేక వేల మంది సందర్శకులు సచివాలయం ప్రాంగణంలోను సమీపంలోను ప్రతిరోజు గుమికూడుతున్నందువల్ల రకరకాల కాలుష్యాలు కేంద్రీకృతమవుతున్నాయి. నిజానికి సచివాలయం, హుస్సేన్ సాగరం కాలుష్యాన్ని కేంద్రీకరించడంలోను, విస్తరింపచేయడంలోను పరస్పర పరిపోషక పాత్రను పోషిస్తుండడం ఏళ్లతరబడి కొనసాగుతున్న వైపరీత్యం! ‘హుస్సేన్ సాగరం’ పరిసరాల నుంచి తరలిపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వ సచివాలయం- కొత్త-ప్రాంగణంలో పరిశుభ్రమైన పవనాలు సభలు తీరే అవకాశం ఉంది. సమీపంలో ‘సచివాలయం’ సందడి తగ్గిపోవడం వల్ల హుస్సేన్ సాగర్ కాలుష్యం కూడ కొంత తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా ‘ప్లాస్టిక్’ కాలుష్య ప్రభావం తగ్గిపోతుంది. ఈ ‘తరలింపు’వల్ల హుస్సేన్ సాగర్ జలాలను పరిశుభ్రపరచి స్నానయోగ్యంగా వీలైతే పానయోగ్యంగా మార్చే ప్రక్రియ కూడ పుంజుకోవచ్చు! జలాశయాలలోని నీరు జనం తాగగలగడం స్వచ్ఛ భారత పునర్ అవతరణలోని ప్రధాన అంశం! లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన మన జాతీయ జీవన ప్రస్థాన పథంలో అవిరళ, అమలిన జల వాటికలు, జల వాహినులు విశ్రాంతి కేంద్రాలు కావడం చరిత్ర... ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం చరిత్ర. అనంతగిరి ఓషధీ రసాలను నింపుకున్న ముచికుంద- మూసీ నది అమృత జల స్రవంతిగా పరుగులు తీసిన నాటి చరిత్ర గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా ప్రస్తావించి ఉన్నారు. ప్రస్తుతం ‘మూసీ’ అవిరళ- నిరంతర- ప్రవాహం కాదు, అమలిన జలాలూ లేవు. ‘మూసీ’ మురుగు- అన్నది మాత్రమే గత కొన్ని దశాబ్దులుగా భాగ్యనగర వాసులకు తెలిసిన వాస్తవం, అనుభవం! అందువల్ల ‘మూసీ’ మురుగు పక్కన నిలచి ఉన్న ‘ఉన్నత న్యాయస్థానం’ ప్రాంగణాన్ని కూడ అక్కడ నుంచి తరలించి మరో పరిశుభ్ర ప్రాంగణంలో నెలకొల్పడం ‘‘ఊపిరి పీల్చుకొనడానికి’’, స్వచ్ఛవాయువులను అనుభవించడానికి దోహదం చేయగలదు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణతో ముడివడిన ప్రధాన పరిణామాలలో ఒకటి- అవశేష ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని నిర్మించవలసిన అవసరం ఏర్పడడం. ఇదివరకే జనంతో కిక్కిరిసి ఉన్న, కాలుష్యం కేంద్రీకృతమైన నగరాలలోకాక వీటికి దూరంగా ప్రశాంత సీమలలో ‘అమరావతి’ని ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం కూడ సత్ సంకల్పం. ఈ శుభ సంకల్పం వల్ల చిన్న రాజధాని ఏర్పడుతుందని, కాలుష్యం కేంద్రీకృతంకాదని జనం ఆకాంక్షించడం సహజం! చిన్న నగరాలు, చిన్న రాజధానులు ఏర్పడడం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న స్వచ్ఛ ఉద్యమాలలో భాగం... అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటించి ఉన్నాడు. కానీ అంతర్జాతీయ స్థాయికి, గరిమకు ప్రాతిపదిక ‘ప్రమాణం’కానీ ‘పరిమాణం’ కాదు, కారాదు. క్రీస్తునకు పూర్వమే, శతాబ్దులపాటు అంతర్జాతీయ ఆదరణను పొందిన ‘డమాస్కస్’ ఉక్కు భారతదేశంలోని చిన్న చిన్న ‘కొలిమి’బట్టీలలో తయారుకావడం చరిత్ర. దేశమంతటా ప్రధానంగా- నేటి- తెలుగు ప్రాంతాలలోని పల్లెలలోని ‘కొలిమి’ ‘బట్టీ’లలో ‘విశ్వకర్మ’లు ఈ ఉక్కును తయారుచేశారు. ఒక్కొక్క ‘కొలిమి’ని నిర్వహించిన ఒక్కొక్క ‘విశ్వకర్మ’ ఒక్కొక్క శాస్తవ్రేత్త, స్థపతి.. ప్రగతి, ప్రగతిని సాధించగల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అట్టడుగు స్థాయివరకు వికేంద్రీకృతం కావడం ప్రాచీన భారత చరిత్ర.. ఇది అంతర్జాతీయ గరిమకు ఒక ఉదాహరణ మాత్రమే, ఉదాహరణలు అసంఖ్యాకం.. అందువల్ల అంతర్జాతీయ స్థాయి రాజధానిని ఈ వికేంద్రీకృత ప్రగతి, పరిజ్ఞాన చరిత్రకు అనుగుణంగా నిర్మించడం మేలు.. ఆంధ్రప్రదేశ్‌లోని సగం జనాభా రాజధానిలోనే కేంద్రీకృతం అయ్యే విధంగా ఊపిరాడని భారీ నగరాన్ని నిర్మించడం వల్ల కాలుష్యం మరింత పెరుగుతుంది.
అందువల్ల అమరావతిలో ఎనిమిదో తొమ్మిదో నగరాలను నిర్మించడం స్వచ్ఛ పరిసరాల స్ఫూర్తికి విఘాతకరం. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని సగం విస్తీర్ణం అడవుల నిలయం కావాలన్న కార్యక్రమాన్ని అమలు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని కూడ హరితమయం చేయగలగాలి. అమరావతిలో పరిపాలన నగరాన్ని మాత్రమే నిర్మించినట్టయితే స్వచ్ఛ రాజధాని ఏర్పడుతుంది. మిగిలిన వాణిజ్య, క్రీడా, తదితర నగరాలను ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క జిల్లా కేంద్రంలో నిర్మించడం వల్ల ప్రగతి, పరిజ్ఞానం వికేంద్రీకృతం కాగలవు. ఈ వికేంద్రీకృత ప్రగతి వ్యవస్థ వల్ల మాత్రమే కాలుష్యం ఒకేచోట కేంద్రీకృతమై దుర్గంధం కొలువుతీరకుండా నిరోధించవచ్చు. అనేక అంతస్థుల భవనాలను ఒకేచోట నిర్మించడం వల్ల కూడ ‘బొగ్గుపులుసు’ వాయువు కేంద్రీకృతమైపోయి ప్రకృతికి ఊపిరాడని దుస్థితి దాపురిస్తుంది. ప్రాచీన భారతదేశంలో రాజధానులు విద్యాకేంద్రాలు కాలేదు. విశ్వవిద్యాలయాల వంటి ‘మహా విద్యాలయాలు’, గురుకులాలు రాజధానులలో ఏర్పడలేదు. రాజధానికి దూరంగాఉన్న నగరాలలో ఈ మహావిద్యాలయాలు ఏర్పడినాయి. రాజధానులు వాణిజ్య కేంద్రాలుగా కాని, తీర్థయాత్రస్థలాలుగా కాని, పర్యాటక పారిశ్రామిక కేంద్రాలుగా కాని ఏర్పడలేదు. ఈ దేశంపై మమకారం లేని, కేవలం కొల్లగొట్టుకొని పోవడం లక్ష్యమైన బ్రిటన్ దురాక్రమణదారులు వికేంద్రీకరణను విధ్వంసం చేసి ‘కేంద్రీకరణ’ను వ్యవస్థీకరించారు. కాలుష్యం కేంద్రీకృతం కావడానికి ఇదీ చారిత్రక నేపథ్యం! కానీ భారత్ నుంచి పాఠాలు నేర్చుకున్న అమెరికాలోని యాబయి రాష్ట్రాలకూ చిన్న రాజధానులే ఏర్పడి ఉన్నాయి...
తెలంగాణ సచివాలయాన్ని తరలించడం మంచిదే కాని, కానీ కొత్త సచివాలయాన్ని ‘బైసన్ పోలో’వంటి మహానగర మధ్య ప్రాంతాలలోకాక జన సమ్మర్దానికి దూరంగా ఉన్న శివారు ప్రాంతాలలో నిర్మించడం మేలు! భువనగిరి సమీపంలోనో, షాద్‌నగర్ సమీపంలోనో, చేవెళ్ల చేరువలోనో, సిద్ధిపేట పరిసరాలలోనో కొత్త సచివాలయాన్ని, ‘విధాన మండలి’ భవనాలను, మంత్రులకు ఉద్యోగులకు ఇళ్లను ఎందుకని నిర్మించరాదు? ఉన్నత న్యాయస్థానం నూతన భవనాలను నిర్మించరాదు?? ‘బైసన్ పోలో’లో తొంబయి ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినట్టయితే అందుకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వానికి వేరేచోట దాదాపు ఆరువందల ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పగించాలట. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనను విధించిందట! ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నత న్యాయస్థానానికి నివేదించిందట. అందువల్ల ఈ భూమి మార్పిడి వల్ల తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు ఐదువందల ఎకరాల భూమి నష్టవౌతుందట.. అందువల్ల ‘బైసన్ పోలో’ ప్రాంతంలోకాక మహానగరానికి దూరంగా కొత్త సచివాలయం నిర్మించడం వల్ల హైదరాబాదు ప్రాంగణంలో కాలుష్యం తగ్గుతుంది... జన సమ్మర్దం తగ్గుతుంది కనుక!! స్వచ్ఛ భాగ్యనగరం, స్వచ్ఛ తెలుగు రాష్ట్రాలు, స్వచ్ఛ భారత్‌లను మళ్లీ సాధించవచ్చు...